Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 14


    "వెధవ జోకులొద్దూ....మనం భార్యాభర్తలం అన్న విషయం మరచిపోవద్దు. ముఖ్యంగా వాళ్ళ దగ్గర..." అంది ప్రనూష.
    .......మిసెస్ ప్రనూషా శ్రీచరణ్.
    శ్రీచరణ్ మంచంమ్మీద అస్థిమితంగా అటూ, ఇటూ దొర్లుతున్నాడు. నిద్ర  రావట్లేదు.
    టైం పదిన్నర దాటింది.
    మెల్లిగా లేచి, ప్రనూష గదివైపు చూసాడు. ఆమె గదిలో కూడా లైటు వెలుగుతూనే ఉంది.
    అంటే ప్రనూష కూడా, తనలానే ఆలోచిస్తోందా?
    ప్రనూష తన భార్య.
    మనసునూ, శరీరాన్ని పంచుకోని భార్య.
    తను పెళ్ళయిన బ్రహ్మచారి...
    వాటే గ్రేట్ కాంబినేషన్!?
    రెండు మనసులూ, శరీరాలు కలవకపోయినా...భార్యాభర్తలవుతారా? అతని మానసిక స్థితి సంఘర్షణలే భేటీ పడుతోంది. అతని మనసు వెనక్కి వెళ్ళి జ్ఞాపకాల పేటికను తెరిచి, తరచి తరచి గతాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తోంది!    తనూ, ప్రనూష.
    అసలు తమ పెళ్ళే ఓ విచిత్రం....జ్ఞాపకాల పేటిక తెరుచుకుంది. ఒక్కో అరలో ఒక్కో జ్ఞాపకం...పదిలంగా... అతి పదిలంగా, వినయంగా.....అతి వినయంగా అతని ముందొచ్చి నిలిచింది.
    "స్టార్ట్ యిమ్మీడియట్లీ....గ్రాండ్ మా సీరియస్" అన్న టెలిగ్రాము చూసి కంగారు పడిపోయాడు శ్రీచరణ్.
    'ఏమైందేంట్రా....అంత కంగారుపడిపోతున్నావు?" రూమ్మేట్ అడిగాడు.
    'బామ్మకు సీరియస్ గా వుందట్రా..." అన్నాడు.
    'అయ్యో...అలాగా....నువ్వెంటనే బయల్దేరు..." అన్నాడు.
    "రూమ్మేట్ కంగారుగా.
    "నేను వెళ్ళేసరికి బామ్మ ఏమైపోతుందో?"
    "ఛ.... ఛ... అవేం మాటల్రా....బామ్మకు ఏమీ కాదు. నువ్వు ధైర్యంగా వెళ్ళు కావాలంటే నేను తోడువస్తాను..."
    "బామ్మకు ఏమీ కాదా?"
    "ఏమీ కాదని చెప్పానుగా"
    "నేను వెళ్ళేసరికి పైకెళ్ళిపోతుందేమో...."
    'ఛ.... ఛ.... మరీ యింత సెన్సెటివ్ అయితే ఎలారా? నేను చెబుతున్నానా... బామ్మకు ఏమీ కాదు వెళ్ళు......వెళ్ళు..."
    "వెంటనే వెళ్ళనా? కామత్ లో పెసరట్టు, ఉప్మా తిని వెళ్ళనా?"
    "ఏంట్రా ఏమైందసలు... బామ్మ సీరియస్ వార్త విని...కాస్త అన్ బాలెన్స్ అయినట్టున్నావు..." శ్రీచరణ్ మొహంవైపు చూస్తూఅడిగాడు రూమ్మేట్ విగ్నేష్. అప్పుడు నవ్వాడు శ్రీచరణ్. తెరలుతెరలుగా నవ్వి క్రమక్రమంగా సౌండ్ పెంచి, కడుపు పట్టుకుని మరీ...
    "ఒరే....ఏమైందిరా....నాకు భయంగా వుందిరా....సరిగ్గా మాట్లాడరా....బామ్మకు ఏదీకాదురా....నాకు భయమేస్తోందిరా..." అన్నాడు రూమ్మేట్ శ్రీచరణ్ వంక చూసి.
    'నీ మొహం భయం.....పదపద....హాయిగా ఓ ఉప్మా, ఫిల్టర్ కాఫీ లాగించేసి ఏదైనా సినిమాకు వెళ్దాం" అన్నాడు శ్రీచరణ్.
    'నీకు ఖచ్చితంగా పిచ్చెక్కిందిరా....ఓవైపు బామ్మకు సీరియస్ గా వుందని టెలిగ్రామ్ వస్తే....నువ్వేంట్రా....పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నావు?'
    శ్రీచరణ్ మంచమ్మీద వున్న పరువుపైకెత్తి దానికింద వున్న టెలిగ్రాముల కట్టొకటి, విగ్నేష్ ముందుపెట్టి 'చూడరా.... యిది బామ్మకు పెరాలిసిస్ వచ్చిందన్న టెలిగ్రామ్. మరొకటేమో యాక్సిడెంట్ అయిందన్న టెలిగ్రామ్....మరొకటేమో జాండిస్ వచ్చాయని....ఆఖరికి ఎయిడ్స్ ని కూడా వదిలిపెట్టకుండా ఎయిడ్స్ అటాక్ టు బామ్మ... అన్న టెలిగ్రాం కూడా ఇచ్చిందిరా..." నవ్వుతూ ఒక్కో టెలిగ్రామ్ చూపిస్తూ చెప్పాడు శ్రీచరణ్.
    "అంటే..."
    "మా బామ్మ వీక్లీ మ్యాగజైన్ కు సీరియల్ ఇన్ స్టాల్మెంట్లలో ఇచ్చినట్టు నాకు టెలిగ్రామ్ లు వారానికోటైనా ఇస్తుంది. ఆ ముసల్దానికదో సరదా..." అన్నాడు అసలు విషయం చెబుతూ.
    "నిజంగానా?" ఆశ్చర్యపోతూ అన్నాడు విగ్నేష్.
    "నీ మీదొట్టురా... నేను అబద్దాలాడితే, నీ కళ్ళు టప్పున పేలిపోతాయి. నీ కాళ్ళు పెరాలిసిస్ వచ్చి పడిపోతాయి. సరేనా?" అన్నాడు.
    "వావా? వద్దులే....నమ్ముతా.....!" అన్నాడు భయంగా విగ్నేష్.
    సరిగ్గా ఈ సంఘటన జరిగిన ఇరవై నాలుగ్గంటల తర్వాత...
    గది తలుపులు దబదబా బాదిన శబ్దం విని, బద్దకంగా లేచి వెళ్ళి తలుపు తీశాడు శ్రీచరణ్. ఎదురుగా రామస్వామి బామ్మకు నమ్మిన బంటు. ఘోరం జరిగిపోతున్నది చినబాబూ..." అన్నాడు ఏడుపు లంకించుకుంటూ.
    "అబ్బ....ఏడవకుండా చెప్పవయ్యా...." విసుక్కున్నాడు శ్రీచరణ్.
    "రాత్రి బామ్మగారు ఉరేసుకోబోయారు..." అన్నాడు ఏడుపు గొంతుతో.
    'ఉరా? ఎందుకు?" అనుమానంగా అడిగాడు శ్రీచరణ్.
    "ఎందుకంటే బాబుగోరు అంతా మీవల్లే జరిగింది. ఆవిడకు ఏదైనా జరిగితే, దానికి మీరే బాధ్యులు" కోపంగా అన్నాడు రామస్వామీ.
    "అదేంటి నేనేం చేశాను"
    "బామ్మ సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ ఇస్తే మీరు రాలేదుగా, నా మనవడికి నా మీద ప్రేమ లేదు. వాడు వేలెడంత ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతే నేనే పెంచి పెద్ద చేశాను. అలాంటిది నేను చస్తానని తెలిసినా రాలేదని, ఊరందర్నీ పిలిచి మీటింగెట్టి రాత్రి ఉరేసుకోబోయింది..." రామస్వామి చెప్పాడు.
    "ఊరంతా టముకు వేసిందా? ఆ ముసల్ది ఆపని చేస్తుందని వూహించకపోవడం నాదే తప్పు..." అన్నాడు శ్రీచరణ్.
    "మీరు వెంటనే రండి బాబూ....సరిగ్గా పది గంటలకు మీరు రాకపోతే, పదిగంటల ఒక్క నిమిషానికి చూరు"కు ఉరేసుకు చస్తానని, తన కర్మకాండ జరిపించడానికి, అన్ని  ఏర్పాట్లు కూడా చేసుకుంది. మీరొచ్చి ఒక్కొక్కరికి పెట్టిపోతే చాలట" రామస్వామి చెప్పి కళ్ళు తుడుచుకున్నాడు.
    అనుమానంగా రామస్వామి వంక చూశాడు.
    "ఏంటి చినబాబూ...అలా చూస్తున్నారు నేనేం కళ్ళలో ఉల్లిపాయలు పిండుకుని రాలేదు" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS