"ఆఁ, ఉదయం వెళ్ళిపోవడమే నంటున్నారు మీ అన్నయ్య. పాలవాళ్ళని పిలిచి డబ్బు లెక్కగట్టి ఇచ్చేశారు. కొట్టతనికి డబ్బు పంపేశారు. 'ఫస్ట్ వారంరోజులేగా? జీతం తీసుకొని వెళ్ళొచ్చు'నని చెబితే 'తరువాతొచ్చి తీసుకోవచ్చు, అవతల ఆయన ఎలా ఉన్నారో, ఆలస్యం చేయడానికి వీల్లేదు' అన్నారు."
ఇన్నేళ్ళు ఒక్క కుటుంబంగా కలిసి మెలిసి ఉన్నారు. ఏ దుఃఖమైనా, సంతోషమైనా మనసువిప్పి చెప్పుకొన్నారు. కష్టం, సుఖం పంచుకొన్నట్టుగా మసిలారు, వెళ్ళాల్సిన చోటికివెళ్ళిపోతున్న సంతోషంతో జానకికి పెద్ద బాధగా లేదుగాని, రుక్మిణికే ఏం తోచనట్టుగా, కాళ్ళు చేతులు ఆడనట్టుగా అయిపోయింది. పలకరించడానికి ఉన్న ఆ ఒక్కతోడూ వెళ్ళి పోతూంది! ఇకనుండి రోజులు గడపడం ఎట్లా?
మరునాడు జానకివాళ్ళకి వీడ్కోలువిందు ఇస్తున్నా, జానకికి బొట్టుపెట్టి చీరా రెవికా ఇస్తున్నా మనసు మనసులో లేనట్టుగానే ఉంది రుక్మిణికి. ముఖంలో కళ అస్సలు లేదు.
"వెళ్ళాక ఉత్తరం వ్రాస్తావుగా?" పట్టుకుపోయిన గొంతుకతో అంది రుక్మిణి.
"తప్పకుండా!"
"మళ్ళీ ఎప్పుడొస్తావు మా ఊరు?"
"నెలా రెణ్ణెల్లలో వచ్చి నిన్ను చూచుకోకపోతే, అక్కడి సంగతులు చెప్పకపోతే నా మనసుమాత్రం కుదురుతుందా?"
"ఏమో! పట్నం కాపురంలో ఈ పల్లెటూర్ని స్నేహితురాలిని మరిచిపోతావేమో!"
"ఎంతమాట! నిన్ను మరవడమా, రుక్మిణీ? నిన్ను మరవడమంటే నన్ను నేనే మరవడమన్నమాట!"
"వెడుతూనే ఉత్తరం వ్రాయాలి!"
"తప్పకుండా!"
జానకివాళ్ళు ఎక్కిన బండివెంట చాలాదూరం వెళ్ళి ఆగిపోయింది రుక్మిణి కన్నీటితో.
జానకి కళ్ళలోనూ నీళ్ళు!
"నేనూ అత్తావాళ్ళతో వెడతాను!" అని ఏడుస్తున్న సంధ్యని బలవంతాన చంకలో వేసుకొని ఇంటిముఖం పట్టిన రుక్మిణిని చూస్తే, ఎవరో ఆత్మీయుల్ని తగలేసి ఇంటిముఖం పట్టినప్పటి దుఃఖఛాయలు ఆవరించుకొని ఉన్నాయి.
ఇంటికివచ్చి పక్కమీద పడుకొని ఏడుస్తున్న రుక్మిణిని కోప్పడ్డాడు మోహన్. "వాళ్ళేదో అజ్ఞాతవాసం చేస్తున్నట్టుగా ఈ ఊరొచ్చారు. అజ్ఞాతవాసం అయిపోయింది! వాళ్ళ వాళ్ళను కలుసుకోడానికి సంతోషంతో వెళ్ళిపోయారు. నువ్వు ఏడవడం బాగాలేదు."
"రేపటి నుండి ఎలా కాలక్షేపం కావాలి?"
"పుస్తకాలు చదువుకో! ఎన్ని కావాలంటే అన్ని తెచ్చిపెడతాను. మరీ మనసు కుదరడంలేదంటే టౌన్ కి వెళ్ళి సినిమా చూసివద్దాం!" అన్నాడు ఓదార్పుగా.
మరునాడు ఎవరో యాత్రాస్పెషల్ టికెట్స్ అమ్ముతూంటే తీసుకువచ్చాడు.
"నీ మనసు ఈ ప్రయాణం వల్లైనా కుదుటపడుతుందేమోనని తీసుకొన్నాను టికెట్లు. ఇరవైరోజులు దక్షిణభారతమంతా తిరిగొద్దాం. ఎల్లుండే బయల్దేరాలి."
ఇరవైరోజులు యాత్రలు చేసివచ్చినా తలుపు మూసివున్న ఎదురింటిని చూసేసరికి మనస్సంతా వికలం అయ్యేది రుక్మిణికి.
సంధ్యసంగతి చెప్పనే అక్కరలేదు. ఎప్పుడూ ఆ పిల్లకి బావధ్యాసే. "మా బావా, అత్తా వస్తారు బోల్డె బొమ్మలూ, మిటాయిలూ తీసుకొని. మేం పట్నం వెడతాం, మా అత్తావాళ్ళవెంట." అని ఏమిటేమిటో స్నేహితులతో చెప్పేది.
జానకి వాళ్ళు వెళ్ళిపోయిన నెలరోజుల తరువాత జాబు వచ్చింది ఆమె నుండి.
"ప్రియమైన రుక్మిణి వదినకు,
క్షేమం! క్షేమమని తలుస్తాను!
మేం అనుకొన్నంత సుఖంగా లేదిక్కడ. మా మామగారుపోయారు. కొడుకుమీది కోపంతో ఆయన చాలా ఆస్తి నాశనం చేశారు. బిజినెస్ చిల్లులు పడిన పడవలా ఉంది. ఆ చిల్లుల పడవని ఈయన చేతికిచ్చి కన్నుమూశాడు ముసలాయన. ఈ అవక తవకలని సరిచేయడానికి ఆయన ఆహోరాత్రులు కష్టపడుతున్నారు. క్షణం తీరికలేదు. ఒక మాటా మంతీ లేదు. ఎప్పుడు ఇంటికి వస్తారో, ఎప్పుడు భోజనం చేస్తారో తెలియదు. నవ్వులు సరదాలు అస్సలు లేవు. ఈ జీవితాన్ని చూస్తుంటే ఆ రాజానగరంలో ఎంత ప్రశాంతంగా గడిచిపోయాయి రోజులు అనిపిస్తూంది. ఇక్కడికి వచ్చినప్పటినుండి హరిప్రియకి ఒకటే జ్వరం. పిల్లకి ఇంత సుస్తీ అయినా ఒక నిమిషం దాని ప్రక్కన కూర్చొని పలకరించే తీరిక లేదాయనకి. నాకనిపిస్తూంది, ఈ బిజినెస్ ఎత్తేయించి మళ్ళీ ఆయన్ని ఆ రాజానగరం లాక్కువచ్చేద్దామా అని!
