19
సంతోషం సగం బలం అన్నారు! ఈవేళనీ, రేపనీ, వచ్చే వారమనీ, ఆ పై వచ్చే వారమని అరుణ శంకర నారాయణ గారిని గురించిన కబురు కోసం ఆనందాతిరేకంతోనే ఎదురు చూస్తుంది. ఈలోగా హాస్టల్ లోని సహాధ్యాయినులతో చెలిమి కలపడము, సేతుపతి అయితే నేమీ, రఘుపతి అయితే నేమీ సెలవు రోజుల్లో ఆ అమ్మాయికి అసలు ఈ ప్రపంచం మీది ధ్యాసే ఉండనంత ఇదిగా వింతలూ, విశేషాలూ , వినోదాలూ చూపుతుండడము, సహజంగా శ్రద్ధ గల పడుచు కాబట్టి అరుణ అన్ని వేళలా తన చదువులో లీనమైపోయి ఉండడము మొదలయిన అనేక కారణాల వల్ల ఆ అమ్మాయి ని శంకర నారాయణ గారి మీద బెంగ ఇంతకు ముందు కుంగ దీసినంతగా ఇప్పుడు కుంగ దీయ్యడం లేదు. నెల గడిచింది. రెండు నెలలు గడిచాయి. అయినా ఏ కబురూ ఎవరికీ అందలేదు.
రంగయ్య చౌదరి తెలివి తక్కువ వాడు కనకనా? అలోచించి, అదను చూచుకుని -- అబద్దాలే అయినా అరుణ తృప్తి కోసం ఒక ఉత్తరం వ్రాశాడు ఇన్నాళ్ళ కు! అది ఎక్స్ ప్రెస్ డెలివరీ లో ! అరుణ , అప్పుడప్పుడే ప్రార్ధనలు ముగించి బయటికి వస్తుంది ఇద్దరు ముగ్గురు పిల్లలు, "అరుణా! నీకు ఉత్తరం వచ్చింది. నీకు ఉత్తరం వచ్చింది!" అంటూ అరుణను చుట్టూ ముట్టారు. అరుణ పరుగు పరుగున వెళ్లి , సంతకం పెట్టి ఆ ఉత్తరాన్ని అందుకుని మళ్ళీ ప్రార్ధనా మందిరం లోకి పరుగు తీసింది. ఎవ్వరూ లేరక్కడ. కవరు విప్పింది. రంగయ్య చౌదరి గారి దస్తూరీ అగుపడగానే , అరుణ లో ఎక్కడ లేని ఆవేగం , ఆనందం, ఆశ బయలుదేరాయి. బిగ్గరగా చదువుకోవడం మొదలుపెట్టింది, త్వరత్వరగా అసలు విషయం వద్దకు ఎంత త్వరగా వస్తే అంత మంచిదని!
"చిరంజీవి అరుణకు ఆశీస్సులు. మీరు వెళ్లి పోయిన తరవాత ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి, తుదకు భగవదను గ్రహం వల్ల, నాన్నగారి ఉనికిని గురించి తెలుసుకోగలిగాను. నాన్న, అమ్మ , చెల్లాయి లు అంతా క్షేమంగా ఉన్నారు. ప్రస్తుతం వారందరూ పుణ్య క్షేత్రాలన్నింటి కీ తీర్ధయాత్రలు చేస్తుండడం వల్ల వారిది ఫలానా చిరునామా అని నేనేమీ చెప్పలేను. ఎన్ని తీర్ధయాత్రలు చేసినా, వారందరూ మళ్ళీ ఏదో ఒక చోట స్థిర పడిపోవాలిగా? అసలు విషయాలన్నీమనకు తెలియడానికి మరొక అయిదారు మాసాలు పట్టవచ్చు. అయిదారు మాసాలు గానీ, ఒకటి రెండేళ్ళు కానీ-- ఏ నాటికయినా నిన్ను మళ్ళీ నాన్నగారికి అప్పజేప్పనిదే నేను నా ప్రయత్నాల్ని విరమించను.
ఇకపోతే ...మనం ప్రేమించే వాళ్ళు ఎక్కడో ఒక చోట సుఖంగా , క్షేమంగా ఉన్నారన్న సంగతి తెలిస్తే, ఈ పరిస్థితుల్లో అదే పదివేలు! మళ్ళీ నాన్నగారిని గురించి ఏ కబురందినా వెంటనే నీకు ఉత్తరం వ్రాస్తాను.
నీవు మాత్రం శ్రద్దగా చదువుకో. సేతుపతి గారు నీపై చూపుతున్న దయకూ, సానుభూతి కి ప్రతిఫలంగా మనం ఏం ఇవ్వగలం? శ్రద్దగా చదువుకుని అందరి చేతా సెభాష్ అనిపించుకుంటే , అంతకంటే నీవు ఆయనకు చెయ్యగల ప్రత్యుపకారమంటూ ఏమీ ఉండదు. నాన్నగారిని గురించిన గొడవలన్నీ నాకు వదిలేసేయ్యి . అయన నీ కెంత ముఖ్యులో నాకూ అంతేగా?
బుజ్జి, శంకర నారాయణ, అరుణ కుమార్ నీకు ముద్దు లంద జేస్తున్నారు. నేనూ, అత్తయ్యా ఆశీర్వదిస్తున్నాము. సెలవు, మరి.
--మామయ్య, రంగయ్య."
అదీ ఉత్తరం! ఎన్నిమార్లు చదువుకుందో అరుణ కే తెలియదు. ఈలోగా సేతుపతి గారూ వచ్చారు. అరుణ రంగయ్య చౌదరి ఉత్తరాన్నంతటినీ పెట్టింది. ఉత్తరాన్ని కూడా అయన చేతికి ఇచ్చింది.
సేతుపతి గారికీ రంగయ్య చౌదరి ఉత్తరం వ్రాశారు. అందులో ఉన్నది నగ్నసత్యం. అరుణకు వ్రాసినదంతా నాటకం; బూటకం . ఏదయినా ఎవరి మంచి కోసం? అరుణ మంచి కోసమేగా? సేతుపతి అరుణ సంతోషంతో సగపాలు పంచు కోడానికి ప్రయత్నించారు.
"వెరీ గుడ్. ఏమమ్మా, అరుణా మన రఘుపతే మో వాళ్ళ స్కూలు జట్టు తోటీ మహాబలి పురం వెళ్ళాడు. మనమేం చేద్దామంటావు?"
"అయితే ఎక్కడికీ వెళ్ళద్దు లెండి. నేనిక్కడే ఉండి చదువు కుంటాను."
"మరి నేనేమైపోను? వచ్చే ఆదివారం నాటికి నేను బహుశా చాలా పనిలో ఉంటాను. నిన్ను చూడడానికి వస్తే రఘు కానీ, సంబంధం కానీ వస్తారు. అందుకని ఈ ఆదివారాన్ని నీతోనే ఉంది సద్వినియోగం చెయ్యదలుచు కున్నాను. సినిమాకి వెళదామా? లేదూ....మనమూ రఘుకు పోటీగా , దర్జాగా మన పెద్ద కారులో మహాబలి పురం వెళదామా? నీవేం చేద్దామంటే అది చేద్దాం."
"అయితే ఒకటి చేద్దామండీ."
"చెప్పు!"
"ఇన్నాళ్ళ కిన్నాళ్ళ కు నాన్నగారిని గురించిన క్షేమ సమాచారాలు తెలిశాయి! అందుకని కపాలీశ్వారు ని గుడికి, పార్ధ సారధి స్వామి గుడికి, పడపళని గుడికి వెళ్లి పూకలు చేయించి వద్దామండీ."
"వండర్ పుల్ . నేననుకున్నదానికంటే నువ్వు చాలా బుద్ది మంతురాలివమ్మా అరుణా. పద, కారెక్కు మరి."
ఇద్దరూ బయలుదేరారు. అన్ని అలయాలకూ వెళ్లి, అందరు దేవుళ్ళ కూ కృతజ్ఞతా పూర్వక వందనాలు అర్పించి వచ్చారు.
"నే వస్తానమ్మా , మరి! నిజంగా ఓ నాలుగయిదు మాసాల పాటు ఊపిరి సలుపుకోలేనంత పని తొందర లో ఉంటాను. బహుశా ఏ ఫారిన్ టూరో వెళ్ళవలసి ఉంటుందనుకుంటా. వెళ్లానంటే రెండు మూడు నెలలు అమెరికాలో, యూరప్ లోనూ, జపాన్ లోనూ గడపవలసి ఉంటుంది."
"ఫరవాలేదండీ, నాకేం ఫరవాలేదు. రఘుపతి గారు ఉన్నారు. అమ్మగారు ఉన్నారు...."
"అమ్మగారా? వారెవరు?"
"అమ్మగారే! మీ......"
"చండి ని గురించేనా నీ వనేది?"
"ఇక్కడ నాకింకేవరున్నారు అమ్మగారు?"
"నీకో నమస్కారం. చండి నీకు అమ్మగారేమిటి? నన్నడిగితే అది అత్తగారు! ఏ సినిమా లోనూ ఏ అత్తా నటించనంత నిజంగా చండి నిజ జీవితంలో అత్త వేషాన్ని నటించి మెప్పించగలదు!"
"తప్పు! అమ్మగారిని గురించి మీరలా అనరాదు."
"సరే, ఇప్పుడా గొడవలన్నీ ఎందుకూ? శ్రద్దగా చదువుకో. ఏమాత్రం వీలున్నా వచ్చి కలుసుకుంటూ ఉంటాను. ఏమమ్మా?"
"అలాగే నండీ!" అంటూ అరుణ అయన పాదధూళి తీసుకుని శిరస్సున దాల్చింది. తగు విధంగా ఆశీర్వదించి సేతుపతి వెళ్ళిపోయారు.
20
అంతే . అ క్షణం నుంచి అరుణను సరస్వతి దేవి ఆవహించింది. స్వతస్సిడ్డంగా తెలివి గల పిల్ల. దానికి తోడు శ్రద్దా సక్తులు కూడా మెండయ్యాయి. ఇక చూసుకోండి. అరుణ ప్రోగ్రెస్ ను చూచి పంతులమ్మ లు ముక్కుల మీద వేళ్ళు వేసుకున్నారు.
ఆమధ్యన ఒకనాడు మహిళాసభ సెక్రెటరీ ప్రయత్నించి సేతుపతి గారిని ఏరోడ్రోం లో పట్టుకోగలిగింది. ఏదో ఒక కొత్త బ్లాకు కట్టించాలి. దాదాపు తొంబై వేలు ఖర్చవుతాయి. తారా చౌదరి నాట్య ప్రదర్శన వల్ల ఆరు వేలు పోగు చేయగలిగారు. వచ్చి తీరతాయను కున్న విరాళాలు కూడా ఇంతవరకూ రాలేదు. పని పూర్తిగా ఆగిపోయే ప్రమాదం కూడా ఏర్పడింది. సేతుపతి గారి వంటి ఒక్క ఉదార హృదయుడు తలుచుకుంటే, ఆ పని నిర్విఘ్నంగా కొనసాగిపోతుంది. ఇలా విమానం రీ ఫ్యూయల్ చేసుకునే వ్యవధి లో ఆమె ఎన్నెన్నో విషయాల్నీ, విన్నపాల్నీ వెళ్ళబోసుకుంది.
సేతుపతి వాచీ చూసుకున్నారు. టెలిఫోన్ చేసి అయ్యంగారికి, కానీ, సుబ్బారావు కు కానీ ఉత్తరువులిచ్చే అవకాశం లేదిప్పుడు. వారిద్దర్నీ అప్పుడప్పుడే ఆయనే పంపించి వేశాడు. ప్లేన్ బయలుదేరే వరకూ ఉండనవసరం లేదని. వారిద్దరూ ఇంకా రోడ్డు మీదే ఉంటారు!
"ఓ కాగితం ముక్క ఉంటె ఇవ్వండి."
తమ లెటర్ హెడ్ నే ఇచ్చింది ఆమె.
అత్యవసరంగా దాని మీద 'ఆంధ్ర మహిళా సభకు విరాళంగా ఒక లక్ష రూపాయ లిచ్చేది.-- సేతుపతి" అని వ్రాసి , ఆ చీటీ ఆమె కిచ్చారు సేతుపతి.
"మేము కలలో కూడా అనుకోలేదు! తమరు...."
"క్షమించండి . మళ్ళీ ఎప్పుడయినా తీరుబడి గా కలుసుకుందాం. ఏదో భగవంతుడు నాకింత ఇచ్చాడు. అందులో కొంత నేనూ ఇవ్వగలుగు తున్నాను. అంతే. థాంక్ యూ. గుడ్ బై."
ఆమె చేతులు జోడుంచేలోగానే , అయన అయిదారు అంగలు వేశారు. వేసినవారు ఆగి, "బైదిబై ....మా అరుణ చదువు ఎలా సాగుతుంది?' అన్నారు.
'అంత తెలివి గల అమ్మాయిని ణా ఎరుకలో ఎవ్వరినీ చూడలేదండీ. కావాలంటే మార్చి కే మెట్రిక్ కూర్చో బెట్టచ్చు."
"గుడ్, వెరీ గుడ్! అలానే చెయ్యండి. గుడ్ బై." అంటూ వెళ్ళిపోయారాయన. ఆమె చెక్కిన బొమ్మలా ఫ్లేన్ టెక్ ఆఫ్ చేసి ఆకాశ వీధుల్లోకి ఎగిరిపోయే దాకా అలానే నిలబడి పోయింది.ఆమె కళ్ళు కేవలం కృతజ్ఞత తో చెమ్మగిల్లాయి. కార్యసాధన లో ఉన్న సంతోషమూ, సంతృప్తి అన్నీ ఆమె ముఖార విందంలో ఉదయ కిరణాలలా వెల్లి విరిశాయి!
'మానవసేవే మాధవ సేవ' అనుకుని, మన శక్తి వంచన లేకుండా మనకంటే లేనివారికి తోడ్పడడమే గొప్ప! ఆ తోడ్పడడమనేది ఆంధ్ర మహిళా సభలా ఒక విశిష్టమైన, ఉన్నతమైన , ఉత్తమోత్తమమైన స్థాయి అందుకోడం మరో గొప్ప. ఆ సాధనలో సేతుపతి వంటి సహృదయుల అండదండలు సంపాదించు కోగలగడమనేది అన్నింటి కంటే గొప్ప! ఆ సంస్థ పుణ్యం అలాంటిది. మహిళా మణులకు ప్రణాళిక లు వేసి, వాటిని కార్యరూపం లోకి తీసుకు రాగల శక్తి ఉన్నది. అందుకనే ఆ సంస్థ అలా దినదినాభివృద్ధి చెందుతుంది.
