11

లింగరాజు మామగారు పోవటం తో రామదాసు గారికి సమరోత్సాహం లాంటిది వచ్చింది. కొడుకుని వెంట బెట్టుకొని రెక్కలు కట్టుకొని రామచంద్రాపురం లో వాలారు. బాంకులో డబ్బు స్వాధీనం చేసుకొని జగ్గయ్యపేట లోని పేరయ్య పెంకుటింటి ని కొన్నారు.
లింగరాజు కి రామచంద్ర పురం మీద విపరీతమైన ద్వేషం ఉంది. అందుచేత ఆ ఊరును శాశ్వతంగా వదిలి, ఏదన్నా పట్టణానికి భార్యా సమేతంగా తరలి పోవాలని పధకం తయారు చేశాడు. కొంత ఆస్తి బేరం పెట్టాడు. బెజవాడ లో దుర్గా గ్రహారం లో ఓ ఇల్లు వంద రూపాయలకు అద్దెకు తీసుకున్నాడు. యాభై వేలు పెట్టు బడి పెట్టి, ఊళ్ళో పెద్ద బట్టల కొట్టు పెట్టాడు. లింగరాజు కి వ్యాపారం చేసే తెలివితేటలూ లున్నాయని నేనెన్నడూ అనుకోలేదు.
లింగరాజు కి సారధి చాలా సహాయం చేస్తుండే వాడు. బెజవాడ లో కొత్త ఇల్లు కుదిర్చి పెట్టడం దగ్గిర నించి , బట్టలు కొట్టు బేరం కుదర్చటం వరకు, సారధి నడుం కట్టుకున్నాడు. లింగరాజు కి కూడా సారధి పై అంతులేని నమ్మకం, అభిమానం ఉన్నాయి.
సారధి సలహా మీద లింగరాజు బ్రోకరు వ్యాపారం కూడా మొదలు పెట్టాడు. ఊళ్ళో ఎవరు ఏ వస్తువు అమ్మినా, లింగరాజు చేత కొనిపించే వాడు సారధి. దాన్నే తగినంత లాభానికి మరొకరికి అమ్మించే వాడు. ఒక ఇంజనీరు ట్రాన్స్ ఫర్ అయిపోతూ తన కారుని ఎనిమిది వందలకి అమ్ముతా నన్నాడు. కారనే కంటే అదొక చిత్రమైన నాలుగు చక్రాల బండి అనటం న్యాయం. లింగరాజు తో చెప్పి, సారధి ఆ కారు కొనిపించాడు. రెండు వేలు ఖర్చు పెట్టించి మరమత్తులు చేయించి, రంగులు వేయించి నాలుగు వేలకు అమ్మించాడు. ఆ వ్యవహారం లో పన్నెండు వందలు మిగిలాయి.
ఇలాగే ఎన్నో చేయించాడు సారధి. ఎన్నడూ లింగరాజు దగ్గిర ఒక రూపాయి కూడా అప్పుగా పుచ్చుకోలేదు. నిజానికి సారధి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఒకో పూట భోజనం చేయటం లేదని కూడా అనుమానం కలిగేది. ఎన్నడూ తన విషయం మాట్లాడేవాడు కాదు. తన బాధలు ఒకరితో చెప్పుకునే వాడు కాదు.
లింగరాజు పుట్టిన రోజు పండుగని నన్ను, సారధి ని భోజనానికి పిలిచాడు. నేను వెళ్లాను లింగరాజు ఇంటికి. సారధి రాలేదు. గంట పైన అతని కోసం ఎదురు చూసి, అతని గది వెతుక్కుంటూ గాంధీనగరం బయలుదేరాం కారులో. సారధి సలహా పై లింగరాజు మరో కారు కొన్నాడు ఏడు వేలకి. డానికి ఇంకా బేరం రాలేదు.
గాంధీనగరం లో కేకినీ మహల్ పక్క సందులో ఉంది సారధి గది. వెళ్లి తలుపు తట్టాం. గదిలో ఒక తుంగ చాప మీద ముడుచుకుని పడుకొని ఉన్నాడు. మమ్మల్ని చూసి లేచాడు.
"ఒంట్లో బావుండలేదా?' ఇద్దరం ఒకేసారి అడిగాం.
"బాగానే ఉంది" అన్నాడు నవ్వుతూ.
కడుపు లోపలికి పీక్కు పోయి ఉంది. రాత్రి అన్నం తినలేదనిపించింది. పెరటి లోకి ముఖం కడుక్కుంటానికి వెళ్ళాడు. గది నలుగు పక్కలా కలియ జూశాను. ఒక చిన్న పాత ట్రంకు - కొక్కెం విరిగింది సగం తెరిచినట్లు ఓ మూల పడి ఉంది. అందులోంచి చినిగిన పాంటు సగం బైటకు వేలాడుతుంది. మరో మూల ఒక మట్టి కూజా , గాజు గ్లాసూ. కావాలని దారిద్ర్యం అనుభవిస్తున్నాడు సారధి.
"ఏరా భోజనానికి ఎందుకు రాలేదు?' అని ప్రశ్నించాడు లింగరాజు.
"బట్టల్లేక రాలేదురా" అన్నాడు.
లింగరాజు కి కోపం వచ్చింది. నాకు బాధ కలిగింది. అది మూర్ఖత్వమో, మరేమిటో అర్ధం కాలేదు.
ఆరోజు ఎంత బ్రతిమలాడినా, భోజనానికి రాలేదు సారధి. లింగరాజు దగ్గిర కాని, నా దగ్గిర కాని సహాయం స్వీకరించటానికి అంగీకరించలేదు. చేయగలిగింది లేక మేం తిరిగి వచ్చాం.
మళ్ళీ వారం దాకా నే సారధిని చూడలేదు. చూసి ప్రయోజనం లేదు కనక. అప్పుడు ఫ్లూ జ్వరాలు దేశమంతా విపరీతంగా వ్యాపిస్తున్నాయి. ఒకనాడు ఉదయం లింగరాజు మా ఇంటికి వచ్చి, " సారధి కి బాగా జ్వరం తగులుతుంది రెండు రోజుల నుంచీ. మందిచ్చే వాడు గాని, మంచి నీళ్ళి చ్చేవాడు గాని లేకుండా అలాగే పడున్నాడా గదిలో " అన్నాడు.
"ఇప్పుడెక్కడున్నాడు ?" అని అడిగాను.
"వాడికి తెలివి లేదు. మా ఇంటికి తీసుకు వచ్చాను."
ఇద్దరం కారులో బయలుదేరాం. దుర్గా గ్రహారం లో రోడ్లు బావుండవు. ఎగిరెగిరి పడుతూ లింగరాజు ఇంటి ముందు ఆగింది కారు. లోపల పడక గదిలో పక్క నున్న గదిలో పడుకున్నాడు సారధి. పక్కనే కుర్చీలో కూర్చొని ఉంది లింగరాజు భార్య కల్యాణి.
రెండు రోజుల్లో సారధి బాగా నలిగి పోయాడు. కళ్ళు గుంటలు పడ్డాయి బుగ్గలు లోతుకు పోయాయి. డాక్టర్ వచ్చి ఆ క్రితం రోజే ఇంజక్షన్ ఇచ్చాడు.
"ఇంకా డాక్టర్ రాలేదా కల్యాణి?' అని ప్రశ్నించాడు లింగరాజు.
"డాక్టర్ గారికి కూడా ఫ్లూ వచ్చిందిట. అందుచేత రాలేదు" అంది కల్యాణి.
రోగాలు కుదర్చవలసిన డాక్టర్ల కే రోగాలు వస్తే దేశం ఏమయ్యేట్టు? లింగరాజు మరో డాక్టర్ని తీసుకు వస్తానని వెళ్ళాడు.
కల్యాణి చాలా శ్రద్దగా , దయగా సారధి కి ఉపచారం చేస్తుంది. లేత పసుపు రంగు చీర కట్టుకుంది. శరీరం రంగులో కలిసిపోయింది అది. ముదురు నీలి రంగు జాకెట్టు వేసుకుంది. వంటికి అతుక్కుపోయినట్టుందది ఆరోగ్యం తో ఆమె శరీరం మెరుస్తుంది. అంతవరకూ కల్యాణి ని నేను పరీక్షగా చూడలేదు. చదువు లేకపోయినా, అద్భుతమైన సంస్కారం కలవాళ్ళు లోకంలో అక్కడక్కడ కనిపిస్తారు. అలాంటి వ్యక్తీ కల్యాణి. ఒక మహా శిల్పి జగదేక సుందరి రూపాన్ని చిత్రించినపుడు ఎక్కడ, ఏ అవయవం ఎంతగా ఉండాలో, అంతగానే అమరుస్తాడు. ఆమె రూపురేఖలూ, మాటల తీరూ అలాగే తూచి నట్లున్నాయి.
సారధి కళ్ళు తెరిచాడు. నవ్వాడు మెల్లిగా. "ఒకరికి ఋణ పడటం నా కిష్ట ముండదు. ఋణపడితే తీర్చాలి గదా? ఎప్పుడు తీర్చను?" అన్నాడు.
"ఛీ ! పడుకోండి. అవెం మాటలు?' అంది కల్యాణి.
లింగతాజు డాక్టరు ని తీసుకు వచ్చాడు. కాసేపు అక్కడ కూర్చొని "ఇంక వెళతానురా" అంటూ లేచాను.
సారధి నా చెయ్యి పట్టుకొని, "నీతో మాట్లాడాలి. వెళ్ళబోకు" అన్నాడు.
కూర్చున్నాను.
లింగరాజు ఊళ్ళో కి వెళ్ళిపోయాడు. కల్యాణి కూడా ఏదో గ్రహించిన దానిలా గదిలోంచి బైటికి వెళ్ళిపోయింది.
"నన్నీ నరకం లోంచి బైట పడేయ్యరా ముందు" అన్నాడు సారధి. నాకు అర్ధం కాలేదు. లింగరాజు , భార్యా ఇద్దరూ కూడా సారధి ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు. పెద్ద పెద్ద డాక్టర్ల ని పిలిపిస్తున్నారు. ఖరీదైన మందులు కొంటున్నారు. పళ్ళ రసాలు, పానీయాలు-- అన్నీ ఏ లోటూ లేకుండా సిద్దం చేస్తున్నారు. కల్యాణి స్వయంగా శ్రద్ధ తీసుకుని ఉపచారాలు చేస్తుంది.
'అదేమిట్రా? జబ్బు తగ్గే దాకా ఎక్కడో అక్కడ ఉండాలి కదా! పోనీ మా ఇంటికి వస్తావా?" అన్నాను.
"చెప్పాను కదరా! ఒకళ్ళ కి ఋణపడితే , దాన్ని తీర్చే టైం నాకు లేదు . స్నేహితుడే కావచ్చు, ప్రాణ స్నేహితుడే కావచ్చు. ఒక ప్రాణి మరొక ప్రాణికి ఋణ పడితే దాన్ని తీర్చ వలసిందే. తీర్చే అవకాశం లేకపోతె, అంతకంటే మహా పాపం లేదు."
"అయితే ఇక్కడ నీకు వచ్చిన బాదేమిటి?"
"నేనిక్కడుంటే లింగరాజు జీవితం...."అంటూ సారధి వాక్యం ముగించ కుండానే కల్యాణి గదిలోకి వచ్చింది.
"మీ స్నేహితుడు చాలా పిరికి మనిషండీ" అంది కల్యాణి పెదిమ కొరికి నవ్వుతూ.
"పిరికి మనిషి వాడా? సారధి పిరికి వాడైతే, ధైర్యం గలవాడు ఈ సృష్టి లో లేడు" అన్నాను.
"మీకు తెలియదండీ. కొందరు పురుషులుంటారు. వీరాధి వీరుల్లా ఉంటారు. సింహం గర్జించినట్లు ఉపన్యాసాలు చెప్తారు. అతి సాహస కృత్యాలు చేస్తారు. పులులతో ద్వంద్వ యుద్దాలు చేస్తారు. మహా సముద్రాల్ని ఈదుతారు. నిప్పుల మీద నడుస్తారు. కాని, ఆడదాని దగ్గిరికి వచ్చేసరికి పిల్లి కూనల్లా తోక ముడుచుకు కూర్చుంటారు." అంది కల్యాణి.
అంత అతిగా కల్యాణి మాట్లాడటం నేనెన్నడూ వినలేదు. మాటలు చమత్కారంగానే ఉన్నాయి కాని, ఉల్లాసం కలిగించలేదు.
"సారధి గారికి కాస్త ధైర్యం నూరి పోయండి. మీరు గట్టి వారనే విన్నాను" అని సలహా ఇచ్చింది కల్యాణి.
నేను ఏమీ మాట్లాడలేక పోయాను. కొద్ది పరిచయాలకే మనుష్యుల మీద అభిప్రాయాలు ఏర్పరచు కోవటం సరి కాదనిపించింది.
రేపు ఉదయం కనిపిస్తానని చెప్పి ఇద్దరి దగ్గిరా సెలవు పుచ్చుకొని ఇంటికి బయలుదేరాను. గేటు దాకా వచ్చాక కల్యాణి పిలిచి, "సారధి గారు రమ్మంటున్నారు." అంది.
వెనక్కి తిరిగి సారధి దగ్గరికి వెళ్లాను. కల్యాణి పెరటి లోకి వెళ్ళింది. సారధి ముఖమంతా విషాద మలిన మయింది. జీరబోయిన గొంతుతో "నేనింత వరకూ ఎవరికీ ద్రోహం చెయ్యలేదు. తప్పు చెయ్యలేదు. ఈ చివరి రోజుల్లో నమ్మిన వాళ్ళని వంచించి నరకానికి పొమ్మంటావా?' అన్నాడు.
నాకు కొంత అర్ధమయింది. పూర్తిగా అర్ధం కాలేదు. "రేపు మీ ఇంటికి తీసుకు వెళ్ళరా నన్ను. ఇక్కడ ఉండి , ఊబిలో దిగి, మునిగి పోలేను" అన్నాడు సారధి.
