Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 13

 

    రాత్రి భోజనాలు చేసి పడుకున్నారు. శాంత త్వరగానే నిద్ర పోయింది. శారద మాత్రం ఆలోచిస్తూ ఉంది. 'రామం అన్నయ్య ఎంత మంచివాడు ఆ నిండుతనం, హుందాతనం దానికి తగిన చక్కని రూపం, సొబగైన మాటతీరు. కనుకనే ఊరినంతా తనమాటపై నడిపిస్తున్నాడు. అంత గంభీరంగా ఉంటూనే యింత  చలాకీగా మాట్లాడుతాడని అనుకోలేదు. అతని వ్యక్తిత్వం ముందు ఈనాటి ఈ పెద్ద చదువులు ఎందుకు పనికి వస్తాయి? ఎటువంటి వాడినైనా అట్టే తన మాట లతో వశపరచుకొనే మహత్తు ఉంది అతనిలో. త్యాగబుద్ది, వినయ విధేయ తలు, ఆస్తికత్వము అతనికి పుట్టుకతో వచ్చిన గుణాలులా భాసిస్తున్నాయి. శాంత నిజంగా ధన్యురాలు. శాంత ఆవేశానికి, ఉద్రేకానికి అన్నయ్య నేమ్మదికీ కలిసి పోతుంది, పాలల్లో తేనె కలిసినట్లు.
    'ఇప్పటికి నా జీవితం ఒకగాడిన పడింది. ఆ శ్రీపతిగారు, అన్నపూర్ణమ్మ గారు ప్రభాకరంతో ఎన్నిబాధలు పడుతున్నారో? వారి విషయం తలపుకు వచ్చి నప్పుడల్లా వారిపై నాకెక్కడ లేని జాలి కలుగుతూ ఉంది. ప్రభాకరం యిప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో?' పైవిధంగా ఏవేవో ఆలోచిస్తూ నిద్రాదేవి ఒడిలో తలదాచుకుంది శారద.
    శాంత శారదలిద్దరూ భిన్న ప్రవృత్తి గల యువతలు. గులకరాళ్ళపై గలగల శబ్దం చేస్తూ ప్రవహించే సెలయేరు వంటి మనస్తత్వం శాంతది. లోతైనా ప్రదేశంలో, వెడల్పుగా ఉన్నచోట, నెమ్మదిగా, నిండుగా ప్రవహించే నదిలాంటి మనస్తత్వం శారదది. ఆవేశము రావడానికీ, అది తగ్గడానికీ ఎక్కువ వ్యవధి అక్కరలేదు శాంతకు. అసలు ఆవేశమే రాదు శారదకు. ఒకవేళ వస్తే త్వరగా తగ్గదు. ఇద్దరూ అందంలో ఒకరినిమించి మరొకరు పోటీపడుతుంటారు. కోలముఖం, సోగకళ్ళు, నవ్వితే సొట్టలు పడుతూ ఎర్ర గులాబీలను గుర్తుకు తెచ్చే ఆ బుగ్గలు, అరవిచ్చిన మందారాలతో పోటీపడే ఆ పెదిమలు, ముఖంలో చురుకుదనం, కళ్ళల్లో చిలిపితనం ఎవరినైనా యిట్టే ఆకర్షించగలదు శాంత.
    కష్టాలలో పెరిగినా పోషణ సరీగాలేకపోయినా శారదను ఒకసారి చూస్తే మరొకసారి చూడకుండా ఉండలేరు. చంద్రబింబంలాంటి ముఖం, కొసదేలిన ముక్కు తెల్లని ఛాయగల ముఖానికి తుమ్మెద రెక్కలలాంటి నల్లని కళ్ళు ఆమె అందాన్ని యినుమడింప జేస్తాయి. ఆభరణాలు లేకున్నా కళగల ముఖంతో, పెదిమలపై లాస్యం చేసే చిరునవ్వుతో ఎంతో అందంగా కనుపిస్తుంది శారద.
    వారిద్దరి మనోభావాలకు తగినట్లుగానే వారి ప్రవర్తన ఉంది. ఏపనినైనా బాగా ఆలోచించి, తనలోతాను ఆ పనిని గురించి తర్కించుకోని తను చేస్తున్నపని సక్రమమైనదే అని రూఢి అయిన తర్వాత గాని ఆ పనిని ప్రారంభిస్తుంది శారద. అందుకు పూర్తి విరుద్ధం శాంత. శాంత శారదకయ్యే ఖర్చులు భరిస్తున్న ప్పటికి, బాగా ఆలోచించి నిత్యవసర మైన ఖర్చులకు తప్ప, విలాసాలకు గాని, వృధాఖర్చులకు గాని చిల్లిగవ్వ ఖర్చుచేయనిచ్చేది కాదు. శారదతో స్నేహం కలిసిన తర్వాత శాంతచేసే దుబారాఖర్చులు కూడా చాలావరకు తగ్గాయి.

                              *    *    *

    శాంత, శారదలకు అక్కడ శలవులు ఉత్సాహంగా గడిచిపోతున్నాయి. వారిద్దరూ ప్రతినిత్యమూ తోటకు వెడుతున్నారు. సాయంకాల మవగానే రామంకూడా విధిగా తీరిక చేసుకొని తోటకు వస్తున్నాడు. ముగ్గురూ కాలం తెలియని కబుర్లతో చీకటి పడేంతవరకు గడుపుతున్నారు.  ఆ తర్వాతంలంటికి వెళ్ళి భోజనం చేసి, పుస్తకాలు చదువుతూ ఆ తర్వాత నిద్రపోతున్నారు. ఇదీ వారి దినచర్య.
    శారదకు లక్ష్మయ్యగారి యింట్లో ఆ కొద్దికాలంలోనే చనువు పెరిగింది. పార్వతమ్మగారిని అత్తయ్య అనీ, లక్ష్మయ్య గారిని మామయ్యా అని పిలుస్తూ వారికి సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. పార్వతమ్మ గారికి పనిలో సహాయపడుతూ, ఆమె మెప్పును పొందుతూ ఉంది. ఆ వృద్ధ దంపతులు రామంద్వారా శారద విషయాలు విని ఆమెపై జాలితలచారు. శారద చదువు బాధ్యత రామం వహించాడని తెలుసుకొన్నప్పుడు ఆయన సంతోషించారు. శారద తన సత్ప్రవర్తనతో అందరి ప్రేమకూ పాత్రురాలైంది. తన చదువు విషయంలో అందరి ఆమోదం లభించడంతో శారద హాయిగా నిట్టూర్చింది.
    ఒకరోజు లక్ష్మయ్యగారు కట్టించిన ఆలయానికి ముగ్గురూ వెళ్ళారు-
    పూజారిని నియమించి, ఆ దేవాలయానికి కావలసినంత స్థిరాస్తిని తమ పొలాలనుండి వ్రాసిచ్చారు లక్ష్మయ్యగారు. ఆలయంలో రెండుపూటలూ నిత్యనైవేద్యాభిషేకాలు జరుపుతుంటాడు పూజారి. పర్వదినాలలో ప్రత్యేకపూజలు, పేదలకు అన్నదానాలు రామం దగ్గర ఉండి స్వయంగా జరిపిస్తాడు.
    వీరు వెళ్ళగానే పూజారి వారిని సాదరంగా ఆహ్వానించి వారి చేతులలో ఉన్న టెంకాయ, తదితర పూజాద్రవ్యాలను అందుకొని వారిగోత్ర నామాలతో పూజ ప్రారంభించాడు. శాంత గంట అందుకోలేక ఒకచేతితో రామం భుజాన్ని ఆసరా చేసుకొని కొద్దిగా ఎగిరి మరొక చేతితో గంటను వాయించింది. వారిద్దరినీ సంతోషంగా చూస్తూ నిలుచుంది శారద. అప్పుడే పూజ ముగించి మంగళహారతి తీసుకు వచ్చిన పూజారికంటకూడా ఈ దృశ్యం పడింది. ముసిముసిగా తనలో తాను నవ్వుకున్నాడు ఆ గ్రామంలో అందరికి తెలుసు శాంతా రామం యిద్దరూ కాబోయే దంపతులని. వారిద్దరూ కలిసి ఎటైనా వెళ్ళినా, ఒకరిని ఒకరు చనువుగా పిలుచుకున్నా ఎవరూ విడ్డూర పడరు. ఆక్షేపించరు.
    ముగ్గురూ పూజారి తీసుకువచ్చిన హారతిని భక్తితో కళ్ళ కద్దుకున్నారు. ప్రసాదం నోట్లో వేసుకొని అక్కడఉన్న అరుగుల మీద కూర్చున్నారు. ఆ ఆలయం చుట్టూ ఉన్న తోటను చూసి వస్తానని శాంతను. రామాన్ని ఒంటరిగా ఒదిలి వెళ్ళింది శారద.
    'శాంతా దేవుడి ని ఏం వరం కోరుకున్నావ్?'
    'నా బావప్రేమ చిరకాలం నాపై యిలాగే ఉండా...'సిగ్గుతో తల ఒంచుకొని మిగతా మాటలు పూర్తి చేయలేక పోయింది.
    'ఊఁ....అలాగా? అదేమంత అసాధ్య మైన కోరికని...?'
    'ఏమో...? రేపు ఏ కన్నెపిల్లైనా నా బావమనసు దోచేసి వలలో వేసుకుంటే....! అప్పుడు నేనేం కావాలి?' క్షణంలో శాంతముఖం కవళికలు మారిపోయాయి. ఆమెకళ్ళు విచిత్రంగా కదిలి చెమ్మగిల్లాయి. శాంత అందమంతా ఆమె కళ్ళల్లోనే ఉంటుంది. రామం ఎప్పుడూ ఆమె కళ్ళనే వర్ణిస్తూ ఉంటాడు.
    'అదేమిటి? ఇంతే నా నీవు నన్ను అర్ధం చేసుకున్నది?'
    'క్షమించు బావా! కీడెంచి మేలెంచ మన్నారు పెద్దలు. రేపేదైనా జరిగితే నేను భరించలేను. ప్రతి చిన్న విషయానికి నే నెంతగా బాధపడతానో నీకు తెలుసు. నీవు నన్ను అర్ధం చేసుకున్నట్లు అమ్మా....! నాన్న...! కూడా నన్ను అర్ధం చేసుకోలేరేమో...?' చెమ్మగిలిన కళ్ళను పమిటతో తుడుచుకుంటూ అంది శాంత.
    'నీ కసలు అటువంటి ఊహ ఎందుకు వచ్చింది?' క్వశ్చన్ మార్కు ముఖం పెట్టి ప్రశ్నించాడు.
    'ఎందుకో బావా...? అప్పుడప్పుడు నాకు భయం కలుగుతూ ఉంటుంది. నీవు అందగాడివి. పైగా అందరితో చనువుగా ప్రేమగా మాట్లాడుతావు. ఊరిలో పెద్దరికం! నిన్ను వలలో వేసుకోవడానికి నీ మనసు మార్చడానికి ఎవరైనా స్వార్ధపరులు ప్రయత్నించ వచ్చు' అనుమాన పడుతూ అంది శాంత.
    'పిచ్చిదానా...? నీబావ అంత చపల చిత్తుడనుకున్నావా...? వెంటపడిన వారలదరి వెంటపడడానికి? ఒకవిధంగా ఆప్రశ్న నిన్ను నేనే చేయాలి. కాని నీపై నాకు ఆ విశ్వాసం, నమ్మకం రెండూ ఉన్నాయి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో పెట్టుకుని బాధపడకు' లాలిస్తున్నట్లుగా' అన్నాడు రామం.
    'అంతలో శారద తోటంతా తిరిగి ఆ యిద్దరున్న చోటికి వచ్చింది. శాంత ముఖంలో వచ్చిన మార్పు ఆమెకు అర్ధం కాలేదు.
    ముగ్గురూ మౌనంగా యింటివైపు నడిచారు-
    శలవులు పూర్తయ్యాయి. శాంత, శారద లిద్దరూ ప్యాసయ్యారు. బి. ఏ రెండవ సంవత్సరం చదవడంకోసం రామం వద్ద శలవుతీసుకొని బయలుదేరారు. వాళ్ళ నిద్ధరినీ బస్సువరకు సాగనంపి జాగ్రత్తగా ఉండవలసిందని చెబుతూ యింటికి తిరిగి వచ్చాడు రామం.

                            *    *    *

                                   6

    'కమాన్ డియర్...! ఈ రోజు మా యింటికి వెడదాం...!'
    'ఎందుకులే ప్రభాకర్...! నన్ను చూసి మీయింట్లోవారేమైనా అనుకుం'టారేమో?' సంకోచపడుతూ అంది రోజా.
    'ఎవరేమనుకుంటే మనకేమిటి? అయినా ఈరోజు నీవు ధరించిన దుస్తులు చూసి నిన్ను ఆడపిల్ల అని పోల్చుకోవడం కష్టం పద వెడదాం. అంతగా చూస్తే ...చూశారు. మనకేంభయం...? ధైర్యంగా చెప్పేస్తాను. మనమిద్దరము 'వుడ్ బి కపుల్' అని.'    
    'సరే! నీకంత ధైర్యంగా ఉంటే నేనెందుకు కాదనాలి...? పద వెడదాం?'
    ఇద్దరూ హోటలునుండి బయటపడి, అప్పుడే ఎదురుగా వస్తూన్న టాక్సీని ఆపి అందులో యింటికి బయలుదేరారు. రాత్రి ఎనిమిదైంది. హాలులో శ్రీపతిగారు, నీరజ కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రభాకరం వెనుకనే మేడపైకి వెళ్ళిన రోజాను చూస్తూ 'చూడమ్మా నీరజా! ప్రొద్దుననగా వెళ్ళాడు. ఇప్పుడెవరో స్నేహితుడితో యింటికి వచ్చాడు. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు.'
    'స్నేహితుడు కాదు మామయ్యా! స్నేహితురాలు. ఎవరో క్రిస్టియన్ అమ్మాయిలా ఉంది. మెడలో శిలువగుర్తు ఉన్న గొలుసు కనుపించింది.'
    'ఏమిటి...? అమ్మాయా! అదె మిటే? ఇప్పుడు ప్రభాకరంతో పైకి వెళ్ళింది అబ్బాయి కాదూ?' విస్మయంతో ప్రశ్నించారు శ్రీపతిగారు.
    'అబ్బే! కాదు మామయ్యా! అమ్మాయే! మగదుస్తుల్లో ఉంది.'
    'అలాగా! అవుతే యిప్పుడే వెళ్ళి అంతు తేల్చేస్తాను. చొప్పనామిలో నిప్పును దాచినట్లు వీడు నాయింట్లో యిటు వంటి అప్రాచ్యపు పనులు చేస్తున్నాడా...? ఇంకేముంది వంశప్రతిష్ట. తగలబడి నట్లే!' శ్రీపతిగారికళ్ళు నిప్పులు కురిపించాయి.
    'మామయ్యా! ఆవేశపడకు. చెలిమిన చేదు తినిపించవచ్చుగాని బలిమిన పాలు త్రాగించలేము. ఆవేశం అన్నివిధాలా చెరువు.'
    'ఎన్నిసార్లో నచ్చజెప్పాను తల్లీ! వింటేనా...? చేసేవన్నీలోపాలు, చెపితే కోపాలు అన్నట్లు గట్టిగా మాట్లాడితే ఖస్సుమంటాడు. చిలికీ చిలికీ పెద్ద గాలివానగా మారుతుందేమోనని యింత వరకూ వోర్పువహించి ఊరుకున్నాను. ఇక లాభంలేదు బయట ఎలా తగలడినా సహించి, కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుందని ఎంతో సహనంతో నెట్టుకు వస్తున్నాను.' కన్నీరు నింపుకున్నాయి వారికళ్ళు.
    శ్రీపతిగారి పరిస్థితికి నీరజ జాలి పడింది. అంతకన్న ఆమెమత్రం ఏం చేయగలుగుతుంది? ఒకటి రెండుసార్లు ప్రభాకరానికి ఏదో నచ్చజెప్పపోయి భంగపడింది కూడా.
    'మామయ్యా చిక్కుడు తీగకు బీరకాయ కాస్తుందా...? బావ మంచివాడే! ఎలా గైనా అతనిని ఈ పరిసరాలనుండి తప్పించి వేరే ఎక్కడైనా ఉంచి చదివిస్తే బాగు పడతాడేమో? గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలను ఏరినట్లు అతని చెడు స్నేహాలను మాన్పించకుండా అతనిని నిందించి ఏం ప్రయోజనం? ఇక్కడ ఉంటే ఆ స్నేహాలు మాన్పించడం చాలా కష్టం! నీవుకూడా బాగా ఆలోచించు.'
    'కొరివి పెట్టేవాడు కొడుకు, కూడు పెట్టేది కూతురు-అని ఒక్కగా నొక్క కొడుకు వాణ్ణి ఒదిలి ఉండాలంటే మాకు మనసు ఒప్పడంలేదు. మీ అత్తయ్య అసలు ఒప్పుకోదు. ఏం చేయాలో తోచడం లేదు. అయినా నీ సలహా పాటించే ప్రయత్నంలో ఉంటాను. కొంగు తడిస్తే చలిగాని కోకంతా తడిస్తే ఏం చలి అన్నట్లు ఇప్పటికే నిండా మునిగి ఉన్నాను. వాడు దూరమౌతాడనుకుంటే అసలుకే మోసం వచ్చేటట్లుంది.' అని వాపోయారు శ్రీపతిగారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS