Previous Page Next Page 
నీరజ పేజి 15

 

    బాలూ సిస్టర్ కి "థాంక్స్" చెప్పి సుశీలతో వచ్చేసాడు - చెమ్మగిల్లిన సుశీల కళ్ళను చూస్తూ 'ఇవాళ నాతొ సంతోషంగా గడపాలని బయలుదేరావు ....." అన్నాడు ....
    "ఇప్పుడు నేను సంతోషంగా లేనని ఎవరు చెప్పారు ? కొన్ని కొన్ని సందర్భాలలో వచ్చే కన్నీళ్ళలో ఎంత అనందం ఉంటుందో తెలుసా?"
    తెలిసింది బాలూకి. కళ్ళు చెమ్మగిల్లినా , ఏదో అపూర్వమైన కాంతితో వెలిగిపోయే సుశీల ముఖం చూస్తోంటే ........
    సుశీలతో కలిసి నదిలో బోట్ మీద తిరిగాడు బాలూ. పట్టరాని ఆనందంతో పసిపిల్లలా పకపకలాడింది సుశీల........
    "నేనెవరో తెలుసా ? మీ భార్యను- " గర్వంగా అంది.
    "కొంపతీసి తాళి కట్టమంటావేమిటి? ఆ తాళి వల్ల కట్టిన నాకు కాని, కట్టించుకున్న నీకు కాని ఎలాంటి ప్రయోజనమూ లేదు."
    "మీకేం తెలియదు -- భార్య అంటే తాళి కట్టించుకున్నది కాదు -- ప్రేమించిన స్త్రీ."
    రెండు చేతులూ జాపి సుశీలను ఆదరంగా గుండెల్లోకి తీసుకున్నాడు బాలూ..........

                                                                              *    *    *
        
    యశోధర , భర్త వేణుతో కలిసి వస్తున్నానని ఉత్తరం రాసింది. నీరజ వెలవెలపోతూ "పోనీ నేను కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళి ఉండనా?" అంది....
    "కొన్ని రోజులు కాదు గదా, కొన్ని క్షణాలైనా నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదు -- యశోధరకు పెళ్ళి అయిపొయింది -- కాబట్టి నా కారణంగా నా చెల్లెలి జీవితం పాడవుతుందేమోనని భయపడక్కర్లేదు. ఇంక ఏది ఎలా జరిగినా ఎదుర్కోగలను."
    తీవ్రంగా అన్నాడు ప్రభు .....లక్ష్మీ దేవి ఏమీ మాట్లాడలేదు....
    మొత్తం మీద యశోధర వేణుల రాకతో ఇంట్లో వాతావరణం కొంత ఉత్సాహంగా ఉంది.... వేణు ప్రభును మనసారా అభినందించాడు , "ఇలాంటి భార్య దొరకటం మీ అదృష్టం ....." అని.....
    యశోధర , వేణు  రోజూ సాయంత్రం ఎక్కడికో ఒకచోటికి షికారుగా బయలుదేరేవారు - ఒకరోజు వేణు ప్రభుతో "మీరూ రండి?" అన్నాడు. నీరజ కంగారుపడి "మీ మధ్య మేమెందుకు ? మీరు వెళ్ళి రండి?" అంది.
    వేణు నవ్వుతూ -" అంత కంగారెందుకు చెల్లెమ్మా ! మీ ఇద్దరికీ మేం అడ్డురాములే, సరదాగా వెళ్దాం రండి ...." అన్నాడు.
    యశోధర, వేణు సరదాగా తెరుగుతోంటే ప్రభులో తను కూడా నీరజతో అలా తిరగాలనే కోరిక కలగసాగింది- నీరజను పక్కకు పిలిచి "మనమూ వెళ్దాం నీరజా! ఎంతకాలమని ఇలా ఇంట్లో మగ్గిపోతాం? సంఘాన్ని లెక్కచెయ్యకుండా నిలబడాలని నిర్ణయించుకున్నాం ! నిలబడదాం ...." అన్నాడు.
    గుమ్మం కదలకుండా ఏదో అపరాధం చేసి బందీ అయినట్లు ఇంట్లోనే ఉండిపోవటం నీరజకు కష్టంగానే ఉంది -- తయారయి బయలుదేరింది.
    నలుగురూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడవసాగారు- కానీ ఆ సంతోషం ఎక్కువసేపూ నిలవలేదు -- ఆ నలుగురికీ వినపడేలాగా జనం మాటలు విసరసాగారు........
    "ఆ అమ్మాయి నీరజ కదూ."
    "ఆ మధ్య ఎక్కడికో వెళ్ళిపొయిందన్నారు...."
    "వెళ్ళటం....రావటం .....ఆవిడకు అలవాటే కదూ...."
    "ఈసారీ మళ్ళీ అక్కడికే నంటావా?"
    "దేవుడికి తెలియాలి!"
    "చిత్రంగానే ఉంది ."
    "అంతకంటే చిత్రం! ప్రభు ఆ అమ్మాయిని చేసుకుంటానని అనటం ....."
    "ఎంత సాహసం?"
    "నెమ్మదిగా అంటున్నావా ? శీలం సింగినాదం వదిలెయ్యి .....ఆ గూండాలతో లావాదేవీలు...... ప్రాణాలకు సుఖం ఉంటుందా?"
    "ప్రభుకు అంత ప్రేమ ఉందా ఆవిడ మీద?-"
    "వెఱ్రి వేయి విధాలు...."
    నీరజకు తల తిరిగిపోసాగింది. ప్రభు చెయ్యి గట్టిగా పెట్టుకోకపోతే తూలీపోయేదే! వేణు మొదట ఈ మాటలు తమను ఉద్దేశించినవని అనుకోలేదు .... కానీ అవతలివాళ్ళు కావాలని రెట్టించి రెట్టించి అనటమూ, యశోధర కంగారు పడటమూ, నీరజ ముఖం పాలిపోవటమూ , ప్రభు బాధపడటమూ అతనికి అనుమానం కలిగించాయి. నీరజను మళ్ళీ పరీక్షగా చూశాడు అతనికి గుర్తు వచ్చింది అవును -- ఆ మధ్య పేపర్లలో వచ్చిన వార్త ఈ అమ్మాయిని గురించే.
    ఆ రాత్రి భార్యను నిలదీసి అడిగాడు వేణు..... చేసేది లేక యశోధర సమస్తమూ చెప్పేసింది.
    "ఏవిటీ? అలాంటిదాన్ని .....ఆ గూండాల చేతుల్లో పడి తిరిగివచ్చినదాన్ని ..... మీ అన్నయ్య చేసుకుంటున్నాడా ?" అన్నాడు ఆశ్చర్యంగా వేణు.
    "అవును పాపం! ఇందులో నీరజ తప్పు ఏముందీ? నీరజ ఎంత మంచిదో నాకు బాగా తెలుసు."
    "ఛీ! ఛీ! సిగ్గు లేకపోతే సరి." చీదరించుకుంటూ అన్నాడు వేణు.
    ఒక రాత్రివేళ తన పక్కన ఎవరో పడుకున్నట్లు అయి మెలకువ వచ్చింది నీరజకు.
    ఎవరో మొగవాడు తన పక్కన పడుకుని తనను గట్టిగా కౌగలించుకుంటున్నాడు.
    ప్రభు కాదు! ప్రభు ఎప్పటికీ అలా ప్రవర్తించడు.
    "ఎవరూ ?" అంది భయంగా .... గట్టిగా.
    ఆ ఆకారం నీరజ నోరు నొక్కేసింది.
    "హుష్ నేనే?"
    వేణు కంఠ స్వరం గుర్తు పట్టింది నీరజ -- నిర్ఘాంతపోయింది.
    తనను చెల్లమ్మా అని నోరారా పిలిచినా వేణు .... ప్రభును ఎంతగానో అభినందించిన వేణు .......ఇంత నీచంగా ..... చెప్పుడు మాటలకు ప్రభావం ఉంటుందా?
    "వెళ్ళిపొండి -" అంది కోపంతో - చికాకుతో వణికిపోతూ.
    "పెద్ద ప్రతివ్రతా వేషాలు వేయకు."
    నీరజ అసహ్యం అవధులుదాటింది.
    వెళ్ళిపోతారా ? అరవనా?" గట్టిగానే అంది.
    వేణు భయపడి లేచిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS