Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 13


    
    ఉక్రోషం.....క్రోధం!


    ఎందుకో....ఎవరి మీదనో తెలిదు.


    ఏదో అడగాలని వచ్చిన మంగనైనా విరుచుకు పడింది.


    అసలు ఈ కవితలు ఆగిపోవటానికి మంగే కారణమని భావించి, మంగను చుట్టుపక్కలకు రావద్దని గదమాయించింది కూడా.


    ఇదంతా అమాయకత్వమని కాని, తనూ అందరమ్మాయిల్లాంటిదే అని కాని యింకా అంగికరించని అహంతో ప్రతిరోజూ లైబ్రరీకి వెళుతున్న కిన్నేరకు ఓ రోజు చాలా చిత్రమైన సంఘటన ఎదుర్కోవలసివచ్చింది.


    చాలా విశాలంగా వున్న లైబ్రరీలో రేక్స్ దగ్గర నిలబడి పుస్తకాలు చూస్తుంటే రేక్స్ ఆవలివేపు నుంచి వినిపిస్తుంది ఓ కవిత.


    "అందుకే ప్రియతమా నా ఆర్తిని అర్ధం చేసుకోమంటున్నది ! నీ మనసులోకి పదిలంగా నన్ను ఆహ్వానించి, ప్రతి క్షణాన్ని ప్రేమ సింహసనపు అధిరోహణంగా మర్చుకోమంటున్నది......"


    అంతే! ఒక్క ఉదుటున పరుగులాంటి నడకతో ఆ పక్కకు వెళ్లి చూసింది.


    నల్లగా, తుమ్మ మొద్దులా ఉన్న వ్యక్తి అదే కవితను ఆ రోజు తనను అంతగా కదిలించిన కవితను మరెవరికో వినిపిస్తున్నాడు.


    అతన్ని చూసి నిరాశ పడిపోయింది.


    "నమస్కారం అమ్మాయిగారు!" తుమ్మమొద్దు పైకి లేచింది చేతులు జోడిస్తూ. కిన్నెర ముఖ కవళికలల్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉండాల్సిన లైబ్రరీలో తను శబ్దం చేసినందుకే వీర్రాజుగారి ముద్దుల కూతురు కోపంగా వచ్చిందేమో అని కంగారుపడుతూ అన్నాడు - "ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయనమ్మా!"


    కిన్నెర అనుమానం మరింత ధ్రువపడింది.


    అంటే, ఇంతకాలం కవితలు పంపింది ఈ తుమ్మ మొద్దుగాడేనా?


    తను కన్న స్వప్నాలు పగిలి నేల రాలుతున్నట్టు ఆమె కళ్ళలో ఉక్రోషంగా నీళ్ళు ఉబుకుతున్నాయి. నిభాయించుకోలేకపోయింది. "అంటే ఆ కవిత....."


    "తప్పయిందమ్మగారూ!" మరింత తొట్రుపడిపోతున్నాడు. "ఇంకెప్పుడూ ఇలా చదవను."


    "నేనడుగుతున్నది చదవడం గురించి కాదు, ఎందుకు రాసేవ్......రాసిన వాడివి....."


    "బాప్ రే!" అర్దోక్తిగా అన్నాడు--" అంత గొప్ప కవిత నేను రాయడమేటమ్మగారూ!" అది ఈ వారపత్రికలోది."


    అబ్బురంగా చూసింది. అతడ్ని మాత్రమే కాదు, పత్రికలోని కవితను కుడా.


    అదే.....ఆరోజు తనకు రాసిందే పత్రికలో ప్రచురితమై ఉంది.


    'రాఘవ!"


    రాసిన వ్యక్తి పేరును చూస్తూ అర్ధంకాని సందిగ్ధంలో మిగిలిపోయింది చాలా సేపటిదాకా.


    ఎవరీ రాఘవ?


    తనకు పంపిన ఈ కవిత ఈ పత్రికలో ఎలా ప్రచురితమైంది?


    ప్రతిరోజూ తనకు కవితలు పంపుతున్నది ఈ రాఘవేనా? లేక యిలాంటి కవితల్ని కాపీ చేసి మరెవరైనా పంపుతున్నారా?


    ఇంటికి వెళ్ళాలనిపించలేదు. పత్రిక చిరునామా నోట్ చేసుకుంది.


    అనాకపల్లిలోని ఓ టెలిఫోన్ ఆఫీసు నుంచి ఓ అభిమానిలా హైదరాబాదు పత్రికాఫీసుకు ఫోన్ చేసి రాఘవ చిరునామా తెల్సుకుంది.

    అంతే! షాక్ తిన్నట్టుగా నిలబడిపోయింది.


    రాఘవ తను ఉండే తుంపాల పల్లెకు చెందినవాడే!


    ఒక ఆధారం దొరికింది. అది చాలు!

 

                                                                 *    *    *    *


    "మంగా!" కొన్ని రోజుల వ్యవధి తర్వాత కిన్నెర ఈరోజు ఇంచుమించు అదే స్థాయిలో కేకపెట్టి పిలిచింది మంగను.

 

    కాకపోతే యిది సాయంకాలం కాదు. మధ్యాహ్నం ఒంటిగంట కావస్తుంది.


    ఉద్విగ్నంగా గదిలోకి దూసుకొచ్చిన మంగ "ఎందమ్మా! నేనింత కాపలా కాసినా మళ్ళీ పుస్తకంలోకి కవితెలా వచ్చింది?"


    "నీ మొహం!"


    ఈ పద ప్రయోగం యింతకు పూర్వంలా కోపంతో వ్యక్తికరించబడలేదు. అణువంత మృదువుగా వినిపించింది.


    అది మంగ కళ్ళలో ఆశ్చర్యానికి కారణమైంది.


    తను బలహినురాలిలా ప్రవర్తించడం యిష్టం లేదనుకున్న కిన్నెర వెంటనే సర్దుకుంది. "నువ్వు సాధించలేనిది నేను సాధించగలిగాను మంగా! ఇంతకాలం ఈ కవితలు రాస్తున్నదెవరో తెల్సుకోగాలిగాను"


    క్షణంపాటు విస్తుపోయిన మంగ --" నిజమా అమ్మాయిగారు?" అంది సాలోచనగా.


    "అబ్బాయి కూడా బాగుంటాడా?" అని కూడా అడిగేసింది పొరపాటున.


    "పళ్ళు రాలగొడతాను"


    తన తప్పు తెల్సుకున్నట్టు "బాగుంటే మాత్రం మీ అనుమతి లేకుండా కవితలు రాసిన ఆ వ్యక్తినీ మీరెలా అంగికరించగలరు చిన్నమ్మాయిగారూ!" అంది మంగ.


    క్రోధం మంచుకొచ్చింది కిన్నేరకు.


    నా ఆలోచనలు దొరికిపోయేట్టు తను ప్రవర్తిస్తున్నానా! అనుకుంటూ మరింత కోపాన్ని అభినయించింది. "అనవసరమైన చర్చతో కాలయాపన చేయడం నాకిష్టంలేని పని మంగా! రాఘవ అనే వ్యక్తి ఎవరో తేల్చుకోవాలి. ఇంటి నెంబరు తెలిదు కాబట్టి మన ఉళ్ళో ఎంతమంది రాఘవలున్నారు? వాళ్ళలో కవిత్వం రాసే అలవాటు ఎవరికి వుంది అన్న విషయాన్ని రహస్యంగా నువ్వు సేకరించాలి. ఇక్కడ రహస్యం అని ఎందుకంటున్నాను అంటే మా కుటుంబ ప్రతిష్ట దృష్టిలో ఉంచుకోమని...."  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS