Previous Page Next Page 
ఆరాధన పేజి 13


    అయితే - నే నెక్కడి కెళ్ళాలి? అడుక్కు తినాలా? పనిచేసుకోనివ్వరు కదా! నాలాటి దాన్ని ఏ పనికిమాత్రం పెట్టుకుంటారు? గమ్యం లేక పిచ్చిదాన్నైపోయాను. నాతోపాటు బాగయిన లక్ష్మీదేవి అనే పల్లె పడుచుది ఈ ఊరు, ఎరుకల మనిషి ఐతేనేం - నన్ను చేరదీసి ఇక్కడికి తీసుకొచ్చింది. బుట్ట తట్టలల్లి - యాచించి నన్నుకూడా పోషించేది. నేను మీలాటి వారి తోటల్ని ఊడ్చి ఏదైనా త్రవ్వమంటే త్రవ్వి కడుపు నింపుకుంటాను. నా మరిది అప్పుడప్పుడు డబ్బు పంపేవాడు సంవత్సరాని కొకసారి పరీక్షకని వెళ్తాము. అంతా పరీక్షించి "నెగటివ్ అని పంపేస్తారు కానీ. తల్లీ - ఏం లాభం-మమ్మల్ని ఏ పనిలో కూడా పెట్టుకోరు. అక్కడేమో అడుక్కు తినవద్దు" అని ఆదేశిస్తారు -గడ్డికోసి తెస్తే అమ్ముకొచ్చేది. పిడకలు చేస్తే అమ్ముకొచ్చేది ఆ పల్లెలో పిడకా-గడ్డి ఎవరుకొంటారు తల్లీ పాపం- నానా యాతనా పడేది. ఒక రోజు పాము కరచి నిమిషాల్లో ప్రాణం విడిచింది. నన్నొంటరిదాన్ని చేసిపోయింది "ఆమె హృదయవిదారకంగా రోదిస్తోంది. మంజు కడుపు తరుక్కుపోయింది... అప్పటినుంచి నా పొట్ట గడవటమే కష్టమైపోయిందమ్మా - బంధనా లన్నింటినీ తెంపుకుని వచ్చేశాను గాని లక్ష్మి పోవడంతో నాలోని సహనం - అహం - ప్రేమ అన్నీ నశించిపోయాయి నా హృదయం శిల అయిపోయింది. మంచి - చెడు - రెండింటికి తేడాలేదు....ఆకలిబాధ తీర్చుకోవాలి - అదే నా ధ్యేయం నాసంతానంపట్ల నావిధి నిర్వహించాను - నా కర్తవ్యాన్ని పాలించాను....అదే నా తృప్తి....."ఆమె ఆర్ద్రనయనాలను కొంగులో ఒత్తుకుంది.
    "నీ భర్త డబ్బు పంపడా?"
    సుబ్బమ్మ వింతగా మంజుకేసి చూసి స్పృహగా నవ్వింది.
    "హృదయంలో ఇన్ని సంవత్సరాలుగా కరుడుగట్టిన బాధంతా ఇవ్వాళమీతో చెప్పటంతో కరిగిపోయి కొంతహాయిగా ఉందమ్మా..... డబ్బుమాట...? అయ్యోతల్లి - ఇప్పటికి ఐదేళ్ళ నించి నాకు డబ్బుపంపే దిక్కులేదు. మరిదిపోయాడు... ఇన్ని సంవత్సరాలుగా హృదయాన్ని శిలగా చేసికొని "నా" అన్నవారు లేరని భావిస్తూ సన్యాసినిలా గడిపాను..... ఈ వయసులో నా కెవ్వరిమీద ప్రేమగాని, అభిమానంగా ని లేదు అన్నింటికీ అతీతురాలనై పోయాను. ఇప్పుడు డబ్బు రావాలి- నా బ్రతుకుదెరువు అదె- అన్న ఆలోచనకూడాలేదు. అక్కడికి వెళ్ళి బెదిరించి డబ్బు రాబట్టు కోవాలన్న కోర్కె నశించింది....నా విధిని నేను నిర్వహించాను... అంతేనమ్మా...అంతే... ఇదంతా మీ కడపులోదాచుకోండి తల్లీ"
    ఆమె చీపురు చేతబుచ్చుకొంది.
    మంజు ఆర్ద్రనయనాలతో ఆమెవైపు చూస్తోంది. తను డాక్టర్ - తనకన్నీ తెలుసు కానీ ఆమెను మామూలు మనిషిగా సృష్టించ లేక పోయింది. మానవుడిలో ఎంత హీనమైన బలహీనత దాగివుంది- ఎంత భయం- విషపు కోరలను పీకిన నా గుబాము హానికరం కాకపోయినా - దాన్ని చూస్తేనే భయం కాదా పాపం! పాపం! అనుకోటం తప్ప తనేం చెయ్యగలదు? హృదయం క్షోభించింది. ఒక్కసారి దీర్ఘంగా విశ్వాసించింది.
    కుమార్ వచ్చాడు - చెప్పదగినంతవరకు నాల్గుమాటల్లో చెప్పింది. అతనుకూడా పాపం-అన్నాడు-అంతే?

                             *    *    *

    సాయంత్రమైంది. హాస్పిటల్ లో జనం ఎక్కువ మందిలేరు కాంపౌండరు. కుమార్ ఏదో మాట్లాడుకుంటూ కూచున్నారు. తోటమాలి వీరన్న అటు వేపుగా వచ్చాడు.
    "దండాలండీ బాబూ....దండాలయ్యా అన్నాడు.
    "ఆ.....పెళ్ళి హడావిడిలో తోటకు రావటమే మానేశావు కాంపౌండరుగారు పలుకరించారు.
    ముసలాడు నవ్వేడు. "ఎల్లుండి లగ్గం తమరు తప్పకుండా దయసేయాలె డాట్ట బాబూ తమరుకూడా కట్ట అనుకోకుండా రావాలి. పేదోడివి....మీ దయ.
    "ఎవరి పెళ్ళి" కుమార్ మామూలుగానే అడిగాడు.
    "మా చిన్న బిడ్డది.
    "అల్లుడేం చేస్తున్నాడు"
    "ఆయనకేం-మారాజు మూడెకరాల మాగాణి - ఎకరం మామిడితోట - గొడ్డు గోదా అన్నీ ఉన్నాయి. నాది చిల్లిగవ్వఖర్చు లేదండయ్యా - అంతా వాళ్ళదే-
    "అదృష్టవంతుడివే తాతా... ఈ కాలంలో కట్నం లేకుండా పెళ్ళిళ్ళు కావటమే కష్ట.....ఈ అల్లుడు బుద్దిమంతుడు....అందరూ....
    "డాక్టర్ గారూ....అప్పుడే పొగడకండి తాత - తన పదహారేళ్ళ కూతుర్ని నలభై ఐదేళ్ళవాని కిస్తున్నాడు. అదీ మూడో సంబంధం....మొదటి భార్యకు సంతానం లేదని రెండో పెళ్ళి చేసుకున్నాడు - ఆమెకు కూడా బిడ్డలు కల్గలేదు. ఇది మూడో పెళ్ళన్నమాట. చూచి చూచి ఎవరిస్తారు! బీదవాడని ఆశ చూపించి చేసుకుంటున్నాడు ముందర రెండు పెళ్ళిళ్ళకు హాజరయ్యాను ...ఈ పెళ్ళికికూడా వెళ్ళి రావాలి. "కంపౌండర్ మాటలకు ఆశ్చర్య పడిపోయాడు.
    జాలిగా తాతవైపు చూశాడు కుమార్.
    "నా బిడ్డచేయి చూచి-గంపెడు పిల్లల తల్లి అవుతాదని చెప్పింది ఎరుకలమ్మి. ఏం బాబూ- అంబ పల్కుల నిజంగాదా? నిజంగా నా బిడ్డ మగబిడ్డను కంటే మైపూత బంగారమే అవుతాది. దాని అదృష్టం బాగుండాలి......పాయాస పెద్దాళ్ళు ఇద్దరు వచ్చిచూచి, మాట్టాడి పోయారు గాజులు కడియాలు. బంగారుకంటే తొడిగి పోయారు....వాళ్ళకు లేని అదృష్టం నా బిడ్డ కుందేమో". తాత హృదయం - తనకూతురి అదృష్టాన్ని తలంచుకుని ఆనందంతో ఉప్పొంగింది.
    "ఆ ముందు భార్యలు మందుతీసుకో లేదా?"
    ఆ... తీసుకున్నారు....ఆపరేషన్ చేశారు పెద్దామెకు. ఏదో చిన్న లోపం ఉంటే సరిజేశారు.... చిన్నావిడకే లోపం లేదు..... కానీ ఇద్దరు సంతాన విహీనులే.
    "ఎక్కడ చేశారు! పరీక్ష?"
    "అబ్బో! పెద్ద పట్నం తీసుకుపోయాడు" తాత తలపంకించాడు.
    "సరేగాని అతడొక్కమారైనా పరీక్ష చేయించుకున్నాడా?"
    తాత కుమార్ వైపు వింతగా చూశాడు. కొంచెం సేపటి వరకు తాత వీరన్నకు ఆ ప్రశ్న అర్ధం కాకతికమక పడ్డాడు. అర్ధమయ్యాక కుమార్ ను పరీక్షగా చూశాడు. ఎవరూ ఏమీ జవాబివ్వలేదు.
    "చూడువీరన్నా - పిల్లనిచ్చేది నువ్వు చేసికొనేది ఇంకొకరు. మా కెందు కివన్నీ అను కోకు పిల్లచిన్నది. పదహారు సంవత్సరాలు. మరి అతడికి నలభై చిల్లర, పిల్ల ఏం సుఖపడ్తుంది. నీకంటే అతను కొద్దిగా చిన్నవాడేమో ముసలాడితో నీ పిల్ల ఏం సంసారం చేస్తుంది? అందులో ఇంకా ఇద్దరున్నారు. పోనీ వేరే సంబంధం చూడరాదూ? ముందు ఈ మాట చెప్పు- నీ కూతురు కిష్టమేనా?"
    వేరే సంబంధం అంటే నాలుగైదువందలు కావాలె. నా దగ్గర లేదు బాబూ. ఇక పిల్లకు ఇట్టం ఇట్టం లేకపోవటం అనేది లేదు. నా ఇట్టం. అంతే గొప్పోడు - అది చాలు.
    "సరేలే -ఐతే-నా ప్రశ్నకు జవాబియ్యలేదు"
    'అతడికేం-మగ మహారాజు. కోటిమంది కొడుకుల్ని కనెయ్యగలడు. ఆడోళ్ళకు దేవుడు నుదుట రాయలేదు. పాపం వాళ్ళకి గీతలేదు- ఏం పాపం చేసుకున్నారో ఇద్దరికి లేరు."
    "వీరన్నా....భార్యలకు మందిప్పించాడన్నావు మరి అతను కూడా తిన్నాడా-ఏదైనా పరీక్ష చేయించుకున్నాడా?"
    "మళ్ళీ - డాట్టరు బాబు అదే అంటుండారు. మగాడిలో ఏం లోపం ఉంటాదయ్యా పరీచ్చలెందుకూ మందు లెందుకు?"
    కుమార్ నవ్వేశాడు. వీరన్న "ఆ మాత్రం తెలియదా? అన్నట్టు చూచాడు.
    "మగాడనిపించుకున్నావ్ తాతా-సంతానం కలక్కపోవడానికి ఇద్దరిలోనూ లోపాలుండవచ్చు ఒక్క స్త్రీలోనే లోపం కాదు. ఇద్దరూ మందు పుచ్చుకోవాలి. పరీక్ష చేయించుకోవాలి. మందులు - ఆపరేషన్లు అయ్యాక కూడా సంతానం లేకపోవటం ఎక్కడో నూటి కొక్కటి. మొదటి భార్యకు లేకపోతే సరే- పోనీ రెండో భార్యకైనా సంతానం కలగాలిగా? ఇద్దరిలో దోషమేనా?....లేదు.....మాకు తెలుసు ఇది పురుషుడిలో లోపం...అతను చూపించుకుంటే వాళ్ళకే సంతానం కలగవచ్చు."
    తాత, వీరన్న ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఏ సందర్భంలో కూడా ఈ పెళ్ళి తప్పిపోవటం అతని కిష్టంలేదు. పెద్దాడైతే మాత్రం ఏం-దమ్మిడీ ఖర్చు లేకుండా వివాహం జరుగుతుంది. భగవంతుడు చల్లగా చూస్తే దాని కడుపున ఓ నలుసు పడితే-దాని సుఖానికేం తక్కువ? ఈ మనువు కాదంటే అదృష్టాన్ని కాలదన్నినట్లే అవుతుంది.
    "ఏం-వీరన్నా ఆలోచిస్తున్నావు? డాక్టర్ గారు చెప్పేది నిజం. నీ కూతురికి కూడా పిల్లలు పుట్టక పోతే అది పిల్లలో లోపం అంటారు. నీ బిడ్డ సుఖంగా బ్రతుకుతుందని ఇంతపని జేస్తున్నావు. కథ అడ్డం తిరిగితే పిల్ల గతేంకాను? మూడవ భార్యకు ఏం విలువ? నాలుగో పెళ్ళికి తయారౌతాడు అల్లుడు?....అతడికేం-బాగానే వుంటుంది. పండక్కో పడుచు పెళ్ళాం. ఎటు తిరిగీ మీకే అన్ని యాతనలు సాధక బాధకాలూ."
    వీరన్న కేం జెయ్యాలో తోచలేదు.
    లేచి నుంచున్నాడు. కాని తనకు తెలుసు. అంతా సుఖంగా సవ్యంగా జరుగుతుందాని అంతరాత్మ పదే పదే చెబుతోంది. ఒక్క మాటలో తప్పుకుని బైటపడ్డాడు.
    ఆ మాట-మాటిచ్చాను బాబు...
    "వస్తాను" అని దండంపెట్టి వెళ్ళిపోయాడు. "పాపం.... చేతులారా పిల్లగొంతు కొయ్యబోతున్నాడు. ఎంతో నమ్మకముంది కూతురుపైన. ఏంలాభం....అన్నట్లు పెళ్ళికొడుకేం జేస్తాడు? మీకు తెలుసునా! కాంపౌండరును అడిగాడు. తెలియకేం-డాక్టర్ గారూ చాలామంచివాడు నా పొలం అతడే సాగు చేయిస్తాడు. ఎందుకని?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS