Previous Page Next Page 
ఎండమావులు పేజి 15

   
    గౌతమీ! నువ్వూ వివాహితురాలవు కనుక చెపుతున్నాను. తారుణ్యపు తొలి రోజుల్లో ఉండే అభిరుచులు వారికి లేవు. మనసిచ్చి మాట్లాట్టం గాని చక్కగా కబుర్లు చెప్పటంగాని, నవ్వించి, కవ్వించి అక్కున చేర్చుకోటంగాని వారికి తెలీదు.
    నా మనస్సే ఉండబట్టలేక వారితో సమానంగా నేనూ ఉంటే జీవిత మాధుర్యాన్ని అర్ధం చేసుకుని అనుభవించే దెలాగనే ఉద్దేశ్యంతో మమతను పెంచుకుని నా అంతట నేనుగా సరదాగా ఉండాలని నా చేత నైనట్లుగా అలంకరించుకుని వార్ని పలకరించే దాన్ని. నా వైపు ఒక్కసారి చూసి "అబ్బో! ఆ దివినుండి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నావే బాలా" అనేవారు. నన్ను వారు 'బాలా' అని పిలిచే వారు. నాగేంద్రుడంటే వారికి భయం. అందుకని పొరబాటునైనా పూర్తిగా నగేంద్రబాల అని పిలిచే వారు కాదు.
    అంత చక్కగా మాట్లాడారనే సమయంలోనే సినిమాకు పోదామనో, షాపింగ్ కు పోదామనో, షికారుకు వెళదామనో అనేదాన్ని.
    ఈ మాట నేను అనగానే వెంటనే ముఖం కందగడ్డయి పోయేది.
    "చూడు బాలా మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గారు ఈ ప్రపోజల్సు సాయంత్రానికల్లా పూర్తి చేసి రేపొద్దున్నే పట్రమ్మన్నారు. డ్యూటీ కన్నా సినిమాలు ఎక్కువా చెప్పు. నేను రానుగాని నువ్వెళ్ళిరా" అనేవారు డ్రాయింగ్ పెన్సిల్ చివర కింది పెదవికి ఆ నించి ఏమిటో ఆలోచిస్తూ నా సరదా నీళ్ళుకారిపోయేది. మనస్సు ఉసూరుమనేది. మెల్లిగా కాళ్ళీడ్చుకుంటూ లోపలికి వెళ్ళేదాన్ని. వారి మనస్తత్వాన్ని, నా అభిలాషనీ నా మనస్సు లోనే చర్చించుకుంటూ కూర్చునేదాన్ని. లేకపోతే ఏ పుస్తకమో తీసి చదువుకుంటూ కాలక్షేపణ చేసేదాన్ని. అందులోని నాయిక నాలాంటిదే అయితే నాకు తోడు నువ్వూ ఉన్నావా అనుకుని నా మనస్సుకు నేనే సమాధానం చెప్పుకునేదాన్ని.
    ఒక్కోసారి చిత్ర విచిత్రాలు జరుగుతుండేవి. తల్చుకుంటే ఆ రోజుల్లో ఏడుపులు, ఈ రోజున నవ్వూ వస్తుంది. పోకపోక ఎప్పుడయినా ఇద్దరు సినిమాకు వెళ్ళేవాళ్ళం. ఆ సినిమాకే, ఆ ఆటకే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరో, అసిస్టెంటో ఇంజనీరో వచ్చేవారు. ఇక చూడు వారి అవస్థ నాకు టిక్కట్టు కొనిచ్చి నన్ను వెళ్ళమని వారు వాళ్ళతో వెళ్ళేవారు. సినిమా అయిపోయాక ఆ ఆఫీసర్లని వాళ్ళ బంగళాల్లో దిగబెట్టి తను రాత్రి పదకొండింటికి వచ్చేవారు. వారితో రాకరాక సినిమాకు వచ్చాననే సంతోషం హాలు గేటు దగ్గరే నాలో అంతరించేది. అంత ఉత్సాహంగా వచ్చిందాన్ని సినిమా చూడకుండా ఇంటికి పోలేక ఉసూరుమంటూ ఒక్కదాన్నే కూర్చుని సినిమా చూసి మళ్ళీ ఒక్క లైనే ఇంటికి వెళ్ళేదాన్ని. ఆ పరిస్థితుల్లో నా మనస్సు ఎట్లా ఉంటుందో అర్ధం చేసుకోవే గౌతమీ" అన్నది నగేంద్రబాల.
    "బావుంది, ఎంతో బావుంది, ఉద్యోగం పురుష లక్షణం కనక ఆయన అదే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఆ తరువాత" అన్నది గౌతమి.
    "జరిగిపోయిన గత జీవిత స్మృతులను తల్చుకుని ఎంతో బాధ పడతారు కొంతమంది. వాటినే సాగదీసి. సాగదీసి ఎదుటివారిమీద విరుచుకుపడి నానా గొడవా చేస్తారు కొంతమంది. నేను ఏమీ అనలేక. నా కోపం వారిమీద ప్రదర్శించటమనేది తెలివిగల పని కాదని నాకు నేనే నచ్చచెప్పుకుని, జరిగిపోయిన విషయాన్ని నా మనస్సు నుంచి దూరం చేసుకునేదాన్ని.
    వారు తల్లిదండ్రులకు మూడో కొడుకు. ఆఖరి వారు. మామగారు బ్రతికున్న రోజుల్లోనే ఎవరి భాగం వాళ్ళకు పంచేశారు. తన వాటా తను తీసుకుని ఆయన వంతు వచ్చిన రెండెకరాలూ అమ్మేసి మా అత్తగారితో బాటుగా తీర్ధయాత్రలు చేసుకుంటూ మనదేశంలో చూడవలసిన విశేషాలూ, సేవించవలసిన యాత్రలూ అన్నీ చూసి చివరికి ఏ కొడుకూ దగ్గర్లేకుండా, వారం రోజులు తేడాగా వృద్ధ దంపతులు లిద్దరూ కాశీలోనే పోయారు. మాకు ఈ సంగతి పదిరోజులకుగాని తెలీలేదు. ముగ్గురు కొడుకులుండే, కోడళ్ళుండే సుస్తీ చేసినా కూడా వారు ఎవ్వరికీ ఉత్తరాలు రాయకుండా కాశీలోనే ఉండిపోయారు. రెండు రోజులు విరేచనాలు, వాంతులూ అయి ఆవిడ పోయింది. ఆవిడ అంత్యక్రియలన్నీ చేయించి కుమాళ్ళకు ఉత్తరాలు రాశారాయన. వారి మనోభావాలు సామాన్యులకు అర్ధం కావు. వేదాంతులకు మాత్రమే వారి భావం తెలుసు. తమ కర్మకు కొడుకులు కర్తలా? అవే భావం వారిలో ఎప్పుడో జితించి పోయింది. తల్లి మరణవార్త ఊరికే తేలుపటానికే ఉత్తరాలు రాశారుగాని, కర్మకాండలు చెయ్యమని కాదు. అలాంటి వేదాంతి మా మామగారు. ఉత్తరాలు చూసుకుని మా బావగార్లిద్దరూ తండ్రిని చూట్టానికి వెళ్ళారు, వారు మకాం చేసిన పత్రం అడ్రసు ప్రకారం వాళ్ళు వెళ్ళగానే ఆయన కొడుకుల్ని కావలించుకుని బావురుమని ఏడవలేదు. ముత్యాల్లాంటి రెండు కన్నీటి బిందువుల్ని జార విడచి, 'నాగరాజు రాలేదా' అన్నారుట. పెద్ద అధికార్ల క్యాంపుతో వాడికి రావటానికి వీల్లేకపోయిందని చెప్పారుట. మా బావగార్లు. వారికీ తమ్ముడి మనస్తత్వం తెల్సు. ఆ రోజున కాకినాడలో ఎవరో మంత్రిగారు క్యాంపు. పెద్ద పెద్ద ఇంజనీర్లు విచ్చేశారు. ఆముక్క మాత్రమే చెవిని వేసుకుని "అవును వాడి ఉద్యోగం వాడు ఏ మాటా రాకుండా చేసుకోవాలిగా" అన్నారుట. అంతే అక్కడే కూర్చుని గుండె చిక్క బట్టిందని చెప్పి ఒక్క నిముషం బాధ పడి ఆకాశీ విశ్వేశ్వరుడిలో ఐక్యమయ్యారు. తల్లి పోయిందని చూట్టానికి వెళ్ళిన బావగార్ల వద్దనుంచి టెలిగ్రాం తీసుకుని చదివాను. మామగారి మరణ వార్తతో నా మనస్సు ఎంత క్షోభించిందో ఆ రోజున. వారు మూడో రోజున రాగానే టెలిగ్రాం చూపించాను.
    "అమ్మా, నాన్నా అదృష్టవంతులే. ఆ కాశీ క్షేత్రంలో తనువులు చాలించారు. కర్మకాండలు చేసి అన్నయ్యలు ఇక్కడికి వస్తారు కదా. ఇప్పుడు నేను పన్లు మానుకుని అన్నయ్యలకోసం కాశీకి ఎట్లా వెళ్ళను" అన్నారు.
    గౌతమీ! వారి మనస్తత్వం అర్ధం చేసుకుంటున్నావ్ కదూ! తండ్రి మరణ వార్త విని స్నానమైనా చెయ్యకుండా అప్పటికప్పుడు ఏదో బిల్డింగు కొల్తలకు వెళ్ళారు. ఏం చెప్పాలి ఆలోచించు" అన్నది నగేంద్రబాల.    
    గౌతమి ముక్కుమీద వేలేసుకుని ఆశ్చర్యపడ్డది.
    "ఓసారి ఇంకో ఫార్సు జరిగింది. ఏవో బట్టలు, చీరెలు కొనుక్కోవాలని షాపింగుకు బయల్దేరా లనుకున్నాము. సాయంత్రం ఆరు గంటలకు వారు ఆ డ్రాయింగ్ రూములోనుంచి బయటి కొచ్చారు. అంతా సిద్ధమైంది. రిక్షా అతను వాకిట్లోనే ఉన్నాడు. రిక్షా ఎక్కబోతుండగా, వారితో పనిచేసే ఇంకో జూనియర్ ఇంజనీరు వచ్చి "సూపరింటెండింగ్ ఇంజనీరు మన అసిస్టెంట్ ఇంజనీరు గార్ని ఆ బిల్డింగుల ఎష్టిమేట్ల డివిజను విషయమై అడుగుతున్నారు. ఆయన గారు నిన్ను అర్జంటుగా రమ్మంటున్నారు. నన్ను వెళ్ళి తీసుకురమ్మన్నారు నిన్ను" అన్నాడు. ఇంకేం వారికి పరమ సంతోష మయింది. ఆయన్ని డ్రాయింగ్ రూంలో కూర్చోపెట్టి, నాతోనేమో షాపింగుకు వెళ్ళమని చెప్పి డబ్బిచ్చి తను ఆ జూనియార్ ఇంజనీర్ తో మాట్లాడుతూ ఆ ప్లాన్లు, ఎస్టిమెట్లు సర్దుకుంటున్నారు. బజారు కెళ్ళే ఉద్దేశ్యంలో ఉన్న వాళ్ళ మవటంచేత నేను ఇంట్లో తలుపులన్నీ వేసి, వీరి గుమ్మం ఒక్కటే తాళం వేద్దామని చెప్పి తాళం గుమ్మం మీద పెట్టాను. ఆ స్థితిలో అంతా సిద్ధమయ్యాక ఈ కబురు వచ్చిందికదూ, నన్ను బజారు కెళ్ళమని చెప్పారుగా నేను వెళ్ళాననుకున్నారు. నాకూ ఒక్కర్తినే వెళ్ళటానికి మనస్కరించక రిక్షావాడిని వెళ్ళిపొమ్మని నేను గదిలో పడుకున్నాను. నా సంసార జీవితాన్ని గురించి ఆలోచించుకుంటూ. నేను వెళ్ళానని అనుకున్నారు కామాలు, తలుపులు తాళంవేసి ఆయనతో వెళ్ళిపోయారు. వారు తలుపులు గట్టిగావేసి, తాళం వెయ్యటం గదిలో ఉన్న నాకు వినబడ్డది. ఆ స్థితిలో నేనేం చెయ్యాలి. వీధి గుమ్మం వారు తాళం వేసుకుని వెళ్ళిన సంగతి పక్క భాగం వాళ్ళకు తెలీదు. నా పరిస్థితికి నాకు నవ్వాలో, ఏడవాలో, ఎందులోనైనా దూకాలో నాకు తోచలేదు.
    ఈ సంగతి ఎవరయినా వింటే ఎంత అసహ్యంగా ఉంటుంది. వారనుకున్నట్లుగా ఒకవేళ నేను షాపింగుకు వెళ్ళానే అనుకో. వారు తాళం వేసుకునిపోతే నేను వచ్చాక ఏం చెయ్యాలి. ఉన్న ఒక్క తాళం చెవూ తను జేబులో వేసుకుపోతే వారొచ్చేంతవరకూ నేను వరండాలో కూర్చోవలసిందేగా వారనుకున్నట్లుగా వెళ్ళినా ఇబ్బందే అయ్యేది కదూ ఇంక వార్ని ఎట్లా అర్ధం చేసుకోవాలో ఆలోచించు.
    మా తల్లిదండ్రులకు నే నొక్కర్తినే కూతుర్ని. మొగపిల్లలు ముగ్గురు. వారు ముగ్గురూ నా కన్న పెద్దవారే. ముగ్గురి తరువాత పుట్టిందాన్ని నే నొక్కతినే ఆడపిల్లను ఎంతో గారబంగా పెంచారు. హైస్కూలు జీవితం రాజమండ్రిలో గడిచింది. కాలేజీ జీవితం కాకినాడలో కాలేజీ జీవితం సంగతీ, నా సంగతీ నా మనస్తత్వమూ మీరంతా ఎరుగున్నదేకదా ఇంటరు కాంగానే అమ్మ చదువు వద్దన్నది అన్నయ్యలూ వద్దన్నారు. నాన్న మా చిన్నప్పుడే పోయారు. అన్నయ్యలంతా కలిసి ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికొచ్చి ఈ సంబంధం ఆలోచించారు వారు, బి.ఏ. బి.ఇ పెళ్ళినాటికే వారు మూడేళ్ళుగా ఉద్యోగం చేస్తున్నారని చెప్పాను కదూ గొప్పగా కట్నమిచ్చి పెళ్ళి చేశారు. ఆరోజున అన్నీ తలుపు కొచ్చినయ్యి. ఎంత స్వేచ్చగా, కోరిన చీరె. కోరిన నగా కొనుక్కుని జీవితం గడపాలనుకున్నానో నా వైవాహిక జీవితం అంత దుర్భరమై పోయింది. అనుకున్న ఏ కోరికా తీరదు. డబ్బు లేక కాదు. అత్త ఆడబిడ్డల పోరువల్ల అసలే కాదు. భర్తకు ఉద్యోగం లేకపోవటం నుంచికాదు. వారి మనస్సులో ఎప్పుడూ డిజైన్లూ, ప్లాన్లు, ఎష్టిమేట్లు, ప్రాజెక్టులూ అవే మెదుల్తూ ఉంటయి. ఇన్నింటి సందడిలో ఈ భార్య వారికేం గుర్తుంటుంది. పోనీ, సంపాదన మీద ధ్యాసా అంటే అదేమీ లేదు. తమలపాకు తొడిమె కూడా తీసుకోరు. కంట్రాక్టరు డబ్బుతో కాఫీ కూడా తాగరు. డిపార్టు మెంటులో మంచి పేరుంది. పేరెన్నిక గన్న ఇంజనీర్లలో ఒకరుగా ఖ్యాతి తెచ్చుకున్నారు. ఎంత కష్టమైన డిజైనునైనా ఇట్టే నేసేస్తారు. వారికి పని వప్పచెప్పితే పై ఆఫీసర్లకు ఎంతో తృప్తి. నాగరాజుకి పని వప్ప చెప్పారంటే ఇంక తమకు ఏ బాధ్యతా ఉండదని వారికి తెల్సు. కంట్రాక్టర్లకు సింహస్వప్నమే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS