"అంత మాటన్నందుకు చాలా థాంక్స్!" అన్నాడు రాజారావు -- "నా దురదృష్టం కొద్దీ నిన్ను కాస్త ఆలస్యంగా చూశాను. ముందే నిన్ను చూసి వుంటే నా జీవితం ఇంకో దారిలో నడిచి ఉండేదేమో!"
"ఇప్పుడు మాత్రం నష్టమేముంది -- నువ్వోప్పుకుంటే మనిద్దరం పెళ్ళి చేసుకుందాం."
రాజారావు నిట్టూర్చి -- "అది సాధ్యం కాదు " అన్నాడు.
"నాకు తెలుసు. నేను వేశ్యననేగా?'
రాజారావు ముఖం ఎర్రగా అయింది - "నువ్వు వేశ్యవా? అలా అని ఎవరన్నారు? నువ్వు వేశ్వావు కాదు. వేశ్య అంటే డబ్బుకోసం ప్రేమికుల్ని కూడా వదిలి ఎవడ్నో కట్టుకునేవాళ్ళు. తమ తళుకుబెళుకులతో భర్తలకు వెర్రేక్కించి తమ సౌఖ్యం కోసం వారిని తప్పు దారులు తోక్కిన్చేవారు. మర్యాదస్తులుగా చెలామణీ అవుతూ మనసులో వేశ్యల అదృష్టానికి అసూయ పడేవారు.... వారు.... వారంతా వేశ్యలు. నువ్వు వేశ్య కాదు, మాయమర్మం లేకుండా ....నిర్మొహమాటంగా మగవాడి దగ్గర డబ్బు తీసుకుని-- వెలకట్టలేని సుఖాలను ప్రసాదించే సౌఖ్య ప్రదాయినివి నువ్వు..."
"కలకాలం నేనలా పురుష జాతిని సుఖ పెడుతూ ఉండి పోవాలనా -- నువ్వు నన్ను పెళ్ళి చేసుకోనంటున్నావ్?" అంది సౌగంధి.
"కాదు సౌగంధి ! నాకు గత జీవితం గురించిన బెంగ లేదు. నీ జీవన విధానం గురించిన ఆలోచన లేదు. ఎడారిలో ఒయాసిస్సులా కనబడ్డావ్ నువ్వు నాకు. ఒయశిస్సుకి ప్రయాణికుడికి అనుబంధం తాత్కాలికమే అవుతుంది. నీ విషయం లోనూ నాకు అంతే!' అని రాజారావు ఒక్క క్షణం ఆగాడు.
"అమ్మ పోగానే జీవితమంతా అంధ కారమైపోయింది నాకు. వెంటనే చచ్చిపోవాలనే అనుకున్నాను. కానీ అమ్మ ఎన్ని కష్టాలనుభావించింది? ఎన్ని అవమానాలను భరించింది-- అదంతా నన్ను బ్రతికించడానికే గదా! నన్ను అంత కష్టపడి బ్రతికించినందుకు నా వల్ల ఏదైనా మంచి కార్యం సిద్ధించాలి గదా! నా బ్రతుకు సార్ధకం చేసుకోవాలి గదా ! అందుకే బాగా అలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయంలో ఆవేశం, ఉద్రేకం ఉన్నాయి. బ్రతుకు మీద తీపి లేదు.
అంతలోనే నాకు ఆమెతో పరిచయమయింది. ఆమె పరిచయం నా జీవితంలో పన్నీటి జల్లులా కురిసింది. నాలో ఆవేశం, ఉద్రేకం తప్పుకుని ప్రేమానురాగాలు స్థిరపడ్డాయి. ఫలితంగా నేనుద్యోగ ప్రయత్నం మొదలు పెట్టాను. తన కంపెనీలో ఒక ఖాళీ ఉన్నదని అది నాకీయవచ్చు ననీ ఆ మేనేజరు చెప్పాడు. అయితే చివరి క్షణాల్లో ఆహోబలరావు కలగజేసుకుని నాకు అడ్డు పడ్డాడు" ఉద్యోగం పోయింది. ఆమె నిర్ధాక్షిణ్యంగా నన్ను కాదని తలిదండ్రులు చెప్పిన పెళ్ళి చేసేసుకుంది. జీవితమంతా శూన్యం! చేరుపుదామన్న చెరిగిపోని ఆమె ముద్ర నా హృదయం పై పడిపోయింది.
ఒక్కసారి నాలోంచి ప్రేమానురాగాలు తప్పుకున్నాయి. పగ, ద్వేషం, ఆవేశం, ఉద్రేకం నన్నావహించాయి. అప్పుడే నాకు నీ పరిచయం లభించింది. రామభద్రయ్య గురించిన వివరాలు సేకరించడానికి నువ్వు చేసిన సాయం ఈ జన్మకు మరువలేనిది. ఏ కారణం వల్లనో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నేను నువ్వంటే యిష్ట పడుతున్నాను, కానీ ఆమె స్థానం లో నిన్ను నా హృదయంలో ప్రతిష్టించలేకపోతున్నాను. అది నా దురదృష్టం . నాకూ నీకు మాత్రమే తెలిసిన ఆ రామభద్రయ్య రహస్యాలు అలాగే వుండిపోనీ !
ఈరోజు రాత్రితో నా కార్యక్రమం ముగుస్తుంది. నా జీవితం కూడా ముగుస్తుంది. ఈ ఆఖరి గంటల్లో నీకు తెలిసిన విద్యలన్నీ ఉపయోగించి నన్ను రంజింప చేయి, ఈ జన్మకు నీ నుంచి నేను కోరేది అంతే! నీకోసమే ఆ పదివేలూ రామభద్రయ్య దగ్గర తీసుకున్నాను..." అన్నాడు రాజారావు.
సౌగంధి నిట్టూర్చి -- ఎవరేమనుకున్నా నువ్వొక అద్భుత మైన మనిషివి రాజా! నువ్వు దేశానికి కాకుండా పోయావంటే ఆ తప్పు నీది కాదు. దేశం నిన్ను పోగొట్టుకుంది. కానీ నేను నిన్ను పోగొట్టు కొదల్చుకోలేదు. ఇప్పుడు మనం గడిపేది ఆఖరు గంటలు కావడానికి వీల్లేదు. మనం ఎప్పుడూ ఇలా కలిసే వుండాలి-" అని ...." అవసరార్ధం శరీరాన్నమ్ముకోవడం ప్రారంభిస్తే ఆనతి కాలంలోనే అనుకున్న కంటే బాగా సంపాదించ గలిగాను. నేను సర్వ స్వతంత్రురాలిని. నేను గడుపుతున్న జీవితం వదిలిపెట్టాలని ఉంది నాకు. నిన్ను తప్ప మరే మగవాడ్ని నమ్మను నేను. నువ్వు చేయూత నిస్తానంటేనే ఈ జీవితం వదిలి పెడతాను. లేకపోతె నా బ్రతుకు యెప్పటికీ యింతే !" అంది.
"సౌగంధి - సమయం వృధా చేయకు. నా పట్టుదల నీకు తెలుసు...." అన్నాడు రాజారావు.
సౌగాంధి రాజారావు ముందు వివిధ నృత్యాలు చేసి మంచి మంచి పానీయాలు తెప్పించింది. అతని కౌగిలిలో ఒదిగిపోయి , ఎన్నో రసవత్తరమైన కధలు చెప్పింది. తనకు నచ్చిన విద్యలు ప్రదర్శించింది.
"అద్భుతం- సౌగంధి !' అన్నాడు రాజారావు క్షణంలో సంతోషం పట్టలేక.
"నువ్వు మెచ్చుకున్నావు . అదే చాలు!" అంది సౌగంధి.
రాజారావు టైము చూసుకుని ...."పదకొండున్నర అయింది....ఇంకో అరగంటలో రామభద్రయ్య కు ఫోన్ చేయాలి!" అన్నాడు.
7
సరిగ్గా పన్నెండు గంటలకు రామభద్రయ్య ఇంట్లో ఫోన్ మ్రోగింది.
"అదిగో మృత్యువు దేవుడి పిలుపు ...."అంటూ రామభద్రయ్య ఫోన్ దగ్గరకు నడిచాడు. రమాదేవి అతడి వంకే ఆశ్చర్యంగా చూస్తోంది.
"హలో -- నేను...రామభద్రయ్యను....."అన్నాడు రామభద్రయ్య.
"నేను రాజారావును ...." అంది అవతలి కంఠం ,
"చెప్పు !"
"ఏం చేశావీ రోజు ?" అన్నాడు రాజారావు.
"భార్యను తాగుడు మానమని హెచ్చరించి ఒప్పించాను. నా ముగ్గురు పిల్లలకీ పెళ్ళిళ్ళు చేసేశాను. ఆఫీసు వ్యవహారాలు అబ్బాయికీ అప్పజేప్పేశాను. వ్యాపారం నుంచి విరమిస్తున్నట్లు ప్రకటన చేశాను....'
"ఒక్కరోజులో ....ఇన్ని పనులు....సాధ్యమా ?"
"ఏమో -- నాకు సాధ్య పడ్డాయి...."
"ఇప్పుడెం చేస్తున్నావ్ ?"
"చావుకోసం ఎదురు చూస్తున్నాను...."
"భయంగా, బెంగగా .....లేదా?"
"వుంది-"
"బ్రతకాలని పిస్తోందా?"
"అనిపిస్తోంది...."
"కానీ నువ్వు బ్రతకవు. ఒంటిగంట కాగానే ఇంట్లో బయల్దేరి గోదావరి ఒడ్డున రావి చెట్టు దగ్గరకు రా. కారులో కాకుండా నడిచి రా..... నీఇంటి దగ్గర్నుంచీ అక్కడికి ప్రయాణం కాలినడకన ఇరవై నిమిషాలు పడుతుంది. ఒంటిగంటా ఇరవై కల్లా అక్కడుండాలి. జీవితం మీద ఇంకేవిధమైన ఆశలూ పెట్టుకోకు. పిచ్చి పిచ్చి వేషాలేమీ వెయ్యవద్దు...."
"నువ్వు చెప్పినట్లే చేస్తాను"అన్నాడు రామభద్రయ్య.
"బైదిబై ఈరోజు నువ్వింకేమైనా చేశావా?"
"ఇంకేమైనా అంటే?"
"గతంలో చేసిన పాపాల గురించి తలచుకుని పశ్చాత్తాప పడడం లాంటివి."
"పశ్చాత్తాప పడేటంత పాపాలు నేనేమీచేయలేదు"
"మంచిది, అలాగే అనుకో....ఒంటిగంటా ఇరవై కల్లా మాత్రం అక్కడుండాలి. మరిచి పోకూ ....బై...."
అవతల ఫోన్ క్లిక్ మంది.
రామభద్రయ్య ఫోన్ పెట్టేశాడు. అయన శరీరంలో సన్నగా వణుకు ప్రారంభమైంది.
రమాదేవి ఆయన్ను సమీపించి "ఏమిటండీ ఆ ఫోన్ అనడిగింది.
"ఏదోలే నీకు సంబంధించినది కాదు."
"మీకు సంబంధించినవన్నీ నాకు సంబంధించినట్లే , అదేమిటో చెప్పండి !"
"రమా! ఈరోజూఇంతవరకూ గుక్కెడు బ్రాందీ అయినా పుచ్చుకోలేదు. గొంతు ఏదోలా అనిపించడం లేదు?" అన్నాడు రామభద్రయ్య చటుక్కున.
"నాకు దాని పేరు గుర్తు చేయకండి. తాగనని మీమీద ఒట్టేశాను...."అంది రమాదేవి.
"అయితే నీ ఒట్టుకు చిన్న పరీక్ష...." అన్నాడు రామభద్రయ్య.
"చెప్పండి...."
"నేను ఇప్పుడు ఇల్లు వదిలి వెడుతున్నాను. నువ్వు అన్న మాట మీద నిలబడి ఒక్క చుక్క కూడా బ్రాందీ పుచ్చుకోకుండా వుంటే రెండున్నర కాళ్ళ నేను తిరిగి వస్తాను. నువ్వు నిగ్రహం కోల్పోతే -- నేను తిరిగి రాననుకో...." అన్నాడు రామభద్రయ్య.
"మీరు దగ్గర లేకపోతే నన్ను నేను నిగ్రహించుకోలేనేమో నండి . ఈ అలవాటు పూర్తిగా పోయే వరకూ మీరు కొంతకాలం నన్ను కనిపెట్టుకుని ఉండండి...." అందు రమాదేవి.
"ఏమీ లాభం లేదు. నామీద ఏమాత్రం గౌరవమున్నా నువ్వు నేను చెప్పినట్లు వినాల్సిందే!" అన్నాడు రామభద్రయ్య.
రమాదేవి యెంత చెప్పినా అయన వినలేదు. ఒంటి గంటకు కాస్త ముందుగానే అయన ఇల్లు వదిలి పెట్టాడు.
