శిష్యులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు.
ఆమె వైపు ......అయన వైపు మర్చి మార్చి చూశారు.
భక్త జనావళి సైతం , ఆ తాజా పరిణామానికే ఆశ్చర్యంతో తల మునకలైపోయారు.......
ఈసారి అక్కడ వున్న భక్తులే కాదు, అతని శిష్యగణం కూడా 'అవురా! ఏమి తెగింపు!' అన్నట్టు బుగ్గన వేలు వేసుకున్నారు.
కారణం ......అంతవరకూ అయన ప్రసంగం మధ్జ్యలో అలా ప్రశ్నించిన వాళ్ళు గానీ ఆ ప్రసంగాన్ని ఆపమని శాసించిన వాళ్ళు గాని, తమ సందేహాలను బయటపెట్టి ధైర్యంగా అడిగినవాళ్ళు కానీ లేరు? మరి భారతి తొలిసారిగా ఆ ప్రయత్నం చేసింది.
విష్ణు ఆగ్రహానికి గురి అవుతుందేమో అని మిగిలిన భక్తులు భావించారు. కానీ వాళ్ళ వూహలను తలక్రిందులు చేసేలా అయన ప్రశాంత వదనంతో ------మృదువైన కంఠంతో ఆమెను పరామర్శించడం చూసి మరోసారి రిత్తపోయారు.
"మిస్ భారతీ! నిర్భయంగా , నిస్సంకోచంగా మీ సందేహాలు అడగొచ్చు. నాకు తెలిసినంతవరకూ మీ ప్రశ్నలకు జవాబులు చెబుతాను."
"బ్రహ్మం అంటే ఏమిటి?" భారతి సూటిగా ప్రశ్నించింది.
ఒకే ఒక్క క్షణం ఆమె వైపు సూటిగా చూశాడు విష్ణు.
"ఈ మానవ శరీరమే బ్రహ్మ నివాసం. అంటే బ్రహ్మపురం. తొమ్మిది ద్వారాలు వున్న ద్వారవతి అనే మన శరీరమనే నగరంలో బ్రహ్మదేవుడు నివసిస్తాడని వేదాలలో వున్నది. ఈశ్వరుడే ఈ ప్రపంచంలోకి ప్రవేశించి, పంచభూతాలలో ఒక శరీరాన్ని నిర్మించుకుని ప్రాణ కళతో తనే ఆ శరీరంలోకి దిగి దాంట్లో నివశిస్తున్నాడు. శరీరంలో అలా నివసించే భగవంతుడే జీవాత్మ. ఆ జీవుడే బ్రహ్మం........' నింపాదిగా చెప్పాడు విష్ణు.
'అంటే ప్రతి మనిషి బ్రహ్మతో సమానం కావాలి కదా. కానీ ధర్మార్ధ కామ మోక్షాలలో దేనినీ జయించలేని ఈ సగటు మనిషికీ, దైవానికీ పోలిక ఎక్కడుంది?" మరొక ప్రశ్న సంధించిందామె.
విష్ణు వదనంలో ఆ మందహాసం ఇంకా సడలిపోలేదు సరికదా......అయన ముఖ మండలంలో చెప్పలేనంత హెచ్చు రీతిలో ఆనంద వీచికలు ప్రస్పుటమావుతున్నాయి.
బహుశా ఇంతవరకూ ఏ శిష్యుడూ అలా ప్రశ్నించి తమ అంతరంగంలో వున్న సందేహాలను తీర్చుకోకపోవడం ఒక కారణం అయి వుండవచ్చు. లేదా అలాంటి ప్రశ్నల వల్లనే పామరజనుల అజ్ఞానం తొలగిపోతుందనేది మరొక కారణం కావచ్చు!
అందుకే ఆమె ప్రశ్నలకు సందర్భోచిత సమాధానాలు ఇస్తున్నాడు విష్ణు.
'అలా నిర్మాణం చేసుకున్న శరీరంలో జీవుడు బంధితుడై మనిషిగా జన్మిస్తాడు. ఆ తరువాత తన దైవత్వాన్ని పూర్తిగా మరచిపోయి మాయలో చిక్కుకుని సుఖదుఖాలలో ఏర్పడే నష్టాల వలన, మంచీ - చెడూ అనే పనులు చేస్తూ ఆ కర్మలలోనే చిక్కుకుంటాడు. కర్మలలో ఇలా చిక్కి చిక్కి జన్మిస్తూ, మరణిస్తూ......క్=జనన మరణాలనే కాలచక్రంలో తిరుగుతూ వుంటాడు" భక్తుల వైపు పరిశీలనగా చూస్తూ తను చెప్పదలచుకున్నది సూటిగా హృదయానికి హత్తుకునేలా చెప్పాడు విష్ణు.
అయన సమాధానాలను ఆసక్తిగా వింటూ విష్ణులో అంతటి పాండిత్య ప్రకర్ష దాగి వున్నదా అని ఆశ్చర్యపోతున్నది ధీరజ.
ఉన్నట్టుండి మరొక ప్రశ్న వేసింది భారతి.
"మయాజలమైన ఈ సంసార బంధం నుంచి విముక్తి పొందడానికి ఏం చేయాలంటారు?"
"సంసార చక్ర బంధం నుంచి జీవాత్మ విడివడి బయటపడాలంటే ముందుగా తానెవరో తెలిసే తన స్వస్వరూప ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. దీనికై తను ఆ శరీరంలో ఎలా బద్దుడైనాడో ఎలా బంధించబడి వున్నాడో ఆ రహస్యం తెలియాలి. శరీరాన్ని ముఖ్యంగా పంచ కోశాలు కప్పి వుంచుతాయి. ఉల్లిపాయ పొరలు పొరలుగా వున్నట్టు ఐదు కోశాలూ ఒక దానిపై ఒకటి ఆత్మను కప్పి వుంటాయి. ఈ ఐదు విముక్తి అయితే గానీ తన ఆత్మ స్వస్వరూపం ఏమిటో తనకు తెలియదు. ఇలా తన స్వస్వరుప జ్ఞానం కలిగితేనే తనకు విముక్తి."
గూడార్ధాలను సువిశతం కావించడానికి విష్ణు ప్రవచించిన విషయాలు భక్తాదులను గిలిగింతలు పెట్టటమే కాక జ్ఞానబోదకాలు అయ్యాయి.
భారతి సయితం ఏమీ మాట్లాడలేక మవునం వహించింది.
శ్రోతలు తన్మయత్వంతో ఉర్రుతలూగుతున్నారు!
కలెక్టర్ ధీరజ కు అది అంతా ఓ అద్భుత కలలా తోచింది!
ఎంతో ఆవేశంగా భారతి ప్రశ్నించడం.....అన్నింటికి అతీతుడై ప్రశాంత చిత్తంతో విష్ణు బదులివ్వడం చూస్తుంటే నిజంగానే అతనిలో అంతు తెలియని నిగూడమయిన మహిమాన్వితుడు దాగి ఉన్నాడనిపించింది ధీరజకు!
విష్ణు ఒక జ్ఞాన సాగరం....
ఎన్నో ఆద్యాత్మిక ప్రవచనా పరంపరలు అయన వాగ్దాటిలో తరంగాలుగా ఓలలాడుతూ అందరినీ ఆశ్చర్యచకితులను చేశాయి.
విష్ణు ఉదాహరించిన శ్లోకాలకు లెక్కలేదు.
వినిపించిన ధర్మసూత్రాలు నక్షత్రాదికాలు.
"కావున - ఓ జీవుడా మేలుకో! అజ్ఞానం నుంచి తెప్పరిల్లుకో! ఆత్మ జ్ఞానాన్ని పొంది శాశ్వతమైన కైవల్యాన్ని అందుకో! పరమానందాన్ని అనుభవించు. యుగాలు మారుతున్నప్పుడల్లా యుగధర్మం మారుతుంది. కృత యుగంలో హింస అంటే ఏమిటో తెలియదు. ఆ యుగంలో చాలా తక్కువ ఆహారంతో జీవిస్తూ ఎక్కువ ఉపవాసాలు చేస్తూ ఏక సందా గ్రాహకులుగా జనం ఉండేవారు.........
'అందువల్ల ఆ యుగంలోని వారికి ఆయుష్షు కూడా ఎక్కువ ఉండేది. తరువాత త్రేతా యుగం వచ్చినా అబద్దమడడం, హింస వంటివి నామమాత్రంగా కూడా లేవు. కాని కృతయుగం కన్నా కొంత గ్రహణ శక్తి, ఆయుష్షు తగ్గింది. ఈ కలియుగం వచ్చేసరికి రాజోతామన గుణాలు విజ్రుంభించి అధర్మ మార్గం చోటు చేసుకుని మానవులలో క్రౌర్యం పెరిగి సహనం నశించిపోయింది.
"మట్టిబొమ్మ వంటి శరీరాన్ని చూసి వ్యామోహ పడక స్వస్వరుపమైన ఆత్మను గురించి నిరంతరమూ చింతన చేస్తూ గురుబోదద్వారా వస్తావా స్థితిని అనుభూత మొనర్చుకుని పరమశాంతిని పొందాలి."
