"చాలా థాంక్స్. ఈ మేలు మరిచిపోలేను. అవసరానికి ఆదుకున్నారు. కృతజ్ఞురాలిని."
"అంత పెద్ద మాటలనకండి. తోటి ఉద్యోగులాం కాబట్టి ఒకరి కొకరు సాయపడక తప్పదు మరి." అన్నాడు శంకరం.
కసుమ వెళ్ళిపోయింది. ఈ తతంగమంతా దూరం నుంచి గమనించిన శాస్త్రి తన అనుచారుల వైపు చూచి చిరునవ్వు, మొహంలో తగిలించుకున్నాడు, అనుచరులు అతన్ని అనుసరించేరు.
ఆఫీసయిం తర్వాత మిత్రులు గదికి వచ్చారు. స్నానాలు ముగించి సినిమాహాలుకి దారి తీశారు. జీతాలిచ్సిన రేజేమో, అందునా పేరుపొందిన సినిమా నేమో జనం రద్దీగా ఉన్నారు. టిక్కట్లు తీసుకుని థియేటర్లోకి వెళ్ళారు.
సినిమా నడుస్తోంది-
ప్రసాదం కామెంటు చేస్తూనే ఉన్నాడు. 'గొప్పగా ఉంది' 'వహ్వా ........ థ్రిల్లింగ్-సుపర్బ్-మోర్వలెస్' అంటూ తనకు నచ్చిన సన్నివేశాలకు ముగ్ధుడై పరిసరాలు మరిచిపోయి అంటున్నాడు. అక్కడికీ పతి హెచ్చరిస్తూనే ఉన్నాడు 'గొడవ చెయ్యకు బాబూ!' అని.
ప్రసాదం సినిమా చూడటంలో చిన్నప్పుడు యిప్పుడు ఒకే స్థితిలో ఉన్నాడు. ఏమాత్రం మారలేదు. స్టంటు పిక్చర్లూ, వార్ పిక్చర్లూ అంటే అతనికి చాలా మోజు. తెరమీద జరుగుతూన్న స్టంటు వగైరాలను చూస్తూ హాల్లో గోళ్ళు గిల్లుకొడం అతని కిష్టం ఉండదు. వీలైనంతవరకూ తానుగూడా పక్కనున్న వాడ్ని కుదిపెస్తూ దాదాపు స్టంటు లాటిది చేస్తాడు.
ఇప్పుడు అతను చేస్తున్న పనీ అదేను. ఆ పని వల్ల బాధపడేది పతి. ఒక పక్కన కోపమూ, మరో పక్కన నవ్వూ వస్తున్నాయి అతనికి.
ప్రసాదం ఇలాంటి సినిమాలని "టిష్యూ" పిక్చర్" అంటాడు. టిష్యూ అనగా తుపాకి శబ్దమని అతని భావం. తుపాకి మోతలంటే అతని కిప్పటికీ యిష్టమవడానికి సాక్ష్యం అతనికి అతనేను.
ప్రసాదం చేస్తున్న అల్లరికి ఆ క్లాసు తాలూకు ప్రేక్షకులు కాస్త విసుకున్నారు. అంతమాత్రం చేత 'మాస్టారూ మీరు మీ నోరు మూసుకుని కూర్చుంటారా? లేక మెడపెట్టి అవతలకి గెంటేయమంటారా?' అని చెప్పటానికి క్లాసు ప్రేక్షకులకి మనసొప్పడంలేదు. ఇది 'అలుసు' గా తీసుకుని మరీ విజ్రుంభించాడు ప్రసాదం.
ఇక సహించనేలేని వెనక వరసలోని ఒకానొక పెద్దమనిషి "కీప్ క్వయిట్ ప్లీజ్" అన్నాడు మందలింపుగా. ఈ హెచ్చరిక ప్రసాదానికి తల కొట్టి నంత పనైంది. ఇక సినిమా చూసే ఓపిక అతనికి నశించింది. దీనికి తగ్గ ప్రతీకారం చెయ్యాలని అతను నిశ్చయించుకున్నాడు. అయిదు నిముషాలకో తడవ లేచి నిలబడి, బయటికి వెళ్ళి గేటుదగ్గర సిగరెట్టు సగం వరకూ కాల్చిపారేసి మళ్ళీ వచ్చికూర్చోడం మొదలెట్టాడు.
వెనుకవరుసలోని గురుడు ఈవిధమైన 'డిస్టర్బెన్స్'కి లోలోన మండిపడి పోయేడు.
ఇంటర్వెల్లో, దీపాల వెల్తుర్లో తనవైపు అతను గుడ్లురిమి మింగేసేంత కోపంగా చూశాడు.
ఇది చూచి తన చొక్కా తాలూకు కాలరుని రెండు వేళ్ళతో అందంగా పత్తుకుఇ అతని మొహంముందు దులిపినట్టు ఒక్క దులుపు దులిపాడు ప్రసాదం. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత తన మనషులకోసం చూశాడు. వాళ్ళు అప్పటికే బయటకు వెళ్ళిపోయారు టీ తాగేందుకు. వాళ్ళు లేకపోవడంతో, కాస్త కలవరపడి, గబగబా బయట కొచ్చేశాడు.
మిత్రులతో కలసి టీ త్రాగుతూండగా మృణాళిని మరొక అమ్మాయితో కనిపించింది. చేతులో కప్పు పట్టుకునే మృణాళిని దగ్గరకు వేగంగా నడిచి ఆమెను చేరుకుని మొహంనిండా నవ్వు నవ్వుతూ.
"సినిమాకి వస్తూన్నట్టు చెప్పనేలేదే?" అని అడిగాడు.
ఆమె ఏమీ బదులు చెప్పకుండానే పక్కనున్న యువతితో "మా బావ ప్రసాదరావ్" అని పరిచయం చేసింది. ఆమె నమస్కారం చేసింది. ప్రసాదం ప్రతి నమస్కారం చేద్దామనుకున్నాడు గానీ చేతిలో టీ కప్పు ఉండడంచేత కుదరక కంగారుగా తలూపాడు.
అంతలోనే మృణాళిని పక్కనున్న అమ్మాయి అందంగా 'హల్లో' అని విష్ చేసింది. ఈ హల్లో ఎవరికో అర్ధంగాక చుట్టూ చూశాడు ప్రసాదం తను దగ్గరికి వస్తూన్న శంకరాన్ని చూచి 'ఆహా......నీకా' అని సరిపెట్టుకున్నాడు. శంకరం తమలో చేరాడు.
"మీకీ ఊర్లో ఉద్యోగం వచ్చినట్టు అక్కయ్య ఉత్తరం రాసింది. ఊళ్ళోనే ఉంటూ మమ్మల్ని మరిచిపోయారంటే ఆశ్చర్యంగా ఉంది సుమాండి" అన్నది శారద.
శంకరం నవ్వి ఊరుకున్నాడు.
వీళ్ళ కథ అర్ధంకాక, అప్పటికే చల్లారిపోయిన టీని గబగబా నాలుగు గుటకల్లో తాగేశాడు ప్రసాదం.
"ఇతను ప్రసాదరావని-" శంకరం ప్రసాదాన్ని పరిచయం చేయబోతూండగా-
"నో బ్రదర్ ...... మా పరిచయం మృణాళిని ద్వారా యిందాకే జరిగింది. కానీ ...... ఈవిడగారి పేరేమిటో?" అన్నాడు ప్రసాదం మూతి తుడుచుకుంటూ.
"మిస్ శారద. మా బంధువులు" అన్నాడు శంకరం. ఆ తర్వాత శారదని మిగిలిన యిద్దరి మిత్రులకీ పరిచయం చేశాడు శంకరం.
శారద తమయింటి చిరునామా చెప్పి వీలైనప్పుడు తప్పకుండా రమ్మని ఆహ్వానించింది శంకరాన్ని.
"మీ పాట వినడానికైనా వస్తాను సరా?" అన్నాడు శంకరం.
"అవుతే గొప్పగా పాడుతున్నారన్నమాట" అన్నాడు ప్రసాదం.
"రేడియో ......"
"అదేం లేదు గానీ ....... మీరు తప్పకుండా ఒక మాటు మా యింటికి రావాలి. అమ్మగారూ, నాన్న గారూ మిమ్మల్ని చూడాలని రోజూ అనుకుంటున్నారు" అన్నది శారద శంకరం మాటకి అడ్డుపడుతూ.
బెల్లు మోగింది. సెలవు తీసుకుని అందరూ థియేటర్లో అడుగుపెట్టారు కానీ, వాసు గేటు దగ్గరే నిలబడి-
"నేను రూమ్ కెడతాను. మీరు పిక్చరు చూచి రండి" అన్నాడు.
మిత్రులు ఆ మాటకి ఆశ్చర్యపోయేరు.
"ఎందుకు?" అన్నాడు ప్రసాదం.
"సినిమా చూడ బుద్దిపుట్టి కావడంలేదు" అన్నాడు.
"వాట్ ..... ఇంత గొప్ప పిక్చర్ ని-"
"అదికాదు ప్రసాదం-నా మనసు బాగోలేదు."
"నేనింకా గొడవ చేయనుగా" అన్నాడు ప్రసాదం నొచ్చుకుంటూ. వాసు అతని భుజాన్ని తట్టి అనునయంగా-
"నీ గొడవవల్ల కాదు-నా మనసే బాగోలేదు. అంతే." అనేసి వెళ్ళిపోయాడు వాసు. అతనెందుకు వెళ్ళిపోయాడో అర్ధంగాక మిగిలిన సినిమానంతా అంతంతమాత్రంగానే చూశారు. సినిమా అయిన తర్వాత తిన్నగా రూమ్ కొచ్చారు.
తలుపులు తీసిఉన్నాయి. దొడ్లో లైట్లు వెలుగుతున్నాయి. పతి శంకరంవైపు చూశాడు. శంకరం ప్రసాదం వంక చూశాడు, ప్రసాదం పెదిమి విరిచాడు అయోమయంగా.
దొడ్డి గుమ్మం దగ్గరికి వచ్చారు. నూతి గట్టు పైన కూర్చున్న వాసుని చూశారు. మెల్లిగా అతని దగ్గరికి వెళ్ళారు. అతనేదో ఆలోచిస్తున్నాడు. అతని చేతిలో అయిదు రూపాయిల కాగితం రెప రెపలాడుతోంది.
"వాసూ" అతని భుజం మీద చెయ్యి వేసి పిలిచాడు పతి.
* * *
7
వాసు ఉలిక్కిపడి లేచాడు. మిత్రుల్ని చూశాడు. అయిదు రూపాయల కాగితం జేబు లోకి తోసేశాడు. కళ్ళు తుడుచుకున్నాడు. నవ్వు తెచ్చుకున్నాడు.
"ఎంత సేపయిందీ మీరొచ్చి"
"ఏమిటీ గొప్ప ఆలోచనలో ఉన్నావ్" అనడిగేడు ప్రసాదం.
"ఏం లేదు..." అని చెప్పి గబగబా రూంలోకి నడిచేడు వాసు.
"మనందరం మిత్రులం. మనలో దాపరికం వద్దు. నువ్వు దేనిగురించి మదన పడుతున్నావో చెపితే, అందువల్ల కొంత భారం నీకు తగ్గినట్టవుతుంది వాసూ" అన్నాడు పతి.
వాసు పేలవంగా. హోల్డాలు పైన చతికిల పడుతూ-
"క్షమించు పతీ! ఒక్కోసారి నేను పిచ్చి పనులు చేయడం కద్దు. ఏమీ అనుకోవద్దు" అన్నాడు.
"ఏమిటో గొప్ప మిస్టరీగా ఉందయ్యా నీ వ్యవహారం" అన్నాడు ప్రసాదం సిగరెట్టు ముట్టించుకుంటూ.
"మిస్టరీ...." గొణిగాడు వాసు.
"ఏం జరిగిందో చెప్పరాదూ?" పతి అడిగేడు.
"..... మా నాన్న గుర్తుకొచ్చేరు. పోయిన మనిషి నా కోసం బ్రతికి రావడం అసంభవం కదూ! కానీ......థియేటర్ దగ్గరికి ఆయనొచ్చినట్టూ నన్ను ప్రేమతో పిలిచి నట్టూ అనిపించింది. అక్కడ ఒక్క క్షణం గూడా నిలువలేక పోయాను. నాన్నకి నేనంటే అమితమైన ప్రేమ. పెంచినన్నాళ్ళు నన్నాయన ఒక్క క్షణం గూడా విడిచి ఉండలేదు. ఇప్పుడాయన లేరు. కానీ - ఆయన స్మృతి మాత్రం నన్ను కలవర పెడ్తుంది." అన్నాడు. వాసు గాద్గదికంగా.
ఎవరూ ఏమీ మాట్లాడలేదు. మళ్ళా అతనే అన్నాడు.
"మా నాన్న పోవడం మిస్టరీలా జరిగింది. ఆ రోజు ఆయనకి పెన్షనొచ్చింది. ఆయన చేతికి డబ్బొచ్చినప్పుడల్లా నేను ఖర్చుపెట్టుకునేందుకు అయిదూ పదీ ఇస్తూండేవారు. ఆ క్రితం రోజు హైదరాబాద్ ఇంటర్వ్యూ కెళ్ళి వచ్చాను. నాన్న ఒక అయిదు రూపాయల నోటునా చేతి కిస్తూ 'ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఇచ్చేదిరా వాసూ!' అన్నారు బాధగా. అంతే - ఆ నోటు ఆయన చివరి సారిగా ఇచ్చినదై పోయింది. ఆ మరుసటి రోజు నాన్నలేరు. ఆయనిచ్చిన నోటు మాత్రం ఇప్పటివరకూ భద్రంగా ఉంది. నేనుద్యోగిని. నాలుగు డబ్బులు సంపాయిస్తూన్న వాడిని. పువ్వుల్లో పెట్టి పూజించాలిసిన మా నాన్న నాకిప్పుడు లేరు." అన్నాడు వాసు కళ్ళనిండా నీళ్ళు నింపుకుని.
శకరం వాసు భుజాన్ని తట్టాడు.
వాసు శంకరం కళ్ళలోకి చూస్తో
"నేను అన్నివిధాల అభాగ్యుడిని శంకరం" అన్నాడు బాధగా.
"ఇది జీవితం వాసూ!" శంకరం వాసు చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు.
ఆ రాత్రి ఎవరూ భోజనం చేయలేదు!
* * *
రోజు రోజుకీ మరీ అధ్వాన్నంగా తయారవుతుంది. ఆరోగ్యం జానకిరామయ్యగార్కి.
ఎన్నో టానిక్కులూ, మందులూ వాడుతూనే ఉన్నారు. అయినా లాభం లేక పోతుంది. ఈ వృద్ధాప్యంలో, అనారోగ్యానికి తగ్గట్టు సుశీల పెళ్ళోకటి సమస్యగా తఃయారైంది.
ఆమెకి తగిన వరుడు దొరకాలంటే నాలుగు ఊలు తిరగాలీ, నలుగురినీ సంప్రదించాలి. అలా చేసేందుకు తనకి ఓపికలేదు మరి. పోతే-కొడుకులైనా ఈ బరువుని నెత్తి మీద వేసుకుంటే బావుండనిపించింది. ఆ మధ్య కామాక్షమ్మ భర్త శోభనాద్రిగారు ఉత్తరం రాశారు, శారద పెళ్ళి ఈ సంవత్సరంలో జరపటానికి తమ అంగీకారం తెలియ జేయవలసినదిగా వ్రాశారు.
మగ పిల్లవాడికి పెళ్ళి కాదనే దిగులు తనకే నాడూ లేదు. సుశీల తన గుండెల మీద కుమ్పతిలా కూర్చునుంది. ముందు ఆ పిల్ల పెళ్ళి కావాలి. ఈ విషయమై తన పిల్లకి, వాళ్ళకు తెలిసిన వాళ్ళలో ఎక్కడైనా మంచి సంబంధాన్ని చూడవలసిందిగా వ్రాశారు. ఆ కామాక్షమ్మ గార్కీ వాళ్ళ పిల్ల పెళ్ళి విషయమే కావలసి వచ్చింది గాని ఇవతల తమ పరిస్థితి నర్దం చేసుకోడం లేదు.
మొన్నటి వరకూ ఏ జబ్బూ లేని రాయిలాటి మనిషి దీక్షితులు, హఠాత్తుగా పోయారు. కాబట్టి మృత్యువు నెవరూ ఊహించలేరు. ఏ క్షణం ఎలాటిదో ఎవరు చెప్పగలరు? రేపు తనూ-
......ఏమిటీ పాడు ఆలోచనలు! సుశీల పెళ్ళి తను చూడక మునుపే ఈ దారుణం జరుగుతుందా? అసంభవం. వృద్ధాప్యంలో ఇలాటి రోగాలు రావడం రివాజే గాని ప్రాణహాని చెయ్యనని తన గట్టి నమ్మకం.
మరి అలాగైతే దీక్షితులు?
అది వాడి ఖర్మ. రోజు మూడింది. పోయాడు.
మనిషికి పనీ పాటా లేకపోతే ఇలాటి పిచ్చి ఆలోచనలు రావడం కద్దు. పోనీ- నిరంజనం దగ్గరుండైనా వైద్యం చేయించుకుందామా అంటే- ఆ ఇంట్లో భార్యా భర్తల మధ్య రగుల్తున్న జగడం చూస్తూ కూర్చోడం తనకిష్టం లేదు.
మరెట్లా? కళ్ళు గట్టిగా మూసుకుని నొసటను చేతుల్తో రుద్దుకున్నారు జానకిరామయ్య.
"కోటయ్య పంతులు గారబ్బాయి పిలుస్తున్నాడు నాన్నా అన్నది సుశీల. జానకిరామయ్యగారు కళ్ళు విప్పి.
"లోపలికి రమ్మని చెప్పక పోయావూ" అన్నారు.
అతనే లోపలికొచ్చాడు. జానకిరామయ్యగారి ముందున్న కుర్చీలో కూర్చుంటూ.
"మిమ్మల్ని మా నాన్న ఒకసారి రమ్మని చెప్పారండీ"
"ఏమిటో విశేషం."
"తెలీదండి."
"నన్ను ఈ చివరనుంచి ఆ చివరికి నడిపించకపోతే వాడే ఇక్కడికి రాకూడదటోయ్?"
"ఆయనకి పది రోజులనుంచి వంటో బాగోడం లేదండి! విపరీతమైన దగ్గూ, ఆయాసమూను."
"అరరే......"
"ఒక్కరే ఎంతసేపని చెప్పి ఆ నాలుగు గోడల మధ్యా కూర్చుంటారు? దానికితోడు ఈ జబ్బొకటి ఇంట్లో కాలు బయట పెట్ట నివ్వడంలేదు. దాంతో పిచ్చెత్తుతున్న దాయనకి."
జానకిరామయ్య గారు పేలవంగా నవ్వారు.
"వయస్సు నాయనా! ఎంత వాడినైనా లొంగదీస్తుంది. మాలాటి పెద్ధవాళ్ళకి ఈ వయస్సులో కావలసింది మనశ్శాంతి. అదే మనిషిని చేస్తుంది మరి. కాబట్టి - ఇవన్నీ గమనించి మాకు సుఖాన్నివ్వడం, కనిపెట్టుకు నుండటం మీ విధి. ఏమంటావ్?"
