Previous Page Next Page 
ఆఖరి మజిలీ పేజి 15

 

    అతను టేబిల్ మీద వేలితో సున్నాలు చుడ్తూ కూర్చున్నాడు.
    భార్గవి లేవబోయింది. "ఉండండి!' అంటూ అతను లోపలి కెళ్ళి రెండు కప్పుల్లో కాఫీ పోసి తీసుకొచ్చి ఒక కప్పు భార్గవి ముందుంచాడు.
    "కాఫీ కూడా తాగాలా" అంది కొంచెం కాటిన్యం గొంతులో నింపుకుని.
    "తాగితే మర్యాద"
    భార్గవి మాట్లాడకుండా కప్పు తీసుకుని కొంచెం తాగి కింద పెట్టేసింది.
    "ఇకనైనా నన్ను పంపుతారా?"
    "ఇంకా నా దగ్గరే బంధించుకునే రోజు రాలేదు. నిక్షేపంగా పంపుతాను."
    భార్గవి ముఖం ఎర్రబడింది.
    "అంటే! అంటే... మీ ఉద్దేశం .... నన్ను" నేను...."
    "భగవంతుడు చల్లగా చూస్తె ...."
    అతని మాట పూర్తీ కాకుండానే  భార్గవి బయట కొచ్చేసింది విసురుగా. పరుగు లాంటి నడకతో గేటు వైపు కెళ్ళసాగింది. జరగబోయేది ఊహించిన శేఖర్ ఒక్కంగలో బయట కు వచ్చి కారు స్టార్ట్ చేసి గేటు దగ్గరకు తీసుకొచ్చాడు. అప్పటికే భార్గవి గేటు దాటింది. ఆమె ప్రక్కగా ఒక్క కుదుపుతో కారాపి "భార్గవీ రా" అన్నాడు. ఆమె విసురుగా తల తిప్పేసి వెళ్ళబోయింది పక్కకు జరిగి డోర్ తెరిచి గబుక్కున ఆమె రెక్క పట్టుకుని కారు లోకి లాగి కూర్చో బెట్టాడు.
    "ఏమిటీ అఘాయిత్యం" అరవబోయిన భార్గవి నోరు చేత్తో మూసి "ఎందుకలా అరుస్తావు. ఎవరైనా వింటే బావుండదు" అని ఒక్క ఉదుటున కారు స్టార్టు చేసి భార్గవి ఇంటి వైపు పోనిచ్చాడు.
    అవమానంతోనూ, రోషం తోనూ భార్గవి ముఖం కందగడ్డలా తయారయింది. ఎంత ఆపుకుందామన్నా ఏడుపు ఆగలేదు. బుగ్గల మీద నుంచి వెచ్చని కన్నీరు వర్షం లా కురవసాగింది. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని ఇంకో చేత్తో భార్గవి చేతిని తన చేతిలోకి తీసుకుని భార్గవీ! క్షమించు నేనేదైనా పొరపాటుగా ప్రవర్తించి నీ మనసు నొప్పిస్తే...."
    "చాలు...చాలు! మాట్లాడకండి" విసురుగా తన చేతిని లాక్కుంటూ వెక్కిళ్ళ మధ్య అంది భార్గవి.
    "భార్గవీ! నన్నర్ధం చేసుకునే రోజు రాకపోదు." దీర్ఘంగా నిట్టురుస్తూ అన్నాడు శేఖర్.
    "అసలు మీరెవరు? నేనెవరు? మిమ్మల్ని నేనెందుకు అర్ధం చేసుకోవాలి. నన్నెందుకిలా వేధించి వెంట బడుతున్నారు. మీకూ, నాకూ ఏమిటి సంబంధం?"
    "భార్గవీ! అదే నాకూ తెలియటం లేదు. నీళ్ళల్లో ఉండే కలువకూ, నింగి లో చందమామకు ఏం సంబంధం? పూవు కూ , దానికి ఏం సంబంధం? నువ్వు ప్రకృతి నేను పురుషుడు . మనిద్దరి సంబంధం అదే అయి వుంటుంది బహుశా!"
    భార్గవి మనసు ఆగ్రహావేశాలతో ఊగి పోతున్నదని ఎగసి పడుతున్న ఆమె ముక్కు పుటాలే చెప్తున్నాయి.
    శేఖర మే అన్నాడు మళ్ళీ "చూడు, ఇంట్లో మీ అక్కయ్యా, నిర్మల అందరూ ఉన్నారు. అనవసరంగా గొడవ చెయ్యకు -- నేను సాయంత్రం ఊరి కేళ్తున్నాను. అందుకే మందులకు నిన్ను రమ్మన్నాను. ఎట్లాగూ మళ్ళీ మీ ఇంటికి రాక తప్పలేదు. నేనే ఆ మందులేవో తీసుకొచ్చి పడేస్తే సరిపోయేది -- వింటున్నావా, అనవసరంగా అసలు విషయం ఏం లేకపోయినా మీ ఆడవాళ్ళు దానికి రంగులు పూసి ఏదో వికృతాకారం తయారు చేస్తారు."
    "ఓహో! అంటే మా అక్కయ్య వాళ్ళ కంటే మీరు ఆప్తులు, ముఖ్యులు అన్నమాట."
    "ఆత్మీయత" అన్నదానికి అర్ధం చాలా చెప్పవలసి ఉంటుంది. కాని , నువ్వు ఇప్పుడు విని అర్ధం చేసుకునే స్థితిలో లేవు."
    "అసలు ముందిది చెప్పండి. నన్ను 'నువ్వు' అనేటంత స్వతంత్యం వచ్చిందా మనిద్దరి మధ్యా!"
    "ఓ , సారీ భార్గవి! ఆ విషయమే గుర్తించ లేదు నేను. ఒక్కొక్కప్పుడు మనసు ఒక వ్యక్తిని అత్యంత సన్నిహితంగా స్వీకరించి నప్పుడు కొన్ని మర్యాదలు దృష్టిలో ఉండవు.

                                  
    క్షమించు- అదే క్షమించండి!' అన్నాడు చిరునవ్వుతో ఇదే మంత పెద్ద విషయం కానట్టు.
    కారు అగుతూనే లోపలకు పరుగెత్తింది భార్గవి. ఇంటికి వెళ్ళగానే అక్కయ్య కు, అన్నయ్య కు ఈ విషయం చెప్పి శేఖర్ ను ముక్కు చీవాట్లు పెట్టించాలనుకున్నది.
    జయలక్ష్మీ ని చూడగానే తన అభిప్రాయం మార్చుకుంది.
    అక్కయ్య అఘాయిత్యపు మనిషి ఏం అఘాయిత్యం చేస్తుందో అని భయపడి ఆ ఆలోచన వదిలి పెట్టి బాత్ రూమ్ వైపు నడిచింది. ఎంత ముఖం కడుక్కుని వచ్చినా ఎఱ్ఱగా ఉన్న కళ్ళు- వాడిపోయినటున్న ముఖం చూసి -- అదేమిటే అలా ఉన్నావ్" అంది ఆశ్చర్యంగా జయలక్ష్మీ.
    "ఎట్లా ఉన్నాను-- ఎండలో వెళ్ళి వచ్చాను గదా అక్కయ్యా. అందుకని" అని, లోపలి కెళ్ళి పోయింది.
    నిర్మల తీరుబడిగా తమల పాకులు నములుతున్నది. భోజనం చేసినట్లున్నది అనుకుంటూ "తలనొప్పి తగ్గిందా నిర్మలా" అంది.
    "ఆ, తగ్గింది-- ఎంత సేపయింది వచ్చి -- అన్నం తిన్నావా?"
    "ఇంకా లేదు " అంది అక్కడే ఉన్న పేపరు చేతిలోకి తీసుకుంటూ.
    "భార్గవీ! సినిమా లేమున్నాయి" కుతూహలంగా అంది నిర్మల.
    నిర్మలకు మహా సినిమాల పిచ్చి. రెండు మూడు రోజులకొక సినిమా చూస్తుంటే గాని బ్రతకలేదు.
    "నిర్మలా! అన్నయ్య జీతమంతా నీ సినిమాలకే ఖర్చయ్యే ట్టుంది" అని హాస్యంగా నవ్వుతూ పేపరందించి వంటింటి వైపు వెళ్ళింది భార్గవి. అప్పుడే జయలక్ష్మీ కంచాల్లో అన్నం పెడ్తున్నది. భార్గవి ని చూస్తూనే "రా, భార్గవీ! నేనే పిలుద్దామనుకుంటున్నాను " అంది.
    ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు.
    నిర్మలకు పెళ్ళికి ఏయే నగలు చేయించాలో ఏకరువు పెట్టింది జయలక్ష్మీ.
    భార్గవి మౌనంగా వింటూ కూర్చున్నది.
    "భార్గవీ! ఆడపిల్లవు. పెళ్ళి కావలసిన దానివి శ్రీధరానికి ఏం తెలుసు? వాడి దోవన వాడు ఆఫీసుకు పొతే ఒంటరిగా ఆ మహా పట్నం లో ఎలా ఉంటావు? నేను రాను, అక్కయ్య తో కాకినాడ వెళ్తానని చెప్పు" అంది జయలక్ష్మీ గిన్నెలు సర్దుతూ.
    "ఫరవాలేదక్కయ్యా! వదిన వచ్చేవరకు అన్నయ్యకు తోడుగా వుంటాను."
    ఇంతలో నిర్మల పేపరు పట్టుకుని పరుగు పరుగున వచ్చింది.
    'అమ్మా! భలే పిక్చరు . మాట్నీ కి వెళ్ళి తీరాల్సిందే" అంది గారంగా.
    "అబ్బబ్బ! ఏం సినిమాల పిచ్చే నీకు-- అన్నట్టు చిట్టీ -- మీకు కారు కూడా ఇచ్చారుట కంపెనీ వాళ్ళు- పొద్దున్న శ్రీధరం అన్నాడు -- ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది" అంది జయలక్ష్మీ. సంతోషంగా కూతుర్ని చూస్తూ.
    పెళ్ళయిపోయినట్టే శ్రీధరం పెళ్ళాంతో చెప్పినట్టే చెప్తున్న జయలక్ష్మీని క్షణ కాలం విస్తుపోయి చూసింది భార్గవి.
    'అక్కయ్య ఎప్పుడూ ఇంతే. అనుకుంటూ శ్రీధర్ గది వైపు వెళ్ళింది భార్గవి.
    తల్లీ కూతుళ్ళు ఇద్దరూ కలకత్తా లో చెయ్యబోయే కాపురం గురించీ చర్చించుకుంటూ కూర్చున్నారు.
    శ్రీధర్ గది దగ్గర కెళ్ళిన భార్గవి తలుపు తియ్యబోతుండగా శేఖర్ తలుపు తెరిచి బయటకు వచ్చి మళ్ళీ తలుపులు దగ్గరగా లాగాడు.
    అతని ముఖం చూసిన భార్గవి విస్తుపోయి చూస్తుండి పోయింది. అయితే తనని దించటానికి వచ్చిన శేఖర్ వెంటనే వెళ్ళి పోలేదన్న మాట! ఇంతసేపు అంటే దాదాపు రెండు మూడు గంటల సేపు అన్నయ్య గదిలో ఏం చేస్తున్నట్టు?
    శేఖర్ ని చూసిన వెంటనే ఆరిపోతున్న అగ్నికి వాయువు తోడై మళ్ళీ రగులు కొచ్చినట్టు -- భార్గవి మనసు కోపంతో భగభగ లాడింది. విసురుగా వెనక్కి తిరిగింది.
    భార్గవి పొడవైన జడను చేతిలో పట్టుకుని తన వైపు లాక్కుంటూ.
    "భార్గవీ! వెళ్ళొస్తాను" అన్నాడు నవ్వుతూ.
    భార్గవి భయంగా నాలుగు వైపులా చూసింది.
    "ఎవరైనా చూస్తారు."
    'అంతే కదా! ఎవ్వరూ చూడకపోతే ఫర్వాలేదుగా" నవ్వుతూ వెళ్ళిపోయాడు శేఖర్. కారు వెళ్ళిన చప్పుడు దూరమయేదాకా అలాగే నిలబడి నెమ్మదిగా శ్రీధర్ దగ్గర కెళ్ళింది.
    భార్గవి రాకను గమనించిన శ్రీధర్ లేచి కూచుంటూ.
    "భార్గవీ! మందులేవీ?" అన్నాడు చిరునవ్వుతో.
    "అరె! తనకా మాటే జ్ఞాపకం లేదు" - క్షణ కాలం ఏం చెప్పాలో తెలియక అయోమయంగా అటూ యిటూ చూసిన భార్గవి కి ఎదురుగా బల్ల మీద దాదాపు డజను సీసాలు కనిపించినయి. సిగ్గుతో తల వంచుకుంది. శ్రీధర్ చెల్లెలి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.
    'అక్కయ్య ఎక్కడ ఉంది భార్గవీ" అన్నాడు.
    "వంటింట్లో -- అక్కయ్యా, నిర్మలా -- క్వార్టర్స్, కారు, పెళ్ళి , నగలు -- ఆ చర్చలో మునిగి ఉన్నారు" అంది లేని నవ్వు తెచ్చి పెట్టుకుంటూ.
    శేఖరం మీద కోపం తాలూకు ఎరుపు దనం భార్గవి బుగ్గల మీద నుంచి పోనేలేదు.
    "భార్గవీ! నువ్వు చాలా అదృష్ట వంతురాలివమ్మా!" అన్నాడు ఆప్యాయంగా.
    "అవునన్నయ్యా! నీలాంటి అన్నయ్య ఉండటం అదృష్టం కాదా" అంది వాత్సల్యంగా.
    "అది సరేనమ్మా! ఆడపిల్ల అదృష్టం పుట్టింట్లో కాదు -- తాను వెళ్ళబోయే ఇంట్లో -- నువ్వు కావాలని మనసు పడి నిన్ను ఆరాధించే భర్త వల్ల ఎక్కువ సుఖ పడగలవని నా నమ్మకం భార్గవీ" అన్నాడు గంబీరంగా.
    కొన్ని సంవత్సరాలుగా శ్రీధర్ ముఖం మీద చిరునవ్వు కాని, సంతోషం గాని చూసి ఎరగదు భార్గవి. అట్లాంటిది ఇప్పుడు శ్రీధర్ ముఖంలో ప్రస్ప్రుట మౌతున్న ఆనందానికి కారణం అర్ధం కాలేదు. ఇంతలో ఏదో అనుమానపు రేఖ చాయామాత్రంగా మనసులో తళుక్కుమని మాయమయింది.
    "ఇప్పుడే నా పెళ్ళి కేం తొందరన్నయ్యా! ఇన్నాళ్ళు వాళ్ళింట్లో , వీళ్ళింట్లో కాలక్షేపం చేశాం. హాయిగా మనింట్లో కొన్నాళ్ళు సుఖంగా స్వతంత్యంగా ఉందాం"
    "ఉష్! అరవకు" అక్కయ్య వింటే బాధ పడగలదు.
    "వాళ్ళిప్పుడెక్కడ వస్తారన్నయ్యా! పెళ్ళయి పోయి ఈ పాటికి పిల్లలు కూడా పుట్టే ఉంటారు" నవ్వుతూ హాస్యంగా అంది భార్గవి.
    శ్రీధర్ ముఖం నల్లగా మాడిపోయింది . అది కనిపెట్టిన భార్గవి అన్నయ్యా! పెళ్ళి ప్రస్తక్తి వచ్చినప్పుడల్లా నీ ముఖం మారిపోతోంది. ఏం జరిగిందన్నయ్యా-- నాతొ చెప్పకూడదా! నిర్మాలంటే ఇష్టం లేదా!
    'అదేం లేదు భార్గవి! నాదే ముంది -- నేను కోరుకునేదల్లా నీ సుఖం మాత్రమే -- ప్రపంచంలో మనం కావాలని కోరుకునే అందరికీ లభ్యం కావు. భవిష్యత్తు లో మనస్పూర్తిగా నువ్వు కావాలని కోరుకునే వ్యక్తిని మాత్రం ఎన్నడూ నిర్లక్ష్యం చెయ్యకు" గంబీరంగా అంటున్న శ్రీధర్ ని కళ్ళప్పగించి చూడసాగింది భార్గవి.
    "మనస్పూర్తిగా కావాలనుకుంటున్నారో -- లేక అంతా నటనో ఎట్లా తెలుస్తుందన్నయ్యా!"
    "ఎందుకు తెలీయదమ్మా-- మంచితనం దాచినా దాగదు. మన అంతరాత్మ మనకి ప్రత్యక్ష సత్యం. అదెప్పుడూ మనని హెచ్చరిస్తూ ఉంటుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS