కాని నా జీవితం తీర్చి దిద్దటానికి వారి డిజైన్లు పనికిరావు. నా మనస్సు తెల్సు కునేందుకు వారి ప్రపోజల్సు పని చెయ్యవు. వారి హృదయంలో పై అధికార్ల కే తప్ప నాకు స్థానం లేదు. వారి దిన కృత్యాల్లో నేనూ ఒక ఐటమ్ ని మాత్రమే. భోజనం దగ్గరే వారితో నేనేమయినా మాట్లాడితే అయిదు నిమిషాల్లో భోజనం ముగిస్తారు. ఈ వ్యవధిలో నేను ఎన్ని మాటలు మాట్లాడాలి. ఏ విషయాలు ముందుగా చెప్పాలి?
రాత్రి పదింటి వరకూ నేను ఇంట్లో ఉన్నా పెరటి తలుపులు కూడా తియ్య బుద్ధి పుట్టలేదు. దివ్య మైన కాపురం చేసుకుంటూ, ఏ చీకూ, చింతా లేకుండా ఉండవలసిన నాకు ఆ సంసార జీవితంలో ముఖం లేకపోయింది. నిరాశా, నిస్పృహ తప్ప ఇంకేమీ మిగల్లేదు.
భార్యను ఇంట్లోపెట్టి తాళం వేసి అయన ఆఫీసుకు వెళ్ళారని ఎవరయినా తెల్సుకుని, ఆ నోటా ఆ నోటా పడితే ఎట్లా ఉంటుందో ఆలోచించు గౌతమీ. ఆవిడలో ఏదో బలహీనత ఉంటంనుంచే అనుమానంచేత ఇంట్లో పెట్టి, బైట తాళంవేసి వెళ్ళారని నన్ను నీచంగా అనుకోదూ. ఈ భావం నాకు తట్టంగానే శరీరం ఉడికిపోయింది. ముచ్చెమటలు పోసినయ్యి. ఈ సంసారంలో ఈ చిచ్చు గూడా ఒకటాని తలబాదుకున్నాను. కళ్ళు వాచిపోయినయ్యి. ఎప్పుడెప్పుడు వారొస్తారా అని ఎదురు చూశాను. తాళం వేసిన గుమ్మంవైపు.
రాత్రి పది దాటాక వారొచ్చి తలుపు తాళం తీశారు. తలుపు తియ్యంగానే ఎర్రబడ్డ ముఖంతో చెంపలమీద కన్నీటి చారలతో, పీక్కుపోయిన కళ్ళతో నేను సాక్షాత్కరించాను. వారు స్తంభించిపోయారు. కళ్ళు నులుముకుని నేనేమయినా దెయ్యమా అన్నట్టుగా నన్ను చూశారు.
పొంగి పొర్లుకొచ్చే ఆవేశ పూరితమైన దుఃఖంతో బావురుమని వారి కాళ్ళమీద పడ్డాను. "నాలో ఏ దోషమున్నదని నాకీ జైలు శిక్ష వేశారన్నాను" అప్పటికి అర్ధం చేసుకున్నారు.
ఆ స్థితిలో నన్ను చూసి, తను చేసిన తప్పుకు వారు నొచ్చుకుని, సానుభూతి వాక్యాలతో నన్ను పలక రించాలి కదా.
ఏమీ అనలేదు.
"నువ్వు బజారు కెళ్ళా వనుకుని తాళం వేశాను. ఇంట్లోనే అఘోరించా వనుకోలేదు" అంటూ డ్రాయింగ్ రూం లోకి వెళ్ళి, కుర్చీలో కూర్చుని మళ్ళా ప్లాను పరిచారు" ఇంతవరకూ చెప్పింది నగేంద్రబాల. అంతలో తల్లి ఎందుకో పిల్చింది నగేంద్ర బాలని. 'ఇప్పుడే వస్తా'నని తల్లి దగ్గరకు వెళ్ళింది.
గౌతమి మనస్సు అగాధమై పోయింది.
11
పరిషత్తు నాటక పోటీలల్లో "మ్రోగించని వీణ" నాటకానికి మొదటి బహుమతి లభించింది. ఉత్తమ నటిగా జయలక్ష్మి ఎన్నికయింది. ఉత్తమ నటుడుగా ప్రతాప్ ఎన్నిక కాలేదు. అసలతనికి ఏ బహుమతీ రాలేదు. అతని బాధ వర్ణనాతీతం. నటులంతా చక్కగా నటించారు. నాటకంలో కూడా జీవం ఉన్నది. కాని ప్రతాప్ బాగా రాణించలేదు. అతను పాత్రలో లీనమైపోయి నటించాలనుకున్నాడు. పాత్రలో లీనమై నటించటం వేరు. లీనమైనామని అనుకుని పాత్రోచి తంగా నటించటం వేరు. నాటకములలో ముఖము, భావమునకు ఆదర్శమువంటిది. భావ ప్రకటన, ఆంగికాభి నయనము, వాచకము నటునకు ప్రధాన మైనవి. చక్కని శరీర సౌష్టవము ఉన్నా ఉచ్చారణలో గాని, అభినయములోగాని మెరుగులు దిద్దుకోకపోతే ఆ నటుడు ఎంత శరీర సౌష్టవము కలవాడయినా రాణించలేడు, అతని నటన తెచ్చి పెట్టుకున్నట్లుగా, స్థబ్దతగా ఉంటుంది, ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆ విధంగా తెచ్చి పెట్టుకున్న నటనతో ఎంత ప్రయత్నించినా ఆ నటుడు రాణించలేడు.
ప్రతాప్ నటన ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా తోచింది.
అతను ఎంతసేపూ నాయకిని వివిధ రీతుల్లో చూస్తూ, ఆమెను తాకుతూ ఉండాలనే కాంక్షతో తెచ్చిపెట్టుకున్న వరవడిలో సంభాషణలు చెపుతూ ప్రేమ పూరితమైన తృష్ణలో నటించాడు. ఒక సీనులో అతను జయలక్ష్మి ని కౌగలించుకోబోయాడు. జయలక్ష్మి సహజమైన సిగ్గుతో, బెదురు చూపులతో ఆ పరిస్థితికి అనుగుణ్యంగా నటించి అతని కౌగిలిలోకి చేరకుండా, రసాభాసం కాకుండా తప్పించుకున్నది. స్వంత డైలాగ్ చెప్పి హీరోను తొందర పడొద్దన్నట్లుగా హెచ్చరించింది. ఆ హెచ్చరిక కూడా కథా గమనానికి అనుగుణ్యంగానే ఉంది ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేశారు. నాటకంలో లేని డైలాగ్సు చెప్పినందుకు ప్రతాప్ ఖంగారు పడ్డాడు. కంటెన్యూయిటీ డైలాగ్సు ప్రామిటింగ్ ద్వారా గట్టిగా చెప్పాల్సొచ్చింది. ఈ రకంగా ప్రతాప్ కేరక్టరు దెబ్బ తిన్నా, నాటకం రక్తి కట్టింది. అంతా ఆనందంతో మెచ్చుకున్నారు. జడ్జీలు మార్కులు వేశారు.
నాటకానంతరం అంతా జయలక్ష్మిని మెచ్చుకున్నారు. పూలదండలు వేశారు. అభినందన పరం పరలతో మునిగిపోయింది. ప్రతాప్ కు తల తీసేసి నంత పనయింది.
అంతా పరిషత్తు అయాక విశాఖపట్నం వచ్చేశారు. కాలేజీ విద్యార్ధులు పెద్ద పార్టీ ఏర్పాట్లు చేశారు. జయలక్ష్మి హీరోయిన్ గా వెయ్యటం నుంచీ, ఆమె నటనా కౌశలం అందర్నీ ముగ్ధుల్ని చెయ్యటం నుంచీ నాటకానికి పేరు ప్రతిష్టలు వచ్చాయనీ, ఇంకా కొంత తరిఫీదు ఇస్తే సినిమా తారగా రాణించవచ్చుననీ, ఆమె గొప్ప సినిమా తార కావాలని ఆశిస్తున్నామనీ అన్నారు. ప్రతాప్ నటనలో సహజత్వం లేదనీ, అతను చాలా కృషి చెయ్యాలనీ హితవు చెప్పారు. ప్రతాప్ దిగజారిపోయాడు. జయలక్ష్మి సంతోషాతిశయంతో ఏం చెప్పాలో తోచక తన కా గౌరవం చేసినందుకు తన కృతజ్ఞత వెల్లడించింది.
టీ పార్టీకి మురహరి కూడా వచ్చాడు. జయ లక్ష్మికి జరిగిన ఈ సన్మానం తనకు జరిగినట్లు గానే భావించాడు. జయలక్ష్మి లోని నటనా కౌశలం ఈ నాటకంతో బయట పడినందుకు చాలా ఆనందించాడు.
జయలక్ష్మితో ఆ రోజున మాట్లాట్టానికి మురహరికి సందర్భపడలేదు. జయలక్ష్మి కారులో వెళ్లేంతవరకూ అంతా ఆమె చుట్టూ మూగిఉన్నారు. అందరితో పాటుగానే జయలక్ష్మి మురహరి వద్ద శలవు తీసుకుని వెళ్ళింది. ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు.
జయలక్ష్మి వెళ్ళిపోగానే అంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు. ఈ సంరంభమంతా తల్చుకోగానె మురహరికి మనస్సులో రాయి పడ్డట్లయింది. జయలక్ష్మి అనుకోకుండానే తనకు దూరమై పోతున్నట్టుగా అనుకున్నాడు. హృదయంలో తెలియని ఆందోళన. మనస్సు ఆవేదనతో నిండిపోయింది. కళ్ళు చమర్చినయ్యి. పుట్టెడు దిగులు నెత్తిన వేసుకున్నట్లయింది. అతని మనస్సు ఒక్క నిట్టూర్పు విడచి తన గదికి చేరాడు.
ఆ రాత్రి మురహరి భోజనం చెయ్యలేదు. సిగరెట్టు మీద, సిగరెట్టు కాలుస్తూ మంచం మీద పడుకున్నాడు.
అట్లాగే పడుకుని చాలాసేపటికి నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక కల.
* * *
అదొక జానపద చిత్రం సెట్టింగు. చక్కని ఉద్యానవనం మధ్యగా ఒక కొలను. ఆ కొలను గట్టున వయ్యారంగా హొయలు ఒలక బోస్తూ దేవ కన్యగా జయలక్ష్మి కూర్చుంది. తామర పువ్వులో కొలనులోని నీళ్ళను గలగల చప్పుడు చేస్తూ, తెలి మబ్బుల చాటున వడివడిగా పయనిస్తున్న చందమామను చూస్తూ, తెల్లని పలువరుస వింత కాంతు లీనుతూ కనబడుతూండగా, మిల మిల మెరిసే నేత్ర ద్వయాన్ని వోర చూపులతో వయ్యారంగా తిప్పుతూ చందమామతో ప్రియుని రాకను గూర్చి అడుగుతున్న ట్లుగా పాట పాడాలి.
అవతలగా చెట్టుకింద కెమేరా కదలటానికి సిద్ధపర్చి ఉన్నది. డైరెక్టరు యాక్షన్ చెపుతున్నాడు. ఛాయాగ్రహుడు అన్ని యాంగిల్సు లోనూ జయలక్ష్మిని చూస్తూ లొకేషన్ చూస్తున్నాడు. అవతలగా సౌండు ట్రక్కు ఇత్యాది హంగామాతో అంతా పరివేష్టితులై ఉన్నారు. నాయకుడు మాంచి పసందుగా మేకప్ అయి సెట్ మీదికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. అది ప్రేమ ఘట్టం కావటంనుంచి షూటింగుకు కావలసిన వాళ్ళను తప్పమరెవ్వరినీ రానివ్వలేదు.
డైరెక్టరుగారు "యస్. రెడీ" అన్నాడు. "క్లాప్" కొట్టారు. కెమారా స్విచ్ ఆన్ చేశారు.
జయలక్ష్మి ప్లేబ్యాక్ పాటకు అనుగుణ్యంగా పెదాలు కదిలిస్తున్నది.
ఓ చందమామా, వయ్యారి భామా
ప్రియు జాడ నీకు తెలిసింది కాదా!!
ఈ దేవకన్య దివినుంచి రాగా
కను చాటుగా నీవు ఎటు కేగినావో!
నాపైన నీకూ, నిజమైన ప్రేమ
కలదనీ నేనూ కలగంటినోయి
దివినుంచి భువికీ, దిగివచ్చినానూ
ఎటకేగినావో, ఓ అందగాడా!
||ఓ చందమామా||
కలలోన నిన్నూ కనిగాంచినానూ
జపరాలినైనా ననుగాంచలేనా
ఈ అందమంతా, నీ డెందమంతా
జతచేసి మనమూ జగమేలు దామా
||ఓ చందమామా||
పాట కాగానే నాయకుడు మెల్లిగా వచ్చి జయలక్ష్మి కళ్ళు మూశాడు. అతని వేళ్ళనూ, ఉంగరాల్ని తడివిచూసి చిరునవ్వుతో అతని చేతుల్ని తన చెంపలకు రాచుకుంది జయలక్ష్మి.
జయలక్ష్మిని తన కౌగిలిలోకి తీసుకుని తన రెండు అర చేతుల్లోనూ ఆమె చెంపల్ని పొదివి పట్టుకుని.
"కాంతీ, నా రాక ఆలస్యమైనందుకు కోపం వచ్చిందా ఎప్పుడెప్పుడు వచ్చి నీ ముందు వాలుదామని ఆరాటపడినా ఆ పల్లెటూరిపిల్ల నన్ను వదల్లేదు. దాన్ని వదిలించుకుని వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది. క్షమించు కాంతీ" అంటూ జయలక్ష్మి పెదవుల్ని ముద్దు పెట్టుకోబోయాడు.
అంతలోనే "బావా, బావా నన్ను వొదిలి మళ్ళీ ఈ మాయలాడి దగ్గర కొచ్చావా, నన్ను మరిపించి నట్లే మరిపించి అంతలోనే ఇక్కడి కొచ్చావన్న మాట" అంటూ ఇంకో పల్లెటూరి పిల్ల చెంగు చెంగున పరుగెత్తి వచ్చింది.
అంతటితో ఆ సీను అయిపోయింది. "కట్ కట్" అన్నాడు డైరెక్టరు.
జయలక్ష్మి భుజం మీద చేత్తో తట్టుతూ, "చాలా బాగా నటించావు జయా, వెరీగుడ్" అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ సిగరెట్టు పొగ వదుల్తున్నాడు డైరెక్టరు.
ఆ పల్లెటూరి పిల్లగా నటించినమ్మాయి జ్యోతి,
* * *
కల కరిగిపోయింది.
"జయలక్ష్మీ" "జ్యోతీ" అంటూ బిగ్గరగా అరుస్తూ మంచంమీంచి లేచాడు మురహరి.
ఆ రాత్రి అతనికి ఇంక నిద్రపట్టలేదు.
తెల్లవారింది. పది గంటలయినా మురహరి నిద్ర లేవలేదు. ఆ రోజున కాలేజీకి ఏదో శలవు. అంచేత అతను బద్ధకంగా పడుకున్నాడు. తలుపు చప్పుడయింది. కళ్ళు నులుముకుంటూ వెళ్ళి తలుపు తీశాడు జయలక్ష్మి.
"ఏం మురహారీ ఇంకా నిద్ర లేవలేదా. రాత్రి రెండో ఆట సినిమాకు వెళ్ళావా" అంటూ నవ్వుతూ పలకరించి గదిలోకొచ్చి కుర్చీలో కూర్చుంది.
* * *
