.jpg)
"ఆ సంతానం ఎక్కడ పెరుగుతుంది ? ఎలా పెరుగుతుంది ?"
"ఆ భయం నాకు లేదు. ఇది నా మనసులో చిగురించిన పవిత్రమైన ప్రేమ ఫలం - మనుష్యులలో మంచితనం ఎప్పటికీ నాశనం కాదని రుజువుచేస్తూ నాబాబు తప్పకుండా, హాయిగా పెరుగుతాడు. మీరేమీ భయపడకండి! నా శిశువు బరువు భాద్యతలేవీ మీమీద పెట్టను..."
బాలూ చిత్రంగా నవ్వాడు "పిచ్చీ సుశీ....." అన్నాడు జాలి పడుతున్నట్లు.
ఆ క్షణంలో సుశీల ముఖం చూస్తోంటే బాలూ మనసులో మమత పొంగివచ్చింది....
"ఇలాటి సమయంలో ఆడవాళ్ళ మనసులో ఏవేవో కోరికలు ఉంటాయని అంటారు -- నీకేం కావాలో అడుగు ...."
"అనవసరంగా ఆశ పెట్టకండి ! న కోరికలు మీరు తీర్చలేరు?"
"ఈ బాలూ సంగతి నీకు అర్ధం కావటం లేదు! అడిగి చూడు...."
"సరే! అడిగేస్తున్నాను- నన్ను ఒక్కరోజు ఒక్క గంట ఎక్కడికైనా బయటికి తీసికెళ్ళండి...."
నివ్వెరపోయి చూశాడు బాలూ.
"చూసారా? అప్పుడే ఎలాగ అయిపోయారో..."
"అదికాదు ..... ఇలాంటి కోరిక ...."
"భయపడకండి! ఏ విధంగానూ మిమ్మల్ని బంధించను- ఎప్పుడూ ఇలా ఈ మారుమూల గదిలో మీతో గడపడం నాకు ఎలానో ఉంది. విశాలమైన ప్రకృతి ఒడిలో మీదాన్నిగా -- స్వేచ్చగా -- ఒక్క క్షణం ఊపిరి తీసుకోవాలని ఉంది ...."
ఆర్తితో అంటున్న సుశీల చెయ్యి ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకున్నాడు బాలూ.
"తప్పకుండా తీసికేల్తాను...."
సుశీల కళ్ళు మెరిశాయి.
సుశీలను బయటకు తీసి కెళ్తనని రాజేశ్వరితో చెప్పాడు. బాలూ ....... రాజేశ్వరి ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు -- బాలూ ఎంత ఇస్తానన్నా ఒప్పుకోలేదు.
"నేను సుశీలను తీసుకు వెళ్తున్నాను. ఏం చేస్తారో చేసుకోండి -----"
మొండిగా అని సుశీల చెయ్యి పుచ్చుకుని తీసుకువచ్చాడు బాలూ.....
వీధి గుమ్మానికి అడ్డుగా యమభటుడిలా నించున్నాడు, ఆ బ్రోతల్ ని కాపలా కాసే గూండా . బాలూ ఆగిపోయాడు.
రాజేశ్వరి వెక్కిరింతగా నవ్వి , "తీసుకు వెళ్ళండి ...." అంది.
బాలూ విచిత్రంగా ఈల వేశాడు - మరుక్షణం ఎక్కడి నుంచి వచ్చారో , ఎలా వచ్చారో నలుగురు మనుష్యులు చేతిలో పిస్టల్ తో సహా అక్కడికి హకరయ్యారు.
బాలూ రాజేశ్వరిని చూసాడు.
"ఇప్పుడు చెప్పండి! తీసుకు వెళ్ళనా? ఇంకా ఏమైనా అభ్యంతరాలా?"
రాజేశ్వరి ముఖం పాలిపోయింది. బాలూను దెయ్యాన్ని చూసినట్లు చూస్తూ అస్పష్టంగా ఏదో గొణిగింది.
బాలూ సుశీలను చూసి "రా!" అన్నాడు.
సుశీల ముఖం రాజేశ్వరి ముఖాన్ని మించి పాలిపోయింది- ఆ ప్రయత్నంగా ఒక్క అడుగు వెనక్కు వేసింది.
"ఓ ! .... సరే? ఇప్పుడు నేనెవరో తెలిసిపోయింది కదా? నీకు ఇష్టం లేకపోతే రానక్కరలేదు -- ఎలాంటి పరిస్తితులోనూ నేను ఎవరినో ఎవరికీ తెలియనివ్వను -- నీకోసమే ఇంత సాహసం చేసాను -- లోపలికి వెళ్ళిపోతావా?"
"లేదు ! మీతో వస్తాను..."
సుశీల ముందుకు నడిచి బాలూ చేతిలో చెయ్యి వేసింది.
బాలూ తిన్నగా హోటల్ కి తీసుకువెళ్ళాడు.
"మళ్ళీ ఇక్కడికా ...." అంది సుశీల చిరాగ్గా....
"ఇక్కడ మనం ఉండేది కొన్ని గంటలే! నువ్వు తయారవ్వటానికి.... ముందు ముందు ఏదెలా జరుగుతుందో చెప్పలేను -- కానీ ఇవాళ ఒక్కరోజు .... డబ్బు వల్ల లభ్యమయ్యే అన్ని రకాల ఆనందాలూ నీకూ రుచి చూపించగలను...."
బాలూ వెళ్ళి కొన్ని నిమిషాల్లోనే బట్టలు, వాటికి సరిపోయే నగలూ తీసుకుని వచ్చాడు.
"త్వరగా అలంకరించుకో! గొప్పింటి పిల్లలాగ ఉండాలి." బాలూ తెచ్చిన చీర ఎంతో బాగుంది - ఆకుపచ్చ రంగు మీద జరీ పువ్వులు ..... పచ్చలూ, ముత్యాలూ పొదిగిన దుద్దులు, నెక్లెస్, ఉంగరం ..... ఆకుపచ్చ బొట్టు కూడా చూసి " యెంత తెలుసు !" అని నవ్వుకుంది సుశీల .... శ్రద్దగా అలంకరించుకుంది.
పై అలంకరణ కంటే మనసు నిండిన తృప్తి ఎక్కువగా మెరుస్తోంది సుశీల ముఖంలో ..... సుశీల ముఖంలో ఆ అనందం అర్ధం చేసుకుని లోలోపల నిట్టూర్చాడు బాలూ. సుశీలను తీసుకుని పెద్ద పెద్ద హోటళ్ళకూ, షాపులకూ తిరిగాడు బాలూ ....... ప్రతిచోటా బాలుకూ , అతనితో పాటు తనకు జరుగుతోన్న మర్యాదలకూ, సత్కారాలకూ నివ్వెరపోసాగింది సుశీల ...... బాలూ లోలోపల నవ్వుకున్నాడు- సుశీలను కాన్వెంట్ కు తీసుకు వెళ్ళాడు -- సిస్టర్ ఎంతో సంభ్రమంగా, ఆదరంగా ఆహ్వానించింది.
"ఈవిడ మీ ......." అని ఆగిపోయింది.
"భార్య : - "టక్కున చెప్పాడు బాలూ ......... సుశీల బాలూ ముఖంలోకి చూపి తల దించుకుంది.
"అలాగే అనుకున్నాను - ఇంతమంది అనాధ శిశువులకు అండగా నిలబడుతున్నారు. మీ బాబు తప్పకుండా చాలా గోప్పవాడవుతాడు...."
సుశీల అప్రయత్నంగా రెండు చేతులూ జోడించింది -- సిస్టర్ ఆప్రతిభురాలై పోయింది- సుశీల గర్వంగా నవ్వినా, సిగ్గుగా తల వంచుకున్నా, ఆవిడ అర్ధం చేసుకోగలిగేది -- ఇలా చేతులు జోడించటం......
"గొప్పవాళ్ళలో ఇంత నిరాడంబరంగా .......ఇంత మంచిగా ఉండెవాళ్ళను ఎక్కడా చూడలేదు ....." అంది.
"డబ్బున్నంత మాత్రాన గొప్పవాళ్ళు కారు సిస్టర్! నిజానికి మీకంటే గొప్పవాళ్ళు ఎక్కువమంది ఉండరు ..." మరింత ఆశ్చర్యపోయింది సిస్టర్. బాలూ వైపు తిరిగి నవ్వుతూ "ఇన్నాళ్ళూ మీరే మంచివారని అనుకునేదానిని. మీ శ్రీమతి అన్ని విధాల మిమ్మల్ని మించిపోయారు -- ఇలాంటి సంస్కారమూ సహృదయమూ , ఎక్కడా చూడలేదు ---- మీరిద్దరూ చాలా అదృష్టవంతులు -" అంది.
