Previous Page Next Page 
బ్రతుకు బాట పేజి 13


    మొన్న దీపావళి కి కుముదిని లేత గులాబి రంగు సిల్కు చీరే కొనుక్కుంది వంద రూపాయలు పెట్టి .అంత చక్కని చీరే కొనుక్కోవాలని మనస్సు ఊగిసలాడింది. కానీ తెగించలేక పోయింది తను.
    ఆలోచనలతో రోజులు మందంగా దోర్లిపోతున్నాయి. తను ఇల్లు కదిలి ఎన్నో రోజులైంది. ఒక్కసారి అన్నయ్యా, వదిన లనీ పిల్లలనీ చూడాలని కోరుతోంది హృదయం. మళ్ళీ వేసవి కూడా రాబోతుంది.
    అలా ఆలోచించుకుంటూ అగర్వాల్ గారమ్మాయి లకి ట్యూషన్ చెప్పేసి బస్సు కోసం వస్తుంటే బసవరాజు ఎదురయ్యాడు నవ్వుకుంటూ--
    'హల్లో -- నాతొ మా ఇంటికి రాకూడదూ ఇవ్వాళ' అన్నాడు గభాలున.
    'ఇంత సడెన్ గా ఆహ్వానిస్తే ఎలా?' అన్నది సుమిత్ర.
    'ఎప్పటి నుంచో పిలుస్తున్నాను-- వస్తేగా మీరు-- ఇవాళ రండి -- గుడివాడ నుంచి మా చెల్లెల్లోచ్చింది -- మా అన్నయ్యా వదిన కూడా వచ్చారు. చాలా సందడిగా వుంది. మంచి కంపెనీ --' అన్నాడు.
    'నాకు తలనొప్పిగా వుంది -- ఇంకో రోజు వస్తాను -- సారీ- ఏమీ అనుకోవద్దు--'
    'పోనీ నాతొ కాఫీ తీసుకోకూడదూ?' నొచ్చుకుంటూ అడిగాడు బసవరాజు.
    'బృందావన్ కి వెడదాం రండి' అన్నాడు చనువుగా కొంచెం ఆగి -
    'అలాగే పదండి -' అంది సుమిత్ర.
    'మీరేమిటో దిగులుగా వున్నట్టు కనిపిస్తున్నారు--' అన్నాడు హోటల్ లో కూర్చున్నాక.
    'ఏమీ లేదు-- మావూరు వెళ్లి రావాలని అనుకుంటున్నాను వెళ్ళడానికి పదిరోజులు  లీవ్ యివ్వనన్నాడు. మేనేజరు- ఈ ఉద్యోగం బోర్ కొడుతోంది ' అన్నది సుమిత్ర కిటికీ లో నుంచి బయటికి చూస్తూ.
    'అన్నట్లు, మీతో ఓ విషయం చెప్పాలనుకున్నాను-- మా బ్యాంక్ లో ఈ మధ్య ఏవో వేకన్సీ లోచ్చాయని తెలిసింది. ఇవాళ పేపర్ లో పడిందట. అప్లై చెయ్యండి. మీకు తప్పకుండా రావచ్చు -- రికమండేషనుందిగా!'
    'వోద్దులెండి -- మీతో పాటు కాఫీలు త్రాగలేక నా దుంప తెగిపోతుంది --'
    'పోనీ విస్కీ త్రాగకూడదూ!'
    'ఇంకా నా స్టేటస్ అంతకి పెరగలేదు గాని-- వ్యర్ధమైన మాటలు మానేసి బుద్దిగా కాఫీ త్రాగి ఇంటికెళ్ళి, చెల్లాయితో క్యారమ్స్ ఆడుకోండి.'
    'నిజంగా మీరు అప్లై చెయ్యండి సుమిత్రా! తప్పకుండా రావచ్చు --మంచి స్టార్టింగ్ -- మీకా మాత్రం సలహా యివ్వ తగునా?' అన్నాడు బసవరాజు సీరియస్ గా--
    'మీతో ఆమాత్రం హాస్యం మాట్లాడ తగునా?' అన్నది సుమిత్ర, బిల్లు మీద డబ్బులు పెట్టి.
    'మీకు చాలా ఋణ పడ్డాను--' అన్నాడు. బసవరాజు, ఆ డబ్బులు తీసి సుమిత్ర హ్యాండ్ బ్యాగ్ లో వేసేసి.
    సుమిత్ర ఏమీ అనలేదు --
    'నిజంగా మా ఇంటి కెప్పుడోస్తారు!'
    కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు --
    'ఎప్పుడో ఒకరోజున -- తప్పకుండా!'
    'మీతో నింపాదిగా ఒక అరగంటైనా మాట్లాడాలని వుంటుంది. అవకాశం యివ్వరు -- నా సంస్కారం మీద నమ్మకం లేదు కాబోలు.'
    'మీ సంస్కారాన్ని గురించి నాకేం అప నమ్మకాలు లేవు బసవరాజు !నాకు టైం వుండదు . అంతే--'
    అక్కడ నుంచీ బయటికి వచ్చాక , జేబులో నుంచీ చిన్న ప్యాకెట్ తీసి, 'ఇది మీకివ్వాలని తెచ్చాను -- తీసుకోండి --'
    చేయి జాపింది సుమిత్ర.

                                      7
    వేసవికాలం తెల్లవారు జాము, చలి గాలి లాంటి చల్లటి గాలిను మోసుకొచ్చి మెల్లగా ముఖం మీద వూదింది. కళ్ళు తెరిచి కిటికీ లో నుంచి బయటికి చూస్తె, చుట్టూ ప్రక్కల అందరి యిళ్ళ కిటికీ లలో నుంచీ విద్యుద్దీపాల వెలుగులు కనిపిస్తున్నాయి. పరీక్ష లోచ్చాయి విద్యార్ధు లందరికీ -- కుముదిని ఎప్పుడో లేచింది కాబోలు టేబిల్ లైటు వేసుకుని శ్రద్దగా చదువు కుంటోంది.
    కప్పుకున్న దుప్పటి తీసేసి 'ఎప్పుడు లేచావు కుముదినీ!' అన్నది సుమిత్ర.
    'మూడింటికే లేచాను-- కాస్సేపు పడుకో-- ఇంకా తెల్లవారలేదు--' అన్నది కుముదిని. కళ్ళు తెరుచుకుని గోడ కేసి చూస్తూ అలాగే పడుకున్న సుమిత్ర దృష్టి కేలండర్ పైన పడింది.
    'ఇవాళ ఇరవై రెండో తేదీ కదూ!' అన్నది ఉలిక్కి పడినట్లు.
    "ఏం? అన్నది కుముదిని పరాకుగా.
    "ఏం లేదు -- ఇవాళ ణా పుట్టినరోజు--' తనలో తనే అనుకుంది సుమిత్ర నెమ్మదిగా.
    'చెప్పావు కాదు ! మెనీ హ్యాపీ రిటర్న్స్-- ' త్వరగా లేచి దంత ధావనం కానీ -- పండగ చేద్దాం--' ఉత్సాహంగా లేచి నిలబడింది కుముదిని--
    'అందుకే నీకు చెప్పలేదు -- నువ్వు హడావుడి చేస్తే నేను వోప్పుకోను--'
    'అలా అంటే మేము వోప్పుకోం-- మా ఇంట్లో మా యిష్టం , వచ్చినట్లు పండగలు చేస్తాం -- వద్దనడానికి నువ్వెవరు?' అన్నది కుముదిని గట్టిగా సుమిత్ర నోరుమూసి.
    'నీలాంటి ఫ్రెండ్ నాకెలా దొరికిందో నని ఒక్కొక్కసారి ఆశ్చర్య పడుతూంటాను కుముదినీ-- లోకంలో చాలామంది మంచి వాళ్ళున్నారు-- నిన్ను చూస్తూ వుంటే నాకొకటి అనిపిస్తుంది-- జీవితం మనం అనుకున్నంత వేగటూ కాదు, లోకం చాలా మంది చెప్పేటంత గుడ్డిదీ కాదు అని-- ప్రపంచం చాలా అందంగా వుంటుంది. అందులో నీలాంటి గులాబీలు చాలా వున్నాయి అని గ్రహించాను-' ఆవేశంగా అన్నది సుమిత్ర.
    'మాట్లాడితే కవిత్వం చెబుతావు -- నీ కవిత్వం నా ఎకనామిక్స్ కి సరిపడదు బాబూ! ముందు కాఫీ చేసుకుందాం పద!' అని సుమిత్ర చెయ్యి పట్టుకుని వంట గదిలోకి లాక్కుపోయింది కుముదిని. అలాగే అమ్మ దగ్గరికి పోయి సుమిత్ర పుట్టినరోజు అన్నవార్త చెప్పేసింది. చెల్లెళ్ళ చెవుల్లోనూ వూదింది.
    అందరూ గబగబ సుమిత్ర దగ్గరికి వచ్చారు. అమ్మగారు ఆముదం సీసా తెచ్చి సుమిత్ర తలకి పెట్టారు-- చెల్లెళ్ళు సుమిత్ర జడ విప్పారు.
    'ఇవాళ సుమిత్ర ఆఫీసుకి రాదని ఫోన్ చెయ్యి నాన్నా-' అని తండ్రికి ఉత్తరువు జారీ చేశారు--
    రాగిణీ, అరుణా కలిసి మెనూ కార్డు తయారు చేసి వంటావిడ కిచ్చారు.
    సుమిత్రని తలంటు పోసుకోడానికి పంపి ఆమెకేం బహుమానం యివ్వాలా అని అందరూ సమావేశంలో చర్చకి పెట్టారు. ఒకరు చీరే అన్నారు. ఇంకొకరు పెయింటింగ్ అన్నారు. మరొకరు మరొకటన్నారు. అడ్డం ముందు నిలబడి జడ అల్లుకుంటూ నవ్వుకుంది సుమిత్ర.
    ఎన్నో పుట్టిన రోజులొచ్చాయి. ఇంత హడావుడీ అడంబరమూ తనెప్పుడూ అనుభవించలేదు.
    'ఇవాళ నీ పుట్టిన రోజు కుదుటే ' అంటూ బలవంతాన తలంటు పోసేది అమ్మ బ్రతికి వుండగా. తలంటు పోసుకోడం వొక్కటే పండగ చిహ్నం. అంతకి మించిన వేడుక ఆ ఇంట్లో ఇంకొకటి లేదు-- వదిన కూడా పిల్లలకి పుట్టిన రోజు వేడుకలు చేసేది కాదు.
    డబ్బుని బట్టి కోరికలూ, అలవాట్లూ మారుతూ వుంటాయి. లేదా రూపు దిద్దుకుంటూ వుంటాయి.
    'బజారు కెడదాం త్వరగా తయారవ్వు సుమిత్రక్కా' అని హాల్లోంచి అరిచింది అరుణ.
    అదే సమయంలో పుల్లతో కాటుక రేఖలు దిద్దుకుంటున్న సుమిత్ర కి బసవరాజు జ్ఞాపకం వచ్చాడు. ఇవ్వాళ అతన్ని తన యింటికి ఆహ్వానించాలని పించింది కానీ ఎలా? అది వీలయే పని కాదే! పరాకుగా పెట్టె తెరిచింది మంచి చీరే కోసం . చీరెల అడుగున కనిపించిన ప్యాకెట్ వ్రేళ్ళ కి తగిలింది. అప్పటి నుంచీ విప్పనే లేదు-- అందులో వుండే నిజాన్ని చూడెలేదు  తను అడగలేదు--
    అతను చెప్పలేదు.
    ఆ ప్రయత్నంగా ప్యాకెట్ విప్పదీసింది. అది ఈవినింగ్ ఇన్ ప్యారిస్ సెంట్. ఆ పరిమళం చాలా యిష్టం తనకి-- అదెలా తెలుసునో అతనికి!    
    ఈరోజు అతడిని చూడాలనే తహతహ ఎక్కువైంది--
    'రా అక్కా త్వరగా!' రాగిణి పిలిచింది మళ్లీ --
    'ఇవ్వాళ అక్క చాలా బావుంది ' అరుణ కామెంట్ చేసింది.
    'అక్క మంచి వాసనోస్తోంది' అంది రాగిణి --

               
    'అవును ఈ మధ్య సుమిత్రకి ఎవరో మంచి సెంట్ బహూకరించారు --' అని చెణుకు విసిరింది కుముదిని-
    నవ్వుతూ బయలుదేరింది సుమిత్ర  మెట్లు దిగుతూ వుంటే బసవరాజు చెప్పిన ఫోన్ నెంబరు జ్ఞాపకం వచ్చింది.
    'ఇవాళ మీరంతా నాకొక గంట బయటికి వెళ్లేందుకు పర్మిషన్ యివ్వాలి -- ' అన్నది వెంటనే.
    'యివ్వం -- యివ్వం' అన్నారు వాళ్ళు ---
    'యిస్తాం --' అన్నది కుముదిని తరువాత!
    'నీకేన్నాళ్లు గానో చెప్పాలను కుంటున్నా కుముదిని -- బసవరాజు గారనీ, బ్యాంక్ లో పని చేస్తారు. ఆయనతో పరిచయం అయింది. కొంచెం ఫ్రండ్ షిప్ కూడా అయింది. నా బర్త్ డే సందర్భంగా ఆయన్ని పిలవాలనుంది' అన్నది సుమిత్ర చాలాసేపయిన తరువాత.
    'అమ్మ దొంగా! నేను నీకు పరాయి దాన్నా, కానీ, నీ అతిధిని పిలవడానికి నా పర్మిషన్ ఏమిటి!' అన్నది కుముదిని.
    రిసీవర్ తీసుకుని,'ఇవాళ నా పుట్టిన రోజు-- సాయంత్రం ఆరుగంటల కి బృందావన్ కి రండి -- ఐస్ క్రీం తినొచ్చు' అని ఫోన్ పెట్టేసింది -- సుమిత్ర.
    'ఆయనకి ఐస్ క్రీం అంత ఇష్టమా?' అనడిగింది రాగిణి.
    'ఐస్ క్రీం కాదే! అక్కంటే యిష్టం ' అన్నది అరుణ.
    'నీతో లాగే ఆయనతో కూడా స్నేహంగా వుంటాను -- నన్నర్ధం చేసుకో కుముదినీ-- ఆయన్ని ఇంటికి పిలిస్తే నాన్నగారూ, అమ్మా ఏమైనా అనుకుంటారేమో నని హోటల్ కి రమ్మన్నాను-- ఏమీ అనుకోకు' అన్నది సుమిత్ర.
    'నాకు తెలుసులే సుమిత్రా!' అనేసి టాపిక్ మార్చింది కుముదిని.
    సినీమా కి వెళ్లి తీరాలని పట్టుబట్టిన చెల్లెళ్ళ ని విడిపించుకుని బృందావన్ కి వెళ్ళడం సుమిత్ర కి చేత కాలేదు.
    'అయితే సినీమా కొంచెం అయిపోయాక పోదాం -- ' అని కండిషన్ పెట్టి వాళ్ళని కూడా హోటల్ కి తీసుకు పోయింది. బసవరాజు చేత గబగబ ఐస్ క్రీం తిని పించి అతన్ని సినిమాకి తీసుకొచ్చింది కుముదిని.
    'చెల్లెళ్ళూ నేనూ అల్లరి చేస్తూ కూర్చుంటాం -- మీరు మాట్లాడుకోండి .'
    అని వాళ్ళకి సలహా యిచ్చింది. అతని ప్రక్కన కూర్చుని సినీమా చూడడం ఏమీ ఇబ్బంది అనిపించలేదు. నోరు మూసుకుని బుద్దిగా కూర్చుని సినిమా చూసేసి అమ్మాయిలను ఇంటి దాకా తీసుకువచ్చి సురక్షితంగా దిగ బెట్టాడు.
    రిక్షా దిగగానే చెల్లెళ్ళ ని గబగబా మెట్లేక్కించి పైకి తీసుకు వెళ్ళింది కుముదిని.
    "గుడ్ నైట్ సుమిత్రా౧క్' అన్నాడు బసవరాజు వెనక్కి తిరిగి.
    'నేను ఎల్లుండి సాయంత్రం ట్రెయిన్ లో బెజవాడ వెడుతున్నాను. పదిహేను రోజుల దాకా రాను.' అన్నది సుమిత్ర.
    'మిమ్మల్ని స్టేషన్ లో కలుస్తాను--' అంటూ నడిచి వెళ్ళిపోయాడతను.
    అతను మలుపు తిరిగి అదృశ్య మయ్యే వరకూ చూసి నిట్టూర్చి పైకి వెళ్ళింది సుమిత్ర.
    హైదరాబాద్ స్టేషన్ లో సుమిత్ర ని రైలెక్కించి కుముదిని వెళ్ళిపోయింది.
    ట్రెయిన్ కదులుతూ వుండగా ఎక్కిన బసవ రాజును చూసి కళ్ళు యింతవి చేసుకుంది సుమిత్ర.
    'ఎప్పుడు చూసినా మీ ప్రక్కనే స్నేహ బృందం వుండాల్సిందే' అన్నాడతను కూర్చుంటూ --
    'బావుంది - వాళ్ళు ముందోచ్చిన వాళ్ళు.'
    'అవును-- నేనే వెనక బడ్డ వాడిని--'
    సీటులో సర్దుకుని కూర్చుని, తను ఇచ్చిన ప్యాకెట్ విప్పదీస్తూ.
    'మీ పుట్టిన రోజున నా దగ్గర డబ్బు లేదు. బ్యాంకు బాలన్సూ లేదు-- అప్పిచ్చే వాడూ దొరకలేదు-- ఇవ్వాళ దొరికింది-- హృదయపూర్వకంగా యిచ్చే ప్రెజెంటేషన్ ఎప్పుడైనా స్వీకరించవచ్చు ....' అన్నాడు.
    ప్యాకెట్ లోది లేత గులాబి రంగు పట్టుచీరే. దాని మీద అక్కడక్కడ జరీ పువ్వులున్నాయి.
    'ఇంత ఖరీదైన బహుమతులు పుచ్చుకోడం నాకిష్టం వుండదు' అన్నది సుమిత్ర.
    'బహుమతి ఎవరన్నా యిచ్చినప్పుడు ఏదైనా తీసుకోవాల్సిందే -- బావుందో లేదో చూడండి-- లేకపోతె మార్చేద్దాం--' చనువుగా అడిగాడు.
    'చాలా బావుంది. థాంక్స్ -- ' అన్నది సుమిత్ర.
    అతను ఏమిటో చెబుతున్నాడు. తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని అందులో నుంచీ సూట్ కేస్ తాళాలు తీసి, చీరెని సూట్ కేస్ లో పెట్టాడు. అదంతా చూస్తూ నవ్వుతూ కూర్చుంది సుమిత్ర. అంత చనువుగా అతను ప్రవర్తిస్తూ వుంటే చూడడానికి బావుంది. సికింద్రాబాద్ స్టేషన్ రానే వచ్చింది. అతను దిగిపోయి, పళ్ళూ, పత్రికలూ కొనుక్కొచ్చి సుమిత్ర ప్రక్కన పెట్టాడు.
    'నన్ను దూర దేశానికి పంపుతున్నట్లుంది మీ ప్రాణానికి.' అన్నది సుమిత్ర.
    'రైలు బయలుదేరడానికి కూత వేసింది.
    'దూరమూ, దగ్గరా అనేవి వ్యక్తుల మధ్య గల ఆత్మీయతని బట్టి వుంటాయి సుమిత్రా! నిజానికి మీరు చాలా దూరం వేడుతున్నట్లే వుంది నా ప్రాణానికి. త్వరగా రావడానికి ప్రయత్నించండి అంటూ చెయ్యి జాపాడు బసవరాజు.
    రైలు కదిలింది చాపిన చేతిని వెనక్కి తీసుకుని గబగబ దిగిపోయాడు బసవరాజు.
    అతన్ని చూస్తూ అలాగే కూర్చున్న సుమిత్రకి అతను వెళ్ళాక కళ్ళ నిండా నీళ్ళు తిరిగాయి-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS