"క్షమించండి. ఆవేశంలో ఏదో అన్నాను. అసలు జరిగిన దేమిటి?"
"ఒక అర్ధరాత్రి ఆ దొంగ మా ఇంట్లో ప్రవేశించి నా కొడుకును చంపి, తాళాలు సంగ్రహించి దొంగతనం చేయబోయాడు. అడ్డొచ్చిన నలుగురు గార్డులనీ చంపాడు. రెండో జత తాళాలు దొరక్క అతడి ప్రయత్నం ఫలించలేదు."
అలక్ నంద రెండో ప్రదక్షిణ పూర్తిచేసింది.
"ప్రభుత్వం తిరిగి నలుగురు గార్డులనీ నియమించింది. కానీ పోయిన నా కొడుకు తిరిగి రాడు బాబూ. రాక్షసుడయిన ఆ రామస్వామి ఇంతమందిని చంపి ఏం బావుకున్నాడు?"
రాణా పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
"దేవుడి నగలు దొంగతనం చెయ్యాలనుకున్నవాళ్ళు సర్వనాశనం అయిపోతారు. వాళ్ళ జీవితాలే కాదు, కుటుంబం మొత్తం మట్టికొట్టుకు పోతుంది. నామ రూపాల్లేకుండా పోతుంది."
అలక్ నంద మూడో ప్రదక్షిణ ముగించుకుని వచ్చి "వెళ్దామాండీ" అంది.
"పద" అని పూజారికి చెప్పి బయలుదేరారు.
"ఎందుకు మీరలా వున్నారు?" అని అడిగింది.
"ఏం లేదు బాగానే వున్నానే."
"ఏమో, మీరు నవ్వుతేనే బావుంటారు."
అతడు తిరిగి మామూలు మూడ్ లోకి వచ్చాడు. నవ్వి "కాంప్లిమెంట్ కి థాంక్స్" అన్నాడు. ఇంకా నాలుగు మెట్లున్నాయి దిగటానికి అప్పుడతని కాలు జారింది. ఎక్సర్ సైజులు చేసి కండీషన్ లో వుంచుకున్న శరీరం కాబట్టి పెద్దగా బెదర్లేదు అతడు. ఆమె మాత్రం కంగారుపడింది.
"ఏమైందండీ?"
"ఏం లేదు కాలు జారిందంతే?"
"ఇప్పుడే వస్తాను" అని ఆమె పైకి పరుగెత్తుకు వెళ్ళింది. అయిదు క్షణాల తరువాత వచ్చింది.
"ఏం చేసి వచ్చావు?"
"గుళ్ళో అలాటి మాటలు మాట్లాడినందుకు దేవుడికి కోపం వచ్చిందేమో అని గంట కొట్టి వచ్చాను."
అతడు అప్రతిభుడై ఆమె వైపు చూశాడు. ఆమె నుదురు నల్లగా కమిలి వుంది.
అది మూర్ఖత్వమే అయి వుండవచ్చు. కానీ ఏ లాజిక్కూ, ఏ అనాలిసిస్పూ ఇవ్వని తృప్తి....
మనసు నిండా మందాకినిలా.
దక్షిణం వైపునించి వీచే గాలి కోనేరుని పరామర్శించి
గర్భగుడిలో గంటను స్పృశించి
హారతి పళ్ళెం మీదనుంచి ఆశీర్వాదాన్ని తెచ్చినట్టుగా.
అతడు ఆప్యాయంగా ఆమె చెయ్యి పట్టుకుని "ఇంటికి వెళ్దాం పద" అన్నాడు.
* * *
ఆ మరుసటిరోజు అతడు కర్రాని పిల్చి "నాకా దేవలాయం గార్డుల మర్డర్ ఫైలు కావాలి" అని అడిగాడు.
"అదెప్పుడో మూసేసాం కద్సార్."
"మూసేసిన ఫైలే కావాలనేది" కటువుగా అన్నాడు. పది నిముషాల్లో ఫైలు అతని బల్లమీద కొచ్చింది.
అతను చదవటం ప్రారంభించాడు.
చాలా దారుణంగా జరిగాయి మర్డర్లు. నలుగురు గార్డులు, పూజారి కొడుకు మొత్తం అయిదుగుర్నీ నిర్ధాక్షిణ్యంగా చంపేరు. అతడు క్షుణ్ణంగా ఫైలు చదివాడు. సుధాకర్ అతడివైపే చూస్తున్నాడు.
"ఊఁ" బలంగా విశ్వసించాడు రాణా. "అయిదుగుర్నీ రామస్వామి ఒక్కడే చంపేసేడా?"
"అవును సర్."
"నువ్వు సర్వీస్ లో చేరి ఎన్నాళ్ళయింది సుధాకర్?"
"పదిహేను సంవత్సరాలైంది."
"నేను చేరి పదిహేను నెలలైంది. కానీ తార్కికంగా ఆలోచించటానికి ఇన్ స్పెక్టర్ ఉద్యోగమే అవసరం లేదను కుంటాను సుధాకర్."
"మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్ధంకావటంలేదు."
"యాభై ఏళ్ల రామస్వామి అయిదుగురు వ్యక్తుల్ని, అందులో నలుగురు గార్డుల్ని చంపేడంటే నమ్మేవా సుధాకర్?"
"చంపినట్టు వాడే వప్పుకున్నాడు సర్".
"వప్పుకున్నాడా - వప్పించావా?"
కర్రా మొహం వాడిపోయింది. చాలాసేపు మౌనంగా వుండి "పైనుంచి ఇన్ స్ట్రక్షన్స్ సర్" అన్నాడు గొణుగుతున్నట్టు రాణా అతడి దగ్గరగా వెళ్ళి భుజంమీద చెయ్యివేసి "ఎవరి ఇన్ స్ట్రక్షన్స్ సుధాకర్" అన్నాడు నెమ్మదిగా.
"ఎమ్మల్యే నాయుడు, అరవింద్ చౌరసియా...."
రాణా వెళ్ళి తన సీట్లో కూర్చుని సిగరెట్ వెలిగించి, తిరిగి ఫైలు తెరిచాడు. ఒక పేరాగ్రాఫు దగ్గర అతడి దృష్టి ఆగిపోయింది. మళ్ళీ చదివాడు.
"ఈ సంఘటనకి సాక్షి - ఎన్.టి. కంటి...... ఎవరీ ఎన్.టి. కంటి?"
"ఆ అమ్మాయి ఈ వూరి ఎం.పి. పులిరాజు కూతురు సర్".
"పులిరాజు కూతురి పేరు 'కంటి'.... చాలా గమ్మత్తుగా వుందే."
"అసలు పేరు నెమలికంటి త్రిపుర. చిన్నది చేసి, యన్.టి. కంటి అని పెట్టుకుంది. చాలా ఫాస్ట్ గర్ల్ సర్".
"నెమలి కంటి త్రిపుర.... ఎక్కడో విన్నట్టుంది ఈ పేరు" సాలోచనగా అన్నాడు రాణా. * * *
ఎన్టీ కన్టి!
అయిదడుగుల మూడు అంగుళాలు ఎత్తు, బాబ్డ్ హెయిర్, జీన్స్ ఫాంటు "స్వర్గం ఇక్కడే వుంది" అని వ్రాసి వున్న బనీను.
మూర్తీభవించిన చైతన్యపు ముద్దలా వున్న ఆ అమ్మాయి గంటకి నూరు కిలోమీటర్ల వేగంతో కారు డ్రైవ్ చేస్తూంది. రోడ్డుమీద ఒక అరటిపళ్ళ బండి ఇట్నుంచి వెళ్తోంది. ఒక రిక్షా అట్నుంచి వస్తోంది.
రెండింటి మధ్యనుంచి వెళ్ళగలనా అనుకుంది. ఆ అమ్మాయికి అటువంటి థ్రిల్స్ చాలా యిష్టం.
స్పీడ్ ఏమీ తగ్గించకుండా రెండింటి మధ్యనుంచి దూసుకుపోయింది. అయితే ఆ టెన్షన్ లో మరో పక్కనుంచి వస్తున్నామెని చూసుకోలేదు. ఆమె చేతిలో పూల సజ్జ గాలిలోకి ఎగిరి పడింది. ఆమె రోడ్డు పక్కకి పడిపోయింది.
'కంటి' ఉరఫ్ త్రిపుర కారు పక్కకి తీసి ఆపుచేసింది. కానిస్టేబుల్ పరుగెత్తుకుంటూ వచ్చి క్రిందపడిన అమ్మాయిని లేపి త్రిపుర దగ్గరికి వచ్చాడు.
క్రింద పడిన అమ్మాయి అలక్ నంద.
రాణా ఆ దృశ్యాన్ని దూరంనుంచి చూశాడు. ముందక్కడ ఏం గొడవ జరుగుతూందో అతడికి అర్ధంకాలేదు. అలక్ నంద బెదురు చూపులతో నిలబడి ముందు కనపడింది. పోలీసు బ్రహ్మానంద బాలకిషన్ ఒకమ్మాయితో గొడవపడుతూ దూరంగా కారు దగ్గర వున్నాడు.
అంతలో ఆ అమ్మాయి బాలకిషన్ చెంప అదిరేలా కొట్టింది.
రాణా నుదురు చిట్లించాడు. బాలకిషన్ లంచగొండి అని తెలుసుగానీ, స్త్రీలపట్ల అమర్యాదగా ప్రవర్తించడు. పోలీస్ స్టేషన్ లో ఆడఖైదీల పట్లకూడా గౌరవంగానే వుంటాడు. అటువంటి వాడిని ఆ అమ్మాయి ఎందుకు కొట్టిందో అర్ధంకాలేదు. అందులోనూ అతడు డ్రెస్ లో వున్నాడు. డ్రెస్ లో వున్న వాడిమీద చెయ్యి చేసుకోవడం చట్టరీత్యా పెద్ద నేరం.
మోటార్ సైకిల్ ఆపుచేసి వాళ్ళ దగ్గిరగా వెళ్ళాడు రాణా. బాలకిషన్ బిక్కమొహం వేసుకుని నిలబ్ది వున్నాడు. ఆ అమ్మాయి మొహం ఇన్ స్పెక్టర్ ని చూడగానే విప్పారింది.
"డ్యూటీలో వున్న పోలీస్ ని కొట్టడం నేరం మేడమ్" అన్నాడు రాణా. ఆమె ఆ విషయం పట్టించుకోకుండా, "సర్ ప్రైజింగ్! నువ్విక్కడా" అంది. తనని అంత చనువుగా ఏకవచనంతో సంబోధిస్తున్న ఆ ఇరవైయ్యేళ్ళ జీన్స్ అమ్మాయి ఎవరా అని అతడో క్షణం విస్తుబోయి, నువ్వెవరు?" అన్నాడు ఏకవచనంతోనే.
"కాలేజీలో నేన్నీకు జూనియర్ ని. పాటల ఫంక్షన్ లో నీ దగ్గిర ఆటోగ్రాఫు కూడా తీసుకున్నాను. అండ్ యూ నో.... ఐయామ్ in love with you since then. ఒక సైడ్ లవ్ అన్న మాట. వెల్లకిలా అప్డుకుంటే సీలింగ్ ఫాను. బోర్లా పడుకుంటే నీ ఫీలింగ్ పాడుగానూ" అంది నవ్వుతూ.
అలక్ నంద బిత్తరపోయి చూస్తోంది. రాణా కూడా విస్తుపోయాడు. కొంతమంది అమ్మాయిలు ఫాస్ట్ గ వుంటారని తెలుసు గానీ, మరీ ఇంత అని తెలీదు.
'ఒక సైడ్ లవ్ అన్నమాట' అని ఆ అమ్మాయి అంటూంటే నవ్వొచ్చింది. ఈ టీనేజర్స్ ప్రతిదానికీ లవ్ అనే పేరు పెడతారు. కాలేజీలో చదివే రోజుల్లో తను హీరోయే! చదువులో సున్నా అయినా, ఫుట్ బాల్ లోనూ, పాటల్లోనూ మొదట వుండేవాడు. చాలామంది ఆటోగ్రాఫులు తీసుకునేవారు. ఆ వయసులో వుండే థ్రిల్ అది. తనది ఇన్ ఫాక్సుయేషన్ అనుకోకపోవడమే ఇన్ ఫాక్సుయేషన్, ఈ అమ్మాయి ప్రేమ అటువంటిది అయివుండవచ్చు.
ఇంకొకటి కూడా వుంది. జీవితంలో ఏదో సంఘటనో - పరిచయమో జరుగుతుంది. ఆ తరువాత మళ్ళీ వాళ్ళు కలవరు. కానీ కాలం గడిచేకొద్దీ ఆ మామూలు సంఘటన (లేక) ఆ వ్యక్తి తాలూకు జ్ఞాపకం ఎంతో మధురిమని సంతరించుకుంటుంది. ఎప్పుడో పెళ్ళిచూపుల్లో చూసిన వ్యక్తిని (సాధారణంగా మొదటి పెళ్ళిచూపుల సందర్భంలో) జీవితాంతం ఉత్తమంగా వూహించుకుంటూ వుండటం సహజం. వెన్నెల్లో తాజ్ మహళ్ చూసినప్పుడు కన్నా సంవత్సరాల తరువాత ఆ "చూడటం" అనే దృశ్యాన్ని వూహించుకోవడం మధురంగా వుంటుంది. తన ఎదురుగా నిలబడిన అమ్మాయిని ఆ రకపు వ్యక్తిగానే భావించి, రాణా ఆ అమ్మాయికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు.
"నీ పేరు?" అని అడిగాడు.
"కంటి.... ఎన్.టి. కంటి.... పూర్తి పేరు నెమలికంటి త్రిపుర."
అతడు స్థాణువయ్యాడు. ఇంత తొందరగా పులిరాజు కూతురయిన ఈ అమ్మాయి కనపడుతుందనుకోలేదు. తన ఉద్వేగాన్ని అణుచుకుని "మా పోలీస్ ని ఎందుకు కొట్టావు?" అని అడిగాడు.
"గీరగా మాట్లాడాడు."
"ఏం మాట్లాడాడు?"
"డ్రైవింగ్ లైసెన్స్ చూపించమన్నాడు."
"అది గీరగా మాట్లాడటమా?"
".... ...."
"నువ్వొకసారి పోలీస్ స్టేషన్ కి రావలసి వుంటుంది."
"ప్లెజర్, వెంటనే వెళ్దామా?"
అతడు ఆశ్చర్యాన్ని అణుచుకుని, "డ్యూటీలో పోలీస్ ని కొట్టినందుకు నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను." అన్నాడు.
"పోలీస్ స్టేషన్ లో 'టీ' ఇస్తారుగా?"
అతడామెవైపు కన్నార్పకుండా ఒక క్షణం చూశాడు. ఇదంతా అమాయకత్వపు నటనా? మితిమీరిన ఫాస్ట్ నెస్సా? లేకపోతే డబ్బువల్ల వచ్చిన పొగరా? అతడా అమ్మాయిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోపెట్టాడు. లాకప్ సెల్ చూపిస్తూ, "నేను అందులో కూర్చోవాలా? ఇలా నీ ఎదురుగా కూర్చోవాలా?" అని అడిగింది. అతడికేం సమాధానం చెప్పాలో తోచలేదు.
"అలా కూర్చుని నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు."
