"ఏమిటి...? మా ఆవిడా ఫారిన్ క్కూడా వెళ్తుందా....?" అంటూ రామయ్య గారు విస్తుపోయారు.
ప్రభాకర్ నిర్లక్ష్యంగా తల తిప్పి అన్నాడు.
"ఈ రోజుల్లో తలచుకుంటే ఆకాశం లో క్కూడా యెగిరి పోవచ్చు... అదేమంత బ్రహ్మాండమైన పని?"
"ప్రాణాల సంగతేనా బాబూ నువ్వనేది? అని ఎప్పుదెగిరిపోతాయో చేబుదూ? దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు గా నడుస్తున్నాయి రోజులు...." అంది నీరసంగా జానకమ్మ.
"ప్రాణాల సంగతి కదండీ నేనన్నది..... నిజంగా రష్యా వాళ్ళు ఆకాశాన్ని చూసి వస్తున్నారు.... ఈ మధ్యనే ఒకమ్మాయి కూడా ఆకాశాన్ని ఎక్కి వచ్చింది....."
"అమ్మాయి అనేటప్పటికి ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నారండి ఏదో నిచ్చేనేక్కి దిగినట్టు!" అంది చిత్ర కోపగించుకుంటూ.
రామయ్య గారు విస్మయం లో నుంచి తేరుకుని "మా ఆవిడ ఫారిన్ వెళ్తే ఆవిడ వెనకాతల నేనూ, మా పిల్లలో వెంట వెళ్ళాల్సిందే మరి! ఎవరూ తోడూ లేకుండా ఆవిడ ఫారిన్ కాదు కదా పొరుగూరి కైనా వెళ్ళడు.... అంతదాకా ఎందుకు గుమ్మం దాటి అడుగు పెట్టదు...." అన్నాడు.
"ఏమో? మీరంతా కలిసి వెళ్తారేమో ఎవరు చూసొచ్చారు?" అన్నాడు ప్రభాకర్.
రామయ్యగారు, అమ్మాయిలూ అంతా ఒకేసారి ఆతృతగా.
"మాకా రేఖ ఉన్నదేమో చూడండి!" అంటూ చేతులు ముందుకు సాచారు. అందరికీ ఆ రేఖ కాస్తో కూస్తో ఉంది. చూస్తూ ఉంటె అది ఫారిన్ రేఖ అవునా, కాదా అని ప్రభాకర్ కు అనుమానం వేసింది. అయినా ఏమాత్రం జంక కుండా "అందరికీ ఉన్నది.... మీరంతా కలిసి వెళ్తారు ...సందేహం లేదు!' అన్నాడు.
ఆ మాట కొస్తే తనకీ ఆ రేఖ ఉన్నదని చెప్పాడు .
"ఫారినంటే ఏ దేశం వెళ్తామో చెప్పండి!" అంది గీత ఉత్సాహంగా.
అడిగే వాడికి చెప్పేవాడు లోకువ!
'అవన్నీ సాముద్రికం లో తెలియవు లెండి.... మీకా వివరాలన్నీ కావాలంటే భ్రుగు నాడి చూపించు కొండి...." అన్నాడు ప్రభాకర్.
"అదేమిటి? ఆ పేరు నేను ఎప్పుడూ వినలేదే?' అని ఆశ్చర్యపోయింది గీత.
"నాకూ ఏమంత తెలియదు లెండి. నా స్నేహితుడోకడికి భ్రుగునాడి అంటే తగని వెర్రి... ఋషులు రాబోయే సంగతులన్నీ కట్టలు కట్టలుగా రాసి పడేశారట. అవి చూసుకుంటే అందులో మన తండ్రి, తాతల పేర్లు దగ్గర్నించి అన్నీ వివరంగా ఉంటాయట....
'అవి ఎక్కడుంటాయి?' అనడిగింది కళ ఆతృతగా.
"సాముద్రికం చెప్పే వాళ్ళలానే వాళ్ళు కూడా కనపడతారు లెండి, రోడ్డు వెంట వెతుక్కుంటూ వెళ్తే...."
"తండ్రి పేరు రామయ్య, తల్లి పేరు జానకమ్మ అని తెలిస్తే మాత్రం ప్రయోజనం ఏమిటండి? ముందు సంగతు లేమైనా తెలుస్తాయా?" అనడిగింది చిత్ర.
"తెలుస్తాయిట..... అవన్నీ ఒకే పుస్తకంలో ఉండవట. ఆ పుస్తకాలు పట్టు క్కూర్చున్న వాడు ఒక్కో పుస్తకం తిరగెయ్యటానికి కాస్తా కూస్తా అడగడట. ఒక పుస్తకంలో మీక్కావలసిన సంగతి రాలేదనుకోండి, మళ్ళా డబ్బిచ్చి మరొకటి చూపించుకోవాలి.... డబ్బిచ్చు కోగల శక్తి ఉంటె అవన్నీ ఒక దాని తర్వాత మరొకటిగా చూపించుకుంటూనే ఉండొచ్చు...."
"అదేమిటండి! మన గురించి అంతా ఒక పుస్తకంలో రాయకుండా ఇందులో కొంత, అందులో కొంత రాయటం ఎందుకో?..... ఈ పుస్తకంలో తల్లి దండ్రుల పేర్లు వచ్చాయి కదాని మరో పుస్తకం చూపించుకుంటే అందులో మీకు పుట్టబోయే పిల్లల పేర్లు రామారావు, రంగారావు అని ఉంటాయేమో?' అని నవ్వింది చిత్ర.
'అబ్బో! భ్రుగునాడి డబ్బుతో కూడిన వ్యవహారం!" అంటూ రామయ్యగారు మరింక ఆ టాపిక్ మీద మాట్లాడనీయలేదు.
"ఫారిన్ వెళ్తే అక్కడ ఆవకాయ లేకుండా తినటం? జాదీలతో పట్టికెళ్ళినా ఆ చలికి చెడి పోతుందేమో ?" అని అనుమానం వెలిబుచ్చింది గీత.
కళ నవ్వింది.
"జాడీ లో నుంచి ఎర్రగా నూనె కారుతూ ఉంటె ఎవడినో ఖూనీ చేసి ఫారిన్ పారిపోతున్నారనుకుని సరాసరి జైలుకు తీసుకెళ్ళ గలరు....!"
'ఆవకాయలవీ తినటం చేతనే మనకీ జబ్బులు! యూరోపియన్లు చూడండి ఎంత బలంగా ఉంటారో?' అన్నాడు ప్రభాకర్.
రామయ్య గారు ఆలోచనలతో సతమత మవుతూ "మీరు చెప్పింది ఇక ముందు వెళ్ళటం అయి ఉండదు.... ఇది వరకూ మాటే రేఖలో కనబడి ఉంటుంది..." అన్నారు.
ప్రభాకర్ విపరీతంగా ఆశ్చర్యపోయాడు.
"ఏమిటి? ఇదివరలో ఒకసారి ఫారిన్ వెళ్ళివచ్చారేమిటి?"
"ఫారిన్ అంటే ఏమిటయ్యా పరాయి చోటే కదా? తెలుగు గడ్డ మీది నుంచి తమిళనాడు కొచ్చి పడ్డామంటే మరేమిటి? అందుకే మనందరి చేతుల్లోనూ ఆ రేఖ కనబడుతున్నది... ఆ రేఖ అర్ధం అదేనయ్యా! నాకు బోధ పడింది.... " అని రామయ్యగారు టీక చెప్పారు రేఖలో కిటుకును ఇట్టే తెలుసుకున్నందుకు సంతోష పడుతూ.
బ్రతుకు జీవుడా అనుకున్నాడు ప్రభాకర్. ఇలాంటి వాళ్ళు ఏ కొద్ది మంది ఉన్నా సాముద్రికుల పంట పండినట్టే అనుకున్నాడు.
ఉన్నట్టుండి జానకమ్మ "మా అమ్మాయి లందరికీ మంచి సంబంధాలు లోస్తాయా? తొందర్లో పెళ్ళిళ్ళు అవుతాయా?' అని అడిగింది.
"తొందర్లోనే అవుతాయి.... నిక్షేపం లాంటి అల్లుళ్ళు వస్తారు.... మరేమీ గాభరా పడకండి...." ధైర్యం చెప్పాడు ప్రభాకర్ ఉష వంక దొంగ చూపులు చూస్తూ.
తర్వాత ప్రభాకర్ దారం ఉండ తెమ్మన్నాడు. దానితో జానకమ్మ చేతిని అటు పెట్టి, ఇటు పెట్టి నాలుగైదు సార్లు కొలిచి అదారాన్ని అక్కడ గుర్తుగా తెంపాడు.
"ఏమిటేమిటి....?' అనడిగారు రామయ్య గారు ఆతృతగా.
'ఇప్పుడు కాదండి.... సావధానంగా అలోచించి చెప్పాలి....!' అంటూ దాన్ని జేబులో పదేసుకున్నాడు ప్రభాకర్ అలసటగా.
'అలాగే! ఇప్పుడెం తొందర లేదు నాయనా." అంటూ రామయ్య గారు కాఫీ, టిఫిన్ తీసుకు రమ్మని అమ్మాయిలకు పురమాయించారు.
ఉష చురుగ్గా లోపలి కెళ్ళి కాఫీ, టిఫిన్ తీసుకొచ్చి, బల్ల మీద పెట్టింది....
ప్రభాకర్ వెళ్తున్నప్పుడు రామయ్య గారు "మళ్ళా ఎప్పుడొస్తారు?... అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదూ?" అన్నాడు అవ్యాజ్య ప్రేమను కురిపిస్తూ.
"తప్పకుండా వస్తానండీ! మీరు మరీ చెప్పాలా?' అంటూ సెలవు తీసుకున్నాడు ప్రభాకర్.
రామయగారిల్లు కనుమరుగు కాగానే జేబులో నుంచి దారం ముక్కను ఇవతలకు తీసి పారేశాడు. పుస్తకంలో ఇచ్చిన కొలత ప్రకారం లేదు ఆవిడ చెయ్యి. ఏం చేయటం మరి? ఈసారి అడిగితె ఏవో నాలుగు కోతలు కొస్తే సరిపోతుంది.....
6
సుధాకర్ మంచం మీద నిటారుగా పడుకుని, దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇల్లు విడిచి వచ్చి పది రోజులు దాటింది. సంతోషంగా వచ్చి కొండంత సంతాపాన్ని మోసుకుపోతున్నాడు.... ఇంక మద్రాసు లో ఉండి మాత్రం ఏం ప్రయోజనం ?
కళ! ఫలించని కల!
ఎంత తొందరగా మద్రాసు ను దాటితే అంత తొందరగా కళను మర్చిపోవచ్చు. కనీసం మర్చి పోవటానికి ప్రయత్నించవచ్చును... రాత్రి ప్రయాణం కట్టాలని తీర్మానించుకున్నాడు సుధాకర్...
గుమ్మం దగ్గర కిలకిలా నవ్వు వినిపించేసరికి సుధాకర్ కు షాక్ తిన్నట్టు అనిపించింది.
"మీరేమో ఆరడుగులు , మంచమేమో అయిదడుగులు ... మీ కాళ్ళు ఇవతలకు వ్రేలాడుతుంటే నాకు...."
"వాట్?' అంటూ రబ్బరు బంతి లా ఇంతత్తున ఎగిరి సుధాకర్ హటాత్తుగా మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు.. కళ....! సుధాకర్ షాక్ నుంచి తేరుకోలేక బిత్తర చూపులు చూసేసరికి కళ మరింత పకపక లాడుతూ నవ్వింది.
"ఎందుకలా చూస్తారు? చిన్నప్పుడు 'అందరికీ సరిపోయే మంచం' అనే కధ చదివాను లెండి. అందులో ఒక రాక్షసి దారిని పోయే వాళ్ళందరినీ తన ఇంటికి ఆహ్వానించి వాళ్ళకు సకలోపాచారాలు చేసేదట. ఆ అభాగ్యుడు మంచం కన్నా పొట్టిగా ఉండే వాడి కాళ్ళు మంచం కొస వరకు సాగదీసి చంపేసేదట. వాడు కనక మంచం కన్నా పొడుగ్గా ఉంటె వాడి కాళ్ళను మంచం పొడుగుతో సమానంగా నరికేసి తినేసేదట...."
సుధాకర్ ఇప్పటికి తెప్పరిల్లాడు.
"నయం! ముందరే చెప్పారు....! మీరు కత్తి పుచ్చుకుని వచ్చేలోగా నేను ఉడాయిస్తే కాని ప్రాణాలు దక్కవు....!' అంటూ లేచి నిలబడ్డాడు.
"నేను మీ కంటికి రాక్షసి లా కనబడుతున్నా నన్నమాట!" అంటూ కళ మూతి ముడుచుకుంది.
"మీరు లక్షణంగా ఉన్నా మీ మనస్సులో మాత్రం రాక్షసత్వం గూడు కట్టుకుని ఉంది.... కాకపోతే ఇన్నాళ్ళు నన్నెంత ఏడ్పించారు? ఇలా వచ్చి పలకరించి ఎన్నాళ్ళయింది?.... ఇప్పటికైనా కోపం తగ్గిందా?.... అయినా అంత కోపం ఎందు కొచ్చింది..?
"కోపం కాదు లెండి... మీకేం తెలీదు... ఆ! మీకో సంగతి చెప్పటం మార్చిపోయాను.... మేమంతా రెండు, మూడు రోజుల్లో వైజాగ్ వెళ్తున్నాం...." అంది కళ దిగులుగా.
"నేనూ రాత్రికి బయల్దేరి వెళ్తున్నాను...."
"ఎలా వెళ్తారో నేనూ చూస్తాను... మరో రెండు రోజులుంటే అందరం కలిసి ఒకే మెయిల్లో బయల్దేరి వెళ్ళొచ్చు...."
"వైజాగ్ లో ఎవరున్నారు?" అనడిగాడు సుధాకర్ కుతూహలంగా.
"ఎవరేమిటి? మా మేనత్త ఉన్నది.... మా బావ ఉన్నాడు...."
"హారి భగవంతుడా! మీ మేనత్త కో కొడుకు కూడా ఉన్నాడూ?' అంటూ నీరసంగా కూలబడ్డాడు సుధాకర్.
"ఉంటె మీ సొమ్మేం పోయింది? ఆవిడ ఆస్తిలో మీకేమైనా వాటా తగ్గుతుందా ఏమిటి? మధ్య మీకేమిటా కంగారు? బావ అనగానే అలా బెంబేలు పడిపోతారేం?"
సుధాకర్ గుండెలు నిమురుకున్నాడు.
"మీరభయం ఇస్తే నాకు కంగారేమిటి? ఇంతకీ మీ బావ ఒకటో క్లాసా, రెండో క్లాసా చదువుకుంటున్న చిట్టి బావా?"
"అదేం కాదు! నాకంటే రెండేళ్ళు పెద్ద...."
సుధాకర్ కెవ్వుమన్నాడు. కాస్సేపు తల చేత్తో పట్టుకుని కూర్చున్నాడు. తర్వాత గభాలున లేచి తోలు పెట్టె తీసి బట్టలన్నీ బైటికి తీసి మళ్ళా సర్దటం మొదలు పెట్టాడు.
"మీతో మాట్లాడలేదని అన్నారుగా.....? మీకిప్పుడు కోపం ఎందుకొచ్చిందో నాకూ అందుకే వచ్చింది...."
సుధాకర్ చేతులు చటాలున పని చేయటం ఆపేశాయి. కళ వైపుకు తిరిగి ఆశ్చర్యంగా చూస్తూ నవ్వి అన్నాడు.
"ఎంత చక్కగా డిమాన్ స్ట్రేట్ చేసి చూపించారండి.....!"
"కాఫీ తీసుకొస్తానుండండి...." అని కళ వెళ్ళబోయింది.
"నో! నో! థాంక్స్....తాగే వచ్చాను...."
'అది కూడా ఎప్పటి నుంచి?" అంటూ కిలకిల లాడింది కళ.
"భలేవారే! కాఫీ మాట నేనన్నది.... మీరు వద్దన్న దగ్గరి నుంచి సిగరెట్లు కూడా మానేశాను.... అయినా మీరిప్పుడు కాఫీ తయారు చేయబోయి చేతులు కాల్చుకున్నారంటే నేను ఏ డాక్టర్ కోసమో పరిగెత్తాల్సి ఉంటుంది...."
"చాల్లెండి.... నాకేం వంట రాదేమిటి....?"
"రాకేం? నేను వచ్చిన కొత్తలో మీరు స్వయంగా మీ చేత్తో నాకు వంట చేసి పెట్టారుగా?"
కళ సిగ్గు పడింది.
"మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదూ...?" అన్నది .
"బాధ అని మెల్లిగా అంటారేం? యమ యాతన పడ్డాననుకొండి.... నేను నిక్షేపం లా హోటల్ కెళ్ళి భోం చేసి వచ్చేవాడిని.... మీరు పాపం పస్తు పడుకుంటే నా ప్రాణాలు గిలగిలలాడేవి...."
కళ మాట్లాడకుండా లోపలి కెళ్ళి కాస్సేపటి లో కాఫీతో తిరిగి వచ్చింది. వద్దంటూనే సుధాకర్ కప్పు అందుకున్నాడు.
కాఫీ కప్పు పెదాల దగ్గర ఉంచుకోబోతూ సుధాకర్ "నేనొక మాట అడుగుతాను.... జవాబు చెప్తారా?" అనడిగాడు.
"యక్ష ప్రశ్న అడగరు కదా....?"
"నో! నో! బహు సూక్ష్మ ప్రశ్న?"
"అడగండి!"
"మీకు...మీకు...."
"మీరు మెడ్రాస్ లో ఏవేం చూశారు?' అనడిగింది చటాలున కళ.
"నిజం చెప్పమంటారా?'
అబద్దమాడి నమ్మించగల ననుకుంటూన్నారా?' అని పక్కుమంది కళ.
"నేను మెడ్రాస్ రావటం ఇది మూడో సారి...."
కళ ఆశ్చర్యపోయింది.
"మరి డబ్బు ఎక్కువై వచ్చారా....?"
"మిమ్మల్ని చూద్దామనే వచ్చాను.... నా స్నేహితుడు రామయ్య కి పంచ రత్నాల్లాంటి అమ్మాయి లున్నారు. వాళ్ళకి ప్రయత్నాలు చేస్తున్నారట . నువ్వో మాటు వెళ్ళి చూసోచ్చావా?' అనడిగారు మా నాన్నగారు.... వెంటనే పెట్టె సర్దుకుని ఇలా బయల్దేరి వచ్చేశాను.... మరి ఇప్పుడు చెప్పండి.... నేనంటే మీ కిష్టమేనా....?"
కళ చటుక్కున చూపులు మరల్చి నాలిక జోరుగా అల్లల్లాడించి అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
ఆడవాళ్ళు అవునంటే కాదు, కాదంటే అవును.... నాలిక మెలికలు తిప్పితే....?" ఆడవాళ్ళ భావం తెలుసుకోవటానికి ఏం చదువు కోవాలి?' అనుకున్నాడు సుధాకర్.
