Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 15


                                        21
    ఇక అరుణ చదువును గురించి. పదకొండేళ్ళు నిండిన పిల్ల. ఓణీ వేసుకోవలసిన అవసరం కూడా అట్టే రాలేదు. అక్టోబర్ నుంచి మార్చి వరకు అరుణ ఆంధ్ర మహిళా సభ లో గడిపిన ఆ ఆరునెలల్లో ఫ్రీ మెట్రిక్ పుస్తకాలు పూర్తి చేసి, మెట్రిక్ పరీక్షకు కూర్చోడానికి కావలసిన జ్ఞానాన్నంతటినీ సంపాదించింది. అందరూ విస్తుపోయారు. ఒక్క తెలుగు లోనే కాదు, ఇంగ్లీషు, హిందీ, లెక్కలు ఏ సబ్జెక్టు లోనయినా సరే, అరుణ "అబ్బ!" అనిపించుకుంది.
    సేతుపతి తమ కారులో స్వయంగా ట్రిప్లి కెన్ లోని నేషనల్ గరల్స్ హైస్కూల్లో దింపారు అరుణ ను, అమ్మాయి పరీక్ష ఆ సెంటరు లో జరుగుతుండడం వల్ల.
    "నీవేమీ భయపడవద్దు. అరుణా. పదినిమిషాలు వ్యర్ధమయినా సరే, ముందు ప్రశ్నలన్నింటి నీ బాగా చదువుకొని అర్ధం చేసుకో. ఆ తరవాత నీకు ఏయే ప్రశ్నలకు సమాధానాలు చాలా బాగా వచ్చో వాటి నన్నింటినీ వ్రాసేయ్యి. ఆ తరవాత అనుమానమున్న వాటిని గురించి అలోచించి, నీకు తోచింది వ్రాయి."
    "అలాగే నండి."
    "మరి....భయపడవుగా?"
    "భయమెందుకు? అన్నీ మహిళా సభలో నాకు నేర్పిన పాఠాలేగా?"
    "వెరీ గుడ్! నేను వస్తా. మరి. సంబంధం వచ్చి నిన్ను మీ హాస్టల్ కు తీసుకు వెళతాడు. ఏమమ్మా?"
    "అలాగేనండీ" అంటూ అరుణ అయన పాదాల మీద తల ఆనించి మొక్కింది.
    "అబ్బబ్బ....ఎందుకమ్మా , అరుణా...."
    "ఆశీర్వదించండి!"
    "నీవు ఏ ఫస్టు క్లాసు లోనో పాసవుతావని మీ పంతులమ్మే చెప్పారు. ఏమని ఆశీర్వదించను? వచ్చే జన్మలో నయినా నాకు నీలాటి కూతురు కలగాలి. కనీసం ఈ జన్మలో నీవు ణా కోడలి వైనా కావాలి."
    "పొండి సార్!" పాపం, అరుణ కు గంపెడంత సిగ్గేసింది.
    "ఏమోనమ్మా! దాన్ని ఆశీర్వాదమనుకో, నా ఆశ అనుకో. నీ ఇష్టం."
    అరుణ ఇంకా సిగ్గు పడడంతోనే సతమత మవుతుంది.
    "వస్తా, అరుణా! టాటా."
    అరుణ చేతులు జోడించి నమస్కరించింది.
    అరుణ పరీక్ష వ్రాసింది. యూనివర్శిటీ లో రెండవ స్థానం వచ్చింది అమ్మాయికి.
    ఇప్పుడు మనకందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది -- పదకొండేళ్ళ పిల్ల ఏమిటీ, ఆరునెలల్లో మెట్రిక్ కు తయారవడమె గాక యూనివర్శిటీ లో రెండవ స్థానాన్ని సంపాదించు కోవడ మేమిటీ అని. అసలు ఇప్పటి పరిస్థితుల్లో అది అసంభవం కూడా.
    పిల్లల్లో తెలివి లేక కాదు. కారణం ఏజ్ రిస్త్రిక్షన్ . మన విధానం ఇప్పుడు వెనక బడిన వారిని ముందుకు తేవడం కాబట్టి, అది చేయడానికి , ఇప్పటి మన పాలకులకు ఒకే ఒక మార్గం దొరికింది. అదే ముందున్న వారిని వెనకకు లాగడం! వీరు వెనక పడి, పడి, పడి కాల క్రమంలో వెనక బడిన వారవుతారు. ఆ దెబ్బతో ఆ వెనక బడిన వారూ, ఈ వెనక బడిన వారూ ఒకటవుతారు. అదీ మన పాలకులు గురిచూసే అభ్యుదయం!
    ఆరోజుల్లో తెలివి గల కుర్రాళ్ళు ఎందరో పదకొండవ ఏట మెట్రిక్యులేషన్ పాసయిన వాళ్ళు ఉన్నారు! ఇప్పుడు పదవ ఏడు పూర్తీ కానిదే ఫస్టు ఫారం లో ప్రవేశం ఉండరాదని రూల్! ఎవరు మాత్రం ఏం చేస్తారు లెండి!
    ఒకప్పుడు కాలం గంగా ప్రవాహం లా నిండుగా, గంబీరంగా , ఏ అలజడి లేకుండా నడిచేది. ఇప్పుడు మురికి కాలవలా ఉరకలు వేస్తుంది! అలా అనుకుని అంతటితోనే తృప్తి చెందడం అన్ని విధాల శ్రేయస్కరం!
    ఇకపోతే అరుణ అలా పాసయిన సందర్భం లో సేతుపతి ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. అరుణ కు వారెవ్వరో తెలియకపోయినా ఎందరో వచ్చారు: కానుక లిచ్చారు; అరుణను వేనోళ్ళ పొగిడారు. అందరూ వెళ్ళిపోయాక అరుణ వెళ్లి, సేతుపతి దంపతులకు మొక్కింది.
    "ఆశీర్వదించవే, చండీ!"
    "బి.ఎ.లు, ఎమ్మే లు పాసై, ఐ.పి.ఎస్ . అఫీసరావు కాఅమ్మా!" అంది చాముండేశ్వరి కాస్త ఈసడింపుగానే.
    "పరీక్షలు ప్రారంభించే రోజున అరుణ నాకు నమస్కరిస్తే ఆశీర్వదించడానికి మారుగా ఆశపడి, నేనొక కోరిక కోరుకున్నానే!"
    అరుణ సిగ్గు పడింది. "పొండి! మీరు నన్నిలా అల్లరి చేస్తే నేను మంచిదాన్ని కాను!" అంది.
    "ఇంతకూ మీరు కోరుకున్నదేమిటి?' చాముండేశ్వరి కాస్త ఉబలాటం గానే ఉంది మరి వినాలని.
    "చెప్పనా, అరుణా?"
    "అయితే నేను మా ఊరు వెళ్ళిపోతాను. అక్కడే చౌదరి గారి ఇంట్లో ఉండి పోతా! ఊ!" గోముగా , ముద్దుగా, సిగ్గుపడుతూ కోపగించుకుంది అరుణ. సేతుపతి ఫకాలున నవ్వారు.
    కానీ, అరుణ మాత్రం అమాంతంగా మారిపోయింది. చౌదరి గారి పేరెత్తడం తోటే , ఆ అమ్మాయి మనసులో శంకర నారాయణ గారు మెరుపులా మేరిశారు! వెనువెంటనే ఆ చిన్నారి గుండెలో ఉరుములు మొదలయ్యాయి! కళ్ళ వెంట చినుకులు పడ్డాయి!
    "ఎందుకమ్మా , అరుణా? ఎందుకూ? ఇదుగో ఎన్నిసార్లు చెప్పాను నీకు, నీ మనసులో ఏదయినా బాధ ఉంటె నాతొ పంచు కోమని? అరుణా, అరుణా" అంటూ సేతుపతి సముదాయించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అరుణ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. కాస్త విసుగ్గా , విసురుగా చాముండేశ్వరి ఆ పరిస్థితుల్లో నుంచి నిష్క్రమించింది.
    "ఎందుకు అరుణా? నాతో చెప్పవూ? నాన్నగారు గుర్తు వచ్చారా?" అంతే! అంతటితో జడివాన మొదలయింది!
    "అవును, సార్! ఏడు నెలలయింది. నాన్నగారి తలపే నా మనసులోకి రాలేదు. రేయింబవళ్ళు అయన నాకోసం ఎంతగా పరితపిస్తుంటారు! వారు నాకోసం ఎంత త్యాగం చేశారు! ఇదా నేను వారికి చేసే ప్రత్యుపకారం?' అంటూ వలవల వాపోయింది అరుణ.
    సేతుపతి ఆ అమ్మాయిని ఎన్నివిధాల సముదాయించారో చెప్పలేము. అప్పటికప్పుడు అయ్యం గారిని పిలిపించి, చౌదరి గారికి టెలిగ్రాం ఇప్పించారు, శంకర నారాయణ గారి యోగక్షేమాలు తెలియక అరుణ బెంగ పెట్టుకుందనీ, వెంటనే అన్ని విషయాలూ తెలియజేస్తూ, ఒక ఉత్తరం వ్రాయవలసిందనీను. అంతటితో అరుణ కొంత శాంతించింది.

 

                                 

                                       22
    శంకరనారాయణ గారు క్షేమంగానే ఉన్నారు. అది ఆ నోటా ఈ నోటా వినవచ్చిన వార్తా కాదు! రంగయ్య చౌదరి కళ్ళారా చూసిన విషయం! అసలు ఆ సంఘటన జరిగినప్పుడు రంగయ్య తన కళ్ళను తానె నమ్మలేక పోయారు.
    అరుణ కుమార్ కు సంబంధించిన మొక్కుబడి ఉండి రంగయ్య సకుటుంబంగా తిరుపతి వెళ్ళాడు. మొక్కుబడి చెల్లించి , పుష్కరిణి లో స్నానాదికాలు ముగించుకుని, ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది ఆ సంసారం. స్వామి వారి సన్నిధి లో ఆ సంసారం లోని సభ్యులే కాదుగా ఆశ్రితులు? కొన్ని వందల మంది, ఒకరి కోసం కాకుండా తమ మనస్సు తృప్తి పడడం కోసం తమకు తోచిన విధంగా కైంకర్యాదికాలు చేస్తూ , తమతమ భక్తీ తత్పరత ను స్వామి వారికే వెల్లడి చేసుకుంటున్నారు.
    ఒకచోట ఇరవై ముప్పై మండి గుమిగూడి ఉన్నారు. "భజగోవిందం, భజగోవిందం, గోవిందం భజ మూడమతే"-- అంటూ ఒక మగ గొంతుక శ్రావ్యాతి శ్రావ్యంగా పాడుతుంది. అది పాట పాడడం కాదు. తరతరాల నించి తాను చేసిన పాపం వల్ల మళ్ళీ ఈ మానవ రూపం తాల్చి, అన్నీ తెలిసి కూడా లేనిపోని మమకారాల్లో పడి కొట్టుకుపోతూ, మరో జన్మ అనే మహా సాగరం లో పడిపోవాలని ప్రయత్నిస్తుంటే, "వద్దు, వద్దు -- పునరపి మరణం, పునరపి జననం , పునరపి జననీ జఠ రేశాయనం" అంటూ , తనను తాను హెచ్చరించు కుంటూ , ఎలుగెత్తి ఘోషిస్తున్న ఒక పరితప హృదయుని ప్రార్ధన అది!
    అందరూ చెపులప్పగించి నిశ్చేష్టులై నిలుచున్నారు. పొడలచుకున్న వారు పావలాలు, అర్ధ రూపాయ లూ, అ పాడుతున్న వ్యక్తీ ముందు విసిరి వెళ్ళిపోతున్నారు. రంగయ్య చౌదరి , అతని భార్య , పిల్లలు కూడా ఆ గుంపు లో కలిశారు. ఇంకేముంది?
    "సార్, మీరా! మీరేనా, సార్? మీకిదెం గ్రహచారం, సార్?" అంటూ రంగయ్య చౌదరి శంకర నారాయణ గారి పాదాల మీద పడి, వాటిని తన కన్నీటితో కడిగి వేస్తూ, తన మనోవేదన ను ప్రపంచమంతా కూడా గ్రహించాలన్నంత బిగ్గరగా అక్రందనం చేశాడు.
    అంతటి పెద్దమనిషి , అందరూ చూస్తుండగా అలా సాష్టాంగ పడిపోయాడంటే , అటువైపు ఆ వ్యక్తీ ఎంతటి మహనీయుడై ఉండాలి! రూపాయ నోట్లూ, రెండు రూపాయల నోట్లూ అలా వర్షం లా కురిశాయి! రంగయ్య చౌదరి మనో వేదనను గమనించి, అర్ధం చేసుకుని కూడా శంకర నారాయణ గారు నిండు కుండలా ఉండిపోయారు. భక్తులు అయాచితంగా ఇచ్చిన దానాల్ని ఏరుకుంటూ కూర్చున్నరాయన.
    "సార్, నేనిక దీన్ని చూడలేను, సార్! మేమంతా చచ్చామనా , సర్వ నాశన మై పోయామనా మీరిలా ముష్టేత్తుకోడం? తెలిసిన నలుగురికీ తెలిస్తే వాళ్ళు మిమ్మల్నేమీ అనరు, సార్! మమ్మల్ని అంటారు! ఇక పదండి, మీకు పుణ్యం ఉంటుంది! అమ్మగారేక్కడ? సరస్వతీ, సీతామహాలక్ష్మీ బాగున్నారా? రామ రామ! ఈ డబ్బుల్ని ఏరుకోడం మానేయ్యండి, సార్!"
    "రంగయ్యా, ఎందుకూ మనసు నలా కష్ట పెట్టుకుంటావు? సర్వేశ్వరుని సన్నిధి కి అంత దూరం నుంచి వచ్చి, వాణ్ణి మరిచిపోయి, నాపైని ఎందుకూ  ఇంత మమత ప్రదర్శిస్తావు? నీవు వచ్చిన పని పూర్తి కానీ! దర్శనం చేసుకుని రా! ఇక్కడే ఉంటాను. వెళ్ళు . బాబూ , వెళ్ళు . వెళ్లి రండి , తల్లీ."
    ఏడుస్తూనే రంగయ్య చౌదరి మళ్ళీ అయన పాదాలకు మొక్కారు. అతని భార్యా, పిల్లలు కూడా శంకర నారాయణ గారి పాద ధూళి తీసుకున్నారు. వెళ్లి మనసును శంకర నారాయణ గారి మీద, దృష్టి ని వేంకటేశ్వరుని మీదా నిలిపి, ఏదో దర్శనమయిందని పించుకుని బయట పడ్డారు.
    రంగయ్య చౌదరి ని చూడగానే శంకర నారాయణ , "రంగయ్యా , అరుణ సంగతి ఏమైనా తెలిసిందా?' అన్నారు.
    రంగయ్య అరుణ కు పట్టిన అదృష్టాన్ని గురించి ఒక పెద్ద కధ చెప్పాడు. శంకర నారాయణ గారు ఆనందాతిరేకంతో, తృప్తి తో బొటబొట కన్నీరు కారుస్తూ కృతజ్నుడై , కరునామయుడయిన కమల నాధుని చేతులెత్తి మొక్కారు.
    "రంగయ్యా, నీవు వెయ్యేళ్ళు వర్ధిల్లు! ఎంతటి చల్లని కబురు తెచ్చావు. నాయనా! నీ ఋణాన్ని నేనెన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. ఇక మీరందరూ వెళ్ళిపొండి, బాబూ. కానీ వెళ్ళే ముందు నువ్వు నాకో వాగ్దానం చెయ్యాలి."
    "దేన్నీ గురించి, సార్?"
    "నా ఉనికిని నీవు కనిపెట్టావు. అది నీలోనే ఉంచుకో. మరెవ్వరికీ , కడకు మా అరుణ కు కూడా తెలియనివ్వకు. ఈ జీవితంలో నీవు నాకు చెయ్యగల సహాయం అదొక్కటే ఇప్పుడు! ఇక్కడ నాకే లోటూ లేదు. పిల్లలిద్దరూ చదువు కుంటున్నారు. దుర్గ క్షేమంగా ఉంది. ఇన్నాళ్ళూ అరుణ ను తలుచుకుని కుమిలి కుమిలి పోతుండేవాణ్ణి. నీ పుణ్యమా అంటూ ఆ ఆరాటమూ చల్లబడింది. నాకే అవసరం వచ్చినా నాకూ తెలుయదూ, రంగయ్యా, నీవు ణా వాడివనీ, ఏనాడయినా , నీ పరిస్థితుల్లో నయినా నీ సహాయాన్ని నే నర్ధించవచ్చుననీ? నీవేమీ విచార పడకు. అసలు నేను నీ కగు పడలేదనుకో. ఇక్కడ, ఈ బ్రతుకులో ఉన్న శాంతి నాకు బయటి ప్రపంచంలో లభించదు, అందుకని! ఏం బాబూ?"
    "అలాగే సార్!' అనగలిగాడు రంగయ్య అలోచించి అలోచించి.
    'అరుణా, నేనూ, నీవూ అంతా మళ్ళీ కలుస్తాం, నాయనా! నాకా నమ్మకముంది. పొతే, ఇప్పుడు అరుణ అలా ఉండడమే అందరికీ శ్రేయస్కరం. సేతుపతి గారి పేరు నేనూ విన్నాను. గొప్పవాడు, సహృదయుడు. అరుణ అదృష్ట వంతురాలు! ఆ అమ్మాయి కేమీ పరవాలేదు. సేతుపతి గారికి కృతజ్ఞతాభివందనాలను తెలియజెయ్యి." అని రంగయ్య చౌదరి ని వదిలేసి , బుజ్జి తో "ఏమమ్మా, నువ్వు కాన్వెంటు కి వెళుతున్నావా?' అన్నారు.
    "లేదండీ , తాతగారూ! ఇంటి దగ్గరే నాన్నగారు మాకు తెలుగు నేర్పుతున్నారు."
    "చాలా మంచిది . ఏరా, బాబూ. నీ పేరు నా పేరే కదూ?"
    "మీ పేరేమిటండీ?"
    "శంకర నారాయణ."
    "నా పేరు అదే, బాబూ! ఆ....చిన్నవాడి పేరు అరుణ కుమార్ కదూ, రంగయ్యా?"
    "అవును, సార్!"
    "వెళ్లిరా, నాయనా , వెళ్లిరా. అమ్మా, కౌసల్యా , వెళ్ళిరండి. సృష్టి లోని సంతోషాలన్నీ మీవే అవుతాయి. అందుకు మీరు అన్ని విధాలా అర్హులు. వెళ్ళిరండి."
    అందరూ ఆయనకు సాగిలపడి మొక్కి లేచి వెళ్ళిపోయారు. శంకర నారాయణ గారు మళ్ళీ "పునరపి మరణం, పునరపి జననం , పునరపి జననీ జఠ రేశాయనం" అంటూ మొదలు పెట్టారు! భక్తా గ్రేసరుల్లో కొందరు మళ్ళీ అయన చుట్టూ మూగారు. ఏదో తన్మయత్వంతో అయన మనోవేదన పంచుకోడానికి ప్రయత్నించారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS