"ఏమిటో అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? అంటూ జయలక్ష్మీ రావటంతో ఆ ప్రసంగం అంతటితో ఆగిపోయింది. నిర్మల సినిమాకు పోదాం రమ్మన్నది. కాసేపు ఆ ఆలోచనల నుంచి దూరంగా పారిపోదామనిపించినా మళ్ళీ ఎందుకో వెళ్ళబుద్ది కాలేదు భార్గవి కి.
జయలక్ష్మీ , నిర్మల , పెత్తల్లి మీనాక్షమ్మ గారు సినిమా కెళ్ళి పోయారు.
శ్రీధర్ ఒకరకంగా, భార్గవి ఒక రకంగా ఆలోచిస్తూ ఎవరి గదుల్లో వాళ్లుండి పోయారు.
సాయంత్రం చెట్లకు నీళ్ళు పొయ్యటం పూర్తీ చేసి ఇందిర , నీరజ -- ఇద్దరూ తీరుబడిగా ఇంటి ముందు లాన్ లో కుర్చీలు వేసుకుని కూర్చున్నారు.
"అది కాదు ఇందూ! ఇప్పుడు కాకపోయినా ఎప్పటి కయినా నాకొక ఇల్లుంటే బాగుంటుంది కదా! ఆ విషయాన్ని నువ్వు దూర దృష్టి తో ఆలోచించవెం?"
"అది దూరదృష్టి కదా! ఇప్పటి నుంచే ఎందుకని?' నవ్వుతూ అంది ఇందిర.
"నీకు తెలియదులే! ఇక్కడకు దగ్గరగా ఏదైనా స్థలం చూడు. సీరియస్ గా అంది నీరజ.
* * * *
"అయితే పక్క స్థలమే కొనుక్కో. అది రామనాధం గారని అడ్వకేటు -- ఆయనది . వాళ్ళబ్బాయి కి బొంబాయి లో ఉద్యోగం , వాళ్ళు కూడా పెద్ద వాళ్ళయిపోయారు అందుకని ఈ స్థలం అమ్మేసి బొంబాయి వెళ్ళి పోతారుట."
'అయితే ఇంకేం! అయన దగ్గరకు ఇవాళే వెళ్దాం" అంది సంతోషంగా.
"ఇప్పుడా! ఇవ్వాళ వద్దు. ఆదివారం వెళ్దాం లే" అంది నీరసంగా.
"ఈలోపల ఎవరైనా కొనేస్తే"
"ఈ అరణ్యం లో , ఈ రాళ్ళ లో రప్పల్లో ఎవరు కొంటారు?"
బయట కారు హారను మ్రోగటం తో ఇద్దరూ బయటకు చూశారు.
శేఖర్ లోపలి కొచ్చాడు. "రండి" అని ఆహ్వానించి ఇందిర లోపలి కెళ్ళి కుర్చీ తీసుకొచ్చి వేసింది.
శేఖర్ కూర్చున్నాడు.
"ఒకసారి మీ పేషెంటు ను చూసి "శాటిస్ ఫై" అయితే బాగుంటుంది. అతను రెండు మూడు రోజుల్లో కలకత్తా వెళ్ళిపోతాట్ట. అది చెప్పటానికే వచ్చాను" అన్నాడు శేఖర్ ఇందిరతో.
"రెండు రోజుల కొకసారి భార్గవి ఫోను చేసి చెప్తూనే ఉన్నదనుకొండి -- ఇప్పుడతనికి బాగా కులాసాగా ఉన్నట్టేనా?" అంది నీరజ.
"ఆ -- కులసాగానే ఉంది. కొన్నాళ్ళు రెస్టు తీసుకుంటే మంచిదనుకొండి-- అయినా సెలవ లేదట"
ఇంతలో గేటు తోసుకుని భార్గవి -- వెనకాలే నిర్మల వచ్చారు. "రండమ్మా! మీ మాటే అనుకుంటున్నాము." నీరజ లేచి వెళ్ళి భార్గవి చెయ్యి పట్టుకుని తీసుకొని వచ్చింది.
ఇందిర లోపల కెళ్ళి రెండు పళ్ళాలో యాపిల్ ముక్కలు , ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి అందరి మధ్యలోనూ పెట్టింది.
ఊహించని విధంగా శేఖర్ కూడా అక్కడే ఉండటం భార్గవి కి చికాకు కలిగించింది. ఆ చికాకు కనబడనీయకుండా....
"డాక్టర్ గారూ ఊరికి వెళ్తానన్నారు?" అంది.
"రాత్రి పది గంటల బస్సు. ఇప్పుడు టైము అయిదు గంటలు మాత్రమే" అని ఇందిర వైపు తిరిగి "ఇందిరా! ఈవిడ భార్గవి గారి కాబోయే వదిన గారు. పేరు నిర్మల. -- 'ఆవిడే పరిచయం చేస్తే బాగుండేది. పాపం కాస్త శ్రమ తగ్గింద్దామని -- ఆ పని నేనే చేశాను" అన్నాడు భార్గవి వంక చిలిపిగా చూస్తూ.
'అక్కా! అన్నయ్యతో కలకత్తా వెళ్ళిపోతూన్నాను. మీతో చెప్పి పోదామని వచ్చాను. అంది భార్గవి శేఖర్ మాటలకు సమాధానం చెప్పకుండా.
"మళ్ళీ ఎప్పుడు రావటం?"
"ఇంక ఇక్కడికి రానక్కా? శ్రావణ మాసంలో అన్నయ్య పెళ్ళి -- కాకినాడ లో చేస్తారు. ఉంటె కాకినాడ లో , లేకపోతె కలకత్తా లో అన్నయ్య దగ్గర -- అన్నట్టు చెప్పలేదు కదూ -- ఈవిడ మా అక్కయ్య కూతురు. చిన్నప్పటి నుంచీ అనుకుంటున్న సంబంధమే -- అక్కయ్య మరీ తొందర పెడుతున్నది మా నిర్మల పెళ్ళి విషయంలో ....."
ఇందిర లేచి లోపలి కెళ్ళింది. వచ్చినప్పటి నుంచీ ఇందిర అదోలా ఉండటం భార్గవి గమనించక పోలేదు "నీరజా!" ఇందిర పిలుపుతో నీరజ లేచి వెళ్ళింది.
రెండు చీరలు, పసుపు కుంకం ఒక పళ్ళెం లో పెట్టి తీసుకొచ్చింది నీరజ. ఇందిర కూడా వెనాకాలే వచ్చింది.
భార్గవి కి, నిర్మలకు బొట్టు పెట్టి ఇద్దరికీ చెరో చీర ఇచ్చింది. భార్గవి వద్దని గొడవ చేసింది.
"నా కెందుకండీ -- అనవసరంగా?" మొహమాటంగా అంది నిర్మల . "పెళ్ళి కూతురివి గదా అందుకని -- " నవ్వుతూ అని బలవంతంగా నిర్మల చేతిలో చీర పెట్టింది.
భార్గవి కీ నాకూ మంచి స్నేహం. వాళ్ళింట్లో ఉన్నన్ని రోజులూ నన్ను ఎన్ని విధాలుగానో కనిపెట్టి ఉంది" అంది నీరజ ఇందిరతో.
"అక్కా! వస్తాను" అని నీరజతో చెప్పి "వెళ్ళొస్తానండీ!' అని ఇందిరతో చెప్పి రెండు చేతులు జోడించింది భార్గవి.
భార్గవి, నిర్మల వెళ్ళిన తరువాత శేఖర్ కూడా వెళ్ళిపోయాడు. చీకటి పడటం తో నీరజ, ఇందిర లోపలి కెళ్ళి పోయారు.
"అనవసరంగా చీరలు పెట్టించావెందుకు -- అదీ నా చేత ...." అంది నీరజ.
"ఇప్పుడిక ఆ విషయాలేవీ మాట్లాడలేను" నీరసంగా సోఫాలో పడుకుంటూ అంది ఇందిర.
నీరజ పక్కనే ఉన్న పేపరు చూస్తూ కూర్చున్నది.
దాదాపు 7 గంటల ప్రాంతంలో రాజారావు వచ్చాడు. అప్పుడు కూడా ఇందిర లేవలేదు. స్నానం, భోజనం ముగించి మేడ మీద కెళ్ళి పోయాడు రాజారావు. పది గంటల దాకా చూసి నీరజ ఇందిరను నిద్ర లేపింది.
"భోజనం చేద్దాం రా ఇందూ"
"నాకాకలిగా లేదు. కాసిని పాలు తెచ్చి పెట్టు చాలు" అంది కళ్ళు తెరవకుండానే ఇందిర.
రెండు గ్లాసులలో పాలు తీసుకొచ్చిన నీరజను.
"అదేమిటి? నువ్వు కూడా భోజనం చెయ్యవా!" అంది పాల గ్లాసు చేతిలోకి తీసుకుంటూ.
"నాకూ ఆకలిగా లేదు" అని తనూ పాల గ్లాసు తీసుకుంది నీరజ.
* * * *
శ్రీధర్ కలకత్తా ప్రయాణం దగ్గర పడింది. భార్గవి, నిర్మలా షాపింగ్ కి వెళ్ళి ఏమిటేమిటో కొని తీసుకు వస్తున్నారు.
"వెళ్ళేది మహా పట్నం. అక్కడ అవన్నీ దొరకవా?' అంది జయలక్ష్మీ ఆరోజు బజారు నుంచి తెచ్చిన సామాన్లు పరీక్షగా చూస్తూ.
'అక్కడంతా కొత్త కాదక్కయ్యా! అన్నయ్యకు తీరుబడి ఉంటుందో ఉండదో. అందుకని అన్నీ కొనుక్కుంటే నిశ్చింతగా ఇంట్లో కూర్చోవచ్చు" అంది భార్గవి.
"శ్రీధరం వచ్చాడు గదా! రెండు రోజుల్లో రావచ్చని వెళ్లాను ఊరికి -- ఇంతలో జ్వరంతో పడిపోయాడు -- సాంతం కోలుకోనేలేదు. అప్పుడే ఏం ప్రయాణాలో ఏమిటో పైగా దీన్ని కూడా తీసుకెళ్తా నంటాడేమిటి?" అంది మీనాక్షమ్మ గారు తమలపాకుకు సున్నం రాసుకుంటూ. భార్గవి కలకత్తా వెళ్ళి పోతున్నదంటే అందరి కంటే ఆవిడకు ఎక్కువ దిగులుగా ఉంది.
"ఏమోనమ్మా -- వింటారా ఈ కాలం పిల్లలు" జయలక్ష్మీ దీర్ఘంగా నిట్టురుస్తూ అంది.
"జయా!" భార్గవి ఏమో అనుకున్నాను గాని -- చాలా నమ్రత గల పిల్ల- ఈ ఆరునెలల నుంచీ నాకు ప్రతి పనిలో అందుకుంటూ చేదోడు వాదోడుగా ఉంది" అంది సంబరంగా జయలక్ష్మీ తో.
"అసలయినా పెళ్ళి కాని పిల్ల అంతదూరం వెళ్ళటం నాకిష్టం లేదు. అందుకనే నిర్మల ను కూడా పంపిస్తున్నాను" అంది జయలక్ష్మీ. అప్పుడే ఏదో పని మీద అక్కడికి వచ్చిన శ్రీధర్ గతుక్కుమన్నాడు. "నిర్మలను పంపుతావా! ఎవరైనా వింటే నవ్వి పోతారు. రెండు నెలల్లో పెళ్ళి పెట్టుకుని పెద్ద వాళ్ళెవ్వరూ దగ్గర లేకుండా దాన్ని పంపుతావా" జయలక్ష్మీ ఏదో చెప్పబోయింది.
"మామయ్యా! డ్రాయింగు రూము ఎంత ఉంటుంది? బాగా పెద్దదేనా? ఈ నిర్మల్ పెయింట్స్ " చూడు. డ్రాయింగు రూములో పెడదాం. ఈ వాజేస్ గోడకు పెడదాం" హడావుడిగా చూపిస్తున్న నిర్మలను చూసి జయలక్ష్మీ సంబర పడిపోయింది.
"అసలింతవరకు నేను క్వార్టర్స్ కి వెళ్ళి చూడలేదు " అన్నాడు నిర్లిప్తంగా శ్రీధర్.
ఏమిటో మామయ్యా! నీకు ఎందులోనూ ఉత్సాహం లేదు. ఉత్త బోరీ మనిషివి" అంది నిర్మల.
"బాగా సరదాగా ఉండేవాడిని చూడనా నిర్మలా నీకు....!' అన్నాడు శ్రీధర్ వచ్చిన అవకాశం పోగొట్టుకోకుండా.
"ఏం మాటలురా అవి! సరసానికైనా హద్దు పద్దు ఉంది" అని మందలించింది జయలక్ష్మీ.
శ్రీధర్ కి శరీరంలో ఒకలాటి నిస్సత్తువ కలిగింది. ఏ రకంగా నూ నిర్మల నుంచి తను తప్పుకోలేడు. నిర్మలను చేసుకుని భరించ లేడు. మనసంతా ఆవేదనతో నిండిపోయింది. అందులో నిర్మల కలకత్తా రావటం ఇంకో బాధ ఏం చెయ్యాలో తోచలేదు శ్రీధర్ కి. "శ్రీధరం , చూడు సరదాకే అన్నావనుకో -- దాన్ని చూడి ఎలా మూతి ముడుచుకు కూర్చున్నదో " మందలింపు గా అంది మీనాక్షమ్మ గారు. 'అందుకే పెద్దమ్మా! వీలయినంత తొందరగా పెళ్ళి చేసేయ్యాలనేది -- ఈ రోజుల్లో పిల్లల్ని నమ్మలేం ఆ కలకత్తా లో ఏ బెంగాలి దాన్నో చేసుకున్నాడంటే ఇంకేమైనా ఉందా"
"అవును -- ఇంకేమైనా ఉందా! కొంపలంటుకోవు" శ్రీధర్ అక్కడి నుంచీ వెళ్ళిపోయాడు.
"కాకినాడ ఉత్తరం వ్రాశాను. ముహూర్తం పెట్టి పంపించ,మని. వాడిక్కడుండగానే ముహూర్తం నిశ్చయమయిపొతే మంచిది. మళ్ళీ ఉత్తరాల మీద పని జరగదు. రెండేళ్ళ కి ఇప్పుడు చిక్కాడు మనిషి చేతికి"
ఆశ్చర్యంగా వింటున్న మీనాక్షమ్మ గారు జయలక్ష్మీ అసాధ్యురాలనుకున్నది శ్రీధర్ కణతలు నొక్కుకుంటూ పడుకున్నాడు.
ఇంతలో పోస్టు మాన్ కేక విని బయటకు వెళ్ళి ఉత్తరం తీసుకుని లోపలి కెళ్ళాడు. అది జయలక్ష్మీ కి వచ్చిన ఉత్తరం.
