"ఇంక అంతటితో కట్టిపెట్టు. నేను నా కొడుకు సంగతి అడిగాను గాని ఆ దౌర్భాగ్యురాలి సంగతి అడగలేదు. ఆ అప్రాచ్యురాలు ఎంత చేసినా నా కోడలుకాదు. ఈ జన్మలో కోడలుగా ఎన్నటికీ స్వీకరించలేను. నా కోడలు గౌతమి ఒక్కతే. వదినె, వదినంటూ ఆవిడని పొగుడ్తూ తిరక్కపోతే ఏదయినా ఉద్యోగం చూసుకుని నీ భార్యతో నువ్వు కాపురం చేస్తుంటే ఎంత ఆనందించేదాన్నో ఆలోచించావా. నీ భార్యను నువ్వు దిద్దుకోలేనివాడివి. వదినంటూ ఆ పంచమురారి ఆకాశాని కెత్తుతున్నా వన్నమాట. నీ ఎమ్మే చదువు అన్నయ్య చేసిన ఈపాటి ఘనకార్యాన్ని సమర్ధించేటంతవరకే పని కొచ్చింది. ఇకనుంచీ ఎన్నడూ దాని సంగతి నాతో చెప్పొద్దు" అంటూ ఆవిడ అక్కన్నుంచి వెళ్ళింది. జానకిరాం వైపు చురచుర చూస్తూ తల్లి ననుసరించింది శ్రీలక్ష్మి.
జానకిరాం ఖిన్నుడై పోయాడు. అతని మనస్సులో ఆవేదన ఈ సంఘటనతో ద్విగుణీకృత మైంది. మెల్లిగా అక్కడ్నుంచీ వెళ్ళాడు జానకిరాం.
10
నగేంద్ర బాల ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఒక ఆదివారంనాడు వాళ్ళింటికి వెళ్ళింది గౌతమి. నవ్వుతూ ఆహ్వానించింది నగేంద్రబాల. గౌతమి వెళ్ళేసరికి జడవేసుకుంటున్నది నగేంద్రబాల.
"పది రోజులక్రితం చెపితే ఇప్పుడు తీరిందా గౌతమీ. పోనీలే నా యందు దయుంచి వచ్చావ్ అంతే చాలు. ఏమిటి విశేషాలు గబగబా చెప్పేయ్" అన్నది.
"కాలేజీలో మనం చదువుకునేటప్పుడు అంత రిజర్వుడుగా ఉండేదానివి. ఎవరితోనూ మాట్లాడే దానివికావు. నువ్వు లేనప్పుడు మన స్నేహితురాళ్ళతో అంటూ ఉండేదాన్ని. మన నగేంద్రబాలను చేసుకున్నవాడు, దాన్ని బ్రతిమాలలేక సతమతమై పోవాలి, అని అనుకునేవాళ్ళం. అలాంటి
వాగూ, అని గౌతమి పిలిచేసరికి కలవరపడింది నగేంద్రబాల. ఆ పేరుపెట్టి చదువుకునే రోజుల్లో కాలేజీ స్నేహితురాళ్ళు మాత్రమే పిలిచేవారు. ఇన్ని సంవత్సరాల తరువాత మళ్ళా ఈనాడు ఆ పేరున తనను పిలుస్తుంటే ఆరు సంవత్సరాలు వెనక్కు వెళ్ళింది నగేంద్రబాల. "చదువుకునే రోజులకీ సంసార జీవితానికి ఏం సంబంధం లేదే గౌతమీ నా విషయంలో కాపురానికి వెళ్ళిన కొత్త రోజుల్లో నా జీవితం అనేక మధురానుభూతులను చవి చూచింది. వారు నన్ను దేవతలా చూసుకునే వారు పువ్వుల్లోపెట్టి పూజించేవారు. మరుసటి సంవత్సరం వారి కంటికి నేను భార్యగా కనుపించలేదు. పనికత్తెగా కనుపించాను. వారి ప్రవర్తన లో, భావాల్లో, నడవడిలో అనేక రకాలయిన తీరులు, రెండవ సంవత్సరం పూర్తయ్యేసరికి నామీద లేనిపోని అపనిందలు, చివాట్లు, దెబ్బలు, మూడో ఏడు ప్రవేసించేసరికి ఇద్దరికీ విసుగెత్తి, కోర్టు ద్వారా విడాకులు పుచ్చుకున్నాము. అదంతా ఒక కరిగిపోయిన కల. చెపితే తీరనిది, రాస్తే ఒక పెద్ద గ్రంథం. ఏదో ఆ రోజులు అట్లా వెళ్ళి పోయినయ్యి. నా సంగతికేం కాని మీ వారికేం ఉద్యోగం, ఏ ఊరు, ఎక్కడుంటున్నాడు" అన్నది నగేంద్రబాల తన జీవితంమీద ఎంతో ఉదాసీనత కనబరుస్తూ.
"అబ్బ ఎన్ని కబుర్లో చెప్తాననుకున్నాను. మూడేళ్ళ జీవితమూ, మూడు ముక్కల్లో చెప్పే శావు. నాకేం నచ్చలేదు. అంతగా చెప్పతగని విషయాలేమయినాఉంటే వద్దులే" అన్నది గౌతమి.
నగేంద్రబాల నవ్వింది. ఆ నవ్వులో నిర్లక్ష్యత, ఉదాసీనత, గతజల సేతుబంధనం ఎందుకన్నట్లుగా తేల్చివేసిన మాటల తీరు అంతా గమనించింది గౌతమి.
తన కాపురం సంగతీ, భర్త ఉద్యోగం చెయ్యక పోవటం సంగతీ చెప్పింది గౌతమి.
"నా భర్త నన్ను అదుపులో పెట్టాలనుకుని విఫలమై విడాకులిచ్చారు. నీ భర్తను నువ్వు అదుపులో పెట్టుకోటానికి అసలు ఏమాత్రం ప్రయత్నించనే లేదన్నమాట" అన్నది నాగేంద్రబాల.
ఆ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించలేక పోయింది గౌతమి. "పోనీ నీ జీవితానుభవం కొంత వరకూ చెప్పు. నా జీవితాన్ని తీర్చిదిద్దుకోటానికి ఏమైనా మార్గం ఉందేమో తెల్సుకుంటాను" అన్నది గౌతమి.
నిర్లిప్తంగా నవ్వింది నగేంద్రబాల.
"నా జీవితాన్ని చూసి నువ్వు నేర్చుకునేదేమిటే పిచ్చిదానా. నువ్వూ ఏకాంత జీవితాన్నే కోరుతున్నావా" అన్నది ఆశ్చర్యంగా.
"లేదే అలాంటి పరిస్థితి ఇంతవరకూ రాలేదు. పాఠ్య పుస్తకాల్లో చదివి, బట్టీపట్టి, నెమరు వేసుకుని పరీక్షా పత్రాల్లో ముక్కున పెట్టుకున్నదంతా ఒక్కసారిగా కుమ్మరించి, తేలికపడిన హృదయంతో బైటికొచ్చి నేను పరీక్ష చాలా బాగా రాశాను అని మురిసిపోయె తత్వంగల నాకు జీవిత గ్రంథాలు ఎట్లా చదవాలో ఎన్నేళ్ళొచ్చినా తెలీటంలేదు. అయిదు రోజుల్లో భర్త హృదయాన్ని అర్ధం చేసుకుని తమ జీవితంతో పెనవేసుకుని జీవించగలిగే యువతులు అనేకమంది ఉన్నారు. కాని ఐదు సంవత్సరాలనుంచీ కాపురం చేస్తున్నా వార్ని అర్ధం చేసుకోలేకపోతున్నాను. అది నాలో ఉన్న ఏ బలహీనతో నాకు అర్ధం కావడంలేదు. ఇంత వస్తువుగా నా మనస్సు విప్పి ఎవ్వరితోనూ ఏనాడూ చెప్పుకోలేదు. మా పెద్దాడబిడ్డ పల్లెటూరు గృహిణి. ఆవిడకూ నాకూ అంతగా మాట్లాడుకునే పరిస్థితి రాలేదు. మా చిన్నాడబిడ్డ వితంతువు. ఆవిడతో సంసార జీవితపు కష్ట సుఖాలు ఏమని చెప్పుకునేది. కాకపోయినా మీ అన్నయ్య మనస్సు నాకర్ధం కావటం లేదంటే ఆవిడ ఏమైనా అనుకోవచ్చు. 'వదినె ఇన్ని విషయాలు నీమీద చెప్పింది అన్నయ్యా' అంటే వారి దృష్టిలో నేను మరీ హీనమైపోతాను. ఇంకపోతే మా వదినె. ఆవిడ నిజంగా నెరజాణ ఆవిడతో పొల్లుపోకుండా మాట్లాడాలి. లేకపోయిందా మా ఆడబిడ్డ పుట్టింటికి అంటే మా దగ్గరికే చేరింది. అత్తారింట్లో ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నయ్యో మరి అంటూ ఒక్క ముక్కకి పది అర్దాలు వచ్చేటట్లుగా చెపుతుంది. అందుకనే నా మనస్సు విప్పి నీ ముందుంచాను. నాకు తగిన సలహా ఇచ్చేముందు నీ వైవాహిక జీవితం ఈ తీరుగా ఎందుకయిందో అభ్యంతరం లేకపోతే నాకు చెప్పవే నాగూ" అన్నది గౌతమి.
గౌతమిది ఆవేశ పూరితమైన హృదయం. కాని ఎదుటివారి హృదయాన్ని ఎంత ఆలశ్యంగా అర్ధం చేసుకుంటుందో తన హృదయాన్ని అంతకుమించిన అలశ్యంతో అంకితం చేస్తుంది. అదే ఈనాడు నగేంద్రబాలతోనే తన హృదయం విప్పి ఇన్ని సంగతులు చెప్పింది. కారణం ఒకరి నొకరు చిన్నప్పట్నుంచీ అర్ధం చేసుకున్న వాళ్ళవటం చేతనే.
సంసారజీవిత ప్రవాహంలో వడివడిగా ప్రయాణం చేసి సుళ్ళు తిరిగి మునిగి మళ్ళా తేలిన నౌకలాంటిది నగేంద్రబాల. మునగాలేక, తేలాలేక సతమత మైపోయే తీరుగా ఉన్నది గౌతమి.
చెమర్చిన కళ్ళు తుడ్చుకుని తన జీవితగాథ చెప్పసాగింది నగేంద్రబాల.
"ప్రేమను గురించీ, ప్రేమించి వివాహాలు చేసుకోటం గురించీ నాకు అంతగా తెలీదు. అందుచేత మా వివాహం ప్రేమించి చేసుకున్నది కాదు. సర్వ సాధారణంగా జరిగిన వివాహమే వారి పేరు నాగరాజు మా వివాహకాలం నాటికి జూనియర్ ఇంజినీరు. అప్పటికే ఉద్యోగంలో చేరి మూడేళ్ళయింది. ఉద్యోగరీత్యా పేరు తెచ్చుకున్నవారే. డిజైన్సులో మేధావి. వారితో ప్రప్రధమంగా నేను మాట్లాడింది మొదటి రాత్రి రోజునే. పెళ్ళి చూపులప్పుడు కూడా వారు నన్నేమీ పలకరించలేదు. అడగవలసిన ప్రశ్నలన్నీ వారి తండ్రిగారే అడిగారు.
మొదటిసారిగా మేం కాపురం పెట్టింది కాకివాడలో. ఉండేది మే మిద్ధరమే అయినా అయిదు గదుల ఇల్లు తీసుకున్నారు. ఒక గది డ్రాయింగ్ రూమ్. నిజంగా అది డ్రాయింగ్ రూమే. ఒక గది వారితో మాట్లాట్టానికొచ్చేవారు కూర్చునేది. మిగతామూడు గదులూ మేం వాడుకునేందుకు, క్యాంపులకు వెళ్ళినప్పుడు నాకు తోడుగా మా ఇంట్లో మా పని మనిషి పడుకునేది. నెలకు కనీసం ఇరవై రోజులు క్యాంపు. మిగతా పది రోజుల్లోనూ ఇరవై నాలుగ్గంటల్లో పదహారు గంటలు ఆఫీసు పని. పై అధికార్లు రెండు రోజుల్లో కావాలని చెప్పిన డిజైన్లు, ఎఫ్టిమేట్లు సాయంత్రానికల్లా ఇచ్చేసేవారు. ఇంక డ్రాయింగ్ రూంలో పెద్ద బల్లపైన ప్లాన్లు పరచి వాటిల్లో నిమగ్నులై ఉంటే ఇంక ఎంత టైమైందీ తెలీదు. అన్నం నీళ్ళు కూడా అక్కర్లేదు. ప్లాస్కులో కాఫీనో, టీనో ఉంటే చాలు. ఇంక గోల్డు ఫ్లేక్ సిగరెట్టు పెట్టెలు రోజుకు నాలుగయిదు పెట్టెలు సునాయాసంగా కాల్చేశారు. డ్యూటీయందు వారికీ అంత శ్రద్ధ.
