Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 14

 

    "ఆరో తారీఖు దాదాపుగా ఖాయం అయిందనుకో....అంతకంటే మంచి ముహూర్తం ఇంకా ఏమైనా వుంటుందేమో రెండునెలల తర్వాత అని నా ఆలోచన" అన్నాడు రామశేషు.

    "అ సంగతి పంతులుగార్ని అడిగి తెలుసుకుంటే సరిపోతుంది మనలో మనం తర్కించుకుంటే ఏం ప్రయోజనం" అన్నాడు బసవయ్య.

    "పెళ్ళి పనుల్లో నువ్వు కూడా సాయం చేయాలి. వారం రోజుల  ముందే అమ్మాయి, నువ్వు మా ఇంటికి వచ్చేయ్యాలి తెలిసిందా? అన్నాడు రామశేషు.

    "ఆ సంగతి నువ్వు వేరే చెప్పాలా బావా ! వారం ఎందుకు? పదిరోజుల ముందే వస్తాం సరేనా? నా పిచ్చిగానీ అంతమంది తమ్ముళ్ళు వుంటే, ఇంకా నాతో పనేముంటుంది?" అన్నాడు బసవయ్య.

    రామశేషు నిశ్శబ్దంగా నవ్వాడు.

                                                               8

    పెళ్ళి బట్టలు, ఇతర సామాగ్రి తీసుకుని సురేంద్రతో ఎడ్లబండిలో కస్తూరి, దాక్షాయణి, శివపార్వతి, జయంతి గిరిజాలు పట్నం వెళ్ళి అన్ని కొని తిరిగి వస్తున్నారు.

    దారిలో రైల్వే లైను వుండటంతో బండి ఆపి, సురేంద్ర దిగి పట్టాల దగ్గిర అటూ ఇటూ చూశాడు.

    సిగ్నల్ ఇచ్చి వుంది. అది గమనించి, తిరిగి బండి దగ్గరకు వచ్చి చెప్పాడు "ఏదో బండి వస్తుంది సిగ్నల్ ఇచ్చారని."

    "అయితే కాసేపు బండి దిగి, ఆ చెరువు గట్టుపైన కూర్చుందాం రైలుబండి వెళ్ళిపోయేవరకు" అంది జయంతి.

    "సరే దిగండి. చల్లగా, హాయిగా వుంది. కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు" అంది శివపార్వతి.

    అందరూ బండి దిగారు.

    చెరువులో నీళ్ళు పచ్చగా పాచిపట్టి ఉన్నాయి. చెరువునిండా కలువ పూలు తెల్లగా మెరుస్తున్నాయి.

    అవి చూసి జయంతి అంది "బావా! నీక్కాబొయె పెళ్ళాం కోసం రెండు కలువపూలు కోసి తీసుకురా. గిరిజక్క పదిలంగా తీసుకుంటుంది."

    "ఏయ్ వద్దు! నీళ్ళు పాకుడుపట్టి వున్నాయి. గట్టుకూడా బాలేదు జారిపడిపోవచ్చు" అంది కస్తూరి.

    "ఏంకాదులే అత్తయ్యా! తెస్తానుండండి...." అంటూ చెరువులోకి జాగ్రత్తగా దిగాడు. ఒడ్డున కూర్చుని, చెండ్రాకోలుతో రెండు పూలని గట్టిగా బిగించి లాగాడు. అవి దానికి చుట్టుకుని పైకి వచ్చాయి. వాటిని అపురూపంగా పట్టుకుని పైకి వచ్చి జయంతి కొకటి, గిరిజకు ఒకటి ఇచ్చాడు. గిరిజ సిగ్గుపడుతూ అందుకుంది.

    "అమ్మో! గిరిజక్కకు ఎంత సిగ్గో...కాస్త పెళ్ళయ్యేవరకు దాచుకోతల్లీ, సిగ్గంతా ఇప్పుడే ఒలకపోసుకోకు" అంది జయంతి.

    ఆ మాటలకూ అందరూ నవ్వారు.

    గిరిజ మాత్రం జయంతి తొడపైన గట్టిగా గిచ్చింది.

    "అబ్బా" అంటూ చేత్తో రాసుకుంది.

    "బావా జాగ్రత్త! గిరిజక్కకు తొడపాశం పెట్టటం అలవాటు, నువ్వేడైనా పొరపాటు చేశావనుకో, నీ పని ఖాళి, తొడపాశం పెట్టేస్తుంది" అంది జయంతి.

    సురేంద్ర జయంతి నెత్తిమీద మొట్టికాయ వేశాడు.

    "ఇది మరీ బాగుంది మీ వరస. మధ్యలో నేనేం చేశాను? అదేమో తొడపాశం, నువ్వేమో మొట్టికాయలు' అంది జయంతి.

    "మరి వాళ్ళ విషయం నీకెందుకే? వాళ్ళు వాళ్ళు గిచ్చుకుంటారు మొట్టికాయలు వేసుకుంటారు" అంది నవ్వుతూ శివపార్వతి.

    'అంతేలేమ్మా మొగుడూ పెళ్ళాలు అన్నాక ఆ మాత్రం సరసం లేకపోతే ఎలా? అంతేకదు చిన్నపిన్ని. మొగుడుకు కోపం వచ్చినా అనందం వచ్చినా పెళ్ళాం జడను పట్టుకుని కూడా లాగుతారు" అంది దాక్షాయణిని చూస్తూ.

    "ఏయ్ నిన్నూ" అంటూ దాక్షాయణి జయంతి వెంటపడింది.

    "అమ్మో చచ్చాను తల్లో" అంటూ రోడ్డుపైన పరుగుతీసింది దాక్షాయణి నవ్వుకుంటూ వచ్చి మళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుంది.

    జయంతి భయం నటిస్తూ మెల్లగా వచ్చి అక్కడికి చేరింది.

    "ఏంటి జయంతి జడ లగాడమేమిటి?" అడిగింది శివపార్వతి.

    "అబ్బో! అదో పెద్ద కధలే చిన్నపిన్ని. తరువాత చెపుతాలే" అంది జయంతి.

    "దాని అల్లరి మరీ ఎక్కువైపోయింది" అంది కస్తూరి కూతుర్ని మురిపంగా చూసుకుంటూ.

    "అందుకే అక్కా! జయంతికి కూడా గంతకు తగిన బొంతను చూసి ముక్కుకు తాడేస్తే సరిపోతుంది" అంది దాక్షాయణి.

    "నేనేం గంతనుకాను బొంతను నేతుక్కోవటానికి. నాకో రాజకుమారుడు పైనుంచి దిగివస్తాడు" అంది బింకంగా.

    "ఏమోతల్లి పైనుంచివస్తాడో, లేకపోతే ఆ వచ్చే రైలునుంచి దిగి వస్తాడో" అంది దాక్షాయణి.

    ఆమె మాటలకు అందరూ నవ్వారు.

    రైలు పెద్ద శబ్దం చేస్తూ వెళ్ళిపోయింది.

    జయంతి రైలు పెట్టేలన్నింటిని లెక్కపెట్టి "హయ్ మొత్తం పన్నెండు పెట్టెలు అంది" చిన్నపిల్లలా చప్పట్లు కొడుతూ.

    "సరేసర్లే! బండెక్కు పోదాం" అంది కస్తూరి కూతురి భుజం చరుస్తూ.

    అందరూ నవ్వుకుంటూ ఎడ్లబండి ఎక్కారు. సురేంద్ర ఎడ్లు కట్టిన తాడు పట్టుకుని వాటి ముందు నడుస్తూ నిదానంగా రైలుపట్టాలను దాటించాడు. పట్టాలు దాటిన వెంటనే బండి ఎక్కబోతుంటే.

"అగు బావా! సోడా తాగి వెళ్దాం. దాహం వేస్తుంది" అంది పక్కనే సోడా బండిని చూసి జయంతి.

    సురేంద్ర నవ్వుకుంటూ సోడాబండి కుర్రాడిని పిలిచాడు.

    వాడు పరుగులుతీస్తూ వచ్చి అందరికీ సోడాలు కొట్టిచ్చాడు. అందరూ సోడాలు తాగారు. సురేంద్ర వాడికి పైసలు ఇచ్చి, "ఏం తల్లీ ఇక పోదామా మళ్ళి ఇంకా ఏమైనా కోర్కెలు వున్నాయా?" అన్నాడు నవ్వుతూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS