Previous Page Next Page 
ఆరాధన పేజి 14

 

    'ఇది డాక్టర్ గారి సొమ్ము! దానధర్మలకి ఒప్పుకుంటారు గానీ, దొరల్లాంటి దొంగలకు యివ్వాలంటే కోపంతో మండి పడతారు. ఇప్పటికే ఎంతో డబ్బు దుర్వినియోగం అయిందని చెప్పింది శారద అక్కయ్య! డాక్టర్ గారి బంధు గణం లో కొన్ని శని గ్రహాలున్నాయని చెప్పాడు జోగులు కూడా. అందుకే యింత జాగ్రత్త!' శకుంతలమ్మ గారి ముఖాన నెత్తురు చుక్క లేకుండా పారిపోయింది . ఆ విసిరిన వ్యంగ్యోక్తులు తమ పైనే నని గ్రహించింది . నిశ్శబ్దంగా హాల్లో కి వెళ్ళిపోయింది అనూరాధ. జరిగిన సంగతంతా శారదకు తెలియజేసింది ఫోను ద్వారా.
    మరో రెండు రోజుల వరకు శకుంతలమ్మ గారి నోరూ, చేయీ ఆడనే లేదు. అన్నపూర్ణమ్మ గారామే కంటికి మనిషిలా అగుపించనే లేదేమో, మాట వరుసకైనా పలుకరించ లేదు. ఆమె ఎందుకలా మౌనంగా వుండి పోయిందో అనూరాధ కి అర్ధంగానే లేదు.
    మూడో రోజున యింటి ముందో కారాగింది. హరికృష్ణ మేనమామ, అయన వెనక వో ప్లీడరూ ప్రవేశించారు. అనూరాధ ఏదో పెద్ద దండయాత్రే జరగబోతోందని గ్రహించింది.'
    'రండి! బాబాయ్! ఎన్నో రోజులయింది మిమ్మలని చూసి!" ఆహ్వానించింది అనూరాధ.
    అతడామె ఆహ్వానాన్ని విన్పించుకునీ విన్పించుకోనట్లే నౌకర్నీ కేకవేసి 'కాఫీ తీసుకురారా!' అన్నాడు.
    'ఆ! ప్లీడరు గారూ! మీకు జరిగినదంతా చెప్పానుగా! హరికృష్ణ పిచ్చి పోదని డాక్టర్ గారే వ్రాసి యిచ్చారు! ఇదిగో! చూడండి! నీరజ నా పోషణ లో వుంటుంది. పిచ్చి ఎక్కిందని ఎవరైనా ఆస్తిని కాజేయవచ్చు మీరన్నట్లు. అందుకే ఇవిగో దస్తావేజులు! ఆస్తి నంతా నా పేరున మార్చండి. పాపం! ఎలా అయిపోయిందో చూడండి! మా హరి కుటుంబం!' సానుభూతి ని ప్రదర్శించారాయన.
    అనూరాధ విభ్రాంత అయిందా మాట వినగానే. ఆస్తి పైనే దండయాత్ర జరుగుతుందని తెలుసుకుంది. హరికృష్ణ సంతకం చేస్తాడా పరిస్థితిలో.
    'బాబాయ్ గారూ! ఒక్క మాట! నాకో సందేహం వచ్చింది. హరికృష్ణ గారి పిచ్చి పోదని ఏ డాక్టర్ వ్రాసి యిచ్చాడు? ఏదీ వోసారి చూడనివ్వండి!' అన్నదామె.
    'మధ్యన నువ్వెవరివి? మహాతల్లీ!'
    'మీకన్నా దగ్గరి బంధువునే ఆయనకి!'
    'ఆహా! ఎందుకో?! ఆ దగ్గరి బంధుత్వం!' వ్యంగ్యం దూసుకు వచ్చింది.
    'ఆస్తి కోసం మాత్రం గాదు.' చురుక్కుమంది నివ్వురవ్వ లా ఆ పెద్ద మనిషి కామాట వినగానే.
    'మరి దేనికోసమో! చూడండి ప్లీడరు గారూ! హరి పిచ్చి వాడు , నీరజ కా కాళ్ళూ చేతులు లేవు. ఎవరైనా పిచ్చి వాళ్ళని పెళ్లాడతారా? ప్రేమించుతారా? లోకంలో ఎక్కడైనా విన్నామా? ఈ వింతని?' న్యాయవాది లా ప్రశ్నించాననుకున్నారాయన. సగర్వం గా మీసాల్నీ మెలివేసుకుంటూ అనూరాధ వంక చూస్తూ చిత్రంగా నవ్వారు.
    'మమత లో వున్న మాధుర్యాన్ని చవి చూడని వాళ్లకి దొక వింతగానే వుంటుంది మీరన్నట్లు. కానీ మానవత్వం వున్నవాళ్లు దీన్ని వింత అనలేరు. అనరు కూడా.'
    'సరే! బావుంది వుపన్యాసం! హరికి ఏ వైపు నుంచి చూట్టానివి? నువ్వు?' ముద్దాయిని ప్రశ్నించాడతను .
    'పవిత్రమైన అనురాగ బంధం వైపు నుంచి!' కంచులా మ్రోగిండామే కంఠం.
    'ఆ! వింటున్నారా? ప్లీడరు గారూ! ఈ అమ్మాయి క్కూడా పిచ్చి పట్టినట్టుందే అట్టే చూస్తుంటే!'
    నవ్వుతూ మధ్యలో ఆగి అన్నారాయన--
    'సరే! ఒప్పుకుంటాం నీ మాటని! ఏదీ వో నిదర్శన చూపించు మా హరికి నువ్వు అనురాగ మూర్తి వని!'
                                                                8
    అనూరాధ వెంటనే లోనికి వెళ్ళి హరి కృష్ణ వ్రాసుకున్న డైరీ తెచ్చి ప్లీడరు కందించింది. అయన రామనాధం గారి చేతిలో వుంచాడు. రెండు మూడు పేజీలు  చూసి.
    చదువుతున్న రామనాధం గారి ముఖం వింత వింత రంగుల్ని సంతరించుతోంది. ఒక్కొక్క పేజీ తిరుగుతోంది. అయన కంఠన యేవో భావాలు పైకీ క్రిందికీ దిగుతున్నాయి. పూర్తీ అయ్యేసరికి నల్లగా మాడిపోయిందా పెద్ద మనిషి ముఖం. విసురుగా ఎదుట వున్న బల్ల మీద వేశాడా డైరీని.
    'ఇదంతా ఊహాలోకం! ఆ అనూరాధ ని నువ్వేనని ఎలా చెప్పగలవు?' మరో మలుపు తిరిగిందాతని వాదం.
    'అయన బహూకరించిన కృష్ణ విగ్రహం చూపించమంటారా?'
    'అంటారా ఏమిటి? చూపించవలసిందే! ఆస్థి కోసం యీ రోజుల్లో ఎన్నో వింతలూ జరుగుతున్నాయి.'
    'ఆ మాట అనవలసింది నేను రామనాధం గారూ!మీరు లెక్క లేకుండా డాక్టర్ గారి డబ్బు ఖర్చు చేసివేశారు-- ఆ! ఆగండి! కోపం వచ్చినా ప్రయోజనం ఏమీ లేదు. ఇదిగో!...'
    అర్దోక్తి లోనే ఆయనలోని ఆగ్రహం తారాజువ్వ లా లేచింది.
    'ఎన్నివేలు తీసుకున్నానో కొంచెం చెప్పమ్మా!'
    'ఇదిగో ! చూడండి!' ప్లీడరు గారికి అందించింది మరో డైరీ ని.
    అయన డైరీ తెరిచాడు--
    'మామయ్య మళ్ళీ వచ్చాడు . పది వేలు కావాలంటూ. నెల రోజుల క్రితమే రెండు వేలు వెళ్ళ పెద్దబ్బాయి చదువు కోసమని తీసుకొన్నాడు. నోటూ లేదు. తిరిగి రాని డబ్బు అది. ఈ పదివేలూ యింతే!'
    'మరో పేజీ తిరిగింది--
    'రామనాధం మామయ్య మొత్తం 75 వేలు తీసుకున్నాడు. ఇంకా వున్నదంతా దొంగిలించాలనే ప్రయత్నించుతున్నాడు.'
    ప్లీడరు తెల్లబోయాడు. రామనాధం గారికి ముచ్చెమటలు పోశాయి.
    అంత జాగ్రత్త గా తనను నాలుగు వైపులా నుంచీ వో అమ్మాయి బంధించుతుందని అయన ఏనాడూ ఊహించనైనా ఊహించనే లేదు.
    ఏవో మాయమాటలు చెప్పి, మంత్రాలు అల్లి, కళ్ళు గప్పి హరికృష్ణ ఆస్తిని చేజిక్కించుకుందామనుకున్నాడాయన. కానీ ఆ బృహత్పధకం తారుమారై పోయింది. పైగా అయన చుట్టూరా మరో ఖైదు నిర్మించ బడింది.
    హతాశుడై సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడతను. ప్లీడరు మహాశయుడు లేచి 'వెళ్లి వస్తానండి! లాభం లేదిక!' అని సెలవు తీసికొన్నాడు. అంతలో శంకుతలమ్మగారు అపరాకాళీ మాతల ప్రత్యక్ష మయ్యింది.
    'ఏవిటండి? అలా దిగాలు పడి పోతున్నారు? ఈబోడి వ్యవహారానికి ! ఇది మన హరికృష్ణ యిల్లు. ఎవరో కాదన్నంత మాత్రాన మనం పారిపోతామా? పిల్లల్ని కూడా రమ్మని కబురంపించండి! అందరం యిక్కడే వుందాం. పాపం! హరికి మాత్రం ఎవరున్నారిక? ఎవరు చూస్తారు? కళ్ళల్లో వుంచుకుని పువ్వులా చూచు కుంటాను బాబుని' ఆమెలోని ఆగ్రహం బుడిబుడి దీర్ఘాలు తీసింది కొంతసేపు.
    అనూరాధ క్షణం సేపు మౌనంగా వుండి పోయింది. ఆ మహాతల్లి అల్లిన పధకాన్ని 'పద్మవ్యూహం కన్నా మించిన వ్యూహం తయారు చేసింది' అనుకున్నదామే.
    'మీరింత శ్రమ పడనవసరం లేదు లెండి. మేము రేపే బొంబాయి వెళ్తున్నాం. మళ్లీ తిరిగి వచ్చేవరకూ యింట్లో ఎవరూ వుండరు! ఎలాగా అన్న సందేహంతో శారదక్కయ్య సతమతమై పోతోంది. మీరామాట అన్నాక కొండంత బలం వచ్చింది.' ఏ భావమూ ధ్వనించలేదా కంఠనా.
    'బొంబాయి వెళ్తున్నారా? ఎవరెవరు? ఎందుకు?' శకుంతలమ్మ గారి కనుబొమలు ముడిపడ్డాయి.
    'హరికృష్ణ గారూ, నేనూ, శారదక్కయ్య ! ఎందుకు వెళ్ళేది అందరికీ చెప్పడం నచ్చదట శారదక్కయ్యకి.'
    ఆ మాట వినగానే శకుంతలమ్మగారి నోరు మంత్రించినట్లు కట్టుబడి పోయింది. రామనాధం గారు మూసిన కళ్ళు తెరువనే లేదప్పటికి!
    ఆరాత్రి శారద రాగానే జరిగినదంతా వాళ్ళు వినకుండా చెప్పింది అనూరాధ. పెద్దగా నిట్టూర్చి అన్నదామె.
    'అయితే మందీ మార్బలం తోనే నీపైన దాడి చేశారన్న మాట, పాపం! పద్మవ్యూహాన్ని చేధించ లేకపోయారే! అనూ! జాగ్రత్త! రామనాధం గారు మనిషి గాడు. గోముఖ వ్యాఘ్రం. మరో వైపు నుంచి నిన్ను బంధించాలని చూస్తాడు. ఈసారి నీతో ఆప్యాయంగా మాట్లాడుతూనే దెబ్బ తీయగలడు! శకుంతలమ్మ' మహా రాక్షసి! స్వయంగా అన్న కాపురాన నరకాన్ని సృష్టించిన మందార యీవిడ! అన్న సంపాదన కోసం ఆశపడి వదినను కాపురానికి రానీయకుండా , లేనిపోనివి కల్పింఛి రెండేళ్ళు పర్వతం లా అడ్డు నిలబడింది.
    మనిషిగా ప్రవర్తించదేనాడు. ఆవిడ కూతురు అరుణ కుమారీ అంతే! అచ్చు తల్లిలా ప్రవర్తించుతుంది. ప్రతిక్షణం పైసా కోసం నాటకం ఆడుతూనే వుంటారు తల్లీ కూతుళ్ళు. తల్లి మందిర అయితే కూతురు శూర్పణఖే అనుకో!' శారద ఆ కుటుంబ గాధను క్లుప్తంగా వివరించింది.
    మరునాటి వుదయాన్నే లేచి  ఎవ్వరి తోనూ మాటైనా చెప్పకుండానే ప్రయాణమై వెళ్ళిపోయారు రామనాధం , శకుంతలమ్మ గార్లు. తృప్తిగా విశ్వసించింది అనూరాధ అంతటితో ఆపీడ వదిలినందుకు.
    నీరజను మరోసారి చూసి రావాలనుకుంది. కానీ పది రోజుల వరకూ తీరిక చిక్కలేదామెకు. వో నాటక సమాజం వారు ఆమెను మద్రాసు లోనే 'మరోసారి నృత్య ప్రదర్శన యిమ్మని ఆహ్వానించారు. అంగీకరించిందామె.
    'అనూ! బావకి సేవ జేయడంతోనే అలసిపోతున్నావు. నృత్య ప్రదర్శన యివ్వడానికి కింకా వోపిక వుందా?' అన్నది శారద.
    'వోపిక అవసరం ముందు వొడి పోయిందక్కా! రాజు స్కూలు ఫైనలు పాసయ్యాడుగా! కాలేజీ లో చేరతా నంటున్నాడు. మరి డబ్బు కావద్దూ!'
    'ఈ శారద అక్కయ్య ఆ మాత్రం ఆదుకోగూడదా అనూ!'
    'కూడదని కాదక్కా నేనలా అంగీకరించింది, పవిత్రమైన స్నేహాన్ని డబ్బుతో ముడి వేస్తె మిగిలేది శూన్యమే! అభిమానం మరీ ఎక్కువ అని హాస్యమాడకు. స్వయం శక్తి మీద ఆధారపడితేనే హాయిగా వుంటుంది. అవసరాలు అనుక్షణం వుంటూనే వుంటాయి. మన జీవితాల్లో. సాయం అందించే వాళ్లున్నారని సోమరితనంగా కూర్చోలే నక్కా!' అన్న దామె మృదు మధుర స్వరంతో.
    శారద కనులలో ఏదో భావం మెరుపులా మెరిసిందా క్షణం లో . ఆ స్నేహమయిని చూస్తున్న కొలదీ ఆమె అంతరంగాన ఆనందం అర్ణవమై కట్టలు త్రెంచుకుంటోంది.
    ప్రదర్శన కి హరికృష్ణ ని కూడా వెంట దీసికొని వెళ్దామన్నది శారద. గత స్మృతులు ఏవైనా, ఆ నృత్యాన్ని చూడగానే కదులుతాయేమోనన్న  వూహతో.
    అనూరాధ అలంకరించుకుంటున్నంత సేపూ ఆమె ముందే కూర్చున్నాడు హరికృష్ణ. అతడు మొదటగా ఏలూరు లో అదే వేషం లో చూశాడామెను.
    అలంకరణ పూర్తయ్యింది . కాలి అందెలు ఘల్లు ఘల్లు మంటుండగా 'వెళ్ళనా మరి!' అన్నది హరికృష్ణ వంక చూసి.
    అతనిలో తుఫాను ఆరంభమైంది. ఏవో భావాలు వూపివేయసాగాయి. అతని హృదయాన లీలగా ఏదో దృశ్యం కదులుతోంది. పెదవులు వణుకుతున్నాయి. కనులలో వింతైన మెరుపులు తళుక్కుమంటున్నాయి. నవ్వబోయాయి పెదవులు కానీ ఆ క్షణం లోనే ముకుళించుకు పోయాయి ఎందుకనో. ఏదో శబ్దం వెలికి రాబోయింది. వెంటనే గొంతులో ఉండలు వుండలుగా ఏదో అడ్డుపడింది. మెల్లగా లేచి శారద వెనకే వెళ్లి సీట్లో కూర్చున్నాడు. అనూరాధ కనులలో బాధ తరంగాలై దూకుతోంది. అతడు తన వంక చూసిన చూపులు కలవర పెడుతున్నా యామెను.  బాధతో, గతం గుర్తు రాక, విలవిల లాడిపోయిన ఆ డాక్టర్ వదనాన దీనత్వం రంగులు పులుము కొనడం మరువలేక పోతోంది.
    'కృష్ణా! బాధపడవద్దిక! ఈ అనూరాధ సర్వస్వమూ మీదే! నా మనస్సున మల్లె లు పరిచి వుంచాను మీ కోసమే!' అని ఆ శాపగ్రస్తుడ్ని ఊరడించాలని తహతహ లాడిపోయిందామెలోని అనురాగమయి.
    ఆ తహతహ ఆమె అచ్చు 'రాధే' అయ్యింది. ప్రేక్షకుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ఆ అనురాగమయి మధుర కంఠన సరిగమలు సరికొత్త హోయాలలో శ్రోతల హృదయాలలో తీయని వూహల తీరుపై నవ్వులు పువ్వుల్ని రువ్వాయి.
    ప్రదర్శన ముగిసిన తరువాత యింటి దగ్గర అన్నాడు హరికృష్ణ ---
    'రాధా! పిచ్చి వాళ్ళు ఎలా వుంటారు?'
    అనూరాధ నివ్వెరపోయిందా ప్రశ్న విని. ఎవరో అతడిని ఆ మాటతో పరిహాస మాడారని గ్రహించింది. మానని గాయాన్ని రేపి వినోదం చూశారని తెలుసుకుందామె.
    'నేను పిచ్చి వాణ్ణి నటగా?'
    'మంచి మనుషు లందరూ పిచ్చి వాళ్ల గానే కన్పించు తారు కొందరికి.' అనూరాధ మృదువుగా నచ్చ జేపుతోంది.
    'పిచ్చి వాళ్ల నెవరూ పెళ్ళాడారా రాధా!'
    'ఎందుకాడరు ? వాళ్ళూ మనుషులేగా?'
    'మరి...మరి...నువ్వు పిచ్చి వాడ్నే పెళ్లి జేసికొంటావా?'
    'ఏం? చేసుకోగూడదా? తప్పు కాదుగా అది!'
    అతని పెదవుల పై ఏవో భావాలు నృత్యం చేశాయి. కానీ అస్పష్టంగా గొణుక్కున్నాడా మధురమూర్తి. బయట మల్లెలు విరిసినట్లు మెరిసిపోతున్న వెన్నెల వంకే చూస్తుండి పోయడెంతో సేపు. అనూరాధ అతడు బహూకరించిన 'కృష్ణ విగ్రహాన్ని తెచ్చి అతని ముందుంచింది కావాలనే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS