Previous Page Next Page 
ఆఖరి మజిలీ పేజి 14

 

    వెనక్కు తిరిగి క్షణ కాలం నీరజ కళ్ళలోకి చూశాడు , నీరజ చేతిలో నుంచి కొంచెం వక్కపొడి తీసుకుని ఆమె భుజం చుట్టూ చేతులేసి తన గుండెల మీదకు లాక్కున్నాడు సురేంద్ర. నీరజ జరిగిందేమిటో ఆలోచించే లోపలే "నీరూ! ఇదే ఆఖరి కలయిక" అని నీరజను వదిలేసి వెళ్ళిపోయాడు.
    నీరజ అక్కడే కూలబడి రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని నిశ్శబ్దంగా రోదించసాగింది.
    అప్పుడే ఆ వైపుగా వచ్చిన ఇందిర ఆ దృశ్యాన్ని చూసి ఆమెను పలకరించే ధైర్యం లేక మౌనంగా నిట్టుర్పు విడుస్తూ లోపలి కెళ్ళి పోయింది.
    
                         *    *    *    *
    శేఖర్ తన రూములో ఏదో మాగజైన్ చదువుతూ కూర్చున్నాడు.
    భార్గవి శ్రీధర్ చేత హార్లిక్స్ తాగిస్తున్నది.
    "అన్నయ్యా! పొద్దున్న అక్కయ్యా, నిర్మలా వచ్చారు. పెద్దమ్మ కూడా వచ్చింది. ఇప్పుడు వాళ్ళంతా ఇక్కడికి వస్తారేమో!" అంది భార్గవి శ్రీధర్ తాగిన గ్లాసు చేతిలోకి తీసుకుంటూ.
    "భార్గవీ! నిహంగానా" అయినా వాళ్ళకీ ఇల్లు ఏం తెలుసు?"
    "పెద్దమ్మ కి అడ్రసు ఇచ్చి వచ్చాను."
    "అబ్బా! తలనొప్పి"
    "అన్నయా!" గాభరాగా అంది భార్గవి.
    "శరీరానికి కాదమ్మా బాధ -- మానసుకి."
    "శ్రీధరం -- " అంటూ జయలక్ష్మీ -- వెనకాలే నిర్మలా, జయలక్ష్మీ పెతల్లి వచ్చారు.
    వాళ్ళను చూస్తూనే శ్రీధర్ గుండెల్లో రాయి పడ్డది.
    "చూశావా అమ్మా -- మామయ్యా ఎలా అయిపోయాడో" అంటూ చనువుగా దగ్గర కొచ్చి కూర్చుంది నిర్మల.
    "చూడు శ్రీధరం -- నిర్మల కి నువ్వంటే ఎంత ఆపేక్షో -- భార్గవి టెలిగ్రాం చూసిన దగ్గర నుంచి దాని ప్రాణం తల్లడిల్లి పోతున్నధనుకో"
    "దాని దేముందక్కయ్యా! రక్త సంబంధమాయే! స్వంత మేనమామను-- ఆ మాత్రం అపేక్ష ఉండదా" అన్నాడు నవ్వుతూ.
    "శ్రీధరం , ఇక్కడికి వచ్చి జ్వర పడ్డావు కాబట్టి సరిపోయింది. అక్కడ ఉంటె ఇట్లాంటి వేమైనా వస్తే ఎంత బాధపడేవాడివి. కనీసం కాఫీ నీళ్ళయినా కాచిపోసే వాళ్ళుండాలి గదరా! పెళ్ళి చేసుకోరా. అంటే వినవు. దానికి మాత్రం ఎవరున్నారు -- అక్కలా చెల్లెళ్ళా -- అన్నలా, తమ్ముళ్ళా! కొంగు తుడుచుకుంటూ అంది జయలక్ష్మీ.
    ఆశ్చర్యంగా కళ్ళప్పగించి వింటున్నాడు శ్రీధర్.
    "అమ్మో! అక్కయ్య ఎంత తెలివి గలది--" అనుకుంటూ నిర్మల వంక చూశాడు శ్రీధర్.
    ఇదంతా తనకేమీ పట్టనట్లే అక్కడే ఉన్న పుస్తకాలు తిరగేస్తూ కూర్చున్నది.
    పసిపిల్లప్పుడు ఏడుస్తుంటే బజారు తీసుకెళ్ళి చాక్లెట్లు కొనిపెట్టేవాడు. భార్గవి కి, నిర్మల కు వయసులో ఎక్కువ తేడా లేదు. తల్లి తండ్రి కలరా తో ఒక్కసారే మరణించటంతో తను, భార్గవి అక్క జయలక్ష్మీ అండ జేరక తప్పలేదు. జయలక్ష్మీ -- శ్రీధర్ ని , భార్గవి ని ప్రేమగానే చూసేది. జయలక్ష్మీ భర్త చంద్ర శేఖరం గారికి పొగాకు వ్యాపారం. పెద్దలిచ్చిన ఆస్తి పాస్తులెం లేకపోయినా వ్యాపారంలో పట్టింది బంగారమయినది. అదంతా నిర్మల పుట్టిన వేళా విశేషమన్నారు. కాకినాడ లో పెద్ద మేడ కావలసినంత పలుకుబడి. శ్రీధర్ భార్గవి ఇద్దరి చదువు సంధ్యలూ ఓపిగ్గా చూసేవారు. తల్లీ తండ్రి పోయేనాటికి భార్గవి కి నాలుగేళ్ళు. శ్రీధర్ కి పది సంవత్సరాలు. భార్గవి తో సమానంగా నిర్మలను ఎత్తుకుని ఆడించేవాడు. నిర్మల చిలిపి పనులకు భార్గవిని ముద్దాడినట్టే ముద్దాడేవాడు.
    భార్గవి తో పాటు నిర్మల కూడా తనని "అన్నయ్యా" అని పిలిచేది. కానీ జయలక్ష్మీ కోప్పడి "మామయ్యా" అని పిలిచేటట్టు అలవాటు చేసింది. నిర్మల పిలిచిన అన్నయ్యా! అన్న పిలిపే తన మనసులో ముద్ర వేసుకున్నది. అక్కయ్య ఆ విషయం ఎన్నటికి అర్ధం చేసుకోదు.
    "ఏమిటిరా, శ్రీధరం ఆలోచిస్తున్నావు? అంది జయలక్ష్మీ.
    "ఏం లేదక్కయ్యా! ఇవ్వాళ డాక్టరు గారు  ఇంకా డాక్టరు గారు కనపడలేదేమా అని ఆలోచిస్తున్నాను" అన్నాడు శ్రీధర్ అక్కడే ఉన్న గడియారం వంక చూస్తూ.
    ఇంతలో శ్రీధర్ రానే వచ్చాడు. శ్రీధర్ చిరునవ్వుతో శేఖర్ వైపు తిరిగాడు.
    "మంచి ఇంప్రూవ్ మెంటు. ఇందంతా మీ చెల్లెలి చలవే!
    శేఖర్ రాకతో జయలక్ష్మీ నిర్మలా అందరూ బైటకు వెళ్ళారు. ఇంటి ముందుగా పెంచిన మొక్కలు అందంగా పూసినాయి. అందరూ అటు వైపుగా వెళ్ళారు. భార్గవి మాత్రం అక్కడే ఉండి పోయింది.
    "కాదు డాక్టర్! అంతా మీ చేతి చలవే! అన్నాడు. శ్రీధర్ శేఖర్ ని పరిశీలనగా చూస్తూ
    మంచి ఒడ్డూ పొడుగూ ఉన్న శేఖర్ చామన చాయగా ఉన్న అందమైన కనుముక్కు తీరుతో హుందాగా ఉన్నాడు. మాటలలో అప్యాయం వినయం అతని అందానికి మెరుగులు దిద్దుతున్నాయి. శ్రీధర్ మనసులో చిత్రమైన కోరిక కలిగింది. ఎందుకో గాని అంతులేని అనురాగం ఒక్కసారిగా ఉబికి వచ్చేసరికి తట్టుకోలేక పోయాడు. కళ్ళు మూసుకుని శేఖర్ చేతిని తన చేతిలోకి తీసుకుని "డాక్టర్" అన్నాడు.
    శేఖర్ అనుమానంగా "ఏమిటి శ్రీధర్ గారూ ఏదో చెప్పాలనుకుంటూన్నట్టున్నారు?" అన్నాడు కాస్త ముందుకి వంగుతూ.
    "మీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు."
    "శ్రీధర్ మీరీ విషయాన్ని గురించి అంతగా ఆలోచిస్తున్నారా?"
    "అవును డాక్టర్" యెంత డబ్బు ఖర్చు పెడితే మాత్రం ఇంత ఆప్యాయంగా చూసే డాక్టర్ దొరుకుతాడు. రోగికి అవసరమైంది మందులే కాదు దానితో బాటు డాక్టరు ఇవ్వవలసింది ధైర్యం - నిజంగా మీ ఋణం తీర్చుకోలేనిది...."
    "ఆ దానిదే ముంది ఎన్నో రకాలుగా తీర్చుకోవచ్చు పత్రమో, ఫలమో ఏదీ కాకపోతే మీ తోటలో పూసిన గులాబీ అయినా చాలు....! అన్నాడు నవ్వుతూ ఎదురుగా నిలబడ్డ భార్గవి వంక చూస్తూ శేఖర్ మాటల్లో "మీ తోటలో గులాబీ" అన్న మాటలు అర్ధం తేలిగ్గానే గ్రహించ గలిగింది భార్గవి. చురుగ్గా శేఖర్ కళ్ళలోకి చూసి అవతలకు వెళ్ళిపోయింది.
    "అమ్మా, భార్గవి అక్కయ్యా వాళ్ళను పిలుచుకురా! అన్నాడు శ్రీధర్ వెళ్తున్న భార్గవి నుద్దేశించి.
    భార్గవి, జయలక్ష్మీ ని , నిర్మలను వెంట బెట్టుకు కొచ్చింది.
    శేఖర్ కి పరిచయం చేశాడు శ్రీధర్.
    "నమస్కారం డాక్టర్ గారూ" అంటున్న జయలక్ష్మీ ని, ఆమె చొరవకు ఆశ్చర్యపోతూ "నమస్కారం" అన్నాడు శేఖర్.
    "మా తమ్ముడికి మంచి టానిక్కు లు వ్రాసివ్వండి డాక్టరు గారూ! ఆ హోటలు తిండి తినే ఈ రోగాలన్నీ తెచ్చు కుంటున్నాడు. ఈ శ్రావణంలో నన్నా-- అన్నా ఏమిటి ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా మా నిర్మల నిచ్చి ముడి పెట్టి చేస్తాము" ఒక్క బిగిన మాట్లాడుతున్న ఆవిడ ధోరణి కి శేఖరానికి నవ్వు వచ్చింది.
    "మీ తమ్ముడు కేమండీ -- ఇప్పుడు కులాసాగా ఉన్నట్లే -- అయినా మంచి టానిక్స్ వ్రాసిస్తాను" అన్నాడు జయలక్ష్మీ నుద్దేశించి.
    "మామయ్య కు మందుల మీద నమ్మకం లేదు లెండి! కొన్న సీసాలన్నీ సీలన్నా ఊడదీయకుండానే మురిగి పోతుంటాయి" అంది నిర్మల చొరవగా.
    "మీరు కాబోయే శ్రీమతి కాబట్టి ఆ బాధ్యత మీరు తీసుకోవాలి" నవ్వుతున్న శేఖర్ ని చూసి భార్గవి ముఖం చిట్లించుకుంది. నిర్మల మనసు ఆనందంతో సుళ్ళు తిరుగుతుండగా శ్రీధర్ వంక చూసింది. నాలుగు రోజులు గడిచిపొయినయి. శ్రీధర్ ఇంటికి తీసుకెళ్ళారు. ఆరోజున శ్రీధర్ చూడటానికి వచ్చిన శేఖర్ తో అన్నట్టు మర్చిపోయాను. నాకు సెలవయిపోయింది డాక్టర్. నేను డ్యూటీ లో జాయినవ్వాలి-- నేను వెళ్ళవచ్చు కదా!" అన్నాడు శ్రీధర్.
    'అవుననుకోండి -- కనీసం పది రోజుల వరకు మీరు కదలకూడదు. స్ట్రెయినయితే మళ్ళీ జ్వరంరావచ్చు."
    "కాని సెలవలేదే" అన్నాడు శ్రీధర్.
    ఎట్లాగయినా ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళి పోవాలని శ్రీధర్ ఆలోచన.
    "సెలవయిపోవటానికి నువ్వు సెలవేప్పుడు పెట్టావురా! రెండేళ్ళ నుంచీ ఎన్ని ఉత్తరాలు వ్రాసినా ఇదే మాట" అంది కొంచెం కోపంగా జయలక్ష్మీ.
    "నేను ఇక వస్తాను శ్రీధర్. ఎవరినయినా నా డిస్పన్సరీ కి పంపితే మందులు పంపుతాను. అదీ కాకుండా నా దగ్గర శాంపిల్స్ వచ్చిన టానిక్స్ చాలా వున్నాయి. అవి కూడా పంపిస్తాను. మీరు త్వరగా కోలుకుంటే కలకత్తా వెళ్ళిపోవచ్చు" అని బాగ్ తీసుకునిబయలు దేరాడు శేఖర్.
    'అలాగే" అని భార్గవి ని పిలిచాడు శ్రీధర్.
    "శ్రీధర్ -- "డాక్టర్ " అని పిలవద్దు హాయిగా "శేఖర్" అని పిలిస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది" అని భార్గవి రాకతో ఆగిపోయాడు.
    డాక్టరు గారితో వెళ్ళమ్మా! మందు లిస్తారుట" అన్నాడు భార్గవి తో. "నేనా" ఆశ్చర్యంగా అంటూ అనుమానంగా శేఖర్ ని చూసింది. శేఖర్ చిరునవ్వు నవ్వుతున్నాడు. భార్గవి మనసు మండిపోయింది.
    "వెళ్ళమ్మా" అన్నాడు మళ్ళీ శ్రీధర్.
    భార్గవి ఎటూ చెప్పలేక పోయింది. "సరే" అంటూ లోపలి కెళ్ళి పోయింది.
    జయలక్ష్మీ ఏదో పనిలో ఉంది. నిర్మల ముసుగు తన్ని పడుకుంది.
    "నిర్మలా! పడుకున్నావా" అంది దుప్పటి తొలగిస్తూ . కళ్ళు తెరవకుండానే "కాస్త తలనొప్పిగా, భారంగా ఉంది భార్గవీ" అంది నిర్మల.
    డాక్టర్ గారింటి దాకా వెళ్ళి మందులు తీసుకొద్దాం రారాదూ"
    "అమ్మ బాబోయ్! నేనిక్కడి నుంచి ఇప్పుడు ఒక్క అంగుళం కూడా కదలలేను" అంది ఖచ్చితంగా.
    ఇష్టం లేకపోయినా వెళ్ళక తప్పలేదు భార్గవి కి.
    శ్రీధర్ దగ్గర కెళ్ళింది. అతను కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు.
    అక్కడ శేఖర్ లేడు.
    "అరె! వెళ్ళిపోయారా" అనుకుంటూ బయటకు వచ్చింది.
    కారులో స్టీరింగ్ ముందు కూర్చుని ఉన్నాడు శేఖర్. భార్గవి రాకను గమనించి ఫ్రంటు డోర్ తెరిచాడు.
    భార్గవి బాక్ డోర్ తెరిచి వెళ్లి కూర్చున్నది. శేఖర్ మౌనంగా కారు స్టార్ట్ చేశాడు.
    "మీ నిర్మల రానన్నదా" స్టీరింగు తిప్పుతూ రోడ్డు వంక చూస్తూ అడిగాడు శేఖర్.
    క్షణం విస్తుబోయిన భార్గవి "అవును -- రానన్నది" అంది నెమ్మదిగా.
    "కష్టమే మీకు పాపం. నాతొ రాక తప్పలేదు"
    "అంటే మీ వుద్దేశం! నేనప్పుడే అనుకున్నాను-- ఇందులో ఏదో దురాలోచన ఉన్నదని" కోపంతో ముఖం జేవురింటగా అంది భార్గవి.
    "భార్గవీ! ఎర్ర గులాబీలా ఉన్న నీ ముఖం ఎంత అందంగా ఉందొ తెలుసా?" అన్నాడు శేఖర్ చిలిపిగా.
    ఛీ! ఛీ! మీ మగవాళ్ళ కసలు బుద్ది లేదు. ఆడపిల్ల ఒంటరిగా కనబడితే చాలు -- వర్ణన మొదలు పెడతారు"
    "భార్గవీ! అతని గొంతులో ఏదో బాధ ధ్వనించింది.
    ఇంతలో కారు గేటు దాటి ఇంటి ముందాగింది. శేఖర్ డోర్ తెరిచి పట్టుకున్నాడు. భార్గవి దిగలేదు.
    "దిగండి మేడమ్! చెయ్యి నొప్పి పుడుతుంది" అన్నాడు నవ్వుతూ.
    కారు దిగిన భార్గవి కి ఆ ఇంట్లో మనుష్య సంచారం ఉన్నట్టు కనబడలేదు.
    కాని, ఇప్పుడు లోపలోకి వెళ్ళక పొతే బాగుండదు. అని అలోచించి భార్గవి కారు దిగింది.
    శేఖర్ ముందు నడుస్తూ తన రూము లోకి దారి తీశాడు. వెనకే భార్గవి వచ్చింది.
    "కూర్చోండి. " అని కుర్చీ చూపించి పక్క గదిలోకి వెళ్ళాడు.
    రెండు మూడు సీసాలు తీసుకొచ్చి బల్ల మీద పెట్టాడు. పక్కనే ఉన్న అలమార తలుపు తీసి అందులో నుంచి కూడా ఏవో సీసాలు తీశాడు.
    భార్గవి గది నాలుగు వైపులా చూస్తూ కిటికీ దగ్గర కెళ్ళింది. బాగా విశాలంగా ఉండి, మంచి గాలి, వెలుతురూ ఆరోగ్య ప్రదంగా ఉంది. కిటికీ లో మంచి చల్లని గాలి హాయిగా వస్తున్నది. కిటికీ నానుకుని రెండు దానిమ్మ చెట్లు న్నాయి. ఒక మూలగా వేప చెట్టుకి రాధా మాధవం పెనవేసుకున్నది. మిగతా నేలంతా గచ్చు చేయబడి శుభ్రంగా ఉంది. ఆలోచిస్తూ నిలబడ్డ భార్గవి కి శేఖర్ పిలుపు వినపడింది.
    ఒక ప్లేటు లో బిస్కెట్లు, రెండు అరటి పండ్లు పెట్టి తీసుకొచ్చాడు శేఖర్ . "అరె! మీరు నిలబడే ఉన్నారా? రండి- ఇవి తీసుకోండి" అన్నాడు. అతని ముఖంలో చిలిపితనం లేదు. ఎందుకో గంబీరంగా ఉన్నాడు. "ఇప్పుడివన్నీ ఎందుకు? నేను మందుల కోసం వచ్చాను. నేను వెళ్ళాలి త్వరగా" సాధ్యమైనంత వరకూ ప్రశాంతంగానే అంది భార్గవి.
    "మీకేదైనా అనుమానం ఉంటె ముందు నేను తింటాను. తరువాత మీరు తిందురు గాని" అని నవ్వుతూ ఒక బిస్కటు తీసుకుని తిన్నాడు. భార్గవి చురుగ్గా అతని కళ్ళలోకి చూసి ప్లేటు ముందుకు లాక్కుంది. తింటున్నదన్నమాటే గాని భార్గవి మనసు మనసులో లేదు. తనెందుకో మెత్తబడి పోతున్నది. ఎంత త్వరగా ఇక్కడ నుంచి బయటపడితే అంత మంచిది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS