"సౌభాగ్యవతిగా నూరేళ్ళ జీవితం నీ కుంది, సోఫీ!" అన్న వీణ మాటలకు నవ్వుకొంది సోఫియా.
కష్టాలన్నీ పలుక్కొని వస్తాయన్నట్లు 'అబ్బాజాన్ సీరియస్' అని జుబేదాకు టెలిగ్రామ్ వచ్చింది.
జుబేదాను ఓదార్చటం గగనమై పోయింది వారికి. సూటుకేసు సర్ది రాజీవ్ తో హైదరాబాదు పంపించారు.
ఈ హడావుడిలో వీణ గాజులు పోయాయి.
దొంగ జబ్బు ఉన్న సరోజ లేదు హాస్టల్లో. మరెవ్వరో తీశారు. అవి ఇక దొరకవని చెప్పింది సోఫియా.
ఏ చిన్న వస్తువు పోయినా ఎంతో గొడవ చేస్తుంది వీణ. పెన్ పోతే 'అయ్యో! నా లక్కీ పెన్. థర్డ్ ఫారమ్ నుంచి వాడుతున్నా'నంటుంది. పుట్టిన రోజుకు నాన్నమ్మ ఇచ్చిన గోల్డెన్ బాంగిల్స్ పోతే ఎంత ఏడుస్తుందో నని తలచింది సోఫియా. కాని, చాలా లైట్ గా తీసుకుంది వీణ.
సోఫీ అమ్మను పోగొట్టుకొంది. జుబేదాకు వచ్చిన కష్టంలో తను పోగొట్టుకొన్న వస్తువు బహు స్వల్పం అనిపించింది.
రాజీవ్ రాకకై ఎదురు చూడసాగారు.
నిద్రలేని కళ్ళతో, నలిగిన దుస్తుల్లో అప్పుడప్పుడే మొలకెత్తుతున్న నారు మడిలోని గడ్డిలా ప్రత్యక్షమైన రాజీవ్ ను చూచి శంకించిన మనస్సు కలవారై మౌనంగా చూడసాగారు. వారినే చూస్తూ, "ఆయన బాగున్నారు. మజిల్ పెయిన్ కి హార్ట్ అటాక్ అని భయపడ్డారు. పెద్దవాళ్ళకి తెలియకుండా జుబేదా అన్న టెలిగ్రామ్ ఇచ్చాడు. స్టేషన్ నుంచి ఇటే వచ్చాను. మీ రెలా ఉన్నారో అని." నలిగిన అమ్మాయిలను చూస్తూ, "మీకు కాస్త మార్పు అవసరం. రెడీగా ఉండండి. ఇంటికి తీసుకొని వెడతాను" అని చెప్పి హాస్పిటల్ కి వెళ్ళి సంతకం చేసి, అతని డ్యూటీ మరొకళ్ళకి అప్పజెప్పి ఇంటికి వెళ్ళాడు రాజీవ్.
* * *
తల దువ్వుకొంటున్నది వీణ. పిరుదులు క్రిందుగా అల్లల్లాడుతున్న నీలవర్ణ కేశాల క్రింద నడుము మరీ చిన్నగా ఉంది. లేత వయస్సును తెలుపుతున్న శరీరపు మనువు చిక్కినట్లుంది.
"వీణా!"
"ఊఁ!"
"రాజీవ్ మంచివాడే కదూ?"
"కొన్నిసార్లు మంచిగానే కనిపిస్తాడు."
"అతనంటే నీ కెలాటి భావమూ లేదా?"
"ఏ భావమూ లేదు."
"నీ కంటికి అందంగా లేదా? సంజయ్ లా అందంగా ఎండెరగని నవాబులా ఉండాలా!"
'సంజయ్' అనగానే క్షణం మౌనం వహించింది వీణ.
ఈ మధ్యనే రెండు మూడు ప్రేమలేఖలు వచ్చాయి. అతని మనస్సును దేనిమీద లగ్నం చేయలేక పోతున్నాడట. కంటికి నిదుర దూరమైందట. సీతకు దూరమైన రాముడు, లైలాకు దూరమైన మజ్నూ, జూలియట్ ని ప్రేమించిన రోమియోలు అతని హృదయంలో స్థాన మేర్పరచుకొన్నారని, వారిలా దుఃఖాంతం కాకుండా సుఖాంతం అవ్వాలని, ఏనాన్డూ దేవుని తలంచని వాడు రోజూ దేవాలయానికి వెళ్ళి వస్తున్నాడని వ్రాశాడు. ఆ లేఖలను చింపి గాలిలో ఎగరవేసింది. ఇప్పుడు హఠాత్తుగా సంజయ్ పేరు ఎత్తగానే బదులు చెప్పలేక పోయింది.
ఆత్రతగా, "వీణా!" అంది సోఫీ.
ఆ గొంతులోని కొత్తదనానికి సోఫియా వైపు తిరిగి, "సోఫీ! సంజయ్, రాజీవ్, పెళ్ళి- ప్రేమ - ఐ హేట్ ఎవ్వెరిథింగ్! డు యూ అండర్ స్టాండ్!" అంది.
"కన్నెపిల్ల కలలు, స్వతస్సిద్ధమైన ప్రేమ-అవి నీలో కలగకపోవటం వింతగానే ఉంది. పూర్వాను భవమున ఏ దేవకన్యవో కాని, నీలో హేట్ ఎందుకు వచ్చింది?"
వీణ ఫోర్తు ఫారమ్ చదివే రోజుల్లో సజ్జకంకులు తెచ్చుకొందామని పొలానికి పోతూ ఉంది. మధ్యాహ్నం వేళ, గడ్డివాము పక్కన ఒక ఆడది కఠినమైన నేలపై ఉంది. తొడలు, రొమ్ములు కనిపిస్తున్నాయి. ఓ యమ్మో ఓలమ్మూ అంటూ నవ్వుతున్నది. దానిపై మగవాడ, నగ్నంగా.... ఏమి చేస్తున్నాడో ఏమో పసిమనస్సుకు పూర్తిగా అవగాహనం కాలేదు. కాని, అది మంచి పని కాదు అని తెలుసు. అసహ్యమనిపించింది. వయస్సు పెరిగి ప్రపంచజ్ఞానం తెలిసి వస్తున్న కొలది ఈ ప్రేమ - పెళ్ళి రోతగా కనిపించాయి. రవికెనుండి జారిన దాని రొమ్ములు గుర్తుకొస్తే రోమాంచిత మవుతుంది.
ఆ సంఘటన చెప్పిన వీణవైపు చూచింది సోఫియా. ఆముదం తాగినట్లున్న వీణ ముఖం చూచి పకపక నవ్వుతూ, "అది ప్రకృతిసిద్దం! భార్యాభర్తల కలయిక పవిత్రమైంది. అది దేవుడు నిర్ణయించిందే. అలా కాకుంటే ఇంత అందాలరాశిని మీ అమ్మకు, నాన్నకు ఎలా పుట్టేదానివి! ప్రపంచం నడిచే దెలా?" అంది సోఫీ.
"అందుకే మనిషి జన్మకంటే ఏ పక్షిగానో!"
"అవీ చేస్తాయి."
"ఏ పూవుగానో!"
"మకరందం కోసం తుమ్మెదల గుంపు..."
"బాబోయ్!" చెవులు మూసుకుంది వీణ.
పరిచయమైన కారు హారన్ వినిపించింది. అలంకరణ ముగించి బయటికి వచ్చారు.
టౌనుకు రెండు మైళ్ళ దూరం పోయాక ప్రహరీ గేటులోకి పోయింది కారు. బాట కిరుపక్కల కొబ్బరి చెట్లు- వాటి మట్టలు బాటమీదకు వాలి ఆహ్వానితులను ఆహ్వానిస్తున్నట్లుండే వాటి మధ్య ఉన్న అశోకాలు అటెన్షన్ లో నిలుచునట్లున్నాయి. సెల్యూట్ తీసుకొంటున్నట్లు మెల్లిగా పోనిచ్చాడు కారును. రకరకాల పువ్వులున్న చెట్లు చుట్టూ కనిపించాయి. అంత విశాల మైన స్థలంలో సీజన్ మొక్కలు వేసి తీయటం, పైగా వాటిని మెయిన్ టైన్ చేయటం కష్టం. అందుకు వృక్షాల్లా పెరిగి రంగురంగుల పువ్వులు పూయగల అడవి కొండగోగు, తంగేడు, బిల్లుడు, రేలు, కానుగ, మోదుగ, రేగి మొదలగు చెట్లను పెంచారు. ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ చెట్లు పూలతో వాజ్ లో అమర్చినట్లున్నాయి.
బాట నేరుగా లేదు. వంకర టింకరగా ఉంది. అందుకు కొద్ది దూరంలో ఉన్న ఆ రెండంతస్తుల భవనం రోడ్డుకు కనిపించనే లేదు.
పోర్టికోలో కారు ఆగింది. అక్కడ పొడుగాటి కారు ఉంది. దానిని చూస్తూ, 'మినిస్టరుగారు వచ్చి నట్లుంది' అని స్వగతంగా అనుకొన్నాడు.
ఆ చివరనుండి ఈ చివరి వరకు పొడుగాటి మెట్లు. వాటిపై రకరకాల క్రోటన్స్ కుండీలు అమర్చి ఉన్నాయి.
మెట్లెక్కుతూ వీణవైపు సంతోషంగా చూశాడు. 'ఇది నీ ఇల్లు' అన్నట్లుగా ఉన్నాయి ఆ చూపులు. ఆ భావాన్ని సోఫియా చదవగలిగింది.
వరండా దాటుతుండగా సింహగర్జనలా వినిపించింది. ఎగిరిపడి సోఫియా చెయ్యి పట్టుకొంది వీణ. సోఫియా కూడా దడుచుకొంది.
రాజీవ్ గద్దించగా కొత్తవారి వైపు గుర్ మని చూసింది అల్సేషియన్ కుక్క.
డ్రాయింగ్ రూమ్ లోనుంచి భాగ్యవంతుల దర్పము, లక్ష్మీకళ, చామనఛాయ వర్ణంలో సౌందర్యవతి, ఏ వంకా లేని జానకీదేవిని చూపించి, "మా అమ్మ!" అని సోఫియా, వీణలకు పరిచయం చేశాడు.
రాజీవ్ కి ఎందరో గర్ల్ ఫ్రెండ్సు ఉన్నారు. కాని, వాళ్ళెవ్వరినీ ఇంటికి తీసుకొని రాలేదు. ఈ వచ్చిన వాళ్ళలో ఏదో ఇంటరెస్ట్ ఉండి ఉండవచ్చు!
"అబ్బాయ్! మినిస్టర్ మామయ్య వచ్చాడ్రా" అంటూ వీణవైపే చూడసాగింది. అందం ఉన్నవాళ్ళ దగ్గర లక్షలు ఎందుకు ఉంటాయి? చదువులకు ఎందుకు వస్తారు? అనుకొంటూనే, "పైకి పదండమ్మా!" అని లోనికి పోయింది.
ఆమెతో డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళారు. మెత్తటి కార్పెట్, సోఫాలు, షోకేసులతో అట్టహాసంగా ఉంది ఆ రూము.
ఎర్రగా, లావుగా పొడగరైన ఆయన్ని చూపుతూ, "మా నాన్నగారు" అని, వీణ వైపు తిరిగి, "వీణ- రెండో సంవత్సరం; సోఫియా- ఫైనల్ ఇయర్" అని చెప్పాడు రాజీవ్.
నమస్కారాలు చేసిన వారిని - "సుఖీభవ!" అని దీవించారు.
ఇంకొక ఆయన్ని చూసి, "మంత్రి మామయ్య!" అని నవ్వాడు రాజీవ్.
వారు గది బయటికి పోగానే మంత్రిగారు, "బాలాజీ! నీకంటే గట్టివాడోయ్ నీ కొడుకు" అంటూ బిగ్గరగా నవ్వాడు. "అబ్బాయి అలాంటివాడు కాదు" అంది జానకీదేవి.
'ప్రతి తల్లీ అలాగే అనుకొంటుంది' అనుకొంది సోఫియా.
మిద్దె వసారాలో సోఫాలు, కుర్చీలు ఉన్నాయి. సింపుల్ గా, నీట్ గా ఉన్నాయి.
'సినిమాలోకి ఇల్లులాగా ఉంది' అనుకొంది వీణ. తన వెంటబడే రాజీవ్ ఇంత గొప్పవాడని తలంచలేదు.
కూర్చోమని చెప్పి, "లక్ష్మీగారూ!" అంటూ ఒక గదిలోకి వెళ్ళాడు రాజీవ్. వెంటనే ఒకామె చెయ్యి పట్టుకొని చిన్నపిల్లాడిలా వచ్చాడు. చిరునవ్వుతో వారి కెదురుగా కూర్చుంది ఆమె.
"ఈ అమ్మాయి వీణ కదూ? నీవు సోఫియావి!" అవునా అన్నట్లు రాజీవ్ వైపు చూచింది. తల ఊపుతూ ఆమె పక్కన కూర్చున్నాడు.
వంకుల జుట్టు. పాపిట మధ్యలో తెల్ల వెంట్రుకలు నిండుదనాన్నిచ్చాయి. పెద్ద కళ్ళు. పొడుగాటి ముక్కు. మెరుపు తగ్గని శరీరఛాయ. రాజమాతలా ఉన్నది పట్టుచీరలో. ఆమె దగ్గర ఎవ్వరైనా మనస్సు విప్పి స్వతంత్రంగా మాట్లాడగలరు. మంచి మాటకారి. కొత్త దనం తెలియకుండా సంభాషణ సాగించగల నేర్పు ఉంది. కాలేజీ, చదువు, హాస్టల్ విషయాలు ఆసక్తిగా దిగి తెలుసుకొంది.
క్రిందనుంచి రాజీవ్ కి పిలుపు వచ్చింది. వెళ్ళాడు.
వీణ స్వవిషయలు మాటల్లో అడిగింది. "దొరా!" అంటూ పనివాన్ని పిలిచి ఫలహారాలు తెప్పించింది. నాలుగైదు రకల స్వీట్లు, జీడిపప్పు, పకోడీ ప్లేట్లు వారి ముందుంచింది.
ఒకటీ అర తింటున్న వారిని బలవంతం చేసింది. "మీ రేమీ తినలేదే! బాబు మధ్యాహ్నమంతా హడావుడి చేశాడు..."
వారు కాఫీ తాగాక, "అలా తోటలోకి వెళ్ళిరండి. నేను పూజ ముగించుకొని వస్తాను" అంటూ వారికి తోటవైపు దారి చూపింది.
అంతవరకు నిర్భంధంలో కూర్చున్నట్లుంది. ఫ్రీగా గాలి పీల్చుకొంటూ తోట మధ్యలోకి వచ్చారు. ఊయల బల్ల ఉంది. పరుగున వెళ్ళి కూర్చున్నారు.
* * *
