Previous Page Next Page 
అపస్వరం పేజి 14


    "వెడదామర్రా. కిశోర్ సాహు జీనియస్" అంది నర్మద.
    "సినిమా అయ్యాక..... లంచ్ హోమ్ లో టిఫిన్....."
    సరిపోయింది. ఎప్పుడూ యిలాగే తిండినిద్రా అని ఏడుస్తూఉంటే లావుకాక ఏం చేస్తావ్?" అంటూ మీర రాజ్యలక్ష్మి చేతిని గిల్లింది.
    నర్మద, "నేను మీర ఇంటికి వచ్చేస్తాను. అక్కడినుండి అందరం కలిసి వెడదాం" అంది.
    "ఎండలో నేను నడవలేను బాబూ. జట్కాలో అయితేగాని రాను" అంటూ మధ్యలో పేచీ పెట్టింది రాజూ.
    "ఇలాగే అలవాటు చేసుకో రాజూ. ఇంకో రెండేళ్ళకి రోడ్డు రోలరుని మించిపోతావంతే! ఆడవాళ్ళకి ఫిర్ చాలా ముఖ్యం రాజూ. మొహం అందంగా లేకపోయినా ఫరవాలేదుగాని ఫిగర్ లేకపోతే కష్టం.....మీరని చూడు ఎలా ఉందో....." అంటూ రెండడుగులు వెనక్కి వేసి మీరనే పరీక్షగా చూస్తూ.
    "ఆ నడుమూ, ఆ భుజాలు....." అంది చంపా.
    "ఇక చాలు చంపా. వినలేను" అంది విసుగ్గా మీర. రాజ్యలక్ష్మి అసూయతో మీరవైపు చూస్తూ
    "అలాగేలే, మీరనే బాగా ఉండనీ. నాకు ఫిర్ ఉండి ఏం కావాలి చెప్పు! నేనేం బాల్ డాన్స్ కు వెళ్ళాలా ఏమన్నానా?" అంది.
    ఆఖరి బెల్లు కాగానే విద్యార్ధినులందరూ అల్లరి చేసుకుంటూ బయటికి వచ్చారు.
    మీర ఇంటికివచ్చి పుస్తకాలు టేబుల్ మీద పెడుతుండగానే శ్రీపాదు వచ్చి,
    "ఎలా రాశావ్ మీరా?" అనడిగాడు.
    "ఎలా రాస్తే ఏమిట్రా శ్రీపాదూ? ఇక నా కంతా ఒకటేగా?"
    అంతవరకూ ఆపుకున్న కన్నీరు కట్టలు తెంచుకుంది. శ్రీపాదుకు ఏమీ అర్ధం కాలేదు.
    కాస్సేపు ఏడ్చి తన్ను తానే వోదార్చుకుంది మీర. తరువాత మొహం కడుక్కుని కృష్ణయ్య గారివద్ధకు వెళ్ళి,
    "పెదనాన్నా, ఈరోజు మేమందరం సినిమా కెళ్ళాలనుకున్నాం" అంది.
    "సరే వెళ్ళు. కాని రేపుమాత్రం ఇంట్లోనే ఉండు. శామువాళ్ళ మేనమామ, ఆయన భార్య వస్తారు నిన్ను చూడటానికి."
    మీర జవాబు చెప్పలేదు.
    మధ్యాహ్నం స్నేహితురాళ్ళంతా కలిసి సినిమాకు వెళ్ళారు. దానిలో నాయిక మీరలాగానే వివాహాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది కానీ ఒకరోజు నిసర్గపు తడిలో పిక్నిక్ కు వెళ్ళినపుడు అకస్మాత్తు కాలుజారిపడ్డ నాయికను నాయకుడు చేయూత ఇస్తాడు. ఆ చేతిని అందుకుని పైకి లేవబోయిన నాయికకు అతని హస్త స్పర్శతో హృదయం పులకరిస్తుంది. పెళ్ళివద్దన్న ప్రతిఘటన మానుకుంటుంది. పెళ్ళి మానవునికి చాలా అవసరమన్న వాదనను అంగీకరిస్తుంది.
    సినిమా చూసి విషాదంతో నవ్వింది మీర, మీరకు వివాహపు ఆవశ్యకత ఇంకా కనిపించలేదు. పెళ్ళి లేకుండా స్త్రీ తన బ్రతుకు తాను బ్రతక గలదు అని ఆమె నమ్మకం. కనుక సినిమా ఆమె మీద ఏవిధమయిన ప్రభావాన్ని చూపలేకపోయింది.
    ఇంటికి వస్తున్న వియ్యంకులకోసం అన్ని పద్ధతులూ జరిగాయి.
    కృష్ణయ్యగారు స్టేషనుకువెళ్ళి కాబోయే అల్లుడినీ, వియ్యంకులని స్వాగతించి తీసుకువచ్చారు. ఇంటికి రాగానే కమలమ్మగారు వియ్యపురాలీని లోపలికి తీసుకువెళ్ళారు.
    "ప్రయాణం సుఖంగా జరిగిందా?"
    "వూ"
    "స్నానానికి లేస్తారా?"
    "స్నానం చేసుకునే బయలుదేరాం"
    వాంగీభాతు, భీరు, బొంబాయి బొండా, కూరలతో విందు భోజనం వడ్డించారు.
    మీర గదినుండి బయటికి రానేలేదు. కమలమ్మగారి బలవంతానికి కట్టుబడి, అంజూరపు రంగు పట్టుచీర కట్టుకుని జడ వేసుకుని, పూలు పెట్టుకుంది. నీలపురంగురాళ్ళ జూకాలు ఆమె మనసులాగే చంచలంగా వూగుతున్నాయి.
    అందరూ హాల్లో కూర్చుని తాంబూలం వేసుకుంటున్నారు. శాము కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నాయ్. కృష్ణయ్యగారు అది గమనించి
    "మీరా ఇలా రామ్మా" అని పిలిచారు.
    మీర గదినుండి బయటికివచ్చి తల వంచుకుని చాపమీద కూర్చుంది. శాము చుట్టూవున్నవారు ఏమనుకుంటారన్న సంకోచం లేకుండా మీరవేపే చూస్తూ కూర్చున్నాడు.
    ఇంతకుమునుపు తను వచ్చినపుడు, మీర తనకు టికెట్టు అమ్మిన దృశ్యం గుర్తుకువచ్చి, అతని మొహంలో చిరునవ్వు తొంగి చూసింది. మీర క్కూడ తనలాగే ఆ సంగతి గుర్తు కొచ్చిందేమో నని సూక్ష్మంగా ఆమె మొహంలోకి చూశాడు. క్రిందికి చూస్తున్న విశాలమైన కనురెప్పలు, నుదురు, పాపిడి మాత్రమే కనిపించాయి. మొహం భావ రహితంగా ఉంది. గాంభీర్యం తప్ప మరే భావమూ అతనికి కానరాలేదు.
    శాము మనసు ఉల్లాసంతో లేగదూడలా గెంతుతున్నపుడే, మీర మనసు వికసించని మొగ్గలా ఉండిపోయింది.
    శాము, తమ కూతుర్నికాదని, మీరని చేసుకుంటున్న కారణం సావిత్రమ్మగారికి బోధపడింది. అతని అభిరుచిని, రసికతనూ మనసులోనే మెచ్చుకున్నారు.
    రాత్రి బొబ్బట్లు పరమాన్నంతో విందు భోజనాలయ్యాక, రామశాస్త్రి గారు లగ్న పత్రిక రాశారు. నిశ్చితార్ధం జరిగిపోయింది. శాము, మీరకోసం, లేత ఆకుపచ్చ రంగు పట్టుచీర తెచ్చాడు.
    అస్తమానం పచ్చటి చేల మధ్య కాలం గడిపే శాముకు ఆకుపచ్చరంగంటే అమితమయిన ప్రేమ. సావిత్రమ్మగారు చీరను మీర కిచ్చి, ఆశీర్వదించారు. మీర వెంటనే ఆ చీర కట్టుకుని తనకు చూపించాలన్న ఆత్రం శాముకు. కాని మొహమాటంవల్ల ఆ మాట నోటితో చెప్పలేకపోయాడు. కాని కళ్ళతోనే ఆశతో అర్ధిస్తున్నట్టుగా ఆమెవేపు చూసి నపుడు మీర అలక్ష్యంతో చీరను పట్టుకొని వెళ్ళటం కనిపించింది. అతని మనసులోని కోర్కె అక్కడే ఉండిపోయింది.
    మీర పెళ్ళి పనుల సిద్ధతతో ఇల్లంతా సందడిగా ఉంది. ఎవరికోసం ఇదంతా జరుగుతుందో ఆ పెళ్ళికూతురు మీర మొహంమాత్రం కళావిహీనంగా ఉంది. విరక్తి, ఉదాసీనతల తెరలో దాక్కుంది మీర మనసు. పెళ్ళిరోజు దగ్గర పడుతున్నకొద్ది ఇల్లు చుట్టాలతో నిండిపోసాగింది. ఈ గొడవల మధ్య కాస్సేపు హాయిగా నిద్రపోయి, నిద్రలో నన్నా తన మనసులోని విప్లవాన్ని మరవటం సాధ్యపడలేదు. ఇంటినుండి పారిపోయి, ఎక్కడున్నా ఏకాంతంగా కాస్సేపు హాయిగా నిద్రపోయి, నిద్రలో నన్నా తన మనసులోని విప్లవాన్ని మరవటం సాధ్యపడలేదు. ఇంటినుండి పారిపోయి, ఎక్కడున్నా ఏకాంతంగా కాస్సేపు హాయిగా నిద్రపోయి, నిద్రలో నన్నా తన మనసులోని విప్లవాన్ని మరవటం సాధ్యపడలేదు. ఇంటినుండి పారిపోయి, ఎక్కడన్నా ఏకాంతంగా కాస్సేపు గడపాలనిపించింది మీరకు. కాని వివాహసమారంభంలో ముఖ్యపాత్ర మీరదే అవటంవల్ల ఎక్కడికీ వెళ్ళటానికి కూడా వీలు పడేదికాదు. పెళ్ళికి ముందురోజు పెళ్ళివారు వచ్చి విడిదిలో దిగారు. శాము మేనమామ కూతురు సరస్వతికి మీరను చూడాలని ఎంతో ఆత్రతగా ఉంది. తన్ను కాదని శాము ఎలాటి రంభను చేపడతాడోనన్న కుతూహలంతో.
    "రావే రంగూ శాము మావయ్య పెళ్ళి చేసుకోబోయే పిల్ల ఎంత అందంగాఉందో చూసి వద్దాం" అంటూ తన ఈడు పిల్ల రంగలక్ష్మి తో కలసి బయల్దేరింది.
    కాఫీ టిఫిన్ తీసుకొన్నాక, రంగలక్ష్మితో సరస్వతి, ఆడపెళ్ళివారింటికి బయల్దేరింది. ఇంట్లోకి వెడుతూండగా ఎదురుగా వచ్చిన శ్రీహరిని,
    "మీర ఏది? మేము మీర స్నేహితులం" అని అడిగారు.
    మీర స్నేహితురాళ్ళంతా ఇంచుమించు శ్రీహరికి తెలుసు. ఈ కొత్త స్నేహితురాళ్ళెవర్రా అనుకుంటూ, "రండి" అన్నాడు. మీర గదిలో తన చనిపోయిన తల్లివేపు బంధువు పెద్ధక్కతో మాట్లాడుతూ కూర్చుంది. శ్రీహరి వచ్చి,
    "మీరా నీ స్నేహితులట. ఎవరో వచ్చారు చూడు" అన్నాడు.
    "ఉండు పద్దక్కా. రాజూవో, చంపావో వచ్చి ఉంటారు. తీసుకొస్తాను." అంటూ మీర గబగబా గది నుండి బయటికి వచ్చింది. ఎదురుగా అపరిచితులను చూసి, ఆశ్చర్యంతో నిలబడిపోయింది. సరసి మీరని పై నుండి క్రిందిదాకా పరిశీలనగా చూస్తూ.
    "మేము శాము మామయ్య వేపువాళ్ళం. మిమ్మల్ని చూద్దామని వచ్చాం" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS