హటాత్తుగా అదృశ్యమైపోయింది మంగ.
ఆ తర్వాత కిన్నెర యిక వచ్చి మంచినీళ్ళయినా ముట్టుకోకుండా ఎదురుచూస్తూ ఉండిపోయింది.
ఉళ్ళో అడుగుపెట్టిన మంగకు ముందేం చేయాలో పాలుపోలేదు.
పోస్టాఫీసుకు వెళ్ళి అరా తిద్దామన్నా తెల్సుకోవాలనుకుంటున్నది అబ్బాయి గురించి కాబట్టి , ఆ చిన్నపల్లెలో అదేన్ని అనర్ధాలకు దారి తీస్తుందో అని అందోళన పడింది.
అసలే రెండు గ్రూపులతో అట్టుడికిపోతున్న పల్లెటూరు.
పొరపాటున ఆ విషయం ఉదయ్ బాబుక్కాని, వీర్రాజుగారిక్కాని తెలిస్తే కొంపలు మునిగిపోతాయి.
మంగకు చాలా ఇబ్బంది అనిపించింది.
అంత తెలివితేటలున్న రాఘవ ఈ ఉళ్ళో వుంటే అది తనకు తెలియకపోవటం నిజంగా దారుణమని కూడా అనిపించింది.
అదిగో! అలా ఆలోచిస్తూ నడుస్తున్న సమయంలో ఎదురయ్యాడు రాయుడు. అనకాపల్లి నుంచి వస్తున్నట్టున్నాడు.
"బాబాయ్!" పలకరించింది మంగ చనువుగా. "నీతో చిన్న పని పడింది."
ప్రసన్నంగా నవ్వేశాడు రాయుడు. "చిన్నదో, పెద్దదో అసలు ఈ ఉళ్ళో నాతో పనిపడని మనిషేవరు చెప్పు కానియ్!"
రాయుడు టెలిఫోన్ డైరెక్టరి లాంటివాడు మాత్రమే కాదు. అడిగింది చెప్పడం మాత్రమే కాక, చెప్పింది నలుగురిని అడగకుండా చెప్పే అలవాటున్న మనిషి కూడా అనిపించడంతో తెలివిగా ప్రసక్తిని ప్రారంభించింది. "ఈ ఉళ్ళో కవిత్వం రాసే అమ్మాయి ఎవరయినా వున్నారా అని అమ్మాయిగారు తెల్సుకోవాలనుకుంటుంది."
ఆవులించకుండానే పేగులు లెక్కపెట్టెయగల సమర్ధుడైన రాయుడు మంగ మొహంలోకి చూశాడు చిద్విలాసంగా నవ్వుతూ, "నువ్వీ ప్రశ్న ఎందుకు అడిగినా కాని, నాకు తెలిసి మన ఉళ్ళో కవిత్వం రాసే అమ్మాయిలు లేరు. ఉన్నది రాఘవ అనే ఓ బ్యాంక్ ఆఫీసరు. మాణిక్యమ్మ మనవడు. ప్రస్తుతం అనకాపల్లిలో......."
అవసరానికి మించి వివరాలు అందించేశాడు. అని తను తెల్సుకోవాలనుకుంటున్న రాఘవ గురించే.
"థాంక్స్ బాబాయ్!" అంటూ మోడరన్ పనిమనిషిలా ముందుకు నడవబోతుంటే పిలిచాడు.
"సంగతేమిటి మంగా!"
"అబ్బే!" తొట్రుపడింది మంగ. "ఏం లేదు"
"ఏమి లేకపోతే అమ్మాయి గురించి అడిగిన దానివి అబ్బాయి గురించి చెప్పగానే అవసరం తీరినట్టు, అలా పారిపోతున్నవేం?"
"మ....మరేం....లేదు"
"ఏది వున్నా లేకపోయినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. రాఘవ యింకా పెళ్ళి కానివాడు కాబట్టి, ఎప్పుడూ ముందు కెళ్ళకు"
ఆశ్చర్యంగా అడిగింది ---"వెళితే ఏం చేస్తాడు?"
"అతనేం చేయడు.....కాని...." క్షణం ఆగి అన్నాడు "నీకే చేయాలనిపిస్తుంది."
"ఏమిటి?"
"మరీ దబ్బపండులా ఉంటాడెమో గబాలున మీద పడి ముద్దెట్టాలనిపిస్తుంది జాగ్రత్తా!"
మనిషి కూడా అంత బాగుంటాడని తెలిసిన మంగ ఇక ఆగలేదు, అఘమేఘాల పై లోగిలిలోకి పరుగెత్తింది.
రాయుడు చెప్పిన ప్రతి పదాన్ని పొల్లు పోకుండా మంగ వినిపించింది.
"అయితే ఎమిటట?" తన మొహంలో కూడని ఏ భావమైనా మంగ చదివేసే అవకాశముంటే ఆ విషయంలో జాగ్రత్త పాటిస్తూ అంది కిన్నెర. "అంత అందంగా ఉంటాడు కాబట్టి అతడిని కలుసుకోకూడదంటాడా? వీల్లేదు మంగా! అతడేలాంటి వాడన్నా, ఏమైనా కానీ బుద్దిచెప్పి గాని విడిచిపెట్టను అంతే!"
బుద్ది చెప్పడానికి ఏ మార్గాన్ని అనుసరించేది కిన్నెర చెపితే మంగ వినాలనుకుంది కానీ, చెప్పలేదామే. అదే మంగ కాస్త భయపడటానికి కారణమయింది. "అమ్మాయిగారు!"
"చెప్పు"
"మాణిక్యమ్మ నాకు తెలుసు."
"అయితే?"
"పిల్లలు పోయాక మనవడిని చదివించుకుంటూ ఇంతకాలము బతుకుతోందని విన్నాను కాని, ఈ రాఘవే ఆవిడ మనవడని ఇప్పుడే తెలిసింది."
"ఇంతకాలం రాఘవ గురించి నీకెందుకు తెలియదు?" అని అడగాలనుకుంది కాని, మంగ అప్పటికే జవాబు చెప్పడం ప్రారంభించింది.
"సామాన్యంగా నాకు ఈ ఉళ్ళో ప్రతి మగాడు కాకపోయినా చాలామంది గురించి తెలుసు. కాని మన కుటుంబానికి ప్రత్యర్ధులైన కొందర్ని చూడనట్టే, ఏదో ఉళ్ళో చదువుతున్న రాఘవ గురించి ఇంతదాకా నాకు తెలియలేదు. పైగా మీ దగ్గర పనికి కుదిరాక నేనూ మీ టైపు ఘోషాను సాగించడం మొదలు పెట్టాను. ఎందుకంటే మీ వంశ ప్రతిష్ట కాపాడటం నా ధర్మాల్లో ఒకటి కాబట్టి."
ఒక చిన్న ప్రశ్నకు ఇంత పెద్ద సైజు జవాబుకు మంగ అనర్గళంగా చెప్పడం అసలు నచ్చలేదు కిన్నేరకు. "ఇప్పుడు నన్నేం చేయమంటావు మంగా!"
"రాఘవ అనే వ్యక్తి మీ విషయంలో తప్పు చేసినా ఇంట్లో అందరికి తెలియకుండా మీరు మాత్రం మందలించి వదిలి పెట్టేయమంటున్నాను. ఎంతైనా మాణిక్యమ్మ మనవడనే జాలి మాత్రమే కాదు, పెద్దయ్యగారికి తెలిస్తే అతన్ని ప్రాణాలతో విడిచిపెట్టరు కాబట్టి."
మంగ అభ్యర్ధన నచ్చింది కిన్నేరకు. నచ్చింది అనేకన్నా ఈ తర్కంతో ఆమె అహం కాస్త చల్లబడింది అంటే బాగుంటుంది.
