ఆమెకు మనసు చీకాకు అయినప్పుడు గాయత్రీదేవి దగ్గరకు వచ్చిపోతుంది. గాయత్రీదేవి రాజలదేవికి యెన్నో విషయాలు చెప్తుంది. మనోధైర్యం పొందే వుపాయాలు చెప్తుంది. స్నేహం యిచ్చే నీడలో ఆ యిద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటారు.
రాజమాతకూ కొన్ని దిగుళ్ళు వున్నాయి. వాటిలో ప్రధానమయింది రంగారావుగారు మళ్ళీ పెళ్ళి చేసుకోలేదన్న దిగులు. కులం నిలుస్తుందా?
రంగారావుగారి తొలి భార్యకు సంతానంలేదు. పెళ్ళి అయిన రెండేళ్ళకు ఆమె కన్ను మూసింది. మళ్ళీ పెళ్ళి అనగానే రంగారావుగారు మండిపడి పోతారు. రాజమాత రాజలదేవి గంటల తరబడి కూర్చుని మాట్లాడుకునేది యిటువంటి విషయాలను గురించే!
నేను డాక్టర్ వైకుంఠంగారితో మాట్లాడుతూ వుండగా వచ్చింది రాజలదేవి. ముందు నా గదికి వచ్చినా యోగక్షేమాలు పరామర్శించి వెళ్ళటం ఆమెకు అలవాటు. అలవాటు ప్రకారం ముందు నా గదిలోకి వచ్చింది.
"ఆచార్లుగారు యెప్పుడూ యేదో ఒక హడావిడిలో వుంటారు" అంటూ పలకరించింది నన్ను. మా స్నేహానికి యిరుసు సమానమైన వయస్సు.
ఆడవాళ్ళు త్వరగా యెదిగిపోయినట్లు కన్పిస్తారు. అందునించి ఆమె నాకన్నా పెద్దదిలా అవుపించినా వయసు సమానం. నేను ఆమెకు పెద్దరికమే యిస్తాను. ఆమె నన్ను తనకన్నా చిన్నవాడిని చూచినట్లు చూస్తుంది. యిద్దరికీ తెలుసు వయసు సమానమేనని! యిదొక విచిత్ర స్నేహం.
"రండి కూర్చోండి" అంటూ మరొక కుర్చీ తెప్పించాను. డాక్టరు వైకుంఠం నన్నూ, ఆమెనూ మార్చి మార్చి చూస్తున్నాడు.
రాజలదేవి కూర్చున్నారు. డాక్టరు వైకుంఠంగారిని పరిచయం చేశాను. పరస్పరం నమస్కారాలూ, అభినందనలూ అయ్యాక అసలు విషయం కదిలించాను వైకుంఠంగారిని.
"ఇంతకూ పునర్జన్మలు లేవంటారా?" అంటూ అడిగాను.
"ఉండవచ్చు లేకపోవచ్చు" డాక్టర్ వైకుంఠం సమాధానం యిది. యీ సమాధానం విని రాజలదేవి నవ్వుతోంది.
"సైన్సు ప్రకారం ప్రతి ప్రశ్నకూ ఒక స్పష్టమయిన సమాధానం వుండాలి కదా!" అని అడిగాను ఆమె ఆసక్తిగా వింటోంది మా సంభాషణ.
"సైన్సు పెరిగినకొద్దీ సమస్యలు జటిలం అవుతాయి సందేహాలు అధికం అవుతాయి. ప్రతి ప్రశ్నకూ సమాధానం యివ్వగలిగినంత సైన్సు యింకా మనకిలేదు" అని వైకుంఠంగారి సమాధానం.
"ఈ ప్రకారం చూస్తే మన వైద్యశాస్త్రం అంతా అబద్దం అయి వుండాలి కదండీ!" అన్నాను మొహమాటం లేకుండా.
"అదేమిటీ?" అంటూ నోరుతెరిచాడు వైకుంఠం.
"తలనొప్పికి ఒక మందు వేసుకున్నాం అనుకోండి. అది తల నొప్పి తగ్గించి వూరుకోదు. మరొక అపకారమో వుపకారమో చేస్తుంది. కాబట్టి ఆ మందు తలనొప్పి మందు అనటం అర్ధసత్యమే కాని నిండు అయిన నిజంకాదు" అన్నాను.
డాక్టరు వైకుంఠంగారు నాతో ఆర్గ్యుమెంటుకి దిగలేదు.
"ఏవో వుంటాయిలెండి. రోగాలూ పెరుగుతుంటాయి. మందులూ పెరుగుతుంటాయి" అంటూ లౌకికం మాట్లాడటం ప్రారంభించాడు.
"అంతా పూసగ్రుచ్చినట్లు మీతో చెప్పాను. సీతాదేవి ఫ్రాన్స్ నించి వ్రాసిన యీ వుత్తరంకూడా చదవండి" అంటూ డాక్టరుగారికి వుత్తరం యిచ్చాను.
నేను లోపలకు వెళ్తూవుంటే రాజలదేవి కూడా నావెంట వచ్చింది.
ఆమెను గాయత్రీదేవిగారి దగ్గరకు తీసుకువెళ్ళి డాక్టరు విశాఖనించి వచ్చాడని రాజమాతకు చెప్పాను. రంగారావుగారికీ చెప్పాను. వెనుదిరిగి వస్తూ వుంటే అలికిడి అయింది. లోపలికి తొంగి చూశాను.
మిస్ మార్లిన్ కి మెలుకువ వచ్చింది. ఆమె బాబ్డు హెయిర్ లాగి గుర్రం కుచ్చులా రబ్బరుబాండుతో బిగించుకుంటోంది. లోపలకు వెళ్ళాక తలయెత్తి నన్ను చూచి ప్రశాంతంగా నవ్వింది.
"సుఖంగా నిద్రపట్టిందా?" అంటూ పలకరించాను.
"ఆడదానిగా పుట్టటం నా అదృష్టం. నేను ఆడదానిగా వున్నంత వరకూ మగవారంటే నాకు భయం వుండవలసిన పని లేదు" అని చెప్పిన తరువాత సుప్రసిద్ద సినిమా నటి మార్లిన్ మన్రో నవ్వినంత నిశ్చింతగా హాయిగా నవ్వింది మిస్ మార్లిన్.
ఆమె వూహలో తాను క్రొత్తచోటులో వున్నానన్న స్పృహ లేక పోవటం ఆ నవ్వులో కన్పించింది నాకు. ఆమెకు యీ మనుషులూ, యీ వాతావరణమూ క్రొత్త అనిపించటల్లేదు. అలవాటయిన చోట్లో ఆత్మీయుల మధ్య వున్నట్లే వుంది.
"నిద్రపట్టింది. అయితే కన్ను మూసింది మొదలు మళ్ళీ కళ్ళు తెరిచిందాకా ఒకటే కలలు. ఆ కలలు నాకు బాగా అలవాటు అయినాయిలెండి" అంటూ నవ్వింది. చిన్నతనంనించీ పరిచయం అయిన మనిషితో మాట్లాడినట్లుగా ఫ్రీగా మాట్లాడుతోంది.
"కలల కౌగిలిలో కరిగిపోవటం నిద్రకన్నా సుఖమిస్తుంది. కాని యెప్పుడో ఒకప్పుడు అవి కలతేనని, అది కేవలం కలల కౌగిలి అనీ తెలుస్తుంది. అప్పుడు మనం నిజానికి దూరంగా వున్నామన్న విషయం తెలుస్తుంది. నిజాన్ని నిద్రపుచ్చి కలల్ని కౌగిలించుకోవటం ఖరీదు లేని సుఖం. కాని అది చాల తాత్కాలికం" అన్నాను. నేనూ ఆమెకు క్రొత్త తెలియనివ్వలేదు. యిదివరకే బాగా పరిచయం వున్నట్లు మాట్లాడాను.
"మీరు యేదో రిఫరెన్స్ యిస్తూ మాట్లాడుతున్నారు. కాని ఆ రిఫరెన్సు యేమిటో నాకు స్ఫురించి చావటల్లేదు" అన్నది మిస్ మార్లిన్ వ్రేళ్ళతో నెత్తిమీద గీరుకుమ్తూ కళ్ళు అదొకలా పెట్టి.
నింగిలోని అందాల నీలాలకాంతుల్ని అలా అలంకరించుకున్న ఆమె కళ్ళు అదొకలా చూడ్డంలో మరింత అందంగా కనిపించినాయి.
"మీకొచ్చిన కలలు యెలాంటివి?" అన్నాను మాటమార్చి.
"నేను మల్లమ్మదేవినట. మంటల్లో కాలిపోతున్నానట. అరిగిపోయిన పాతరికార్డులాంటి కలే మళ్ళీ వచ్చింది. నాకు ఆ కలని చూస్తున్నప్పుడు అది కల అనిపించదు. నిజం అనిపిస్తుంది" అంటూ చెప్పింది మార్లిన్.
