"మరి నా కంటే అందమైన వాడిని చేసుకోకుండా నన్నెందుకు చేసుకున్నావు. అంత అందమున్నదానివి. నా ఉద్యోగం చూసి, డబ్బు చూసి చేసుకున్నావా?" హేళన, కటువు ఆ మాటల్లో-ఏమిటిది! మొదటి రాత్రి ఆయన ఈ ధోరణి ఏమిటి అన్పించింది నాకు. "నేను మీ లోపం చూసి చేసుకున్నానో, నాలో మీరేం చూసి చేసుకున్నారో యిప్పుడు పోస్ట్ మార్టమ్ లు అవసరం అంటారా? ఎందుకు చేసుకున్నా చేసుకున్నాం. యిప్పుడు యింక ఆ ప్రశ్నలనవసరం" 'నేను కటువుగానే అన్నా, దాంతో ఆయన మొహం గంటుపెట్టుకున్నారు. "యింతకంటే మీకు నాతో మాట్లాడవల్సిందేం లేదంటే.....గుడ్ నైట్....పడుకుందాం' అన్నాను నిబ్బరంగా చూస్తూ-దాంతో ఆయన మొహం మరింత మాడ్చుకున్నారు. కాని అంతలోనే తేరుకుని అదోలా నవ్వుతూ, "ఫర్వాలేదు గడుసుదానివే, ఏమిటో అనుకున్నాను, డంబ్ అనుకున్నాను. అంటూ దగ్గిరకి జరిగి భుజం మీద చెయ్యివేశారు. ఈ మాటలకి ముందు ఆయన ఆ పని చేసుంటే, గదిలోకి రాగానే ప్రేమగా చెయ్యివేసి వుంటే పులకరించేదాన్నేమో. ఈ మాటలంటూ ఆయన మోహంలో కనబడిన హేళన వ్యంగ్యం, వెటకారం, అదోరకం క్రుకెడ్ నవ్వు చూసాక ఆ స్పర్శ నాకు ఏ అనుభూతి నివ్వకపోగా ఏదో వెగటనిపించింది. ఆయన మొహం దగ్గిరగా చూస్తూంతే ఆ కళ్ళు.....అతని కళ్ళల్లో తీక్షణత గద్ద కళ్ళని గుర్తు తెచ్చింది. దూరాన్నింఛి చూసినప్పుడు కనపడని ఆ లావు పెదాలు మరింత లావుగా, నల్లగా కన్పించాయి. ఆ నవ్వులో కుటిలత్వం కన్పించి ముడుచుకు పోయాను ఆ స్పర్శకి ఆయన దగ్గిరకి లాక్కుంటూంటే ఏదో ఉక్కిరి బిక్కిరైపోయాను.
"నిన్ను......నిన్ను చూస్తుంటే.....యిలా నలిపేయాలని వుంది" అంటూ మోటుగా, మొరటుగా, నిజంగా సుకుమారమైన పువ్వుని చేతుల్లో నిర్దాక్షిణ్యంగా నలిపినట్టే నలపసాగారు. అది ఆయనకి తెల్సిన శృంగారం. నేనూహించినది, కోరినది వేరు....."ఇంత సుకుమారంగా ముట్టుకుంటే నలిగి పోతావేమో నన్నట్టున్న నిన్ను ఎలా......అర్చనా......యిలా దూరం నించి నీ అందం చూస్తూ ఎలా వూరుకోను. వూరుకోకుండా అలా అని నిన్ను నలిపి......అబ్బనే సహించలేను.....నీ ఈ అందం, నీ సౌకుమార్యం నా స్వంతం అంటే నాకింకా నమ్మకం కల్గడం లేదు అర్చనా..." అంటూ నా వడిలో పడుకుని కళ్ళల్లోకి చూస్తే ఆ ప్రేమకి, అనురాగానికి కరిగి పోయి, నేనే అతని కౌగిలిలో కరిగి పోవాలనుకున్నాను. నా అందాన్ని ఆరాధించే మగవాడికి సర్వం అర్పించుకుని బానిసనయ్యేదాన్ని!.....యిప్పుడు ఆయన చేతిలో ఊపిరందక గింజుకుంటూ ఆ కౌగిలినుంచి ఎలా తప్పించుకోవాలో, ఏ వంకతో కట్టుకున్న భర్తని వదలాలో అర్ధంకాని దుస్థితిలో పడ్డాను ఆ రాత్రి. ఒక్కమాట, ఒక్క చూపుతో మనిషిని వశపర్చుకుని కట్టిపడేసుకోవచ్చని కొందరు మూర్ఖులకి తెలియదు. ఆ మూర్ఖులలో నా మొగుడు ఒకడు!
"ఆయన సరసం పూర్తి అయ్యాక సిగరెట్టు వెలిగించుకుని పడుకుని పొగవదుల్తూ మళ్ళీ మొదలు పెట్టారు. "నీకు కాలేజీలో బోయ్ ఫ్రెండ్స్ చాలామంది ఉండేవారా వుండే వుంటారులే - మామూలుగా ఉండే అమ్మాయిల చుట్టూతానే తిరుగుతారు అబ్బాయిలు, మరింకకాస్త ఎర్రగా వుంటే అబ్బాయిలు వెంటపడకుండా వుంటారా?
"ఆ వుండేవారు బోలెడు మంది...." తిరస్కారంగా అన్నాను కావాలనే ఉడికించాలని.
"ఉత్తరాలు అవి రాసేవారా. నిన్ను పెళ్లి చేసుకుంటామని ఎవరూ రాలేదా! లవ్ ఎఫైర్లు. ఆ వున్న మాటే అడుగుతున్నానులే. అలాకోపంగా చూస్తే నాకేం భయం ఏమిటి," చాలా హాస్యంగా అంటున్నట్టు వెటకారంగా అంటున్న ఆయన మాటలు చూస్తుంటే ఈడ్చి మొహంమీద కొట్టి గదిలోంచి పోవాలనిపించింది. ఎంత నిగ్రహించుకున్నానో దేముడికే తెలుసు.
"లవ్ ఎఫైర్లు అన్నీ మారేజీల కింద మారతాయా.....అదో సరదా" అన్నాను నేనూ హాస్యంగా అన్నట్లు ఒక్క ఉదుటున లేచిపోయారు. "ఏమిటీ లవ్ ఎఫైర్లుండేవా, ఎంతమందితో. ఛీ, సిగ్గులేకుండా అదోసరదా అని చెప్తున్నావా. ప్రతి వెధవతో తిరిగి ఆఖరికి నన్నో వెధవని చేసి నా ఉద్యోగం అది చూసి నన్ను పెళ్లాడావన్నమాట ఇంకా ఏదో సరదాగా అడుగుతున్నాను నేను.....నా ఎదుటే ఇలా తెగేసిచెప్తున్నావ్. ఛీ...ఏదీ మీరు మంచివాళ్ళని మా వాళ్ళంటే ఒప్పుకున్నాను" నీ వరస చూస్తే నాకు ముందునించి అనుమానమే వచ్చింది." చాలా తీక్షణంగా అన్నారు.
"ఏం అనుమానం వచ్చింది నన్ను చూస్తే కోపం ముంచుకు వచ్చినా శాంతంగానే అడిగాను.
"నీలాంటి అందమైన ఆడదాన్ని నమ్మకూడదని బెల్లం చుట్టూ చీమల్లా మగాళ్ళు నీ చుట్టూ తిరిగితే నీవు చాలా గర్వంగా గొప్పగా అందరితో తిరిగి వుంటావు." కసిగా అన్నాడు.
