"కంగారుపడకు.....ఇప్పుడే తీసుకొస్తా....." సంజయ్ రయ్యిమని వెళ్ళిపోయాడు.
"పది నిముషాలు ఆలస్యం అయినా ఆవిడ దక్కేదికాదు. సే థాంక్స్ టూ సంజయ్!" అన్నాడు డాక్టర్.
విద్య బలహీనంగా తలతిప్పి సంజయ్ వైపు చూసింది.
"ఆవిడకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎక్కువగా ఆవేశపెట్టేవీ జరగకుండా చూడండి! నౌ షీ ఈజ్ నార్మల్!" చెప్పాడు డాక్టర్. వర్ష చిన్నపిల్లలా ఏడ్చేస్తోంది.
విద్య వర్ష తలమీద చెయ్యివేసి నిముర్తూ "నన్ను వదిలివెళ్ళిపోదామనుకున్నావా వర్షా?" అని అడిగింది.
"లేదమ్మా లేదు నీ గుండె అంత దెబ్బ భరించలేదని నాకు ఇప్పుడు పూర్తిగా అర్ధం అయిపోయింది. నేను ఇంకెప్పుడూ నిన్ను వదిలివెళ్ళను. నా సంతోషం కోసం నిన్ను చంపుకోను!" వెక్కి వెక్కి ఏడుస్తూ అంది.
సంజయ్ దోషిలా తల వంచుకుని చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అతని మనసు కూడా పశ్చాత్తాపంతో నిండిపోయింది. తను ఆవేశంగా తీసుకున్న నిర్ణయంవల్ల ఒకవేళ విద్య మరణించి ఉంటే వర్ష తనని జీవితాంతం క్షమించేదికాదని అతనికి తెలుసు!
వసుంధర తమ్ముడి దగ్గరకొచ్చి "ఆంటీకి సారీ చెప్పు!" అంది.
సంజయ్ విద్య బెడ్ దగ్గరకెళ్ళి "సారీ.....ఆంటీ!" అన్నాడు.
విద్య బలహీనంగా నవ్వి "నువ్వు చాలావరకు సక్సెస్ అయ్యావు సంజయ్! నా వర్ష ఏం కావాలని అడిగినా నేను కాదనకుండా అన్నీ ఇస్తూ వచ్చాను. ఇప్పుడుకూడా కాదనలేదు. వసుంధరా.....డేట్ ఫిక్స్ చెయ్యి. రిజిస్టర్ మేరేజ్ చేద్దాం" అంది.
సంజయ్ మొహం సంభ్రమంతో విచ్చుకుంది! వర్ష అపనమ్మకంగా తల్లిమొహంలోకి చూసింది. "నావర్ష తల్లి ఏం కోరుకున్నా నేను ఇవ్వగలను అని నిరూపించుకోవడంకన్నా ఈ జన్మకి కావల్సిందిఏముంది?" కూతురి తలనిమిరి "ఆర్ యూ హేపీ?" అడిగింది విద్య.
"అమ్మా నువ్వు దేవతవి" కన్నీళ్ళతో తల్లిచేతులుపట్టుకుని అంది వర్ష.
వసుంధర నవ్వి "ఆంటీకి థాంక్స్ చెప్పు సంజయ్!" అంది.
ఈసారి సంజయ్ విద్య బెడ్ మోకాళ్ళ మీద వర్షలాగే కూర్చుని "వర్ష ఎంతో నేను అంతే అనుకుని ఈరోజు నుండీ నన్నూ అలాగే చూడాలి మరి!" అన్నాడు పిల్లాడిలా.
విద్య అతని తలమీద చెయ్యివేసి "యూ ఆర్ చైల్డిష్......నాకు ఆ సంగతి తెలుసు సంజయ్!" అంది.
"థాంక్యూ ఆంటీ" సంతృప్తిగా అన్నాడు.
వర్షకళ్ళల్లో మతాబులు వెలిగించుకున్నట్లుగా అవి మెరుస్తున్నాయి.
సంజయ్ చేతివేళ్లు పెద్దవాళ్ళకి తెలియకుండా, దొంగతనంగా ఆమె వీపు మీద చక్కిలిగింతలు పెడ్తున్నాయి.
"రిజిస్ట్రార్ ఆఫ్ మేరేజెస్" అన్న బోర్డు ఉన్న ఆఫీసు దగ్గర టేక్సీలోంచి సంజయ్, వసుంధరా, ఇంకో నలుగురు దగ్గర బంధువులూ దిగారు. అప్పటికే అక్కడికి చేరుకున్న విద్యా, వర్ష పూలదండలతో, స్వీట్స్ తో సిద్దంగా ఉన్నారు.
పెళ్ళి కూతురి పట్టుచీరలో, జడనిండాపూలుపెట్టుకుని వర్ష తమాషాగా ఉంది. సంజయ్ సూట్లో చాలా బావున్నాడు. వసుంధర ఒక సాక్షి సంతకం, విద్య తరపున ఆమె అన్నగారు త్రిమూర్తి ఒక సాక్షి సంతకం పెట్టారు.
వర్ష, సంజయ్ సంతకాలు పెట్టి దండలు మార్చుకుని దంపతులయ్యారు. విద్యకి మొదటిగా, ఆ తర్వాత మిగతా వాళ్ళకీ పాదాభివందనం చేశారు.
వసుంధర అందరికీ స్వీట్స్ పంచింది.
వర్ష నోటికి సంజయ్ స్వీట్ అందించాడు. వర్ష కూడా అలాగే చేసింది.
"గుడికి తీసుకువెళ్తాను. అక్కడ ముహూర్తం ప్రకారం మంగళసూత్రంకడ్తాడు" విద్యతో చెప్పింది వసుంధర.
విద్య ఆశ్చర్యంగా "అదేం? మళ్ళీ ముహూర్తం ఎందుకూ? ఇది పెళ్ళికాదా?" అడిగింది.
"అదికాదు.....మంగళసూత్రం.....చాలా ముఖ్యం కదా!" వసుంధరనసిగింది.
వర్ష అదాటుగా తల్లిముఖంలో భావాలని చూసింది.
విద్య ముఖం చిన్నబోయింది "ఓ.కే! నాకు తెలీదులే!" అనేసింది. ఆ అనడంలోనే ఎంతో అవమానాన్ని దిగమింగుకుంటున్న ధ్వని వినిపించింది.
వర్ష తల్లివైపు బాధగా చూసింది. "అక్కడి నుండి మా ఇంటికి తీసుకువెళ్ళి హారతి ఇప్పించికొత్తకోడలి చేత గృహప్రవేశం చేయిస్తాను. సాయంత్రం రిసెప్షన్ టైంకి అందరం కలిసివస్తాం" అంది వసుంధర.
విద్య ఇంకా ఆశ్చర్యంగా "గృహప్రవేశమా?" అంది.
త్రిమూర్తి కలుగజేసుకుంటూ "అవన్నీ సాంప్రదాయంప్రకారం చేసే పద్ధతులేలే అమ్మాయ్" అన్నాడు.
"సరే.....మీ ఇష్టం!" అయిష్టంగానే అంది.
వర్ష తల్లివైపు చూసింది. "వెళ్ళిరా తల్లీ" అంది విద్య.
సంజయ్ వర్ష చెయ్యి పట్టుకుని టేక్సీ వైపు నడిపించాడు. అప్పుడు రాలిపడ్డాయి ఉగ్గపట్టుకుని ఆపుకుంటున్న విద్యకన్నీళ్ళు!
"ఛ! ఏమిటదీ.....ఎక్కడికి వెళ్తోందనీ? మళ్ళీ సాయంత్రం మనింటికి రాదూ!" త్రిమూర్తి చెల్లెల్ని ఊరడించాడు.
విద్య కొనగోటితో కన్నీళ్ళు తుడుచుకుంటూ "వర్ష సంజయ్ భార్య అయిపోయిందిగా, ఇంక నాకేం హక్కు లేదా అన్నయ్యా?" అడిగింది.
"ఎందుకు లేదూ! ఎప్పుడూ నీకూతురే!" చెల్లెలి మనస్థితి తెలిసిన త్రిమూర్తి
ఉపశమింపచూశాడు.
"అది నా ప్రాణం.....ఒక్క క్షణం కంటిముందులేకపోయినా నేను తల్లడిల్లిపోతాను.....నేను బ్రతకలేను" గుండె పట్టుకుంటూ అంది విద్య.
"నువ్వు ఎక్కువగా ఆలోచించకూడదు! ఊర్కో....." అన్నాడు త్రిమూర్తి.
వర్షా, సంజయ్ రిసెప్షన్ రోజు రాత్రి విద్య ఇంట్లోనే గడిపారు. ఆరోజు కోసం గది డెకరేట్ చెయ్యడానికి ప్రత్యేకమైన మనుషుల్ని పిలిపించింది విద్య. శోభనంగది భూతల స్వర్గంలా తీర్చిదిద్దించింది.
వర్ష పాలనురగలాంటి చీరలో మబ్బుతునకలా మెరిసిపోయింది.
విద్య కూతురితో "ఏం చెప్పాలో తెలీడం లేదు. కానీ అబ్బాయే చెప్తాడని నాకు తెలుసు. ఏమాత్రం భయంవేసినా అతనితో చెప్పు. అతను నీమాట వినకపోతే నాతో చెప్పు.....నేను హాల్లోనే ఉంటానుగా!" అని చెంపలు నిమిరింది.
