మధ్య తరగతి సాంఘిక వ్యవస్థ లో వివాహము ప్రేమ కూడా ధన సంబంధ మైనవి. కాని చాలామంది ఆ విషయం తెలుసుకోలేరు. ముఖ్యంగా వివాహం ధన సంబంధమైనది . ధర్మ సంబంధ మైనది కూడా. ఒక కాలంలో ధర్మానికి ప్రాధాన్యము ఉంటె మరో కాలంలో ధనానికి మాత్రమె ప్రాముఖ్యము ఉంది. ఇన్నాళ్ళూ ధర్మ ప్రాధాన్యమైన విజయ జయప్రదరావు ళ వైవాహిక అనుబంధం ఇప్పుడు జయప్రదరావు దృష్ట్యా ధన సంబంధ మై పోయింది.
ధర్మం అనేది ఉసిరి కాయను అరిచేతిలో ఉంచుకోవాలని స్త్రీ అనుక్షణం ఆరాటపడుతూ ఉంటుంది. కానీ అదంత సులభం కాదు. ఎప్పుడో ఒకసారి సర్వ దుఃఖాలూ కమ్మి వేసినప్పుడు అది జారిపోతుంది. అలాగే తిరిగి మరోసారి అలాటి దుఃఖ సమయంలోనే అయాచితంగా వచ్చి అరిచేతిలో వాలుతుంది ధర్మం.
ధర్మరీత్యా కట్టుకున్న మగవాడే సర్వస్వమని నమ్మ గలిగిన విజయ లాటి స్త్రీలు , ఒక్కసారిగా తమ నమ్మకాలు అధః పతనం కావటాన్ని భరించ లేరు. స్త్రీ కి ధర్మం అనేది ఒక కవచం. ఇప్పుడా కవచం తన కళ్ళ ఎదుటనే తూట్లు పడిపోవటం చూచి నిర్ఘాంత పోయి నిలబడింది విజయ.
"ఏమిటి అలా చూస్తావు .... త్రాగాననా? ఫరవాలేదులే. త్రాగితే నువ్వేమీ అనవుగా? మా విజయ మంచిది . క్షమిస్తుంది" ఎక్కిళ్ల తో అన్నాడు జయప్రదరావు.
విజయకు తల గిర్రున తిరిగిపోయింది. ఈ రోజు తన నుంచి క్షమను కోరుతున్న మూడో వాడు.....ఆ ఇద్దర్నీ తను క్షమించలేకపోయింది. ఇప్పుడూ అంతేనా? ధర్మం కఠోరమైనది కాదా? భర్త అయినంత మాత్రాన ప్రలోభ పక్షతాపాలు చూపించాలా తను? ఎన్నటికీ అది జరుగదు. అతని యందు తన ధర్మం సక్రమంగా నిర్వర్తిస్తున్నది. అతను కూడా తన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించే టట్లు చూస్తుంది.
"ఎందుకు త్రాగారు మీరు?"
"ఏం, త్రాగకూడదా?"
"కూడదు."
అంత నిషాలో తననూ భార్య కంఠస్వరంలో వచ్చిన కాఠిన్యాన్ని గుర్తు పట్టాడు జయప్రదరావు. తెల్లబోయీ తిరిగి చూశాడు.
"చెబుతున్నాను. ఈ క్షణం నుంచీ మీరు త్రాగటానికి ఎంతమాత్రం వీలులేదు."
"త్రాగకపోతే ఎలా?"
"ఎలా ఏమిటి? త్రాగకూడదు. అంతే."
"రేపటి నుంచీ అలాగేలే."
"ఒట్టు వెయ్యండి."
"అలాగే."
భార్య చేతిలో వేసిన చెయ్యి అలాగే ఉంచి దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నించాడు. విజయ విదిలించి వేసింది. ఇదివరకటి సంసారిక జీవితంలో తను కోరినప్పుడు విజయ ఏనాడూ కాదనలేదు. జయప్రదరావు కు చాలా చిరాకని పించింది.
"ఎందుకని?"
"మీరు త్రాగివచ్చి నన్ను ముట్టుకోవటానికి వీలు లేదు. మైల పడ్డారు , మీరు."
"సింగి నాదం....ఇలారా."
"దూరంగా ఉండండి." ఆడ సింహం లా గర్హించిన విజయను చూచి వణికి పోయినాడు జయప్రదరావు. మెదలకుండా పోయి నులకమంచం మీద వాలాడు.
విజయ తెల్లవార్లూ కుమిలి కుమిలి దుఃఖిస్తూనే ఉంది. ఆమె అంతర్యంలో అనేక రకాల ఆలోచనలు సుడి తిరుగుతున్నాయ్. తనకు ఆరోగ్యం చెడి పోతున్నది. ఇంట్లో తినటాని కంటూ ఏమీ లేదు. మూడు నెలల అద్దె బకాయి ఉంది. జయప్రదరావు తన సంగతి బొత్తిగా పట్టించుకోవటం లేదు. ప్రొద్దున్నే పోయి ఎక్కడో యింత తిని రాత్రి త్రాగి వస్తున్నాడు. అదీ ఒకరోజున వస్తే ఒకరోజు రావటం లేదు.
జగన్నాధం ఈ మధ్య తరచూ వుండటం లేదు. అతను తమకన్నా దరిద్రుడు. రేపటి నుంచి ఎలా జరుగుతుంది? ఎవరింట్లో అయినా పనిచేడ్డామన్నా గాని, జాలిపడే వాళ్ళే గాని పనియిచ్చే వాళ్ళు లేరు. ఆ పైన శరీరంలో ఓపికా లేదు.
తన భర్త తనను ఎంతో ప్రేమించేవాడు. ఇప్పుడు తన సంగతి అతనికి పట్టటమే లేదు. ప్రేమానుబంధాలు, బాధ్యతలు, భ్రమలు అన్నీ కూడా ధనానికి సంబంధించినవేనా? అలాంటప్పుడు ఆ సంగతి స్పష్టంగా తెలుసుకో నివ్వకుండా ఇదంతా ధర్మమనే వాదంతో ఈ సమాజం ఎందుకు మభ్య పెడుతున్నది? తెల్లవారిన తరువాత మంచం మీద నుంచి లేవలేక పొయిందామె. కొంచెం జ్వరం కూడా ఉన్నది.
జయప్రదరావు ఇదివరకే గనుక అయితే నానా కంగారూ పడిపోయే వాడు. ఎప్పుడో ఒకసారి విజయ ఒకటో రెండో లంఖణా లు చేస్తే ఆమె అన్నం తినేదాకా తనూ పస్తున్నాడు. కుర్ర కుంకను చేసి కొంగున కట్టేసుకుంది అని అత్తగారు కూడా విసుక్కుంది-- తన కొడుకు కుర్ర కుంకయి కోడలు మహా పెద్దదయి పోయినట్లు.
ఆ సంగతి జ్ఞాపకం వచ్చింది విజయకు. భర్త చేయి గట్టిగా పట్టుకుని, "నన్ను వదిలి వెళ్ళకండి" అన్నది.
జయప్రదరావు నవ్వి , "వెళ్ళకపోతే ఎలాచేప్పు? ఏదయినా మందో మాకో తెవాలిగా" అన్నాడు.
"నాకే మందూ వద్దు. మీరు పక్కనుంటే అదే తగ్గిపోతుంది."
"సరే. అలాగేలే. అరగంట లో వచ్చేస్తాగా?"
విజయ తర్కించలేదు. తన విలువ తగ్గిపోయింది. దానికోసం యాచించటం లో అర్ధం లేదు. పైగా అది తనలాంటి అభిమానవతి చెయ్య తగ్గ పని కానేకాదు. ఆమెకు తెలుసు -- ఇంట్లో ఏమీ లేదు. ఆఖరికి చెరువుకు వెళ్ళే ఓపిక లేక మంచినీళ్ళు కూడా తేలేదు. జయప్రదరావు రోజూలాగా రాకపోతే మృత్యువేగతి. పోనీ సమస్యలు తీరిపోతాయి. గోడకేసి ఒత్తిగిలి పడుకుంది విజయ.
జయప్రదరావు మెదలకుండా బయటికి వెళ్ళిపొయినాడు. సిగ్గు అభిమానం అనేవి అతన్ని వదిలి వేసి ధన్యుడిని చేసినాయ్. లేకపోతె తను చేస్తున్న పనులకు ఆత్మహత్య చేసుకునే వాడు.
మానవుడి తప్పొప్పులకూ, ఔన్నత్య పటణాలకు , నీతోదాత్తాలకూ , అన్నిటికీ పరిస్థితులే కారణం. ఆ పరిస్థితులే ఉన్నతుడూ, ఉదాట్టుడూ అయిన జయప్రదరావు ను నీచుడూ, పతితుడూ గా తయారు చేసినయ్.
పరమ పవిత్రమూర్తీ , మహా ఇల్లాల్లూ అయిన భార్యను అనారోగ్య స్థితిలో ఒంటరిగా వదిలిపెట్టి పెకాడటానికి , ఆ వచ్చిన డబ్బు పెట్టి త్రాగటానికీ పంపించినయ్.
సంధ్య వార్చనిదే మంచి నీళ్ళు కూడా ముట్టని జయప్రదరావు మొహం కూడా కడుక్కోకుండా సారా త్రాగుతున్నాడు. అశుచిగా ఆహారం తీసుకుంటున్నాడు. ఈ మధ్య ఎక్కడ ఏమీ దొరక్క ఒక మిత్రుడు పెట్టిన మాంసం కూడా అరగించాడు.
మొదట అది మాంసమని తెలియదు. తీరా తెలిశాక ఆత్మహత్య తప్ప ప్రాయశ్చిత్తం లేదనిపించింది. ఇప్పుడు తానున్న యీ స్థితి కూడా ఆత్మహత్య కన్న తీసిపోయిందేమీ కాదు. ఈ ప్రాయశ్చిత్తం చాలు. విజయకు తను అనర్హుడు. తప్పుల్ని క్షమించే ఔదార్యం అమెకు లేదు. తనను ఎలాగూ కాదంటుంది. ఇప్పుడే కాకుండా పోయినాడు తను.
"అంతా పోయింది. మిగిలిందేమీ లేదు" అనుకుని చిరునవ్వు నవ్వుకుంటూ ముందుకు సాగాడు జయప్రదరావు. తనేన్ని విధాల పతనమయినా విజయ కు మాత్రం ద్రోహం చెయ్యాలని లేదు. ఇప్పుడు చేసింది ద్రోహం కాక ఏమిటి?
అతని లోంచి ఎవరో నిలదేసి అడిగినట్లు అనిపించింది. ఆ ప్రశ్న వినిపించుకుంటే సమాధానం తన దగ్గర లేదు. అందుకే వినిపించుకోలేదతను.
అతను నూజివీడు అంచులకు వచ్చి ఒక గేటును తట్టాడు. ఎవరు తలుపు తెరిచారో కూడా చూడకుండానే లోపలికి అడుగు పెట్టాడతను.
"ఎవరూ?....నువ్వా బాపనయ్యా?" అంటూ ఒక ముసలి -- వసుంధర -- ఊడి పడింది.
"నేనే వస్తుంధరా....అందరూ వచ్చారా?"
"వచ్చారు . కాస్త ఏమయినా పుచ్చుకుంటారా?"
"మన దగ్గర దమ్మిడీ లేదు. నువ్వేమయినా పెట్టుబడి పెడితే సాయంత్రం ఆటలో మిగిలింది పెట్టి, బాకీ తీర్చేస్తాను."
'అదేం మాట బాబూ, మీరు అన్నమాట తప్పేవారా ఏమిటి? మీ నాయన గారి దగ్గర నుంచీ మీ కుటుంబం అంతే" అంది ముసలి వసుంధర.
వయస్సు లో వున్నప్పుడు వసుంధర బాగానే సంపాదించింది. ఇప్పుడు పేకాట కూ త్రాగుడికీ, అప్పిచ్చి పొట్ట పోసుకుంటుంది. అప్పటి సంపాదన కంతటికి ఈ ఇల్లెక్కటే మిగిలింది ఆమెకు. లోపల మంచి జోరుగా జరిగిపోతున్న మూడు ముక్కలాట లో పోయి పడ్డాడు జయప్రదరావు. అంతే! విజయ జ్వరమూ, మిగతా ప్రపంచమూ విస్మృతి లో పడిపోయినాయ్.
