Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 14


    "హలో వంశీ! హౌ ఆర్ యు? కొత్త పెళ్ళికొడుకుని ఎలా వున్నావని అడగడమే తప్పనుకో. కొత్త దంపతులకి జీవితం మూడు బెడ్ రూమ్ లు, ఆరు బాత్రూమ్ లుగా వుంటుందనుకుంటా"
    
    "నువ్వు చెప్పింది కరక్టే. కాని నాకో చిన్న ప్రాబ్లమ్ వచ్చి పడింది. ముహూర్తం కుదరక ఫస్ట్ నైట్ నెలరోజులు వాయిదా పడింది. ఇక డిటైల్స్ అడక్కు, ప్రస్తుతం నువ్వు నాకో చిన్న సహాయం చేయాలి"
    
    "ఏమిటో చెప్పు"
    
    "వెరీ సింపుల్ ఏడుమంది ఓ ఆరుగంటలపాటు గాఢ నిద్రలోకి జారిపోయే మత్తుమందు కావాలి"
    
    "యుమీన్ స్లీపింగ్ పిల్స్"
    
    "యా! లడ్డూలలో పెట్టి ఇచ్చే వీలుండే మందు ఇవ్వు. ప్రాణహానిగానీ, మరే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ గానీ వుండకూడదు"
    
    "డీటైల్స్ అడగవద్దన్నాఉ గనుక - అడగకుండా ఇచ్చేస్తాను..." అని ఆ మిత్రుడు షాపులోనికి వెళ్ళాడు.
    
    మరో అయిదు నిముషాల్లో బయటికి వచ్చి, వంశీ చేతిలో ఏడు చిన్న ప్యాకెట్లను వుంచాడు.
    
    "ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క లడ్డూలో మిక్స్ చేసేసెయ్. ఇది తిన్నవాళ్ళు ఆరేడు గంటలపాటు ఏనుగులు వచ్చి తొక్కినా లేవరు"
    
    "ఓ థాంక్యూ" అని. ఆ తరువాత సెలవు పుచ్చుకుని ఓ మిఠాయి దుకాణానికి వెళ్ళాడు.
    
    ఆ కొట్టు యజమాని మార్వాడీ. రాజస్థాన్ నుంచి వచ్చి అక్కడ సెటిలయ్యాడు. అతనితో బాగానే పరిచయం వుంది వంశీకి. ఏడు పొట్లాలను అతని చేతిలో వుంచి, ఒక్కో పొట్లాన్ని ఒక్కో లడ్డూలో వేసి తయారుచేసివ్వమని హిందీలో చెప్పాడు.
    
    రెండు మూడు యక్ష ప్రశ్నలు వేశాక మార్వాడీ లోనికి వెళ్ళి, మత్తుమందు బూందీలో కలిపి ఏడు లడ్డూలు తయారు చేసుకుని వచ్చాడు. అతనికి బిల్లు ఇచ్చేసి ఊరికి బయల్దేరాడు వంశీ.
    
    ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం రెండయ్యింది. భోజనం ముగించుకుని అలా పడుకుండిపోయాడు.
    
    సాయంకాలం ఆరుగంటల ప్రాంతాన మెలకువ వచ్చింది. స్నానం చేసి శోభనం పెళ్ళికొడుకులా తయారయ్యాడు. తెల్లటి పైజామా జుబ్బా వేసుకుని ఫారిన్ సెంట్ ని ఒళ్ళంతా స్ప్రే చేసుకున్నాడు.    

    రాత్రికి ఫస్ట్ నైట్ జరిగిపోతుందని నమ్మకంగా అనిపించడం వల్ల ఏదో తెలియని హుషారు ఒక దగ్గర నిలవనివ్వడం లేదు అలా పొలాల వెంబడి తిరిగాడు.    

    రాత్రి ఎనిమిది గంటల ప్రాంతాన తిరిగి ఇంటికి వచ్చి, లడ్డూలను తీసుకుని సత్యనారాయణరావుగారి ఇంటికెళ్ళాడు. వరండాలో మామ ఎదురుపడ్డాడు.
    
    అల్లుడు ఎక్కడ ఇంట్లోకి దూసుకొచ్చేసి, శాస్త్రాన్ని మంట గలిగేస్తాడోనన్న కంగారు కళ్ళలో కదలాడుతుండగా - "ఏం వంశీ! ఇలా వచ్చావ్?" అని దొంగను నిలబెట్టి ప్రశ్నించినట్లు అనుమానంగా అడిగాడు.
    
    "ఇవాళ మా అమ్మ పుట్టినరోజండీ! ఇదిగో ఈ లడ్డూలను ఇచ్చి రమ్మంటే వచ్చాను" అని ప్యాకెట్టును ముందుకు తోసాడు.
    
    ఆ సరికే వంశీ వచ్చాడని ఇల్లంతా పాకిపోయింది. సుజన హాల్లో నిలబడిపోగా, ఆమె సోదరీమణులూ, తల్లీ మాత్రం వరండాలోకి వచ్చారు.
    
    "అలానా" అని ఆమె ముఖమంత వెలిగిపోయేట్టు నవ్వింది.
    
    "సరే నువ్విక పద నాయనా" అన్నాడు వంశీవైపు తిరిగి.
    
    "వస్తానండీ" అందరివైపు చూస్తూ అని అక్కడి నుంచి బయటపడ్డాడు వంశీ.
    
    అతను గేటు దాటాడో లేదో సుజన పెద్దక్కయ్య ఉమ తల్లిలోంచి ప్యాకెట్టును తీసుకుని స్వీట్స్ ఏమిటోనని చూసింది.
    
    "ఇదేమిటి? లెక్క పెట్టినట్లు ఏడంటే ఏడే స్వీట్స్ పంపింది. మనిషికి ఒకటికంటే ఎక్కువ తింటే అజీర్తి చేస్తుందనా?" అంది సుజన వైపు తిరిగి వెటకారంగా.
    
    తమను బోల్తా కొట్టించడానికి వంశీ ఈ ఎత్తు వేసాడని వాళ్ళు ఊహించలేక పోయారు. విషయం తెలిసిన సుజన మాత్రం వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుని పైకి మాత్రం గంభీరంగా ముఖం పెట్టింది.
    
    "అలా మాట్లాడకే" అన్నపూర్ణమ్మ తిరిగి ప్యాకెట్టు అందుకుని తలా ఒకటి ఇచ్చి, సుజన బామ్మకు యివ్వడానికి డాబా మీదకు వెళ్ళింది.
    
    సుజన తన లడ్డూను తింటున్నట్టు నడిస్తూ దొడ్లోకి వెళ్ళి, ఎవరూ తనను చూడడం లేదని నిర్ధారించుకున్నాక, దాన్ని బలం కొద్దీ పొదల్లోకి విసిరింది.
    
    కొంతసేపు అక్కడే వుండి ఇంట్లోకి వచ్చింది. అందరూ లడ్డూ తింటూ కనిపించారు. మరి కాసేపట్లో వాళ్ళకంతా ఏదో అవుతుందని అనుకుందిగానీ, అదేమిటో మాత్రం అంతుబట్టడం లేదు.
    
    అప్పటికి భోజనాలు అయిపోవడంతో అందరూ పడుకోవడానికి సన్నద్దులవుతున్నారు.
    
    సుజన మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ డాబా మీదకు చేరుకుంది. బామ్మ గదివైపు చూసింది.
    
    ఆమె అప్పటికే గురకపెడుతోంది.
    
    తన రూమ్ లోకెళ్ళి పడుకుంది. శరీరమంతా కోరికతో నిండి పోయినట్టు బరువుగా తోస్తోంది. అంతకాలం బుద్దిగా వున్న జాకెట్టు ఇప్పుడు బంధనాలు తెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు అన్పిస్తోంది. అప్పటివరకు తనను చుట్టుకున్న చీర తాత్కాలిక వియోగానికి సిద్దపడుతున్నట్లుంది. కాళ్ళకున్న వెండి గజ్జెలు చిరుశబ్దాలు చేస్తూ వంశీకి ఆహ్వానం పలుకుతున్నట్లు భ్రమ కలుగుతోంది.
    
    అటూ ఇటూ దొర్లింది గానీ శరీరం తన మాట వినడం లేదు. బుద్దిగా పడుకోవడానికి సహకరించడం వేడి సెగలా రేగుతున్నట్లుంది. తల్లోని మల్లెపూలు కసికొద్దీ సువాసనలు పెంచుతున్నట్లు ఆ గదంతా పన్నీటి మధ్యనున్న దీవిలా వుంది.
    
    దొడ్డి తలుపు తీసి వుంచమని వంశీ చెప్పడం గుర్తొచ్చి తిరిగి కిందకు దిగింది. హాల్లో ముగ్గురు అక్కయ్యలు, సంక్రాంతి దినాన ముంగిట తీర్చిదిద్దిన రంగు రంగుల ముగ్గులను పాదాచారులు చెరిపేసినట్లు అడ్డదిడ్డంగా పడి నిద్రపోతున్నారు.
    
    దొడ్డి తలుపును శబ్దం కాకుండా తెరిచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి తన గదిలో దూరింది.
    
    మంచం మీద పడుకోవడం తరువాయి రంగు రంగుల కలలు కళ్ళమీద వలలా వాలిపోయాయి.
    
    వంశీ పరిస్థితి కూడా ఇందుకు డిటోలానే వుంది. ఇంట్లో ఏదో తిన్నాననిపించి బయటపడ్డాడు. పదిగంటలు ఎప్పుడౌతుందా అని ఆతృతపడిపోతూ రచ్చమీద కూర్చున్నాడు.
    
    పైన చందమామ దేదీప్యమానంగా వెలుగుతుంది. చల్లటిగాలి శరీరాన్ని చుట్టుకుంటోంది. పల్లె మొత్తం నిద్రలోకి జారుకోవడానికి ఆయత్తమవుతోంది.
    
    తను వెళ్ళగానే సుజన ఎలా ఫీలవుతుందోనని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు అతను. వెళ్ళగానే కౌగలించుకుంటుందా? భలే ప్లాన్ వేసావె అని ముద్దు పెట్టుకుంటుందా? రమ్మని కళ్ళతోనే పిలిచి కూర్చోడానికి మంచాన్ని చూపిస్తుందా ఏం చేస్తుంది? ఫస్ట్ నైట్ న తామిద్దరి మధ్యా దొర్లే మొదటి మాట ఏమై వుంటుంది?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS