Previous Page Next Page 
భార్యా గుణవతి శత్రు పేజి 14

 

       ఉత్సాహంగా వింటున్నారు కస్టమర్స్ ఫుడ్డూ, లిక్కరూ ధారాళంగా ఖర్చయిపోతున్నాయి. మాటలు తడబడటం, గొంతులు పెద్దవి కావడం మెల్లిమెల్లిగా మొదలవుతోంది.    
    బాగా డబ్బున్న గుజరాతీల కుర్రాడిలా కనబడుతున్న ఒకతను లేచి, జాన్ ట్రవోల్టాను ఇమిటేట్ చేస్తూ, కుడిచెయ్యి ఆకాశంవైపు చూపిస్తూ బీటిల్స్ పాట ఒకటి అందుకున్నాడు కాసేపు డాన్స్ చేసి, అతను కూర్చోగానే మరొకతను లేచాడు. మహంకాళి అమ్మవారి జాతర రోజున చిందులు తొక్కే పోతరాజు పాత్రధారిలా వున్నాడతను. నల్లటి రూపం, పెద్ద పొట్ట, పొట్టి చేతులు, బాగా నూనె పట్టించిన గిరజాల జుట్టు.    
    అతి నాగరికంగా వున్న ఆ హైబ్రో క్రౌడ్ మధ్య అనాగరికంగా కనబడుతున్నాడు అతను. ఆవుల మందలో జొరబడిన అడవిదున్నలా, రాయంచల మధ్య కాకిలా వున్నాడు.    
    తూలుతూ డైస్ ఎక్కి సింథి సైజర్ వాయించే గిరిధారిని కౌగిలించుకుని "ఏమే బాగున్నావా?" అన్నాడు తెలంగాణా ప్రాంతంలో మగవాళ్ళని కూడా ఏమే, అవునే, కాదే అని సంబోధించే అలవాటు వుంది.    
    "బాగున్ననే" అన్నాడు గిరిధారి. "పాండు అన్న మా బస్తీలోనే ఉంటాడు. ఈ మధ్య బాంబేకి మకాం మార్చిండు" అని బాలూకి పరిచయం చేశాడు గిరిధారి, చిన్న గొంతుతో.    
    పాండు బాలూతో కరచాలనం చేసి, చేతిని గుండెలకు ఆనించుకున్నాడు. అతని "సత్తా" అంచనా వేస్తున్నట్లు ఒకసారి నిలువెల్లా చూసి "ఏయ్ తమ్మీ! జబర్దస్త్ మ్యూజిక్ వెయ్! ఆజ్ మై ఖూబ్ నాచూంగా!" అన్నాడు.    
    ఇలాంటి తమాషాలన్నీ బ్యాండ్ వున్న బార్ లలో అలవాటే.    
    సహనంగా చిరునవ్వు నవ్వి, "బంబయ్ సే ఆయే మేనే దోస్త్, దోస్త్ కో సలాంకరో!" అన్న పాట అందుకున్నాడు బాలూ.    
    చేతులూ, నడ్డీ తిప్పుతూ, చావు బాజాలతోపాటు వెళుతూ కొంతమంది చేసే డాన్స్ లాంటిది మొదలెట్టాడు పాండూ.    
    అయిదు నిమిషాలు అలా ఎగిరి, ఆయాసమొచ్చి ఆగాడు అతను. జేబులోంచి యాభైరూపాయల నోటుతీసి బాలూ మొహంచుట్టూ దిష్టి తీసినట్లు మూడుసార్లు తిప్పి, అతని పెదిమల మధ్య పెట్టాడు.    
    ఇలాంటి చేష్టలు బాలూకి ఇష్టం ఉండదు. అయినా తప్పదు. భరించాలి.    
    తర్వాత బాత్ రూంలోకి వెళ్ళాడు పాండు. సింకు దగ్గర తల పెట్టి వామిట్ చేసుకున్నాడు.    
    ఈలోగా బాలూని మెల్లిగా హెచ్చరించాడు గిరిధారి. "పాండు ఇదివరకు మా లొకాలిటీలో పెద్ద దాదా! అతను బాంబే వెళ్ళిపోయినా యింకా అతని మనుషులు గుండాగిరీ చేస్తూనే వున్నారు. కొట్లాటలు తీర్చి పైసలు తీసుకుంటారు వాళ్ళు కొట్లాటలు లేకపోతే వాళ్ళే పెడతారు. జాగ్రత్త!" అన్నాడు.    
    కందిపోయిన మొహంతో పాండు తిరిగి వచ్చాడు. వస్తూనే "ఇంక నా ప్రోగ్రాం ఖతం అయిపోయింది తమ్మీ! జనగనమన వాయించు! ఎల్లిపోతా!" అన్నాడు.    
    అతని మాటలు సీరియస్ గా తీసుకోలేదు బాలు. నవ్వేసి వూరుకున్నాడు.    
    కొద్దిక్షణాలు ఎదురుచూశాడు పాండు.    
    "చప్పుడు చెయ్యవు ఏం తమ్మీ, ఏం కత! చెప్పేది వినబడుట లేదా?"    
    "బార్ లో జాతీయ గీతం వాయించడం బాగుండదు" అన్నాడు బాలు.    
    "ఏ సాలగాడు చెప్పిండట్ల!" అన్నాడు పాండు గొంతు పెద్దది చేస్తూ - "నేను ఫర్మాయిష్ చేస్తున్న! వాయించు!"    
    "సారీ అలా కుదరదు!" అన్నాడు బాలు స్థిరంగా.    
    "నే నెవర్నో ఎరిక వుందా?"    
    బార్ లో అందరూ మాట్లాడటం మానేశారు.    
    బాలూ మాట్లాడకుండా చూస్తూ నిలబడ్డాడు.    
    పాండు బార్ మేనేజర్ దగ్గర కెళ్ళాడు.    
    "ఏం తమ్మీ! మంచిగ బతకాలని లేదా ఏమి? ఈ పోరగాడు ఫోజు కొడతన్నాడు జర సమజాయించు."    
    భయపడిపోయాడు మేనేజర్. గబగబా బాలూ దగ్గరికి వచ్చి, చెవిలో చెప్పాడు. "అధికారంలో ఎవరుంటే వాళ్ళ వెనక చేరి పనులు చేసి పెట్టే రౌడీవాడు. వాడితో మనకెందుకు! గబగబ వాయించెయ్! ఎవడు పట్టించుకుంటాడు?"    
    మౌనంగా అలాగే వుండిపోయాడు బాలు.    
    రెచ్చిపోయాడు పాండు. జేబులోంచి రాంపురీ చాకు తీశాడు. దానితో అందరినీ బెదిరిస్తూ, బల్లలన్నీ తోసేశాడు. గ్లాసులూ, ప్లేట్లూ, సీసాలు ధన ధన పగిలిపోయాయి. అద్దాల తలుపులు బద్దలు చేసేశాడు. అంతా క్షణంలో జరిగిపోయింది.    
    గొడవ మొదలవగానే త్వరత్వరగా బయటికి వెళ్ళిపోయారు ముప్పాతికమంది కస్టమర్స్ మిగతావాళ్ళు నిర్విన్నులై చూస్తున్నారు.    
    అతన్ని అడ్డగించే సాహసం అంతమందిలోనూ ఎవరికీ లేకపోయింది.    
    పిడబ్ల్యూడీలో పనిచేసే ఒక పెద్ద ఆఫీసర్ మాత్రం ఫోన్ దగ్గరికి నడిచి, పోలీసు కంట్రోల్ రూం నెంబర్ డయల్ చెయ్యబోయాడు.    
    వెంటనే ఆయన దగ్గరికెళ్ళిపోయి వారించాడు మేనేజర్.    
    "పోలీసులకా సర్! ప్లీజ్ సర్! నేను మేనేజ్ చేసుకుంటాను. పోలీసులని ఇందులో జోక్యం చేసుకోనివ్వద్దు."    
    అతని బాధ అర్ధం చేసుకున్నట్లు తలవూపి వెళ్ళిపోయాడా ఆఫీసరు. ఇప్పుడు జరుగుతున్న నష్టంకంటే, పోలీసులు రంగప్రవేశం చేస్తే జరిగే నష్టం ఎక్కువ! ఆ వార్త పేపర్లలో వస్తే నష్టం మరింత ఎక్కువ. పోలీసు కేసుల్లో ఇరుక్కునే బార్లలోకి రావటానికి కస్టమర్లు జంకుతారు.    
    కేష్ కౌంటర్లో వున్న డబ్బు మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోయాడు పాండు.    
    అప్పుడింక శివమెత్తిన వాడిలా వూగిపోయాడు బార్ మేనేజర్. నిప్పులు కక్కుతూన్న బాలూవేపు చూస్తూ "నీకంత దేశ భక్తి వుంటే సైన్యంలో చేరి వుండాల్సింది. మిలటరీ బ్యాండ్ లో దేశభక్తి గీతాలు వాయిస్తూ వుండవలసింది. బార్ లో చేరి మమ్మల్ని చంపడమెందుకూ? ఇక వెళ్ళు! మళ్ళీ రాకు!!"    
    బాలూకి మేనేజర్ చెపుతున్నది అర్ధంకాలేదు మొదట.    
    తన ఉద్యోగం పో....యిం....ది!!

    నిజంగానే పోయింది.    
    ఇన్నాళ్ళు చేసిన సర్వీసు - ఒక చిన్న సంఘటనతో తుడిచి పెట్టుకుపోయింది!! బార్ లో ఈ రోజు జరిగిన నష్టమంతా తన వల్లనే జరిగినట్టు భావిస్తోంది మేనేజిమెంటు.    
    ఇక తను బ్రతిమిలాడటం అనవసరం. కొద్దిక్షణాలు నిశ్శబ్దంగా వుండి "నాకు రావలసిన సేలరీ..." అన్నాడు బాలు.    
    "లెక్కచూసి నీకు మనియార్డర్ చేస్తాం వెళ్ళు-"    
    ఆ డబ్బు ఎలాగూ తనకి అందదని తెలుసు బాలూకి. వెంటనే అతనికి తను ఇన్ స్టాల్ మెంట్ మీద సౌదామినికి కొనిచ్చిన చీరెలు గుర్తొచ్చాయి. ముందు ఆ అప్పు ఎలా తీరుస్తాడు తను? ఇల్లెలా జరుగుతుంది ఇప్పుడు? కొత్త కాపురం పెట్టీ పెట్టకముందే ఇలా జరిగిందేమిటి? ఏ దుష్టగ్రహం అన్నా తనమీద తన విషపు చూపును ప్రసరిస్తోందా? అతడు తలెత్తాడు.    
    బార్ ఖాళీ అయిపోయినా ఒక కస్టమర్ మాత్రం కదలకుండా కూర్చుని, బీరు తాగుతున్నాడు. చేదు నవ్వుతో వంకర తిరిగి వున్నాయి అతని పెదిమలు.    
    అతను ఆంజనేయులు!!    
    మనసు మొద్దుబారిపోగా బార్ లో నుండి బయటకు నడిచాడు బాలు, ఇంటికెళ్ళి సౌదామినికి మొహం చూపించాలంటే దిగులుగా వుంది. ధైర్యం చాలటంలేదు. తనేదో అంటుందని కాదు, నిజానికి తననేమి అనదుకూడా. అయినా ఎదుటివాళ్ళు తనమీద పెట్టుకున్న ఆశలను నిరాశ చేస్తున్నపుడు కలిగే దిగులుతో కూడిన భయం.    
    ఇప్పుడు ఉద్యోగం పోవటంలో కూడా తన తప్పేమీలేదు. అయినా ఇంటికెళ్ళి, మౌనంగానే మనసులోని భావాలను కళ్ళతో చెప్పే సౌదామినిని ఫేస్ చెయ్యాలంటే బెంగగా వుంది.    
    తను ఎటువైపు వెళుతున్నాడో తనకే తెలియని నిరాసక్తతతో చాలా రోడ్లు నడిచి నడిచి ఒక చౌకరకం బార్ ముందు ఆగిపోయాడు బాలు ఒక నిర్ణయానికి రాకుండానే లోపలికి వెళ్ళి కూర్చున్నాడు.    
    .... అర్ధరాత్రి దాటాక ఇంటిముందు ఆటో ఆగిన శబ్దం వినగానే, కిటికీలోంచి చూసి తలుపు తెరిచింది సౌదామిని అతను తలుపు తట్టకముందే తీసి నవ్వుతూ చూసింది. ఆమె కళ్ళు స్వాగతం చెబుతున్నాయి తీర్చిదిద్దినట్లున్న ఆమె కనుబొమలు ఆర్చిషేపులో వున్న స్వాగతద్వారాలలాగా కనబడుతున్నాయి.    
    అతడు గిల్టీగా ఫీలయ్యాడు.    
    అతని పెదిమలు నవ్వుకి నకిలీరూపంలో రబ్బరులా సాగాయి. ఒక సెకండు తర్వాత ఆ కాస్త సింథటిక్ నవ్వుకూడా జారిపోయి, పెదిమల కొసలు కిందివైపుకి నిరుత్సాహాన్ని చూపిస్తూ తిరిగాయి.    
    కాపురం పెట్టిన తర్వాత ఈ కొద్దిరోజులలోనూ అతన్ని ఇలాంటి మూడ్ లో ఎన్నడూ చూడలేదు సౌదామిని. వీధి చివర వున్న షాపులో అగ్గిపెట్టె కొనుక్కురావటానికి వెళ్ళివచ్చే ఆ కొద్ది నిమిషాల ఎడబాటే యుగయుగాల విరహంలా ఫీలవుతూ ఊపిరాడనివ్వకుండా తనని చుట్టేస్తాడతను ఇంటికి తిరిగి రాగానే తమా ఇద్దరిమధ్యా, అరక్షణంసేపు కూడా, అరంగుళం కూడా దూరం వుండకూడదన్నట్లు తాకుతూనే నిలబడతాడు. అటువంటిది-    
    ఇవాళ తనను తాకటానికి భయపడుతున్నట్లు కొంచెం ఒదిగి, గుమ్మంలో నుంచి లోపలి వెళ్ళిపోయిన బాలూవైపు ఆశ్చర్యంగా చూసింది.    
    "భోజనం వడ్డించనా" అంది మృదువుగా.    
    వద్దన్నట్లు తల వూపాడు.    
    అతనివైపు పరిశీలనగా చూసింది.    
    "భోజనం చేశారా?"    
    అవుననో కాదనో అర్ధంగాకుండా తల వూపాడతను.    
    "చెయ్యలేదు అవునా? వడ్డిస్తాను" మృదువుగా అంది.    
    స్థబ్దంగా చూస్తున్నాడు అతను. ఇవాళ వండింది - బలవంతంగా వడ్డించి తిన్పిస్తుంది! రేపూ అంతే ఎల్లుండి కూడానేమో!!   
    కానీ ఆ తర్వాత...    
    వండటానికి వుండదు వడ్డించటానికి వుండదు. తినటానికి బతిమిలాడటం వుండదు.    
    ...కంచం పెట్టి వడ్డించింది సౌదామిని. పీట వేసింది. అతను కూర్చున్నాడు. పీటమీద కాదు, ఆమె ప్రక్కన.    
    ఒంగిపోయి ఆమె ఒళ్ళో తల పెట్టేశాడు బాలూ ఎడమచెయ్యి ఆమె నడుంచుట్టూ వేశాడు. ఎందుకో దుఃఖం వచ్చింది.    
    కొద్ది క్షణాలు ఆగి అతని జుట్టుని నిమిరింది సౌదామిని. "ఏమయ్యింది?"    
    "నీకు చెప్పలేనంత అన్యాయం చేశాను సౌదామినీ!"    
    మెల్లగా నవ్వింది సౌదామిని. "ఎందుకంత పెద్ద పెద్ద మాటలు? చెప్పండి, ఏమయింది?"    
    "బార్ లో ఉద్యోగం పోయింది".    
    "పోతే పోయింది అయినా బార్ లో ఉద్యోగమేమిటి? నాకు మొదటినుండీ ఇష్టంలేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS