9
బాలభానుని లేత కిరణాలు సమస్త జీవరాశిని తాకి నూతన చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. మంచుతో తడిసిన గులాబీలు మెత్తగా, మధురంగా, సుతారంగా నవ్వుతున్నాయి. లానులో ఉన్న గడ్డి పరకల మీదున్న మంచు బిందువులు అరుణ భూమని మృదు కౌగిలి లో తన్మయత్వం చెంది ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. ఆ హాస్పిటలు ఆవరణ లో ఒవిధమైన ప్రశాంతి పరిపాలన చేస్తుంది. నర్సులు హడావుడిగా అటూ యిటూ తిరుగుతున్నారు.
అప్పుడే గేటు దాటి ఆవరణ లోపలికి వచ్చారు మీనాక్షి, విశాలా యిద్దరూ. పొడుగాటి వరండా దాటి ప్రత్యేకంగా ఉన్న స్పెషల్ వార్డ్ వైపుగా నడిచారు.
తలనిండా కట్లతో ఉన్న భానుమూర్తి ని చూడగానే విశాల అదిరిపడింది.
"ఇదేమిటి మీనాక్షీ! ఇన్ని దెబ్బలు తగిలాయా ?" అంది భయంగా.
"ఊ కణత దగ్గరగా పెద్ద గాయమే తగిలింది. అదే కణత మీద తగిలుంటే .... ఏదో భగవంతుడు చల్లని చూపే చూశాడు!" ఫ్లాస్కూ, చెంబూ లాకర్ మీద పెట్టుతూ అంది మీనాక్షి.
విశాల రెప్ప వేయకుండా నిద్రపోతున్న భానుమూర్తి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది.
"పంపు దగ్గరికెళ్ళి యివన్నీ తొలుచు కోస్తాను. కూర్చో నుంటావా?" అంది మీనాక్షి లాకర్ లో ఉన్న పాత్రలు తీసుకుంటూ.
విశాల తల ఆడించింది, సరే అన్నట్లుగా. మీనాక్షి వెళ్ళిపోయింది.
కిటికీలో నుండి లాను వైపు చూస్తూ నిల్చుంది విశాల.
నర్సు లోపలికి వచ్చి భానుమూర్తి యింకా నిద్రలో ఉండడం చూసి తిరిగి వెళ్ళిపోయింది.
మరి కాసేపటికి భానుమూర్తి కళ్ళు తెరిచి హీనస్వరంతో "-
"మీనాక్షి!" అన్నాడు.
విశాల వెనక్కు తిరిగి చూసి "మీనాక్షి పంపు దగ్గర కెళ్ళింది" అంది.
భానుమూర్తి విశాల ముఖంలోకి ఒకసారి చూసి కళ్ళు మూసుకుని బరువుగా మూలిగాడు.
"ఏ ప్రాణికి హాని తలపెట్టడం మీ నైజం కాదె!అలాంటి మీమీద చెయ్యి చేసుకొనేందుకు ఆ పాపిష్టి వాళ్ళకు చేతులెలా వచ్చాయో?" అంది విశాల.
భానుమూర్తి బాధగా నవ్వాడు - జవాబుగా.
"కాఫీ పోసివ్వనా?" అంది విశాల.
"మీనాక్షి వస్తుంది లెండి!"
"ఆమాత్రం పని నాకేం కష్టమని కాదు."
"కష్టమని కాదు." నసిగాడు.
"మరి?"
"ఏం లేదు. నిల్చున్నారేం? అలా స్టూలు మీద కూర్చోండి." మాట మార్చాడు భానుమూర్తి.
విశాల మరేమనక స్టూలు మీద కూర్చుని ఎదురుగా గోడ కేసి చూడసాగింది.
"ఇంత పొద్దున్నే వచ్చారేం?"
"మీరిక్కడున్నా రావడం పడలేదు. మళ్ళీ స్కూలుకు టైమౌతుందని మీనాక్షి వస్తుంటే వచ్చాను."
"ఓ...."
"ఇంతకూ కొట్టిందెవరో తెలీదా?"
"ఊహూ-- చీకట్లో కాంపు నుండీ వస్తున్నాను. అందులోనూ ఆ పల్లెల్లో లైట్లు గూడా లేవాయే. ఎలా తెలుస్తుంది?"
"నిజమే. న్యాయ మార్గంలో నడిచే వాళ్ళకు తరచు యిలాంటి బహుమతులే లభిస్తుంటాయి గాబోలు!" భానుమూర్తి ముఖంలోకి చూస్తూ అంది విశాల.
"ఇలాంటి బహుమతి లభిస్తుందని ముందే తెలిసుంటే అందరూ వెళ్ళే మార్గం లోనే నేనూ వెళ్ళేవాణ్ణి!" విచారంగా నవ్వుతూ అన్నాడు భానుమూర్తి.
"ఊహు- మీరలా అనడం ఏం బాగలేదు." అప్రసన్నంగా తలాడిస్తూ అంది విశాల.
"అదేం?' కుతూహలంగా ప్రశ్నించాడు.
"భగవంతుణ్ణి చేరుకొను కొన్ని మార్గాలుంటాయి. అందులో న్యాయ మార్గమొకటి. ఉత్తమమైన గమ్యానికి బాట కంటకమయంగానే వుంటుంది. ఆమాత్రం చేత వెనక్కు తిరిగి పోవడం గానీ, తప్పు మార్గాలలో పోవడం గాని భావ్యమా? గమ్యమంటూ ఒకటి ఎర్పరచుకోన్నాక ఎన్ని కష్టాల కైనా ఓర్చుకుని దాన్ని చేరుకోవడమే సజ్జనుల లక్షణం. సత్ప్రవర్తన కన్నా తృప్తి నిచ్చే వస్తువు ప్రపంచంలో మరొకటి లేదంటే మీరు నమ్మరేమో?"
"నామ్మకపోవడమేం ? నమ్ముతాను. నమ్మడమే కాదు అనుభవపూర్వకంగా గూడా తెలుసుకున్నాను. కానీ తాత్కాలికమైన కష్టాల్లో మనం ఆలోచించడం మానేస్తాం. ఏమంటారు?'
"అవును."
మీనాక్షి నీళ్ళ చెంబుల తోనూ, పాత్రలతోనూ తిరిగి వచ్చింది. అవన్నీ లాకర్ మీద పెట్టి ఫ్లాస్కు లో కాఫీ గ్లాసులో పోసి మంచం దగ్గరకు తీసి కెళ్ళింది.
భానుమూర్తి లేవబోయాడు.
"లేవకు. అలాగే త్రాగుదువుగాని."
"లేస్తాను మీనాక్షీ!" అంటూ భానుమూర్తి నెమ్మదిగా లేచి దిండు నానుకుని కూర్చున్నాడు.
మీనాక్షి ఇచ్చిన కాఫీ చప్పరిస్తూ , "అయితే మీకు భగవంతుడి మీద ఏమాత్రం ద్వేషం లేదా?" అన్నాడు. ఆలోచనల నుండి తేరుకుని విశాల ముఖంలోకి చూస్తూ.
"భగవంతుడి మీదా? నాకా? ఎందుకూ?' ఆశ్చర్యపోయింది విశాల.
"మీకే!"
"ఎందుకు?"
"మీ కిలాంటి పరిస్థితిని కల్పించినందుకు?' జాలిగా ఆమె కన్నుల్లోకి చూస్తూ అన్నాడు భానుమూర్తి.
విశాల ముఖం వివర్ణమైంది. కన్నులు చెమ్మగిల్లాయి. పెదమలు సన్నగా కంపించాయి. చివాల్న లేచి కిటికీ దగ్గర కెళ్ళి కిటికీ లోంచి బయటికు చూస్తూ "నా స్థితి కేం?' అంది కంఠం లోని మార్పును తెలియనీకుండా.
భానుమూర్తి కి నవ్వొచ్చింది. "అదేమిటి? ఆ విషయాలన్నీ నా నోటంటే చెప్పించి విందామనుకుంటున్నారా? కొంతమందికీ భగవంతుడు నిజంగానే అన్యాయం చేస్తాడు. కంటికి స్పష్టంగా కనిపిస్తున్న విషయాన్ని మీరు కాదంటే మటుకు సరిపోతుందా? కానీ లోకం యింకా కఠినంగా ప్రవర్తించడం బాధాకరమైన విషయం. అదే నా బాధల్లా." తప్త కంఠం తో అన్నాడు.
విశాల హృదయం అవ్యక్తమైన బాధతో మెలికలు తిరిగిపోయింది. కనుకొనకుల్లో రెండు కన్నీటి బొట్లు రాలనా, వద్దా అన్నట్లుగా నిలిచి పోయాయి.
మానవ జీవితం చిత్రమైంది. కానీ అంత కన్నా చోత్రమైంది అతని హృదయం. విజ్ఞాన శాస్త్రజ్ఞులు దాని నిర్మాణాన్ని, పనినీ వివరించి చెప్పినా ఆ జ్ఞానం చాలా పరిమితమనే చెప్పచ్చు. హృదయం కేవలం రక్త మాంసాల ముద్దే కాదు. దాన్ని- తయారు చేసేటప్పుడు బ్రహ్మ ఏయే పదార్ధాలు కలుపుతాడో మానవ ఊహకు , చింతనకు అతీతమైనవిషయం. అందుకనే జగత్తు లోని సర్వశక్తులనూ జయించగలిగిన మానవ మేధ ఆ హృదయాన్ని తన స్వాధీనంలో పెట్టుకోలేకపోతుంది. ఎన్ని కష్టాలయినా చిరునవ్వుతో స్వీకరించగలదు.
తన రహస్యాలన్నీ గోప్యంగా ఉన్నన్ని రోజులూ సంతృప్తి గా మనగలడు. కానీ ఏ రోజయితే తను ప్రాణ ప్రదంగా దాచిన విషయాలు అవతలి వాళ్ళకు తెలుస్తాయో -- తెలిసినా ఊరుకోక ముఖాన్నే అడుగుతారో -- ఆరోజు దాని మనుగడ దుప్తరమౌతుంది.
భగవంతుడి మాటలా ఉంచి లోకం తన కేంతటి అన్యాయం చేస్తుందో విశాలకు తెలీక పోలేదు. కానీ ఆ మాటే భానుమూర్తి నోట్లో నుండి రాగానే విశాల హృదయం దాన్ని సహించలేక పోయింది. ఎదురు తిరిగింది.
"నన్నిలా అవమానించడం వల్ల మీకు కలిగే లాభ మేమిటో చెప్తారా?' అంది వెనక్కు తిరిగి అశ్రుతప్తనయనాలతో.
భానుమూర్తి అప్రతిభుడై పోయాడు. మీనాక్షి కొయ్యబారి పోయింది. భానుమూర్తి కాసేపటికి తన్ను తాను తమాయించుకుని "ఏవన్నారు? మిమ్మల్ని నేను అవమానిస్తున్నాననా? ఛా! ఛా! అలాంటి దురుద్దేశం నా కెందుకుంటుంది? విశాలా, ఇన్నాళ్ళ మన పరిచయం వల్ల మీరు నన్ను యీ మాత్రమే అర్ధం చేసుకున్నారా?" అన్నాడు కంపిస్తున్న కంఠస్వరంతో.
విశాల ఏమీ మాట్లాడక నేలమీద కాలి బొటన వ్రేలితో రాస్తూ తలవంచుకు నిల్చుంది.
"మీనాక్షి! నువ్వన్నా చెప్పు. ఆమెను అవమానించాలన్న దురుద్దేశం నాకే రోజూ లేదని చెప్పు." అన్నాడు ముఖం త్రిప్పి మంచం పట్టే మీద వాలుస్తూ - బాధగా.
"అన్నయ్య విషయం నీకు తెలీదా , విశాలా? నిన్ను గురించి అన్నయ్య ఏ రోజూ నీచంగా మాట్లాడ్డం గానీ, చిన్న చూపు చూడ్డం గానీ జరుగలేదు. నాముందు ఎన్నోసార్లు నిన్ను గురించి గొప్పగా మాట్లాడాడు. నిన్నెప్పుడూ నాకొక ఆదర్శంగా చూపిస్తుంటాడు. నీమీద వుండే సానుభూతి వల్లనే అన్నయ్య అలా అన్నాడు గానీ మరో విధంగా కాదు. దయచేసి ఏమనుకోకు, విశాలా!" అంది మీనాక్షి విశాల భుజం మీద చెయ్యి వేసి.
"సానుభూతా? ఎందుకూ ? ఎవరి సానుభూతి నా కక్కర్లేదు " అంది విశాల తలెత్తకుండానే కఠినంగా.
"సానుభూతి చూపడం సహృదయుల లక్షణం. వెన్నెల కురిపించడమే చంద్రుని తప్పయితే..... దానికి నేనేం జవాబు చెప్పను?' తల త్రిప్పి విశాల వైపు చూస్తూ అన్నాడు భానుమూర్తి.
"సానుభూతి సహృదయుల లక్షణమే కావచ్చు. కానీ సానుభూతి అనే పేరుతొ అవమానిస్తున్నప్పుడు అది ఎవరి లక్షణమౌతుంది?" తలెత్తి అంది విశాల.
విశాల అశ్రుతప్త నయనాలు భానుమూర్తి హృదయాన్ని ఆవేదనతో నింపాయి. "క్షమించండి! మీ మనసు కష్టపెట్టినట్లున్నాను. మరే రోజూ యిలాంటి ప్రస్తావన తీసుకురానని యీ రోజు ఒట్టు వేసుకుని చెప్తున్నాను." అన్నాడు విషన్ణా వదనంతో.
"ఊర్కో, అన్నయ్యా! అవెం మాటలు! విశాల మనసు బాగున్నట్లు లేదు. నీకుస్కూలుకు టైం గూడా కావస్తుంది. వెళ్దాం పద" అంది మీనాక్షి.
ఇద్దరూ వెళ్ళిపోయారు.
భానుమూర్తి అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయాడు. 'అబ్బ! ఎంతటి సౌజన్యవతి!" కాసేపయ్యాక భానుమూర్తి నోట్లో నుండి వెలువడింది - ఆ ఒక్కమాటే!
తలెత్తి దూరంగా ఉన్న వరండా వైపు చూశాడు.
సుధీర వరండాలో నుండి నడిచి వస్తుంది. మరో నిముషానికల్లా లోపలికివచ్చి మౌనంగా కూర్చుంది. ముఖంలో కోపం బాగా వ్యక్తమౌతుంది.
"అంత కోపంగావున్నావేం?" అన్నాడు భానుమూర్తి.
"మన మేనేజరు ప్రతాపానికి!"
"ఏం చేశాడేమిటి?"
"ఏముంది? ఆ పల్లెకు వెళ్ళాడట. ఏమాత్రం ఆచూకీ తీయలేక పోయాడట."
"మరి కొట్టినవాళ్ళు అంత తెలివి తక్కువగా పట్టుబడతారా? జరిగిందేదో జరిగిపోయింది. దాని కోసం యింత రాద్దాంత మెందుకు, మరీ?" అనునయించే ధోరణిలో అన్నాడు భానుమూర్తి .
"నువ్వూరుకో , బావా! ఈరోజు కొట్టారు. రేపు ప్రాణాలే తీస్తారు. ఇలాంటి విషయాల్లో జాప్యమూ , నిర్లక్ష్యమూ పనికి రావు." కరుగ్గా అంది సుధీర.
భానుమూర్తి మరేమీ మాట్లాడలేదు. ఆలోచనలు తన ప్రమేయం లేకుండానే సాగిపోతున్నాయి. విశాల, సుదీరలు మనో ఫలకం మీద ప్రక్క ప్రక్కన నిల్చున్నట్లయింది. గ్రీష్మ ఋతువులోని మధ్యాహ్న వేళ యందలి సూర్యుని వేడిమి లాంటిది సుధీర. వసంత ఋతువులోని పున్నమి నాటి చంద్రుని వెన్నెల విశాల. ఇద్దరికీ ఎంత తేడా! కానీ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పడానికి లేదు. ఎవరి ప్రత్యేకత వారి కుండనే ఉంది. అయినా సూర్యుని వేడిమి కన్నా పున్నమి వెన్నెల హాయినీ, చల్లదనాన్నీ ఎక్కువ మంది కోరుకుంటారేమో?
చంద్రశేఖరం గది లోపలికి వచ్చి "విష్" చేశాడు.
"ఏవిటోయ్? ఎప్పుడు రావడం? మీ అమ్మగారి ఆరోగ్య మెలా వుంది? అలా కూర్చో!' స్టూలు చూపిస్తూ అన్నాడు భానుమూర్తి.
"రాత్రే వచ్చాను. ఉదయం ఆఫీసుకు రాగానే మీ విషయం చెప్పారు. వచ్చేశాను."కూర్చుంటూ అన్నాడు.
