సత్య మ్రింగలేని విషయాల సత్యం ఆవిడ చెపుతూంది. అదో పవిత్ర హైందవ ధర్మ గీతం.
"ఆయనెవరో, ప్రవరేమిటో, గత చరిత్ర ఏమిటో నాకనవసరం. ఆయనే నా భర్త అన్న ఆరాధనే నాకు కావాలి. బాహికంగా ఆయనకు ఈ శరీరాన్ని అర్పించలేనేమో? అదే ఆయన కోరుకుంటే నా ధర్మం నేను నిర్వహిస్తాను.
"ఇక నువ్వా? నీ అదృష్టం నీది."
ఒక్కసారిగా, కాళ్ళమీద వంగి నమస్కారం పెట్టింది సత్య. పొంచి ఉన్న మధు అంతావిన్నాడు, చెప్పుకోలేని ఆనందంలోనే కన్నీళ్లు చిలుకుతుంటే.
"వదినా, ఈ మరిదికూడా" అంటూనే కాళ్ళకు నమస్కారం చేసేడు.
బండి వీధిలోనే నించుంది. సత్య చేతుల్లో రవికెలగుడ్డ ఉంది.
"దీర్ఘ సుమంగళీ భవ" అనే శాంత ఆశీర్వచనం. ముఖంమీద నీళ్ళు కొట్టవలసినత పని అయింది సత్యకు. ఆనాడు అదే రాజు అన్నాడు. ఇదే మళ్ళీ శాంత నోటితో....
గబగబా వెళ్ళి బండిలో కూర్చుంది. మలుపు తిరిగింది. ఊరు దాటేసరికే "అదే అవధానులుగారి కొడుకు రామం సమాధి. దానిమీద పిత్రుప్రేమ చూపించుకుంటూనే కట్టించి వ్రాయించేడు" అన్నాడు వ్రేలుతో చూపిస్తూనూ మధు.
"ఏం వ్రాసేరు?"
"మరణం 1934 జనవరి 16 అని -"
కుతూహలం రేకెత్తింది. దిగి వెళ్ళింది. దగ్గరగా తిరిగింది. అదే ఉంది. ఏమిటిది? ఈ కట్టె వదిలి రామం, రాజు అయ్యేడా? కాళ్ళకు ఏమిటో తగిలినట్లుగానే ఉంటే వంగి చూచింది.
నీలం రంగు కలం. 'రాజాకి సత్య' ఇంగ్లీషులో వేయించిన పేరు ఉంది.
గుండెలు పిడచకట్టేంత భయం క్రమ్ముకుంది. ఒక్కటే పరుగు. ఊపిరే తిరగదేమో అన్నంత తొట్రుపాటు. అవసి గవసిన ఊపిరి.
"మధూ!" అంటూనే చేతుల్లో తలెట్టి గోల పెట్టేసింది.
దడుసుకుందేమో అనుకున్నాడు. ఒక్కసారి కలియచూస్తే పుర్రెలు, గోతులు, సమాధులు, చితులు, మధ్యలో బృందమ్మలు. బర్రెంకల్లా బ్రహ్మజెముడు పొదలు. "ఇది ఆయన నివాసస్థానం" అన్న భావనలోనే నవ్వుకుని, వీపు నిమిరేడు.
చేతిలో కలం పెట్టింది. చదివేడు. ఇదా జరిగింది అనుకున్నాడు.
బండి జోరుగానే నడిచింది.
"సత్యా, నువ్వు ఇప్పటికైనా నమ్మగలవా?" అన్నాడు, ఆలోచనలోంచి తేరుకుంటూ.
"నాకు పిచ్చెక్కుతుందేమో!" అంది.
సత్యం, సత్యాన్నే చెప్పించింది.
* * *
10

"ఓహో, నువ్వా?" తలుపు తీస్తూనే రావు అన్నాడు.
"ఇవ్వాళ ఆదివారం కదూ?"
"రాండి, మాల, సుమాల. కాంచన మాలా..." నవ్వుతూనే ఆహ్వానించేడు.
"నేనంటే మీకు లోకువ."
"చంపేసేవు. చచ్చినంత భయం ఏడు స్తుంటే!"
ఎర్రబడ్డ కళ్ళు, పగిలిన ముఖం కళ్ళ వెనుక వ్యాపారం ఉన్నా, ఈనాడు చూపులో ఏదో దిగాలుగా కన్పించినట్లు తట్టింది. ఆ ఆదునికంలో, విద్యభ్యాసం ఉన్న, ఉమర్ ఖయ్యాం తత్వమన్నట్లు ఆదివారం మాత్రం జీవితానికి ఆటవిడుపు ఇచ్చేవాడు. తనకు మొదటి పరిచయం ఈవిడతో ఆ హోటల్లోనే అయింది. ఆ రాత్రి తన్ను తాను మరిచిపోయేడు యవ్వనంలో అది తప్పుకాదు అనుకున్న శరీరపు మమతలోనే ఆదివారం ఆవిడకు అరణమిచ్చి, నైవేద్యంగా ఓ పది రూపాయల కాగితం, జాకెట్టులోపెట్టి పంపేవాడు.
"ఈ వారంలో తీరుబడిలేని సంపాదనే కాబోలు." నవ్వేడు.
లేదన్నట్లు తల ఈ మూలనుండి ఆమూలవైపు వరకూ త్రిప్పింది. కాని అందులో జీవంలేదు.
ఏదో జరిగింది. ఇన్నాళ్ళ సామీప్యంలోనూ మాలను చూస్తూనే ఉన్నాడు. ఆ బాహిక రూపం క్రింద ఓ అంతర్ముఖ ఔన్నత్యం ఉంది. పైగా ఆ బీదస్థితిలో చూస్తే ఎనిమిదో క్లాసువరకూ చదివిందని, పరిస్థితుల ప్రాబల్యంవల్లే నైతికపతనం చెంది, కుల భ్రష్ఠత్వం తెచ్చుకుందని, ఇక తప్పదన్నట్లే శరీరాన్ని అమ్ముకుంటూందని ఎవ్వరూ అనుకోరు. అందరిలాగే అదీ అన్న ఈసడింపు చేస్తారు.
"ఏం జరిగింది?"
నెమ్మదిగానే చెప్పింది, హోటల్లో జరిగిన విషయం. ఏ చిన్న అంశంకూడా దాచిపెట్టకుండా విపులీకరించింది. బాధగా, హృదయానికి ఎందుకో పీడిస్తున్నట్టుగా వ్యక్తీకరణ ఉంది. ఆ వచ్చిన రోజుల్లో హుషారుపుడితే, తన అనుభవాలు సమీక్షించేది. నవ్వేది. ఆ సమీక్ష శూలాల్లా ఉన్నా తను వినేవాడు.
"ఓనాడు మహాకావ్యం వ్రాస్తావేమో!" అనేవాడు అప్పుడు.
ఈనాడు చెప్పిన విషయం తన్నూ కదుల్చుతూంది. శ్రద్ధగానే విన్నాడు. "ఎల్లా ఉన్నాడు?"
"ఎర్రగా అంత ఎత్తు కాదు. ఇరవై ఏండ్లలోపు ముఖంలో అలసట ప్రస్ఫుటంగా ఉంది. నుదుటిమీద కుడివైపు మచ్చ కొట్ట వచ్చినట్లుగా ఉంది."
"ఆఁ! ఏ హోటల్లో?"
చెప్పింది. వెంటనే చొక్కా తొడుక్కుని, చిల్లర కుక్కుకుంటూనే "అతన్ని నేను పట్టుకోవాలి" అనే బయల్దేరేడు.
ఆశ్చర్యంతో, కుతూహలం రేకెత్తితే "నేనూ వస్తా" అంది.
రిక్షాలో కూర్చునప్పుడే అడిగింది. చూచాయగా ఏవో ఏవో అన్నాడు. అతని చుట్టూరా చీకటి చిక్కపడ్డట్లు కన్పడింది. ఎవరైనా అతను ఓ అతీత వ్యక్తిలాగే తట్టింది.
"అంత ముఖ్యుడా మీకు?"
తల ఊపేడు. రాజు ఈ ఊళ్ళోనే ఉన్నా డన్నమాట. ఆ రోజు మధు ఇంట్లో జరిగి నప్పటినుండి, తను చెప్పుకోతగ్గ ప్రయత్నాలు చెయ్యలేదు. పేపర్లో ప్రకటన చూచేడు. దానివల్ల ప్రయోజనం ఉన్నా, లేకపోయినా సకృతుగానే దశరథంగారు వేయించేరు. అంతే.
అయినా మాలతో జరిగిన కలాపంవల్ల, రాజులో శిఖండి లేచిందా అన్న ఆశ్చర్యం కలిగినా, ఇప్పుడు మాలమత్రం వెతపడుతూంది. హోటలు మెట్లు దిగివస్తూనే, నిరాశగానే వచ్చి, "నిన్న రాత్రే వెళ్ళిపోయేడుట" అన్నాడు. మనస్సు దిగులుపడింది. ఉత్సాహం కలగలేదు.
"నువ్వు వెళ్ళిపో."
"ఆయన్ని ఎక్కడని వెతకగలరు?"
"ఏమో!"
"ఒక్కటి అడుగుతాను. ఆయన కన్పిస్తే మళ్ళీ ఓసారి నాకు చూడాలి అని ఉంది."
"వలపు పుడుతోందా?" నవ్వేడు.
"ఇంతమంది నన్ను వలచేరు. నా వలపు చిగర్చకుండానే అల్లాగే ఉండింది. అందుకూ."
చురుక్కుమంది హృదయం. గబగబా అడుగులే వేసేడు. స్టేషనుకు బయల్దేరేడు. ఊసుపోని వాళ్ళకందరికీ స్టేషను అన్నపూర్ణ. ఇటూ అటూ పచారు చేసేడు. గుంటూరు బండి బయలుదేరుతుంటే చూద్దామనుకున్నాడు. పెట్టెల్లో మనిషిని పోలని మనుష్యులు. నోరెట్టుకుని స్థలం సంపాదించాలన్న ఆయత్తత.
"ఏమిరా? జ్ఞాపకం ఉన్నానా?" ఒకాయన భుజంమీద చెయ్యి వేసేడు.
ఎవరా అన్నట్లు ఎగాదిగా చూచేడు. జరీ అంచు ధోవతి. సిల్కు చొక్కా, పైన రుద్రాక్ష పేటంచు కండువా. పేలవంగా వేస్తున్న వాడిన సెంటు వాసన.
గుర్తుకు రాలేదు. "లేకేమండి?" ఆన్నాడే కాని తలా తోకా అందలేదు.
ఆయన ఫస్టుక్లాసులో ప్రయాణం చేస్తున్నానన్నట్టే "ఏమేవు, చూడు. ఇతనెవరో గుర్తుపట్టేవా?" అన్నాడు నడిపి స్తూనే.
తేరిబారచూచి "పెంటపాడు సుబ్బమ్మ కొడుకు కాదూ?" అంది.
"సరిగ్గా చెప్పేవు. మొన్న మా అమ్మాయికి పెండ్లిచేసి తిరిగి ఇంటికి వెళుతున్నాం. దాన్ని నువ్వు చిన్నప్పుడు చూసి ఉంటావు" అన్నాడు సీతారామయ్య.
"మా అల్లుడి పేరు వినే ఉంటావు. కార్ల రామచంద్రయ్య" అంది ఆవిడ.
గుండెలు ఆగిపోయేయి. రాజు తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడా? ఏమి వైపరీత్యం?
"ఎక్కడ ఉద్యోగం?" అన్నాడు కలుపుకోవాలన్నట్లు.
"ఆ వూళ్ళో కాపీయిస్టు. పెండ్లయిన తర్వాత అల్లుడే 'మామయ్యా, నీకు ఆ ఉద్యోగం ఎందుకయ్యా? నా దగ్గరనే వుంచుగాని' అంటే, వెళ్ళుతున్నాము" అన్నాడు.
లక్ష్మిమాత్రం కొరకొరా చూసింది.
మనస్సు ఎంత తర్జన చేసినా జ్ఞాపకం రాలేదు. చూద్దాం అన్నట్లే "మా చక్కటి సంబంధం" అన్నాడు.
కళ్ళు మెరిపించుకుంటూనే "మా బావ మరదేకా" అనేసేడు. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా గుర్తుకు వచ్చింది. సీతారామయ్య. తను వాళ్ళు ఉన్నప్పుడు ప్రక్కవాటాలో ఉండి, ట్యూషన్లు చెప్పుకుని బ్రతికేవాడు. అతనా?
బండి కదిలేవరకూ వదల్లేదు. మధ్యలోనే అణా సోడా త్రాగించేడు. మొత్తంమీద గొప్ప చూపించుకోవాలన్న పరిచయం అయి నట్లుగానే తట్టింది. తన చిన్నతనంలో గుర్తు ఓ అమ్మాయి ఉండాలని. పేరు రుక్మిణి అని. ఆ అమ్మాయి ఈనాటికి పెరిగి ఉంటే పదిహేనేళ్ళదై ఉండాలి. దాన్ని వీళ్ళు డబ్బుకోసం ఎరబెట్టే రన్నది నిరుకే.
ఏమైనా, ఈ పరిస్థితుల్లో రాజుకు ఇంకో అడ్డం వచ్చిందన్నమాట. సవతితల్లి, దాని తల్లితండ్రులుగా వీళ్ళిద్దరూకూడా ఇంటిపట్టున ఉండకుండానే తరిమివేస్తారు. అది తథ్యం అవును. ఏ నక్షత్రాన్ని పుట్టేడో పాపం అనుకున్న జిజ్ఞాసతో జాలి కలిగింది.
ఆలోచిస్తూనే అడుగులు వేసేడు.
