అనూరాధ కాఫీ 'కప్' తో హరికృష్ణ గదిలో అడుగు పెట్ట బోతుండగా పెద్దగా రోదన విన్పించింది వాకిట్లో.
'అయ్యో! రామా! నా బంగారు తండ్రికి ఎంత గతి పట్టిందే! పండులా వుండేవాడమ్మా! ఈ మాయదారి పిచ్చి ఎక్కడ దాపురించింది? భగవంతుడా దొరలా ఉండేవాడివి తండ్రీ! అయ్యో! అయ్యో! ఎంత చిక్కి పోయాడు నా బాబు! ఈ మాట విన్న దగ్గర నుంచీ ముద్ద మ్రింగుడు పడలేదంటే నమ్ము! చిక్కి శల్యమై పోతున్నాను నాయనా! ఎప్పుడూ నీ మీదే బెంగ! నువ్వే కళ్ళల్లో మెదుల్తున్నావు! నా చిట్టి తండ్రిని యీ పాపిష్టి కళ్ళతో ఎపుడు చూస్తానా అని ఆరాట పడి పోయాననుకో! నాయనా!' అంటూ వో మహాకాయం లోనికి వచ్చి బుడిబిడి దీర్ఘాలు తీస్తూ కళ్ళు వట్టుకుంటూ, అటూ యిటూ చూసి మరింత పెద్దగా అరుస్తూ హరికృష్ణ వూపిరి సలపనీయకుండా అతని తలను గుండెల కదుముకుంది.
ఆవిడే 'శకుంతలమ్మ!' అని గ్రహించింది అనూరాధ.
'ఏదమ్మా ! కాఫీయేనా? ఇలా యివ్వు తల్లీ! ప్రాణం కడబడుతోంది. ప్రొద్దుటి నుంచి పచ్చి గంగ ముట్టుకో లేదంటే నమ్ము! ఎపుడు వచ్చి నా తండ్రి హరిని చూస్తానా అన్న ఆరాటంతో చచ్చిపోయాననుకో--' అనూరాధ చేతిలో నుంచి గ్లాసు తానె అందుకుని గడగడా పానకంలా రెండు గుక్కల్లో గ్లాసుడు కాఫీని పూర్తి చేసింది.
'అమ్మా! ప్రొద్దున నాలుగు యిడ్దేన్లు తిన్నావుగా! స్టేషన్లో రెండు కమలా పళ్ళు కూడా తిన్నవుగా!' అన్నది చిట్టి అమ్మ కొంగు లాగుతూ.
ఆరేళ్ళ ఆ పాప నిజాన్ని బయట పెట్టినా నిరాటంకంగానే సాగి పోతోందామె వుపన్యాసం.
ఆవిడ ముఖాన అలసట మచ్చుకైనా కన్పించడం లేదు. రోడ్డు రోలరు లో మూడో వంతు లావుగా, పొట్టిగా, చిన్న కళ్ళతో చూడగానే ఎంత గంబీరత సంతరించుకున్న మనుషులైనా కడుపుబ్బ నవ్వేట్లుందామె ఆకారం.
మాటలు ఎత్తుగా , ఎడంగా వున్న పళ్ళ మధ్య నుంచి నోరు లాంటి చిన్న గుహలో నలిగి పోలేక తటాలున బయటకు దూకుతున్నాయి 'బ్రతుకు జీవిడా!' అన్నట్లు.
కట్టుకున్న పట్టుచీర ఆమె హోదాను నలు వైపులకూ ఆడంబరంగా చాటుతోంది పెద్ద జరీ అంచుతో, పూలతో . కానీ ఆ పసుపు రంగు చీర అందమే పోయిందా మహా కాయం చుట్టూరా ప్రదక్షిణం చేయగానే.
వచ్చినప్పటి నుంచీ ఎవరూ కోరకుండా, ఆయాసం అవంతైనా లేకుండా అవిరామంగా సానుభూతి ని వర్షం లా కురిపించుతూనే వుందా మహాతల్లి.
హరికృష్ణ ఆమె వంక రెప్ప వేయకుండా చూస్తుండి పోయాడు.
అనూరాధ మళ్లీ వంట గదిలో తన పనిలో లీనమై పోయింది. అన్నపూర్ణమ్మ గారు వంట చేసుకుంటూ భాగవతాన్ని వింటోంది. రాజుకు ఎంతగా ప్రయత్నించినా నవ్వాగటం లేదు.
వోపిక వున్నంత వరకూ వాగ్ధాటిని అవిచ్చిన్నంగా ప్రవహింపచేసి, అలసి పోతూననుకున్నదేమో అనూరాధ దగ్గరకు వెళ్లి కూర్చుంది.
హరికృష్ణ గురించి మళ్లీ ప్రశ్నించనే లెదామే. అనూరాధ గురించి అరా తీయడం ఆరంభించింది. ప్రఖ్యాత అపరాధ పరిశోధక శిఖా మణిలా. అన్నపూర్ణమ్మగారు అక్కడే వుండడం బావుండలేదన్నది. "మా హరికి నీకూ బంధుత్వం లేదు కనుక నువ్విలా ఈ యింట్లో వుండడం నాకే మాత్రమూ నచ్చలెదంది . హరికృష్ణ కు యిక నయం కాదని తేల్చి వేసింది. కొంతసేపు సానుభూతి ప్రదర్శించి ,' మరికొంత 'ఆస్తిని గురించి 'ఏమైపోతుందో నని 'బెంగగా వుంది' అన్నది.
అనూరాధ ఆ వుపన్యాస సారాంశాన్ని అర్ధం చేసికొంది. కానీ పెదవి మాత్రం కదుపనే లేదంత సేపు. నిస్సంకోచంగా తనను గురించి అంతగా విమర్శలను కురిపించుతున్న ఆ వక్త కేసి చూడనైనా చూడలేదామె. కాఫీ తయారుచేసి హరికి యిచ్చి వచ్చి తన పనిలో లీనమై పోయింది.
వంట పూర్తి కాగానే భోజనం వడ్డించ మని ఆదేశించింది శకుంతలమ్మగారు.
'వంకాయ వేపుడు బావుందమ్మడూ! కాకరకాయ పులుసు ఎంత కమ్మగా వుందీ! అబ్బే! మా వంటవాడూ వున్నాడు! ఎందుకూ! తగలెయ్యనా? అన్ని కూరల్లో కారం తప్ప మరోటి వెయ్యడనుకో! వో నెల మా యింట్లో వుండి కాస్త వాడిక్కూడా నేర్పు తల్లీ! చచ్చి నీ కడుపున పుడతాను.' అన్నదామె. ఆ చివరి మాట తనను అవమానించడానికేనని గ్రహించి అనూరాధ ఆమె వైపు చూసి తలవంచుకుని అన్నది సౌమ్యంగా--
'అమ్మకు ఒకరి యింటికి వెళ్లి నవ్వించుకోవడం నచ్చదండీ!'
శకుంతలమ్మ నిర్ఘాంత పోయిందా వ్యంగోక్తి వినగానే. సమాధానం కోసం వెతుక్కుంటూ వుండిపోయింది.
మధ్యాహ్నం కాగానే నడుం వాల్చి గురక లెట్ట సాగిందామె. అనూరాధ, హరికృష్ణ కు భోజనం వడ్డించి తాను కూడా తిన్న తర్వాత పేపరు చూస్తూ కూర్చుంది. హరికృష్ణ కూడా నిదుర బోతున్నాడు.
'అమ్మాయ్! కాస్త ఆ 'ఫ్లాస్కు ' అందుకోమ్మా!కాఫీ లేకపోతె నా ప్రాణం నిలవదు!' అంటూ లేచింది శకుంతలమ్మ గారు.
'అది అయ్యగోరి కాఫీ! అమ్మగోరూ! మీక్కావలిత్తే రాధమ్మ నడగండి!' అన్నాడు నౌకరు జోగులు.
'మధ్యలో రాధమ్మ గారి పెత్తన మేమిట్రా! బోడి పెత్తనం! హరి నా మేనల్లుడు. ఈ యింట్లో సర్వాధికారాలు నావే! ఎవరడ్డు వస్తారు నాకు!' యుద్ధం ఆరంభమైంది.
పేపరు మీది నుంచి దృష్టి మరల్చనే లేదు అనూరాధ. ఆమె అలా మౌనంగా వున్నందు కెంతో ఆగ్రహం ఆవేశించింది శకుంతలమ్మగారిని. అందుకే లేచి వెళ్లి ఫ్లాస్కు లో వున్న కాఫీ అంతా వంచుకుని తాగి వేసింది.
అనూరాధ కూర్చున్నచోట నుంచి కదలనే లేదప్పటికి. తాను చేసిన పనికి ఎదురుగా బాణాలు విసరబడతాయని వూహించిందామె. కానీ అప్పుడు మరింత నిశ్శబ్ధత అవరించిందా వాతావరణాన్ని. అనూరాధ. పేపరు మడిచి టేబిల్ పైన వుంచి, పడక్కుర్చీ లో వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది.
శకుంతలమ్మ గారు ముఖం కడుక్కుని, చీర మార్చుకుని, కూతుర్ని పడుకోమ్మా అని చెప్పి ఎక్కడికో బయల్దేరింది.
హరికృష్ణ గదిలోకి వెళ్తుండగా అన్నది అనూరాధ.
'అయన నిద్ర బోతున్నారు. మధ్యలో మెలకువ వస్తే ఎదుట వున్న వాళ్ళని చిత్ర వధ జేస్తారు.'
'ఇదిగో అమ్మాయ్! ఏమిటి? నీ వుద్దేశ్యం అసలు? నే నెవరినను కుంటున్నావ్? శకుంతలమ్మని! హరికి మేనత్త ని. ఆ! అత్తయ్య నెలా గౌరవించాలో మా హరి కెవరూ చెప్పనక్కర లేదు తల్లీ!' వెటకారంగా అన్నదామె.
అనూరాధ మౌనం వహించిందా పైన. విజయ గర్వంతో లోన అడుగు పెట్టింది శకుంతలమ్మ.
అది వరకా గృహాన ఎన్నోసార్లు తిరిగిన రావడం వలన ఆమెకే వస్తువు ఎక్కడ వుండేదీ తెలుసు. అలమారు తెరిచి ఏదో వెతుకుతుండగా తాళం చెవుల గుత్తి ఆమె చేయి తగిలి క్రింద పడింది. వంగి తీసికో బోతోందామె.
'ఇదిగో ! మహాతల్లీ! నిన్నెవరు ఆహ్వానించారీ స్వర్గం లోకి? రాక్షసులకీ యింటిలో ప్రవేశం నిషేధించబడిందని తెలియదూ? ఏమిటలా చూస్తున్నావ్? మ్రింగేస్తావా? ఏదీ! ఆ నోరు తెరువు! అవును. ఇద్దర్నీ మ్రింగి వేస్తావను కుంటానే సునాయాసంగా. అల్ రైట్! వెళ్లు! ఊ! ముందు యిక్కడ నుంచి వెళ్ళిపో! వెళ్ళవా!' సిరాబుడ్డి అందుకున్నాడు నిద్ర నుంచి లేచిన హరికృష్ణ.
'అరే! నేను నాయనా! మీ అత్తయ్యను! శకుంతలమ్మ అత్తయ్యను!' బందుత్వాన్ని గుర్తుకు తెస్తోందామె.
'అందుకే యీ శిక్ష! మరి యిన్నాళ్ళూ ఎక్కడ దాక్కున్నారో! అత్తగారు! చూడు! అత్తయ్యా! ఈ యింక్ పిల్లర్ ఎంత అందంగా వర్షించుతుందో!' ఆ డాక్టర్ యింకు ఫిల్లర్ తీసికొని ఆమె ముఖం మీదికి సిరా జిమ్మసాగాడు. ఆమె తప్పించుకోవాలని ఏవైపుకు వెళ్ళినా అతడు వదలనే లేదు. పూర్తిగా ఆమె ముఖం సిరాతో తడిసి నల్లగా, వికృతంగా , అతను వర్ణించినట్లు దెయ్యం లా తయారైంది.
'గుడ్! వండర్ పుల్! మైడియర్ అత్తగారూ! ఎంత అందంగా వున్నారో! అద్దం చూపనా! ఆహా! రంభ! ఊర్వశీ! తిలోత్తమా! రాధా! వోసారిలారా! మన యింట్లో వో అప్సరస ప్రత్యక్ష మైంది! చూడు!' హరికృష్ణ విరగబడి నవ్వుతున్నాడు ఆమె ఆకారాన్ని చూసి.
ఆ నవ్వు విన్పించి అనూరాధ లేచి వచ్చింది. ఆమె ఏదో గొడవ జరుగుతుందని ముందే హెచ్చరించింది. అందుకే వెంటనే లేచి వెళ్ళింది. శకుంతలమ్మ గారిని చూడగానే అనూరాధ కూడా నవ్వాగలేదు.
అనూరాధ ను చూడగానే గభాలున ఆ గదిలో నుంచి విసవిసా నడిచి వెళ్లి పోయిందామే. సిగ్గుతో కుంచించుకు పోయింది.
ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని వచ్చింది. హరికృష్ణ ఇంకా నవ్వుతూనే వున్నాడు. అనూరాధ ప్రశ్నించింది గంబీరంగా --
'ఎందుకలా చేశారు? పెద్దవాళ్ళ మీద సిరా పోయవచ్చా!'
'మరి నేను వెళ్లి పొమ్మంటే ఎందుకు వెళ్ళలేదు! అత్తయ్యట! నా నెత్తి మీదికి ఎక్కి కూర్చుంటుందట!' అతని ఫిర్యాదులో యదార్ధం వుందని గ్రహించింది.
అలమారు తెరిచి చూసిందామె. తాళవు చెవుల గుత్తీ లేదు. బీరువా తీసి డబ్బు తీసికోదలచిందని తెలుసుకుంది అనూరాధ. ఆయింటి లో ఆమె ఏనాడు కాలు పెట్టినా మళ్ళీ వెళ్ళే వరకూ హరి కృష్ణ యిష్టా యిష్టాలు గమనించ కుండానే డబ్బు తీసికొని ఖర్చు పెడుతుందని నౌకరు జోగులు చెప్పాడంత క్రితం రోజున. బీరువా తీసిన చప్పుడయింది. అనూరాధ వెంటనే వెళ్ళింది. శకుంతలమ్మ గారు నోట్ల కట్టలో నుంచి వంద రూపాయల నోట్లను అయిదు తీసుకొంది.
'డబ్బు తీసికొనే ముందు అడగడం మంచిది. పోనివ్వండి! ఈ కాగితం మీద సంతకం చేయండి. మీరెంత తీసుకున్నది వ్రాయండి.' అన్నది అనూరాధ ఓ పుస్తకాన్ని ఆమె ముందు వుంచి.
'అంత ఖర్మ నాకింకా పట్టలేదు! ఇది నా మేనల్లుడి సొమ్ము! ఎవరో లెక్క అడిగితె నేనెందుకు చెప్పాలి? సిగ్గులేని వాళ్ళు ఎన్నైనా చేస్తారు!'
'నిజమే! మీరన్న మాట! అభిమానాన్ని కూడా చంపు కుంటారు కొందరు డబ్బు కోసం. అందుకు సిగ్గు పడవలసిందే!' సూటిగా విసరబడింది బాణం.
తేలుకుట్టిన దొంగలా తలెత్తిందామె తడబడుతూ.
అయిదు వందలూ అందుకుని తిరిగి బీరువాలో దాచి వేసింది అనూరాధ. బీరువా మూస్తూ అన్నది ----
