Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 14


    
    ఆ ఇద్దరూ ఇక ఆలోచించలేదు. ఒకరి తర్వాత మరొకరు బావిలోకి దూకారు.
    
    పైన వుండడానికి బుద్ధవక ఆమె కూడా మెట్లు దిగి, చివరి మెట్టుపై నిలిచింది.
    
    ముందు దూకిన వీరస్వామి ఉత్తిగానే బయటికొచ్చాడు.
    
    "మనిషి కనిపించాడు గానీ చేతికి దొరకలేదు. గుక్క పట్టలేక వచ్చేశాను" అని చెప్పాడు.
    
    సర్రున ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    
    ఛీ! తనకి బుద్దిలేదు. అతని ఆవేశం తెలిసీ తను దూకమంది. ఈత వచ్చి వుంటుందనే తను అనుకుంది కానీ వెధవ బట్టలకోసం ఓ జీవిని బలి తీసుకోవడం దారుణం ఇప్పుడెలా?
    
    ఆమె చేతులు నలుపుకుంటోంది తప్ప ఏమీ తోచడం లేదు.
    
    తన కనుగుడ్లను తీసి బావిలోకి విసిరేసినట్టుగా తలంతా వంచి లోపలికి చూస్తోంది.
    
    మరో నిముషానికి కాబోలు ఓ ఆకారం నీటిలో నీలంగా కదులుతోంది. ఆమె తన కళ్ళను మరింత సాగదీసింది.
    
    ఆ ఆకారాన్ని పట్టుకుని మరో ఆకారం కూడా లీలగా కదిలింది. గుండె ఒక్కసారిగా విప్పారినట్టు ఆమెలో సంతోషం, ఆనందం లోపల ఇమడలేక కళ్ళల్లోంచి తన్నుకొస్తోంది.
    
    మరోక్షణంలో ఆ రెండు ఆకారాలూ బయటపడ్డాయి. ఊపిరి తీసుకోవడం కష్టమైపోయిందని జీతూని చూస్తూనే తెలుస్తోంది. అతను మెట్టుమీద పడిపోయి వూపిరిని గుండెల నిండా తీసుకుంటున్నాడు-
    
    అయినా తన ప్రాణాన్ని  కూడా చూసుకోకుండా దూకిన అతను అంత సులభంగా చేతికి చిక్కిన బకెట్ ని వదిలేస్తాడా?
    
    "ఏం మనిషివయ్యా బాబూ చేయి అందివ్వ మంటే అందివ్వడే ఎంతసేపూ ఆ బకెట్ నే పట్టుకుంటాడు" అతన్ని బయటికి లాగిన నారాయణ ఫిర్యాదు చేస్తున్నట్టు అన్నాడు.
    
    ఆమె వీటికి ఏమీ రెస్పాండ్ కావడం లేదు. జితేంద్రను ఆరా చూస్తూ వుండిపోయింది. అతన్ని దగ్గరగా లాక్కుని ఒడిలో పడుకోబెట్టుకోవాలన్న కోరికను అతి కష్టం మీద అణుచుకుంది.
    
    వీరాస్వామి, నారాయణ వెళ్ళిపోయారు.
    
    వాళ్ళు వెళ్ళిపోయినప్పటికి లిఖిత అతనితో ఏమీ మాట్లాడలేక పోతోంది.
    
    "ఇదిగోండి మీ బకెట్ బట్టలన్నీ కూడా వున్నట్టే" అతను కింద మెట్టుమీద పెట్టిన బకెట్ ను లాగి ఆమె చేతికి అందించాడు.
    
    "అయినా నేను దూకు అంటే దూకెయ్యడమేనా? ఈత రాదు అని చెప్పచ్చుకదా" నిష్టూరంగా అంది.
    
    "నాకు చావంటే భయమేమీ లేదు. అయితే చనిపోతే చదివినదంతా మరిచిపోతాను కదా అన్న దిగులు మాత్రం వుంది. అని రావిశాస్త్రి చెప్పినట్టు నేను మరణించాక మిమ్మల్ని చూడలేను అన్న దిగులు బావి అట్టడుక్కి చేరినప్పుడు అనిపించింది"
    
    ఇంతకు ముందున్న ఆందోళన ఇప్పుడు లేదు ఆమెలో పైపెచ్చు ఇదంతా థ్రిల్లింగ్ గా వుంది. సాధారణంగా టీనేజ్ లో ఇలాంటివి అనుభవించాలి. కానీ ఆమెకు అలాంటి అనుభవం లేదు. చదువుకునే రోజు నుంచి ఇప్పటివరకు ఆమె బుద్దిమంతురాలు. అబ్బాయిలను నిద్రపోనివ్వని అందం ఆమెదైనా ఎవరినీ దగ్గరికి చేర్చలేదు. అది భయమో, నైతిక విలువల పట్ల భక్తో తెలియదు. అలాంటిది ఈ కుర్రాడొచ్చి ఆమెను తుఫాను లాంటి తన ఆవేశంతో చుట్టుముట్టేస్తున్నాడు. అందుకే, ఆమెకు వూపిరాడడం లేదు.
    
    "మహా సంతోషించాం కానీ, నువ్వు అలా ఫ్రీగా మెట్టుమీద కూర్చో నేను ఇక్కడ కూర్చుంటాను" అని తను లేచి పైనున్న మెట్టు మీద కూర్చుంది.
    
    "ఈ చెట్ల నీడ ఎంత బావుందో మనిద్దరికీ ఎండ తగలకుండా ఎవరో చెట్ల గొడుగును పడుతున్నట్లుంది" అన్నాడు అతను తల పైకెత్తి ఇప్పుడతను తేరుకున్నాడు. వూపిరాడని ఫీలింగ్.
    
    "నువ్వు ఊహించనట్టే జరిగింది నీ నగల దుకాణం కాస్త ఎంబ్రాయిడరీ షాప్ గా రూపాంతరం చెందింది" అంది.
    
    "అంటే?" అతనికి సరిగా అర్ధం కాలేదు.
    
    "నీ దుకాణాన్ని నీ అసిస్టెంట్లు లూటీ చేసేశారు. మొత్తం హుష్ కాకీ అయిపోయింది. అయినా నీ వెర్రిగానీ ఓ వివాహిత స్త్రీ కోసం అలా వచ్చెయ్యడమేనా, ఇప్పుడైనా తెలిసిందా ఎంత తప్పు చేశావో?"
    
    "నాకు బాధేమీ లేదు. మిమ్మల్ని అరక్షణం చూడడానికి అరలక్ష పోగొట్టుకోవడానికైనా సిద్దమే అన్నిటికీ ప్రిపేర్ అయి వచ్చినవాడ్ని"
    
    "ఎనిమిది లక్షల రూపాయలు పోయాయన్న బాధేం లేదా?"
    
    "లేదు" అతను స్పష్టంగా చెప్పాడు.
    
    "ఎందుకని?"
    
    "డబ్బు విలువ తెలిసినవాడ్ని కనుక..."
    
    ఆ సమాధానం ఆమెకి చిత్రంగా అనిపించింది.
    
    "ఆ డబ్బును తిరిగి సంపాదించాలంటే ఎంత కష్టపడాలో తెలుసా?"
    
    "కష్టపడే ఆ డబ్బు సంపాదించాను"
    
    "సరేలే ఏదో భూమి కొని అలా పెరిగిపోయావ్ కానీ అదే ఇలాంటి పల్లెటూర్లో అయితే సొమ్ము సంపాదించడానికి నీ జీవిత కాలం సరిపోదు"
    
    "అలా అనకండి నాకు నచ్చిన సుభాషితం మీకు తెలుసుగా- ఎఫర్ట్స్ నెవర్ ఫెయల్. ఇక్కడైనా అనుకుంటే అంత డబ్బూ సంపాదించగలను"
    
    "అలా కోతలు కోయకు. ఇక్కడ ఒక్క రూపాయి మిగల్చాలంటే ఎంత కష్టమో ఏ రైతునడిగినా చెబుతాడు"
    
    "నిజమే - నేను దాన్ని కాదనను కానీ లక్ష్యం బలంగా వున్నప్పుడు ఆ మనిషి ఎక్కడ వున్నా దాన్ని సాధించగలడు"
    
    "అయితే ఇక్కడా అంత డబ్బు సంపాదించగలనా?"
    
    "మిమ్మల్ని చూశాక నాకు అలాంటి తిక్కతిక్క వ్యామోహాలు పోయాయ్. మీకోసం సంపాదిస్తాను"
    
    "అయితే పది రోజులకో లక్ష రూపాయలు సంపాదించగలవా? అదీ న్యాయంగా"

    "అలాగే" ఒప్పుకున్నాడతను ధీమాగా.
    
    "అయితే ఓ షరతు నువ్వు నాథ డబ్బు సంపాదించలేక పోయావో- నువ్వు ఈ ఊరొదిలి తిరిగి టౌన్ కి వెళ్ళిపోవాలి. నా వెంట పడకూడదు"
    
    "ఇది పందెం అన్న మాట మరి నేను గెలిస్తేనో"
    
    "నీ ఇష్టం నువ్వు ఏం కోరితే అది చేస్తాను"
    
    "అయితే ఓకే."
    
    అతను ఇక ఏమీ పనిలేదన్నట్టు లేచి వెళ్ళిపోయాడు.
    
    బహుశా ఇదే చివరిసారేమో ఇతన్ని చూడడం అనుకుంది ఆమె మనసులో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS