"రేపు నీకేమన్నా అయితే.....!"
మృదువుగా నవ్వాడు ధన్వి . "రేపెప్పుడో చావు తప్పదని ఇప్పుడు బ్రతకడం మానేస్తామా?"
తల్లి కళ్ళని తుడుస్తూ అన్నాడు ధన్వి మరింత స్పష్టంగా. "ఈ ప్రపంచంలో మనం అడుగుపెట్టింది వెయ్యేళ్ళు బ్రతుకుతామని కాదు పోయేదాకా బ్రతకాలని....అలా బ్రతకలేకపోవడం, రోజు చావడం లాంటిది.....నేను మొండిగా మాట్లాడతున్నాననుకోకు.....ఈ నేలమీద పుట్టిన ప్రతి మనిషి తప్పించుకోలేనిది మరణం ఒక్కటేనమ్మా. చావుకు ఎవరు అతీతులు కారు....అలాంటప్పుడు చావుదాకా బ్రతికే మనిషి మనిషిలా స్పందిస్తూ బ్రతకాలి గాని, గాలి ఇందనంతో నడిచే శవంలా శరీరాన్ని మోస్తూ వుండాలా? నావల్ల కాదమ్మా.....రేపు ఏదో చేస్తారని ఈరోజు చైతన్యాన్ని చంపుకోవడం ఆత్మహత్యకన్నా నేరం ఘోరం."
ఆమెకి ధన్వి చెప్పింది పూర్తిగా అర్ధం కాలేదు. అయినా, చావు బ్రతుకులు అన్న పదాలు వినటానికి భయంగా వుంది, అది ఆ వయసులో వున్న కొడుకు అలా మాటాడ్డం బాధగానూ అనిపించింది....తండ్రి దగ్గరగా నడిచాడు ధన్వి....
"నాన్నగారూ.....నేను వేదాంతం మాటాడ్డంలేదు. మాటాడగల పరిజ్ఞానం కూడా నాకు లేదు. నేను నమ్మింది చేసే మనిషిని మాత్రమే అంటున్నాను....అందరిలో ఒకడిగా నేను ఆలోచించక పోవడం మీకు భాధ కలిగించే విషయం అయితే నన్ను క్షమించండి....నా సమస్య ఏదైనా నాతోనే సమసిపోయేట్టు చూస్తాను తప్ప మీదకా రానివ్వను....."
ధన్వి ఆ తర్వాత అక్కడ నిలబడలేదు.....
గదిలోకి వెళ్ళి రాసిన అప్లికేషన్స్ ని ఎన్ వలప్స్ నీ తీసుకుని బయటికి నడిచాడు నిశ్శబ్దంగా.
నీలకంఠం నిట్టుర్చలేదు......నేలచూపులు చూస్తూ వుండిపోయాడు. ఇప్పటి నాగరికత సమాజంలో, యిలా ఆలోచించగలవాడు తన కోడుకై నందుకు గర్వపడగల స్థాయికి చెందిన మనిషికాదతడు.
నిన్న రాత్రి మీ కాళ్ళు పట్టింది మీ అబ్బాయే అని పొద్దుట భార చెప్పగానే పులకించిపోయి 'వాడు నా కొడుకే' అని గర్వపడి అప్పటికి ఆనందించే సగటు మనిషి.....ఈ పోటీ ప్రపంచంలో బ్రతకటానికి అవసరమైన తెలివివుండి కూడా తను నమ్మిన ఆలోచనల పునాదుల మీద భవంతిని కాక ఒక గోరిని కట్టుకుంటున్నాడు కొడుకు విషయంలో అందోళనపడే మధ్యతరగతి తండ్రి.
కాళ్ళ దగ్గర కూర్చున్న భార్య కంటి నుంచి రాలుతున్న నీటి ధారని ఆపే ప్రయత్నం చేయలేదు నీలకంఠం.
"నా కొడుకు నా చుట్టూ వున్నప్రపంచంలో చాలా మంది కన్నా ఉన్నతుడని నాకు తెలుసు సావిత్రి. వాడు ఓ విలక్షణమైన వ్యక్తీ అనటానికి నేను వెనకాడను. వాడిముందు కాకపోయినా వెనుక గర్వపడతాను. కానీ అది బ్రతికించే ఆదర్శాలు కావు. అదే నా భయం. అందుకే నేను బ్రతికుండగానే వాడి జీవితం ఓ కొలిక్కి రావాలని ఆరాటపడుతూ అరుస్తుంటాను.....నిజానికి నైతిక విలువల గురించి, జీవితం గురించి వాడు చెప్పే నిర్వచనాలు విని ఏ తండ్రయిన గర్వపడాలి సావిత్రి. కానీ మనం వున్న సమాజం....."సాయంసంధ్య వెలుగు క్రమంగా క్షిణిస్తుంటే అదోలాంటి భయం చుట్టుముట్టిన నీలకంఠం బడలికగా కళ్ళు మూసుకున్నాడు.
విలువల గురించి మాట్లాడటానికి అవి పాటిస్తే జరిగే అనర్దాలకి మధ్య వున్న సన్నని సరళ రేఖ గురించి తెలీని పిల్ల తల్లిలా బిక్క మొహం వేసుకుని చూస్తుంది సావిత్రి భర్త వేపు.
"హల్లో" ఇంట్లో అడుగు పెడుతూ పలకరించాడు ధన్వి.....
అప్పటి దాకా కిటికీ దగ్గర నిలబడి బయట చీకటి వెలుగుల్ని పరిశీలిస్తున్నా సామ్రాజ్యం వెనక్కి తిరిగింది.
నిన్నేప్పుడో కబురు పెట్టిస్తే ఇప్పుడోచ్చాడు ధన్వి.
అలా కబురు పెట్టింది సావిత్రి ద్వారా"ధన్వి చేసిన గొడవ గురించి తెలిసాకే......
తెలిసాక సామ్రాజ్యం వూరుకోలేదు. నర్సింగ్ యాదవ్ మనుషుల గురించి బాగా తెలిసిన వ్యక్తీ సామ్రాజ్యం.....ధన్వి గురించి ఎంత భయపడింది అంటే నేర ప్రపంచంలో బ్రతకడం వృత్తిగా మార్చుకున్న ఆ వ్యక్తులు దేనికి వెనకాడరని తనకు తెలిసిన ఓ కొలీగ్ ని నర్సింగ్ యాదవ్ దగ్గరికి పంపించింది.
మరో రోజు ఆలస్యమయితే ధన్విని వాళ్ళు విడిచిపెట్టె వారు కాదు. మొత్తానికి ధన్విని అటాక్ చేయాలనుకున్న వాళ్ళ ప్రయత్నాన్ని చాలా శ్రమతో అపగలిగింది.
అలా చేసింది ధన్వి మీద ఆమెకున్న అపారమైన యిష్టం అనుకోవటానికి అభ్యంతరం లేదు. కానీ, యిలా ప్రవర్తించడమే ధన్వి జీవితవిధానం అయితే, చాలా త్వరలో తన ఉనికిని కోల్పోయే ప్రమాదాల్లో చిక్కుకుంటాడు.....
"చిన్న కబురు పెట్టిస్తే యిప్పటికి తీరికయిందన్న మాట" మోహంలో భావాలు కనిపించకుండా పెదవులపైన నవ్వు పులుముకుని "ఏమిటంత బిజీగా వున్నవా" అంది అతడికి అభిముఖంగా సోఫాలో కూచుంటు....
"బిజీ అని కాదు."
"భయమా?" మరో పశ్న సంధించింది....
"దేనికి?"
సాధ్యమైనంత త్వరగా అతడ్ని మరేది ఆలోచించలేని బిజీ ప్రపంచంలోకి నెట్టాలి.....ఉద్యోగంలాంటి వ్యాపకం వుంటే పిచ్చి సాంఘికస్పృహ లాంటి ఆలోచనలకి ధన్వి ఆటోమేటిక్ గా దూరమైపోతాడు.....అతడ్ని గెలుచుకోవడంకన్నా అతడిలో అలాంటి మార్పుని సాధించడమే ఆమె కోరుకునే నిజమైన గెలుపు.
"నువ్వు జవాబు చెప్పలేదు"
"ఏమిటి?" సాలోచనగా అంది.
