Previous Page Next Page 
ఏటి ఒడ్డున నీటిపూలు పేజి 15


    "శంకరం! శంకరం! కొంచెం తలుపు తీస్తావా?" ముందు గదిలోనించి రామారావుగారి గొంతుక వినిపించింది. మధ్య ఉన్న తలుపు తియ్యమంటున్నారు.
    చారుమతి వెళ్ళి తలుపు తీసి, "ఏం కావాలి, మాస్టారూ? శంకరం ఇంకా నిద్ర లేవలేదు" అంది.
    "శంకరాన్ని నిద్రలేప నక్కరలేదు. బాత్ రూముకి ఇలా వెళ్ళవచ్చునేమో కనుక్కుంధామని పిలిచాను. బయట పెద్ద వర్షం పడుతూంది."
    "ఇలా వెళ్ళవచ్చును. వెళ్ళండి" అంది చారుమతి, దారి తొలుగుతూ.
    రామారావుగారు టవల్ భుజం మీద వేసుకుని స్నానాల గదివైపు వెళ్ళారు.
    రామారావుగారికి గది అద్దెకి ఇవ్వడంవల్ల పెద్ద ఇబ్బంది ఏమీ కలగలేదు చారుమతీవాళ్ళకి. ఆయన ఉదయం ఒక్కసారి సందుగుండా వెనక పెరటిలోకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానంచేసి వెళ్ళిపోతారు. తరవాత రోజులో ఒక్కసారికూడా వెనక పెరడువైపు రారు. తమ పనేదో తాము చూసుకోవడంతప్ప, ఇంటి కెళ్ళి విషయాలు పట్టించుకోరు. ఆయన హైస్కూలులో టీచరుగా పనిచేస్తున్నారు. ఆయన్ని ఇంట్లో అంతా "మాస్టారు" అనే పిలుస్తారు.
    శంకరానికి రామారావుగారి దగ్గిర మంచి చనువు ఏర్పడింది. రామారావుగారు ఇంట్లో ఉన్నంతసేపు ఆయనతోనే గడుపుతాడు. రామారావుగారు తెలుగు వారపత్రికలు, మాసపత్రికలు కొంటారు. కొన్ని ఇంగ్లీషు పత్రికలు, రోజూ దినపత్రిక కొంటారు. శంకరం ఆయన దగ్గిరనించి పత్రికలు, పుస్తకాలు తెచ్చి ఇంట్లో ఆడపిల్లలకి ఇస్తాడు. దాంతో వారికి మంచి కాలక్షేపం దొరికింది.
    రామారావుగారు స్నానంచేసి తిరిగి వచ్చేసరికి శంకరం అప్పుడే నిద్ర లేస్తున్నాడు.
    "ఇప్పుడయ్యా నిద్ర లేవడం? తొమ్మిదైపోయింది" అన్నారు.
    "పనేముంది, మాస్టారూ, నిద్ర, భోజనంతప్ప మనకి?" అంటూ శంకరం నవ్వేశాడు.
    మాగన్నుగా నిద్రపోతున్న ముసలమ్మ లేచింది.
    "ఎవరు వచ్చారురా, శంకరం? ఎవరితో మాట్లాడుతున్నావు?" అంది.
    "మాస్టారు మామ్మా, మనింట్లో అద్దెకున్నాయన" అని చెప్పి, రామారావుగారివైపు తిరిగి, "ఏఇద మా మామ్మగారు, మాస్టారూ, మా నాన్నగారి తల్లి" అని పరిచయం చేశాడు.
    "నమస్కారమండీ" అని నమస్కారంచేసి తన గదిలోకి వెళ్ళిపోయారు రామారావుగారు. ఆయన ముసలమ్మని చూడడం అదే పథమం.
    చారుమతి భోజనం చేస్తూంది.
    "మాస్టారూ, మాస్టారూ అంటూ ఆయన వెనకాలే తిరుగుతావు. ఏదైనా ఉద్యోగం చూసిపెట్టమని అడగకూడదూ?" అంది శంకరాన్ని చూస్తూనే.
    శంకరం కాఫీకోసం వంటింట్లోకి వచ్చాడు.
    "అడిగానే. ఏదో హైస్కూలులో లీవు వేకెన్సీ ఉందని తెలిసింది. ఇవ్వాళో రేపో నన్ను తీసుకువెళ్ళి హెడ్ మాస్టరుతో మాట్లాడుతానన్నారు."
    "ట్రైనింగ్ లేనివాడిని, నీ కెవరు ఇస్తారు ఉద్యోగం?"
    "లీవ్ వేకెన్సీ రెండు నెలలే కదా. ఇవ్వవచ్చును."
    మరునాడు సాయంత్రం శంకరం ఇంటికి వచ్చి చెప్పాడు, ఉద్యోగం వచ్చిందని, శాంతమ్మ శ్రీనివాస స్వామికి కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చింది. శంకరం రెండునెలలూ ఉద్యోగం చేసి జీతం తెచ్చి తల్లి చేతిలో పోశాడు. ఆ జీతంతో అప్పులు సగం తీరాయి. కాని ఏం లాభం? రెండు నెలలు దాటగానే తిరిగి శంకరం నిరుద్యోగి అయ్యాడు. ఇంట్లో పరిస్థితులు మామూలు స్థితికి వచ్చాయి.
    శంకరం మధ్యాహ్నం పన్నెండు గంటలకి భోజనం చేసి, తిరిగి రామారావుగారి గదికి వచ్చాడు. ఆయన స్కూలుకి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నరు.
    "ఏం మాస్టారూ, స్కూలుకి వెళ్ళలేదా ఇవ్వాళ?" అంటూ లోపలికి వచ్చి కూర్చున్నాడు.
    "లేదోయ్, సెలవు పెట్టాను."
    ముసలమ్మ గదిలో తలుపుకి చేరబడి, చిరిగిన చీర కుడుతున్న భానుమతికి వీళ్ళ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. భానుమతి రోజూ అక్కడే కూర్చుంటుంది. భోజనాలయ్యాక వంటిల్లు కడుగుతారు. పొడిగా ఉన్న భాగంలో చాప పరుచుకుని పడుకుంటుంది శాంతమ్మ.
    "ఏమోయ్, శంకరం, అలా దిగులుగా ఉన్నావు? ఏమిటి సంగతి?" మాస్టారి కంఠం వినిపించింది.
    "ఏముందండీ, నా ఉద్యోగం విషయమే. ఏదైనా దొరికితే బాగుండునండీ."
    "ఏదైనా దొరికితే చేస్తావా?"
    "ఎలాంటి ఉద్యోగమైనా సరే చేస్తానండీ."
    "ఫ్యూను ఉద్యోగం దొరికితే చేస్తావా?"
    "మాస్టారూ, మీరు మరీ హాస్యం చేస్తున్నారు. నేను ఫ్యూను ఉద్యోగం చెయ్యడమేమిటి?"
    "ఇప్పుడే అన్నావుకదా, "ఏ ఉద్యోగమైనాసరే' అని. ఫ్యూను ఉద్యోగం తీసిపోయిందా?  నెలకి అరవై డెబ్బై రూపాయలు వస్తాయి."
    "డబ్బు వస్తుందని ఫ్యూనుగా చేరమంటారా ఇంత చదువూ చదివి?"
    "ఏ ఉద్యోగమూ లేకుండేకంటే, ఏదో ఒకటి మెరుగు కదూ! ఆ మాటకి వస్తే నేను ముందు ఫ్యూను గానే చేరాను."
    "నిజమా, మాస్టారూ? మీరు ఫ్యూనుగా చేరారా? ఎందుకని?"
    "మీ ఇంటి పరిస్థితులలాంటివే మావీ, శంకరం! అప్పటి మా పరిస్థితులతో పోల్చుకుంటే మీ రెంతో నయం."
    "ఫ్యూనుగా ఎందుకు చేరాలి చెప్పండి, మాస్టారూ?" శంకరం కంఠంలో ఎంతో కుతూహలం.
    "మా తల్లిదండ్రులకి నేను. మా చెల్లెలు ఇద్దరమే సంతానం. మా నాన్న ఎలిమెంటరీ స్కూలులో టీచరు. మేముకాని, మా బంధువులుకాని ఎవరూ స్థితిమంతులం కాదు. అందరివి పేద కుటుంబాలే. మా నాన్న కష్టపడి నన్ను ఎస్. ఎస్. ఎల్. సి. దాకా చదివించారు. నేను పరీక్ష రాసిన కొన్ని రోజులకే మా నాన్న చనిపోయారు. అప్పటికి నాకు పదిహేను నిండి పదహారేళ్ళు. ఎస్. ఎస్. ఎల్. సి. లో మంచి మార్కులు వచ్చినా ఉద్యోగం ఎవరిస్తారు? కాని ఉద్యోగం దొరకక పోతే మా అమ్మ, నేను, చెల్లెలు అడుక్కుతినాలి. నేనప్పుడు మా స్కోలు హెడ్ మాస్టర్ దగ్గిరకి వెళ్ళి మా ఇంటి పరిస్థితులన్ని చెప్పి, సలహా కోసం అర్ధించాను. ఆయన నన్ను తీసుకుని వారి స్నేహితులొకరి దగ్గిరికి వెళ్ళారు. ఆయన ఒక గవర్నమెంటు ఆఫీసులో ఆఫీసరుగా ఉంటున్నారు. ఆయన మా ఇంటి పరిస్థితులు అన్నీ విని ఇలా అన్నారు:
    'చూడు, రామారావూ, మీ ఇంటి పరిస్థితులు వింటే జాలిగా ఉంది. నీకు ఎస్, ఎస్. ఎల్. సి. లో మార్కులుకూడా బాగా వచ్చాయి. కాని నీ వయస్సే ఇబ్బంది కలిగిస్తూంది. నీకు పదిహేను నిండి పదహారు అంటున్నావు. పద్దెనిమిది నిండితేకాని మా ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం కూడా ఎవ్వరికీ ఇవ్వం. కాని నీ కో సలహా చెబుతాను. నువ్వు ఇష్టపడితే మా ఆఫీసులో ఫ్యూనుగా చేర్చుకుంటాను. ఇందులో నువ్వు చిన్నతనంపడవలిసింది ఏమీ లేదు. ఎలాగా నువ్వు కాలేజీలో చేరి చదవలేవు. చిన్నవాడివైన నీకు వేరే ఉద్యోగమేమీ దొరకదు. మా ఆఫీసులో ఫ్యూన్స్ ని మేం గౌరవంగానే చూస్తాం. నీ గౌరవాని కెప్పుడూ లోపం జరగదు. మీ కుటుంబానికి సాయపడినట్లూ ఉంటుంది. రెండేళ్ళు మా ఆఫీసులో పనిచేస్తే పద్దెనిమిది ఏళ్ళు వస్తాయి. వేరే ఉద్యోగంకోసం వెతుక్కోవచ్చును. ఆలోచించుకుని నాకు రేపు చెప్పు.'
    ఫ్యూనుగా చేరమనగానే నా కెంతో బాధ అనిపించింది. కాని మా హెడ్ మాస్టారు గారు ప్రోత్సహించారు. గౌరవం అనేది మనిషికికాని పనికి కాదని, ఈ పరిస్థితులలో ఈ ఉద్యోగం తప్ప వేరే మార్గం కనిపించడం లేదని, నన్ను వెంటనే ఆఫీసులో చేరమని చెప్పారు.
    అలా నేను ఫ్యూనుగా చేరాను. నా కప్పుడు నెలకి ఇరవై రూపాయలు వచ్చేవి. ఇది జరిగింది పాతికేళ్ళ కిందట. అప్పుడు ఇరవై రూపాయలంటే ఇప్పటి తొంభై రూపాయలతో సమానం. మేం ఆ  ఇరవై రూపాయలతోనే గడుపుకునేవాళ్ళం." మాస్టారు ఆగారు.
    "తరవాత ఏమైంది, మాస్టారూ? మీరు బి. ఎ. ఎలా చదివారు?" శంకరం 'ఆపేశారేం?' అన్నట్టు అడిగాడు.
    "నేను ఫ్యూనుగా చేరానా? కాని అక్కడ నా జీవితం సాఫీగానే సాగింది. నేను చదువుకున్నవాడినని తక్కిన ఫ్యూన్స్, ఆఫీసులో ఉద్యోగస్థులుకూడా నన్ను గౌరవం గానే చూసేవారు. పని చాలా తక్కువ. చాలా ఖాళీ ఉండేది. లైబ్రరీనించి పుస్తకాలు తెచ్చుకుని చదివేవాణ్ణి. ఆఫీసుకి వచ్చిన పత్రికలు, పేపర్లు, ఉద్యోగస్థులు అందరు చదివేశాక నేను ఇంటికి తెచ్చుకుని చదువుకునేవాణ్ణి. దీనితో నా ఇంగ్లీషు, తెలుగు రెండూ అభివృద్ధి పొందాయి. రెండేళ్ళు అవగానే అదె ఆఫీసులో నాకు ఎల్. డి. సి. ఉద్యోగం ఇచ్చారు. తరవాత కష్టపడి చదివి ఇంటర్ మీడియట్ పరీక్షకి కట్టాను. నా చదువుకి అక్కడ చిన్న అడ్డుకట్ట పడింది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS