
18
ఆశలూ, ఆశయాలూ అందరికీ ఉంటాయి. కానీ ఎంతమంది తమ ఆశలు తీరి, ఆశయాలు నెరవేరి తత్పలితంగా కలిగే తృప్తి అనుభవించ గలరు? చాలా చాలా తక్కువమంది.
అ;అలాగే , గంపెడంత ఆశతో వెళ్ళారు సేతుపతీ అరుణా , పొతే శంకర నారాయణ గారే వారి కగుపడలేదు. ఇరుగు పొరుగులను విచారించారు. అందరూ అరుణ ను గురించి శంకర నారాయణ గారు పడ్డ బాధ వివరించారు. అర్ధరాత్రి పూట అ ఊరు విడిచి వెళ్లారన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వారి జాడ కోసం ప్రయత్నించినా , ఎవరికీ తెలియ లేదన్నారు అరుణ ఏడిచింది.
"ఊరుకో , అమ్మా . ఇక్కడ వీరికి తెలియకపోవచ్చు. మీకు బాగా కావలసిన వారేవారైనా ఉంటె చెప్పు. వారి ఇంటికి వెళ్లి విచారిద్దాం" అన్నారు సేతుపతి.
"చౌదరి గారు ఉన్నారండి. చాలా మంచివారు. నాన్నగారు ఏం చేసినా అయన గారికి తెలియనివ్వ కుండా ఉంచరు."
"అయితే,అక్కడికి వెళదాం పదమ్మా."
రంగయ్య చౌదరి తన కళ్ళను తానె నమ్మలేక పోయాడు. అరుణ ను చూచి అయన ఎంత ఆశ్చర్య పోయాడో, అరుణ వెంట వచ్చిన ఆ వ్యక్తీ ని చూచి అంతటి విభ్రాంతి చెందారు.
"అమ్మా, అరుణా! ఎంత భాగ్యం , సార్, నాది! దయ చెయ్యండి, దయ చెయ్యండి!" అని రంగయ్య అంటుండగానే బుజ్జీ , శంకర నారాయణా వచ్చి అరుణను వాటేసుకున్నారు. ఏడుస్తూ అరుణ ఆ ఇద్దర్నీ ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. అంతా వెళ్లి హల్లో కూర్చున్నారు.
"నా పేరు సేతుపతి."
"నాకు తెలుసు,సర్. తమర్ని గురించి తెలియని వారెవరు? మా అరుణ తో తమరి కేలా పరిచయం కలిగింది? అమ్మా, అరుణా, నాన్నగారు నిన్ను గురించి ఎంతగా అలమటించి పోయారో చెప్పలేను..."
అరుణ, ఆ ఇద్దరు పిల్లని ఒడిలో కూర్చుండ బెట్టుకుని , వెక్కి వెక్కి ఏడుస్తుంది. సేతుపతి చూడలేక పోయారు. ఆ అమ్మాయి ప్డుతూన్న ఆవేదన!
"క్షమించండి. మనం శంకర నారాయణ గారిని గురించి ముచ్చటించే కొద్దీ అరుణ బాధ ఎక్కువై పోతూనే ఉంటుంది." అన్నారు సేతుపతి , చౌదరి గారితో బొత్తిగా పరిచయం లేకపోయినా కొంత చొరవ చేసి.
"నన్ను క్షమించండి, సర్! అరుణా, నువ్వూ, బుజ్జీ, బాబూ -- అంతా లోపలికి వెళ్ళండి, తల్లీ, అమ్మతో సేతుపతి గారు ఈ పూట మన ఇంటిలోనే భోజనం చేస్తారని చెప్పు."
"నో...నో....' అంటూ సేతుపతి ఇంకా ఏదో అనబోయే లోగానే "దయచేసి నా ఆతిధ్యం స్వీకరించండి సార్ . ఆభాగ్యవతి గా వచ్చారు. తగిన మర్యాద చేసి తమర్ని పంపకపోతే నాకు తృప్తి ఉండదు. అసలు నన్ను నేను క్షమించు కోలేను." అన్నాడు రంగయ్య.
"సరే! అయితే మీ ఇష్టం. అరుణా, వెళ్ళు , తల్లీ మీ నాన్నగారి గురించి అన్ని విషయాలూ నేను తెలుసు కుంటాగా చౌదరి గారి వద్ద? నీవేం బాధపడకు."
పిల్లలందరూ వెళ్ళిపోయారు.
"మీరు శంకర నారాయణ గారి శిష్యులా?"
"చిత్తం. ఈ ఇల్లూ, ఈ ప్రాక్టీసూ , ఈ సంపాదనా అంతా వారి చలవే నండి!"
"అయన నిజంగా చాలా గొప్పవారు. అయన గారితో సంబంధమున్న అందరి లోనూ అడరాబిమానాలూ, దయా దాక్షిణ్యాలు , మంచితనమూ తప్ప మరేమీ అగుపడడం లేదు నాకు."
"వారు నిజంగా చాలా గొప్ప వారు , సర్!"
"శంకర నారాయణ గారు ఇక్కణ్ణించి ఏ పరిస్థితుల్లో వెళ్ళారో, ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలిసి ఉంటె......"
"నాకేమీ తెలియదండి. అసలు అటువంటి అభిప్రాయం ఆయనగారికి ఉన్నట్టు కూడా తెలియలేదు. తెలిసే ఉంటె ......అయన ఈ ఊరు విడిచి వెళ్ళడానికి వీలే ఉండేది కాదు. అందుకనే అయన తన నిశ్చయాన్ని తనలోనే దాచుకుని, వారి బిడ్డ లాంటి వాళ్ళని మమ్మల్ని ఇలా అన్యాయం చేసి పోయారు. నేనూ వారి అత్తగారి ఊరూ , ఈ చుట్టూ పక్కల పట్టణాలూ తిరిగి వచ్చాను. తన ఉనికి ని ఇతరుల కెవ్వరి కీ తెలియ నివ్వరాదనుకున్న వారిని ఇంత దేశంలో ఎక్కడున్నారని మనం వెతకగలం , సార్?"
"నిజమే! అరుణ ను గురించే నాకు బాధగా ఉందండీ. ఈ ఊరి రైలు స్టేషన్ లోనే అగుపడింది ఆ అమ్మాయి. చూడగానే....ఎందుకో , జాలి వేసింది."
"అరుణ అంటే మామూలు పిల్ల కాదు! చాలా మంచిది. చాలా బుద్ది మంతురాలు. శంకర నారాయణ గారికి ఆ అమ్మాయంటే ప్రాణం. అసలు శంకర నారాయణ గారికి పిల్లల్లేరు......"
"అవునవును. ఆరుణే చెప్పింది మొన్న మొన్న"
'అరుణ వయసు కు ఎంత చదవచ్చునుకున్నారు! చదువంటే -- ఐ డు నాట్ మీన్ క్లాస్ రూం టైప్ -- భగవద్గీత అంతా వచ్చు. తెలుగు బాషలోని శతకాలన్నీ వచ్చు. శంకర నారాయణ గారి బోధ అదంతా. మీరు నమ్మరు. హిందీ రాష్ట్ర భాష పాసయింది. ఆ అమ్మాయి అప్పుడే!"
"అదే, అమ్మాయి చాలా మంచి దనిపించింది. ఎంతగా ప్రశ్నించినా , "నాకెవరూ దిక్కు లేరు' అన్న సమాధానమే ఇచ్చింది. 'పని మనిషి గా మీ ఇంట ఉంచుకోండి' అని అడిగింది. చూస్తూ చూస్తూ ఆ రత్నాన్ని ఎవరు మట్టి పాలు చెయ్యగలరు? సరేనని మద్రాసు తీసుకు వెళ్లాను. మా ఇంటి పరిస్థితులు కొంత బాగుండవు లెండి. అందుకని ఆంధ్ర మహిళా సభలో చేర్పించాను."
"దేవుడు మీకు మేలు చేస్తాడు! మా శంకర నారాయణ గారు ఇక్కడ ఉండగానే ఈ వార్త తెలిసి ఉంటె ఎంత సంతోషించే వారు!"
"జరిగిందేదో జరిగిపోయింది. అరుణ కు మీరు కాస్త ధైర్యం చెప్పండి!"
"తప్పకుండా!"
ఈలోగా భోజనాలకు కబురు వచ్చింది. భోజనం చేస్తూ చేస్తూనే రంగయ్య చౌదరి అరుణ కు ఎన్ని విధాలు గానో నచ్చచెప్పారు. ఉన్నవి కొన్ని, లేనివి అన్నీని!
"ఏమీ లేదమ్మా. అరుణా! నాన్నగారు నాతొ చెప్పారుగా! ఎక్కడికి వెళ్ళేదీ నిశ్చయించు కోలేనందువల్ల అయన ఏమీ చెప్పలేదు. అంతే. వెళ్లి ఎక్కడో ఒక చోట స్థిర పడగానే ఉత్తరం వ్రాస్తా నన్నారు. అయన గారు వ్రాయకపోతే , మరి నీ క్షేమ సమాచారాలు నేను ఆయనగారికి ఎలా వ్రాయగలను? ఎంతెంత బ్రతిమాలి చెప్పారను కున్నావు? 'రంగయ్యా! ఈ జీవితంలో నాకే కోరికా లేదు. మన అరుణ, ఎక్కడో ఒకచోట సుఖంగా ఉందని, క్షేమంగా ఉందని ఒక్క ముక్క వ్రాయి. నేనిక్కడ ఎలాగూ ఉండనని, అరుణ ను గురించి విచారించడం మాత్రం మానకు' అంటూ ఎన్ని విధాల చెప్పారను కున్నావు! సేతుపతి గారు కూడా నీకు శంకర నారాయణ గారీ లాంటి వారేనమ్మా. నీవు చదువు కోలా-- దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని? దేవుడు సర్వాంతర్యామీ! అయన మొదట శంకర నారాయణ గారి రూపంలో, ఇప్పుడు సేతుపతి గారి రూపంలో నిన్ను ఉద్దరించాడు .అంతేనమ్మా' అని , సేతుపతి గారితో "సార్ , మీరు దయచేసి మీ కరెక్ట్ అడ్రెస్ నాకివ్వండి. మా గురువు గారు నాకు ఉత్తరం వ్రాయగానే, వారి క్షేమ సమాచారాల్నీ మీకూ, అరుణ క్షేమ సమాచారాల్నీ వారికీ వెంటనే తెలియ జేస్తా" అన్నాడు.
"అలాగే నండీ, ఏమమ్మా, అరుణా , ఈ ఏర్పాటు నీ కిష్టమేనా?"
అంగీకార సూచకంగా అరుణ మౌనంగా తల ఆడించింది.
"మరి నీవిలా అనవసరంగా బెంగ పెట్టుకుని, రోజుకో పౌను చొప్పున తగ్గి పోరాదు. తీరా మీ నాన్న గారి జాడ తెలిసి, వారిని నీ వద్దకు తెచ్చాననుకో! వారు నిన్ను చూడగానే నన్ను గురించి ఏమనుకుంటారు? నీ పెంపకం లో తీరని లోపమేదో చేశానన్న అపనింద నాకు వస్తుందా, రాదా? అందుకని , అన్నీ తెలిసిన దానివి కాబట్టి, నిన్ను నీవు సముదాయించు కుని , నీ శ్రద్దా సక్తుల్నీ నీ చదువు మీదికి మరల్చాలి ఇక మీదట. ఏమమ్మా?"
"అలాగేనండీ."
"అదీ బుద్ది మంతురాలి లక్షణం!" అన్నారు సేతుపతి .
అంతటితో భోజనాలూ ముగిశాయి. ఓ గంటన్నర పాటు దేశ కాల పరిస్థితులను గురించి ఆ ఇద్దరూ పెద్దలు ముచ్చటించు కున్నారు. ఈలోగానే రంగయ్య చౌదరి భార్య, అరుణ కు ఓ నాలుగు జతల బట్టలూ అవీ కొని తెచ్చి ఇచ్చింది.
"ఎందుకమ్మా ఇవన్నీ?' అన్నారు సేతుపతి.
"ఏదో మా తృప్తి కోసమండీ! మాకూ తెలియదూ మీవంటివారి ఆదరాభిమానాలు సంపాదించుకున్న మా అరుణ కు ఈ ప్రపంచంలో ఇక ఏ లోటూ ఉండదని?" అన్నాడు రంగయ్య చౌదరి.
అందరి వద్దా సెలవు తీసుకుని సేతుపతీ, అరుణా మళ్ళీ కారు ఎక్కారు. రంగయ్యా, అయన సంసారమూ వీడ్కో లివ్వడానికి కారు వరకూ వచ్చారు.
"చౌదరి గారూ!" అందిఅరుణ.
"ఏమమ్మా?"
"నాన్నగారు ఉత్తరం వ్రాయగానే మాకు తెలియ జేయ్యండి దయచేసి.
"పిచ్చిపిల్లా, నీ వంతగా చెప్పాలా? తప్పకుండా అలాగే చేస్తాను. సెలవు , సార్! నమస్కారం."
"నమస్కారం " పిల్లలందరూ అరుణ కు 'టాటా' చెప్పారు. అరుణ సంతోష పూర్వకంగానే అందరి వద్దా మరోకతూరి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది.
