
రాజగోపాలం ఇంటికి దాదాపు రెండు మూడు వందల గజాల దూరంలో ఉంది సురేఖ ఉండే గది లాంటి ఇల్లు. ఒక విశాలమైన గదిని మధ్యగా విభజించి రెండు గదులుగా చేసుకున్నారు. ఇల్లు చిన్నగా ఉన్నప్పటికీ ముక్తసరిగా పరిశుభ్రంగా ఉంది. కూర్చోటానికి ను ఫేము బెత్తలతో అల్లిన రెండు బుట్టల్లాంటివి ఉన్నాయి.
ఒకదాని మీద కూలబడిన తరవాత "ఎవరూ లేరేం?" అన్నాడు.
"ఎవరున్నారు గనక? నేను పుట్టాక ముందే మా నాన్నా, అమ్మా చనిపోయారు. నాకు తోడుగా మా ఆయా ఒక్కతే ఉంది. పక్క వారింటికి వెళ్లి ఉండవచ్చు" అంటూ లోనికి వెళ్ళింది.
లోపల స్టౌ ముట్టించిన చప్పుడు, పాత్రలో నీళ్ళు పోసిన చప్పుడు వినిపించి రవిచంద్ర "మీరు కాఫీ ప్రయత్నం లాంటిది ఏమీచేయవద్దు. నేనిప్పుడు తాగలేను" అన్నాడు.
లోపల నించి గలగల మని సురేఖ నవ్విన చప్పుడు వినిపించిన తరవాత ఆమె మాటలు కూడా వినిపించాయి. "మీరు కలగంటున్నారులా గుంది. కాఫీ మీకు ఇప్పుడు చేసి ఇద్దామన్నా పాలు లేవు. సాయంత్రం వంటకు ఆయత్తం అవుతున్నాను" అంది.
రవిచంద్ర కొంచెం సిగ్గు పడి , నాలిక కొరుక్కుని టైం చూసుకున్నాడు. నాలుగు గంటలయింది. ఇంతలో ఎవరో కళ్ళజోడు ముసలావిడ లోనికి వచ్చింది. రవి లేస్తూ, "సురేఖా" అని అన్నాడు. ఆమె మరాఠీ లో ఏదో అంటూ లోనికి వెళ్ళింది. తరవాత సురేఖతో మాట్లాడుతున్న ధ్వని వినిపించింది. ఈసారి సురేఖ రెండు గ్లాసుల్లో ఏదో పోసుకొని బయటకు వచ్చింది. వెనకాలే ఆమె కూడా వచ్చింది.
"ఊ! కాఫీ అన్నారు కాబట్టి హార్లిక్స్ తీసుకోండి" అంది.
"నా కిప్పుడేమీ వద్దు. క్షమించండి" అన్నాడు రవి.
"ఈ బీద ఇంట్లో ఇంతమాత్రం తీసుకోవచ్చు. కాదనకండి" అంది.
ఒక్క క్షణం నివ్వెరపోయి రవిచంద్ర ఆమెను చూస్తూ గ్లాసు అందుకున్నాడు.
సురేఖ ఆ మాట అంటూ తల వంచుకుంది. అటు తరువాత రవి గ్లాసు అందుకొని తాగుతున్నప్పుడు మళ్ళీ యధాప్రకారంగా నవ్వుతూ , "మా ఆయా మిమ్మల్ని చూసి నాటకం కాంట్రాక్టు వాళ్ళు అనుకుంది" అంది.
:ఏమో, ఎవరు చెప్పగలరు? కాగూడదని ఎక్కడుంది?' అన్నాడు రవి.
"ఇంకేం , సురేంద్ర ను వదిలి పెట్టకుండా తిరగబడి మిమ్మల్ని కంట్రాక్టర్ చేయకపోయినా కనీసం నటుడిగా నైనా చేసి తీరతాడు."
ఇద్దరూ నవ్వుకున్నారు ఆ మాటలకు.
"ఇహ వెళతాను" అంటూ రవి లేచాడు. కండ్ల తోనే 'మంచిదన్నట్లుగా చూసింది.
రవి బయటకు వచ్చి రాజగోపాలం ఇంటి వైపు చూశాడు. ఇతనికి అక్కడికి వెళ్లాలని ఉన్నా ఎందుకో ధైర్యం చేయలేక వెనక్కి తిరిగాడు.
"అదేమిటీ? రాజగోపాలం గారింటికీ వెళతా నన్నారుగా?"
వెనక నుంచి వినపడ్డ సురేఖ మాటలు మళ్ళీ అతణ్ణి రాజగోపాలం ఇంటి వైపు మళ్లే టట్లు చేశాయి.
9
రాజగోపాలం ఇంటి బయట ఎవరూ లేరు. కొంచెం సందేహిస్తూ రవిచంద్ర డ్రాయింగు రూం లోకి వెళ్లి "రాజగోపాలం గారూ" అని పిలిచాడు.
కర్టెను తోలిగించుకుంటూ ప్రియంవద గబుక్కున వచ్చి "ఓ! మీరా, రండి, కూర్చోండి"అని స్నేహ పూర్వకంగా ఆహ్వానించింది.
"రాజగోపాలం గారు లేరా?' కొంచెం కంగారు గా అడిగాడు రవి.
"లేరండి. ఇంకా రాలేదు. అలా నిల్చున్నారేం? కూర్చోండి . నేనిప్పుడు వస్తాను"అని లోనికి వెళ్ళింది.
ఆమె వెనక్కి తిరిగినప్పుడు అతను గ్రహించాడు అమె జడ సగం అల్లుకొని మధ్యలో వదిలిన సంగతిని.
రవి రాక్ లోని పుస్తకాలుతిరగవేయటం మొదలెట్టాడు. "మారేజ్ అండ్ మోరల్" "ఫేర్ వెల్ టు ది ఆర్ మ్స్" , "ది బ్రేవ్ న్యూ వరల్డ్"..... ఇంకా చాలా కనపడ్డాయి.
చేతికందిన పుస్తకం తీసుకొని సోఫాలో కూర్చొని తిరగేయటం మొదలెట్టాడు. ప్రియం వద కసేపాగిన తరవాత లోపల నించి వచ్చింది. పూర్తిగా అల్లిన జడను సొంపుగా చుట్ట చుట్టింది. చుట్ట వల్ల కాబోలు ముఖం కొంచెం పెద్దదయినట్లు కనపడసాగింది. కళ్ళకు వెడల్పు గా కాటుక పెట్టుకుంది. 'వెడల్పాటి బొట్టు, ఎర్రటి చీరపై అదే రంగు జాకెట్టు ధరించింది.
మల్లెలు వెదజల్లు తున్నట్లు సన్నగా నవ్వుతూ, "చాలారోజుల తరవాత మేము జ్ఞాపకం వచ్చామే! వారు చాలాసార్లు అనుకున్నారు మిమ్మల్ని గురించి" అంది.
రవిచంద్ర ఏమీ జవాబు చెప్పలేక, "రోజూ వద్దామనే అనుకుంటున్నాను గానీ......." అని అంటుండగా ......
"ఇవాల్టి కి తీరిక దొరికిందన్న మాట !" అంది ప్రియం వద పూర్తీ చేస్తూ.
"తీరిక నాకెప్పుడూ ఉండేదే. ఇవాల్టి కి ఏదో ఒక పని చేద్దామని బుద్ది పుట్టింది.
ఇంతలో ఇంతకూ మునుపు కనపడ్డ మరాఠీ పిల్ల రెండు ప్లేట్లలో బిస్కట్లు, ట్రేలో కాఫీ తీసుకు వచ్చింది.
ఇబ్బందిగా చూశాడు రవి. అది గ్రహించిన ప్రియ "మీ ఇష్టం వచ్చినంతే తీసుకోండి" అంది.
నెమ్మదిగా ఒక విస్కేట్ ను తీసుకొని తుంపుతూ రవి "రోజూ ఎన్నింటికి వస్తుంటారు రాజగోపాలం గారు?' అన్నాడు. '
"వచ్చే వేళయింది. ఈపాటికి వస్తూనే ఉంటారు." నిమిషాలు ఆలస్యంగా గడవటం మొదలెట్టాయి. రవిచంద్ర ఒంటరిగా చాలాసార్లు స్త్రీ తో మాట్లాడాడు కాని ప్రియంవద లాంటి వ్యక్తులతో కాదు. ప్రియంవద నిజం మాట్లాడితే అతనికి ఇంతవరకు అర్ధం కాలేదు. భర్త సాన్నిధ్యంలో అంత సుఖంగా ఉన్న స్త్రీని అతను ఇంతవరకు దూడలేదు కూడా. ఆమె ఎక్కువగా సంభాషణ ల్లో జోక్యం కలగ జేసుకున్తుండగా చూడలేదు. చాలా తక్కువగా మాట్లాడుతుంది. అయినా ఆ మాట్లాడిన కొద్దిసేపు ఎంతో స్వచ్చంగా నిష్కల్మషంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
రవి పక్కనే ఉన్న పుస్తకాన్ని చూస్తూ "మీరు గూడా మీవారిలా పుస్తకాలు బాగా చదువుతారా?" అన్నాడు సంభాషణ ఏ విధంగా సాగించాలో తోచక.
"చదువుతాను" అంత ఎక్కువగా కాదనుకోండి." మాటల్లో వినయం ధ్వనించింది.
"ప్రస్తుతం ఏమన్నా చదువుతున్నారా?"
"ఆమె మెరిసిపోయే చిరునవ్వుతో, "బుచ్చి బాబు మీ అభిమాన రచయితటగా? వారు చెప్పారు. 'చివరకు మిగిలేది' నేనింతవరకూ చదవలేదు. చదవమని మొన్ననే వారు నాకది యిచ్చారు" అంది.
"చదువుతున్నారా?"
"ఆ! కానీ నిజం మాట్లాడితే నాకు మొదటి చాప్టరు లోనిది చాలా తక్కువగా అర్ధమయింది."
"అవును, జీవితాన్ని అర్ధం చేసుకోవటం కష్టమే. అందులో అబద్ద మేమీ లేదు.'సాలోచనగా అన్న మాటలు ఆమెకు కొంచెం ఆశ్చర్యం కలిగించాయి.
'అయినప్పటికీ కధ బాగానే అర్ధమవుతున్న దనుకోండి. ఇప్పుడు బాగానే సాగుతుంది. " అతను ఆమె మాటలకు తటాల్న తలఎత్తి . "క్షమించండి . నేనన్న మాటల్లో పొరపాటు అర్ధం ధ్వనిస్తే , నా ఉద్దేశ్యం. ఎవరికైనా జీవితాన్ని పరిశోదించటం మొదలు పెడితే అర్ధం చేసుకోవటం కష్టం అని."
"మీరేమీ తప్పు మాట్లాడ లేదే?" ఆమె మరింత విస్మయం చెందుతూ అంది.
ఇంతలో రవి సంభాషణ మార్చాడు.
"రవీంద్ర దగ్గిర నించి ఏమన్నా ఉత్తరాలు వస్తున్నాయా?"
"ఆ ఈ మధ్యనే వచ్చింది" అని కాసేపాగి, "మీకు ఒక విషయం చెబితే నొచ్చు కుంటారేమో?' అంది.
కొంచెం తెల్లబోయి రవిచంద్ర "చెప్పండి .. అదేం లేదు" అన్నాడు.
"మా స్నేహితుడు రవిచంద్ర పెళ్ళయిన తరవాత ఎక్కడికో వెళ్ళిపోయాడు, కనబడుట లేదు అని రాశాడు."
పెటిల్లున తగిలింది. రవి ఏం మాట్లాడలేదు కాసేపు. పేలవంగా నవ్వుతూ ",మీరేం జవాబిచ్చారు?' అన్నాడు.
రవి ఆకస్మికంగా కుంగి పోవటం ఆమె గమనించింది. ఆ విషయాన్ని అప్రయత్నంగా చెప్పివేసినందుకు తత్తర పాటు కూడా చెందింది. సాధ్యమయినంత ఓదార్పు భావాన్ని ఆమె మాటల్లో ధ్వనింప జేస్తూ, "ఈ విషయాన్ని గురించి వ్రాయాలనే ఆలోచన గూడా నాకు రాలేదు. మీ సంగతులను గురించి మీకు తెలియ కుండా వ్రాసేటంత తెలివి లేనిదాన్ని కాదు" అంది.
