Previous Page Next Page 
లోకం పోకడ పేజి 13


                                  11

                
    జనవరి ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ దోనోత్సవాన హైస్కూల్లో 'స్త్రీ పాత్ర' నాటిక ప్రదర్శించారు. నాటిక ఎంతో బాగుందని అంతా ప్రశంసించారు. అంతవరకూ ఆ నాటిక వ్రాసిన వ్యక్తీ ఎవరయిందీ వసుంధర చెప్పలేదు. ఎవరో సరోజ అనే అమ్మాయి వ్రాసిందనే చెప్పింది అందరికీ. కనీసం నాటిక ప్రదర్శించే వాళ్ళకయినా చెప్పలేదు. నాటికను అంత రసవత్తరంగా ప్రదర్శిస్తారని , అంతా ఎంతో మెచ్చు కుంటారనీ ఎవ్వరూ అనుకోలేదు.
    నాటిక పూర్తయింది. పాత్రధారులను స్టేజి మీద హెడ్ మాస్టారు గారు పరిచయం చేశారు. నాటిక వ్రాసిన వారు 'సరోజ ' అని ఊరుకున్నారు హెడ్ మాస్టర్ గారు. అక్కడే ఉన్న వసుంధర మైక్ దగ్గరికి వచ్చి 'స్త్రీ పాత్ర నాటిక రచయితను పరిచయం చేస్తాము. ఒక్క క్షణం నిశ్శబ్దంగా కూర్చోండి " అన్నది.
    అంతా ఎవరా అన్నట్లు ఆత్రంగా రంగస్థలం వైపు చూడసాగారు. "సరోజ గార్ని స్టేజి మీదకు రావలసిందిగా కోరుతున్నాను" అన్నది మైక్ లో వసుంధర. హెడ్ మాస్టారు గారు కూడా ఎవరా సరోజ అన్నట్లుగా వసుంధర వైపు చూశారు. ప్రేక్షకుల స్థానం లో నాలుగవ వరుస లో కూర్చున్న రమేష్ మెల్లగా కుర్చీలన్నీ దాటుకుంటూ వచ్చి స్టేజి ఎక్కి అందరికీ నమస్కరించాడు. అంతా విభ్రాంతులైనారు. సరోజ అంటే ఏ విద్యార్ధినో అనుకున్నారంతా.
    "నా పేరు రమేష్. ఇక్కడ కాలేజీ లో ఇంటర్  రెండవ సంవత్సరం చదువుతున్నాను. ఈనాటికకు మాత్రం 'పెన్ నేమ్' గా సరోజ అని పెట్టుకున్నాను. నాటికను గురించి ప్రేక్షకులు ఏమను కుంటారో నని నాకు చాలా భయం కలిగింది. నా భయం ఇప్పుడు పూర్తిగా తీరిపోయింది. సెలవు' అని రంగస్థలం దిగివచ్చి తన స్థానం లో కూర్చున్నాడు.
    మర్నాడే వసుంధర నాటికలోని పాత్రధారు లందరినీ తీసుకుని రమేష్ గదికి వచ్చింది. నాటిక వ్రాయడం లో అతనికి గల రచనా]చాతుర్యాన్ని అంతా మెచ్చుకున్నారు. ఇన్నాళ్ళ నుంచీ గుంటూరు లోనే ఉంటూ ఇంత చక్కగా వ్రాయ కలిగిన నాటికా రచయితను పరిచయం చేసుకో లేకపోయినందుకు అంతా నొచ్చుకున్నారు.
    తమకు ఇంకా రెండు నాటికలు వ్రాసివ్వమని అడిగారు.
    "మనందరి కన్నా వసుంధర వీరిని ముందుగా పరిచయం చేసుకుంది. చాలా అదృష్టవంతు రాలు. 'స్త్రీ పాత్ర' నాటికను అసలు వసుంధర ను దృష్టి లో ఉంచుకునే వ్రాశారని మా అభిప్రాయం. అందుకు తగినట్లుగానే వసుంధర కూడా ఆ పాత్రను అతి సమర్ధత తో పోషించింది " అన్నారొకరు.
    "మేం రిహార్సల్సు వేసేటప్పుడు మిమ్మల్నీ , మీనాటికనూ ఎంతో మెచ్చుకునేదండీ వసుంధర . కాని మాతో చెప్పేటప్పుడు మీరామె స్నేహితురాలని చెప్పేది. చెట్టంత మగవాణ్ణి పట్టుకుని ఆడదిగా ఎందుకు మార్చి చెప్పిందో మాకు అర్ధం కావడం లేదు. ఈ రహస్యం మాకెందుకు చెప్పలేదే , వసుంధరా?' అన్నదొక స్నేహితురాలు.

                       
    "తన గుట్టు బయట పడకూడదనే ఇట్లా నాటక మాడింది" అన్నది ఇంకో అమ్మాయి.
    "చాలించండి. మీకేమీ మీ రనుకున్నంత గుట్లూ, రహస్యాలూ లేవు. ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఇంత చదువు కుంటున్నా తెలీదు" అన్నది కోపంతో వసుంధర. ఇంక ఆ విషయం ఎవరూ మాట్లాడలేదు.
    "మీకు తగిన సత్కారం చెయ్యాలని మేం అనుకుంటున్నామండీ, అందుకు మీ అందరి సహకారం అవసరం లేకపోయినా మేమే కల్పించుకొని మా ముచ్చట కూడా తీర్చుకోవాలని మా అభిలాష. వసుంధర అంటే మా హైస్కూల్లో అభిమానమే. కాబట్టి మా డ్యూటీ మేము చేసుకోవాలి" అన్నది ఒక విద్యార్ధిని.
    "ఏమిటా సత్కారం? మంచి టీ పార్టీ ఏర్పాటు చేస్తున్నారా?' అన్నాడు సురేంద్ర.
    "టీ పార్టీలు, డిన్నరు పార్టీ లు మామూలుగా జరుగుతూ ఉండేవే. అందులో ప్రత్యేకత ఏమీ లేదు. దైవం అనుకూలిస్తే ......' అంటూ వసుంధర వైపు చూసిందా విద్యార్ధిని. ఆ చూపులోని భావం అంతా అర్ధం చేసుకున్నారు . రమేష్ మనస్సులో తృప్తి గా నవ్వుకున్నాడు. వసుంధర సిగ్గుతో తల వాల్చింది.
    "వెరీ మెనీ కంగ్రాచ్యు లేషన్స్" అంటూ నవ్వాడు సురేంద్ర.

                                                      *    *    *    *
    శ్యామ సుందరి ని పెళ్లి చేసుకోవడానికి సురేంద్ర కు ఇష్టం లేదని తెలిసినప్పటి నుంచి రాయుడు గారికీ, రామయ్య గారికి ఉత్తర ప్రత్యుత్తరాలు నిలిచి పోయాయి. అదీగాక ఇద్దరూ ఎలెక్షన్ ప్రచారాల్లో పడ్డారు. కాని ఆడవాళ్ళ కు మాత్రం మనస్సులో కష్టంగానే ఉంది. ఒకరోజున రాయుడు గారితో భార్య అన్నది: "ఆడపిల్ల కలవాళ్ళం మనమే అంత భీష్మించి కూర్చుంటే, మగపిల్లాడు కలవాళ్ళు వాళ్ళెంత బెట్టుగా ఉండచ్చు? అయిన మనకీ పట్టుదలలు ఎందుకు చెప్పండీ? మీ బావగారి విషయం మీకు తెలీదా? అయన పట్టిన కుందేటి కి మూడే కాళ్ళు . సురేంద్ర యినా ఏదో చిన్నతనం వల్లా, చదువు ధ్యాసతో పట్టం వల్లా అట్లా అన్నాడే గాని మనమ్మాయి ని చేసుకోడానికి అతనికి మాత్రం అభ్యంతరం ఏముంటుంది?-- అని ఆవిడ ఎంత నచ్చచెప్పినా రాయుడు గారు వినలేదు.
    "చూడవే. నాకూ ఒక్కగానొక్క కూతురు. నా ఆస్తి అనుభవించే యోగ్యత వాడికి లేదు. కాబట్టే వాళ్ళకా బుద్ది పుట్టింది. మనకేం? పదిమంది ఆడపిల్ల లున్నారనా , ఇంతమంది పెండిండ్లు ఎట్లా చేస్తామని అనుకోడానికి? నా మంచితనం, మాటతనం అ తండ్రీ కొడుకుల దగ్గర పనికి రాలేదు. పార్టీ తత్త్వం కూడా వదలుకొని ఆడపిల్ల నిచ్సుకునే వాణ్ణి కదా అని, పార్టీ విషయాలు అవతలకు నెట్టి, వాళ్ళింటికి వెళ్లాను. అంతకన్నా ఇంకేం చెయ్యాలో నాకు అర్ధం కావడం లేదు. నేనూ పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న రాజకీయ వేత్తనే.  పదిమంది లో తిరగానేర్చిన వాడినే. ప్రజాక్షేమమూ, వారి మంచి చెడ్డలు తెలుసుకుని ఆకళింపు చేసుకుని సంచరించే వాడినే. నా పిల్లకు పెళ్లి చేయడం నాకు తేలిక పోలేదు. ఆరోజున నేను వాళ్ళింటికి వెళితే అంతా నా వైపు ఆశ్చర్యంగా చూశారు. అటు సూర్యుడు ఇటు పొడిచినా ఒకరి పార్టీ సిద్దాంతాలు మరొకరికి నచ్చని మేము వియ్య మందబోతున్నాము అంటే అంతా ఆశ్చర్య పడసాగారు. కాని వాళ్ళకా యోగ్యత లేదు. అయినా ఇప్పుడప్పుడే శ్యామ పెళ్ళికి తొందరేం చెప్పు? పట్టుమని పడ మూడేండ్లు నిండలేదు. దాని పెళ్లి విషయం నువ్వేమీ దిగులు పడనక్కర లేదు. తెలిసిందా?' అని గట్టిగానే సమాధానం చెప్పాడు రాయుడు గారు. దానితో ఆవిడ మరి మాట్లాడలేదు.
    తల్లి తండ్రులు మాట్లాడుకునే విషయాలు శ్యామ సుందరి కూడా వినేది. బావంటే శ్యామ సుందరికి ఇష్టమే. అపేక్ష. చిన్నప్పుడు ఆదుకున్నారు. కొట్టుకున్నారు. తిట్టుకున్నారు. గిల్లుకున్నారు. అట్లాంటి శ్యామ సుందరి ఇప్పుడు సురేంద్ర కు ఇష్టం లేదు. ఎందుకనో పూర్తిగా శ్యామ సుందరికి తెలీదు. తనకు తెలిసి నంత వరకూ తను పొట్టిగా, లావుగా ఉండటం నుంచే నెమో? అదే కారణమైతే భగవంతుడు పెట్టిన వంకకు తనేం చేస్తుంది? ఈ విషయాలే ఆలోచిస్తూ కూర్చుంది శ్యామ సుందరి. తండ్రి రాయుడు గారు గదిలోకి రావడం శ్యామ సుందరి చూడలేదు.
    "ఏమ్మా, శ్యామా, అట్లా దిగులుపడి కూర్చున్నావ్? ఒంట్లో బాగుండ లేదా?" అన్నాడు రాయుడు గారు చుట్ట కాలుస్తూ.
    శ్యామసుందరి కొంచెం గాబరా పడి లేచి నిల్చుంది. "ఏం లేదు నాన్నా. ఒంట్లో కులసాగానే ఉంది" అన్నది.
    "ఎందుకమ్మా అంత దిగులు? నీమనస్సు నాకు తెలుసు. కాని, వాళ్ళు కాళ్ళు పట్టుకు లాగేస్తుంటే, మనం చూరు పట్టుకుని వెళ్ళాడ్డం అంత మర్యాద కాదమ్మా. ఎవరికి ఎవరో? ఎవరు చెప్పగలరు? నువ్వూ ఆలోచించు" అంటూనే రాయుడు గారు వరండా లోకి వచ్చాడు.
    అప్పుడే ప్రసాద పురం నుంచి రాఘవరావు వచ్చాడు. కొంచెం ఆశ్చర్యం పడ్డాడు రాయుడు గారు. ప్రసాదపురం రామయ్య గారి నియోజకవర్గం లోనిది. రాఘవరావు రామయ్య గారి పార్టీ కి చెందినవాడు. ప్రసాద పురం లో అతనికి పలుకుబడి లేకపోయినా పార్టీ కార్య కర్తగా రాఘవరావు పేరొందిన వాడే. అట్లాంటి రాఘవరావు తన దగ్గరికి వచ్చేసరికి రాయుడు గారికి అమితాశ్చర్యం కలిగింది.
    "ఏం రాఘవరావ్? దారి తప్పి వచ్చినట్లు ఉంది. ప్రసాదపురం లో అంతా బాగున్నారా? ,ఈ నాన్న కులాసాగా ఉన్నారా?" అంటూ చాపమీద కూర్చోమన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS