Previous Page Next Page 
అన్వేషి పేజి 14

 

    కాంతమ్మ కన్నీరు పెట్టుకుంటున్నది. అపర్ణ మౌనంగా కూర్చుంది. ఆ ఇద్దరు స్త్రీల అంతర్యాలూ ఈ పరాజయంతో దగ్గరవుతున్నా యనిపించిందతనికి.
    "నాయనా, గిరిధారీ! అపర్ణకు త్వరగా వివాహ మయేలా నీవూ ప్రయత్నించాలి. అటు వాడికీ, ఇటు దీనికీ ఆ మాటే గుర్తు లేదు. అది కాస్తా నెగ్గితే ఇంక నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను."
    "ఎక్కడికి పోతావు పిన్నీ!"
    "ఏమో! నాకు అయన దాయాదు లిచ్చిన మనోవర్తి డబ్బుంది. వడ్డీతో కలిపి తేలికగా పదిహేను వేల రూపాయలవుతుంది. మనసు ముక్కలైన చోట ఎలా ఉండగలనమ్మా!"
    ఒకనాటి ఆమె మాటలు గుర్తు వచ్చాయి గిరిధారికి.
    "ఒకప్పుడు నా తనువు ఆ ఇంటిలోనే రాలిపోవాలనుకున్నాను. కానీ ఆ ప్రాప్తం లేదులా ఉందీ జన్మకి" అందామె మళ్ళీ.
    అపర్ణ ఈసడించినా పెంచిన ప్రేమతో అధికారాన్ని తీసుకుంది. సునీల అజమాయిషీ మాత్రం ఆమెకు బాధ కలిగించింది. ముఖ్యంగా కృష్ణ లోని మార్పు ఆమె భరించలేని శరాఘాతమైంది.
    "నా పెళ్ళి పట్ల నాకు లేని అనురక్తి మీకందరికీ ఎందుకు పిన్నీ! మళ్ళీ చెపుతున్నాను-- నా పెళ్ళి ఎప్పుడవుతుందో, అసలు అవుతుందో లేదో కూడా నాకే తెలియకుండా ఉంది."
    "అదేమిటే ! ఇందులో తెలియవలసిందేముందీ?'
    "అంతే పిన్నీ. ఒకప్పుడు నిన్ను ఈసడించాను. ఇప్పుడాలోచిస్తే మనసునూ, తనువునూ రెండుగా విభజించి జీవించటం అంత తేలికైన విషయం కాదనిపిస్తోంది. ఇప్పుడింకేమీ అడక్కు! నాకే శుభం జరిగినా మొదటి ఆశీర్వాదం నీదే, పిన్నీ!"
    గిరిధారికి మంగాలు గుర్తు వచ్చింది. "అయితే అపర్ణ హృదయంలోని ప్రేమమూర్తి ఎవరు? తను కాదు గద, భగవాన్!' అంటూ నిట్టూర్చాడు.
    "ఇంకేమననే, తల్లీ! ఈ జాడ్యం నీకూ సోకుతుందనుకోలేదు!"
    "మనం మన తోట ఇంట్లో ఉందాం పిన్నీ."
    "అదేమిటే -- ఆ అడివిలో!"
    "ఏం? ఆ తోటా, ఇల్లూ-- అవన్నీ నావేగా? పోతరాజు వాళ్ళూ ఉన్నారు. వాడితో చెప్పి మరో మూడు నాలుగు కుటుంబాలు ఉండేలా చేశామంటే అదొక పల్లెలా ఉంటుంది. త్వరగా ఆలోచించు. పూర్వపు అపర్ణను కాను నేను. ఇప్పుడు నిన్ను ' అమ్మా' అన్నాలన్నంతగా ప్రేమిస్తున్నాను. పిన్నీ."
    "అపర్ణా!" అంటూ కాంతమ్మ గారు అపర్ణను కౌగలించుకుంది.
    "చాలమ్మా చాలు. ఈ జన్మ కిది చాలు. నువ్వన్నట్లు అక్కడే ఉందాం. ఇంకా కావాలంటే కస్తూరిని కూడా మన దగ్గరే ఉండమందాం. దానిదీ ఎటూ కాని జీవితమేగా!" అన్నది కాంతమ్మ గారు. "మరక్కడేవరో సంగీతం మాస్టారున్నారు గదే!" అంది హటాత్తుగా.
    "ఉంటె ఉండనీ, మన కెంత కావాలి? వాకిలి వరండా కు తడికెలు కట్టుకుని ఉంటాడాయన. లేదా మరో చిన్న పాక వేసుకుంటాడు."
    "భేష్!అంతా ఒక ఆశ్రమంలా తయారవుతుందన్న మాట. పనిలో పని ఒక స్వాముల వారిని కూడా తీసుకు రండి." గిరిధారి నవ్వుతూ అన్నాడు.
    "తమ దయ -- ఆశీర్వాద బలం . వేరే స్వాములేందుకు ! తమరే రండి! ఈ మఠం చిన్నబోదు లెండి!"
    అపర్ణ తిరగేసి కొట్టిన దానికి గిరిధారి ముఖం అభిమానంతో కందిపోయింది.
    "నవ్వుతూ అన్నాను, అపర్ణా. అయితే మీరు నిశ్చయించుకున్నట్లేనా?"
    "తప్పనిసరి! క్రింద మాకొక రెండు గదులు చాలు-- వంటగది కాక ఆ పక్కది. పిన్ని , నేనూ ఉండటానికి. మిగిలిన ఇల్లంతా రోజు కోక కిరాయి దారుని తీసుకొచ్చి చూపిస్తున్నాడు అన్నయ్య! నెలకు రెండు వందల రూపాయల ఆదాయం."
    "వాడి నిందుకే బయట పెడతావు? అది వాడికి పుట్టిన బుద్ది కాదు."
    "చూశారా! మా పిన్ని ఇప్పటికీ అన్నయ్య మీద ఈగ వాలనివ్వటం లేదు."
    "సరేలే. పోదాం , పద."
    "పోదాం గాని రేపే మన ప్రయాణం! ముందు ఎవరితోనూ అనకు. చూడ్డానికి వెళ్లినట్టు వెళ్లి అక్కడే ఆగిపోదాం. ఇక్కడి కొచ్చాక గిన్నెలు, మన బట్టలూ తెచ్చుకుందాం. అక్కడి నుంచి కట్టు బట్టలతో వచ్చేయాలి, తెలుసా? అనక ఏం జరుగుతుందో చూద్దాం."
    అపర్ణలో ఎంత ద్వేషం! ఎంత ప్రతీకారవాంఛ!"
    "తప్పకుండా అలాగే చేద్దాం." అంది కాంతమ్మ గారు.
    'అపర్ణా!...." వారింపుగా అన్నాడు గిరిధారి.
    "మహాశయా! ఈ సందర్భంలో తమరు మౌనం వహించాలి. ఏమీ పుట్టి మునగడం లేదు అందామె."
    "కానీ చెప్పకుండా...."
    "చెప్పితే మరో రకం వాతావరణం ఎదురవుతుంది...
    "మేము ఊరు విడిచి పోవడం లేదు. మరోకరి ఆశ్రయం లోకి వెళ్ళటం లేదు" అంది కాంతమ్మ.
    గిరిధారికి వారు దృడ నిశ్చయాని కొచ్చారని అర్ధమైంది. అతనింక మాట్లాడలేదు.

 

                                   22


    "చూశారా ! పిన్నీ, అపర్ణా ఏం చేశారో?" లోనికి వస్తూనే కృష్ణ అన్నాడు.
    గిరిధారి ప్రశ్నార్ధకంగా చూశాడు.
    "అమాంతం వెళ్ళి తోట ఇంట్లో మకాం పెట్టారు. కట్టుబట్టలతో వెళ్ళారు. చూసినవాళ్ళు ఏమనుకుంటారు? మిమ్మల్ని వెంటబెట్టుకుని వెళ్ళి తీసుకు రమ్మంది సునీల."
    "మనం వెళ్ళినా వాళ్ళు రారేమో?"
    "మీకు తెలుసా?"
    "ఊహిస్తున్నాను."
    "వాళ్ళు నా దగ్గరుండలేని అవమానం జరిగిందని మీ అనుమానమా?"
    "మీ కుటుంబ విషయాలు నాకెలా తెలుస్తాయి, చెప్పండి!"
    "అయితే మీరు నాతొ రారా?"
    "ఎందుకు రాను? పదండి! కాని, నాకన్నా సునీలను వెంట తీసుకు వెళితే ఏమన్నా ప్రయోజన ముంటుందేమో ?"
    "ఇంతటి దానికి ఆమె ఎందుకు లెండి! వాళ్ళు రామని మొండి కేస్తే వాళ్ళ ఖర్మ! వాళ్ళ అహంకారం! 'అంతగా అయితే వంట మనిషిని పెట్టుకుందాం. మరీ కాళ్ళా వెళ్ళా పడకండి!' అని ఆమె ముందే చెప్పింది. వెళ్ళి రమ్మని పిలవటం నా ధర్మం."
    గిరిధారి కృష్ణ వెంట వెళ్ళాడు.
    ఫలితం త్వరగానే తేలిపోయింది. కృష్ణ తిరిగి రమ్మని ప్రత్యుద్దానం చేయటం ఎంత సవ్యంగా ఉందొ, వాళ్ళు 'రాము' అని ఒక్క ముక్కలో చెప్పటమూ అంత మొండిగానూ ఉంది.
    ఇద్దరూ తిరిగి వచ్చేశారు.


    
                                                  *    *    *    *


    ఇది జరిగాక గిరిధారి రోజూ విధిగా తోటకు వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. కస్తూరి తోటలోనే వారితో పాటు ఉంటుంది. అంతేకాదు , అపర్ణ ఆశ్రయం లోకి మరి ఇద్దరు దిక్కులేని స్త్రీలు చేరారు. అందులో ఒకామె కృష్ణ భక్తురాలు. మధుర-- బృందావనం కూడా వెళ్ళి వచ్చిందట. ఆమె చక్కగా కృష్ణ భజన చేస్తుంది. అష్టపదులు, కృష్ణ కర్ణామృత శ్లోకాలూ నిండైన అనుభూతితో శ్రావ్యంగా పాడుతుంది. అపర్ణ వెళ్ళి నెల రోజులు పూర్తీ కావస్తున్నది.
    గిరిధారి లెక్క వేసుకున్నాడు. తనక్కడికి వచ్చి పది నెలలు దాటింది. ఏం సాధించాడు? అతనికి నవ్వు వచ్చింది. అపర్ణ కు తన పట్ల గల అనురక్తి స్పష్టమైంది.
    అపర్ణ అన్నది నిజమే. కృష్ణ కింద ఇల్లంతా అద్దె కిచ్చాడు. వేయించిన కొత్త గదులకు రేకుల వసారా దింపి వంట కూడా పైనే చేస్తున్నారు.
    అయితే పది రోజులు గడిచేసరికి సునీల తండ్రి గారు వచ్చారు. ఆమెను తీసుకు వెళతామన్నారు. ఒక్కర్తే అమ్మాయి, తోలి కానుపు. అందుకు సంబంధించిన వేడుకలన్నీ ఆర్బాటంగా చేయాలని వారి సంకల్పం.
    ముకుందం గారు జరిగిందంతా తెలుసుకుని హృదయ పూర్వకంగా బాధపడ్డారు. అయితే కూతురిని ఏమీ అనలేకపోయారు. అయన అల్లుడిని కూడా రమ్మన్నారు. కాని షాపు అడ్డం వచ్చింది. చివరికి ఆ వారం రోజులు గిరిధారి షాపులో ఉండేందుకు ఒప్పుకోవటం తో కృష్ణ అత్తవారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి తాళం పడింది.
    విషయం విన్న కాంతమ్మ గారు -- "అది పురుడు వెళ్ళి వచ్చేదాకా నేను వెళ్ళి ఉంటాను. హోటలు మేతుకులతో అవస్థ పడతాడేమో?" అన్నది.
    అపర్ణ మండిపడి-- "ససేమిరా . వీల్లె"దన్నది.
    వారం రోజులకల్లా కృష్ణ వచ్చేశాడు. ఈ లోపల గిరిధారి గదికి రోజూ డబుల్ కారేజీ భోజనం వచ్చేటట్లూ అతనూ కృష్ణా కలిసి భోజనం చేసేటట్లూ గిరిదారిని ఒప్పించింది కాంతమ్మ గారు. అవసరాన్ని బట్టి విషయం రహస్యంగా ఉంచాలా, బహిరంగం చేయవచ్చా అన్న అంశం గిరిధారికి వదిలి వేయబడింది.
    మొదటి నాడు గిరిధారి మాట తీసి వేయలేక భోజనానికి వచ్చాడు కృష్ణ. కాని రెండో నాడు కస్తూరి కారియర్  తెస్తూ పట్టుబడి పోయింది. ఆ తరువాత కృష్ణ రాలేనని చెప్పాడు గిరిధారి.

 

                
    "ఇందులో మీరు కించపడవలసిందేమీ లేదు. వాళ్ళు నన్ను కాదని వెళ్ళిపోయాక నేనెలా అంగీకరించను, చెప్పండి? అదీ గాక నాకు షాపుకీ, ఈ భోజనానికి , నివాసానికీ లంగరందటం లేదు. స్నానం అదీ చేసి వెళుతూనే ఏ హోటల్లో నో భోజనం చేస్తాను. మళ్ళీ రాత్రి వచ్చేటప్పుడే చేసి వస్తాను. ఒక గుమస్తా ను పెట్టాను లెండి! నా కంతగా శ్రమ లేదు. వారానికి రెండు మూడు సార్లు షాపుకి వెళ్ళినా సరిపోతుంది. టౌన్ లో ఖాతా లింక పూర్తీ అయినట్లే. రిటేషన్ లో మిగిలే లాభమే కాని కొత్త అర్దర్లంతగా ఉండవు. కాని ఇక ఉండేది నికరమైన ఆదాయం. ఏ గుమస్తా అయినా మోసం చెయ్యలేడు." అన్నాడు కృష్ణ. ప్రస్తుతం అతనికీ భార్యా ,ఆదాయం తప్ప మరేమీ కనిపించటం లేదు.
    "మీలోని మార్పుకీ నేను సంతోషిస్తున్నాను.  అపర్ణ వివాహం కూడా పూర్తీ అయితే మీరింతకన్నా నిశ్చింతగా , హాయిగా ఉండవచ్చును."
    గిరిధారి మాటలకు కృష్ణ కోపం తెచ్చుకున్నాడు.
    "అది నన్ను కాదని వెళ్ళిపోయింది. ఒకరు చెప్పినట్లు వినదు. నేనేం చెయ్యను? మీరేదయినా సంబంధం చూడండి! దాని కామె ఒప్పుకుంటే వెనకాడకుండా వివాహం చెయ్యటానికి నాకే అభ్యంతరమూ లేదు."
    గిరిధారి మాట్లాడలేదు.
    "అమెకా ఆలోచన ఉన్నట్టు తోచదు. మీకు మీ రేరగని మరో విషయం చెప్పనా?"
    "వినటానికేమీ అభ్యంతరం లేదు."
    "నాన్నగారు మా ఇద్దరి జాతకాలు చూపించారు. ఆ లెక్క ప్రకారం అపర్ణ....." కృష్ణ కంఠం పూడిపోయింది. కూర్చున్న కుర్చీలో వెనక్కు వాలిపోయి మోచెయ్యితో నుదురు , కళ్ళూ కప్పుకున్నాడు.
    "దానికి ఆయుర్దాయం తక్కువ. ఈ విషయం దానికీ తెలుసు."
    "మీకా నమ్మకాలు చాలా జాస్తిలా ఉంది." తీక్షణంగా అన్నాడు గిరిధారి.
    కృష్ణ నవ్వాడు. ఎన్నాళ్ళ తరవాతనో ఇప్పుడతను తనతో తిరిగి ఆత్మీయతతో మాట్లాడుతున్నట్లనిపించింది గిరిధారికి.
    "అసలు పిన్ని నాన్నగారి భార్య కావలసింది. ఆమెకు వైధవ్య యోగాముందని ఆమె పుట్టిన నాటి నుంచీ అనుకుంటున్న సంబంధం రద్దు అయింది. అప్పటి నుంచీ నాన్నకు జాతకాల పై అయిష్టం కలిగినా, పిన్ని విధవ కావడంతో నమ్మకం కలిగి అది బలపడింది. దానివల్లనే మేము పుట్టిన వేళ జాగ్రత్తగా వ్రాసి ఉంచి రాశి చక్రాలు వేయించి జాతకాలు తయారు చేయించారు."
    "ఇన్ని విషయాలు తెలిసి ఆమె అంతర్యాన్ని కనిపెట్టి చూసుకోలేకపోయారు. మిమ్మల్ని ప్రాణంగా పెంచిన పిన్ని గార్ని మనఃస్పూర్తిగా మన్నించలేకపోయారు. యౌవన సహజమైన కొత్త మోజులో కర్తవ్యాన్ని మరిచిపోయారు. ఇది కేవలం నా ఒక్కరి అభిప్రాయమే కాదు. మిమ్మల్నేరిగిన వారంతా అదే అనుకుంటారు."
    'అంతా అలా అనుకోవాలనే వాళ్ళలా చేశారు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS