Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 13


    రాఘవేంద్రం చెప్పినదంతా విని ధనమ్మగారు మండిపడ్డది. "సంవత్సరం గడవెందుకయ్యా దీనికి...." అని రాఘవేంద్రావును నిలదీసింది. రాఘవేంద్రరావు ఏమన గలడు?
    "మీకెందుకు? అన్నీ నే చూసుకుమ్తానుగా ముందు ఆడ పిల్ల పెళ్ళి అవనిదే తన పెళ్ళి గురించి మాటలేమిటీ అనే బాధకొద్దీ అతగాడు నీళ్ళు నములుతున్నాడు తప్ప...... మన అంటే ధనమ్మ సమ్మంధమా? మరోటా అందుకని...... నువ్వు నన్ను నమ్ము...." అన్నాడు ప్రాధేయపూర్వకంగా.
    ముకుందరావుకి నచ్చిన ఈ సంబంధం తప్పిపోవడం ముఖ్యంగా ధనమ్మగారి చేతిలో తెగిపోవడం యెంత మాత్రం ఇష్టంలేదు రాఘవేంద్రానికి.
    ఎట్టకేలకు ధనమ్మ నిట్టూర్చింది, మనసులో ఆమె రాఘవేంద్రం ఎక్కడికి పోతాడు....తన ఇల్లూ తనూ నా చేతిలోని వాడేకదా.....అనుకున్నది. కొందరి తత్వమే అంత. ఆమెకు ఓటమి అంటే గిట్టదు. తాను నచ్చిన భాస్కరం తన పెంపుడి కూతురికి మగడు కాకపోవడం ఓటమియా? అంటే అది ఆమె అభిప్రాయం. అందకు నిర్వచనాలతోను, నిఘంటువులతోనూ పనిలేదు.

                                    20

    జయమ్మ కూతురి వాలకాన్ని గమనించక పోలేదు. కూతురికి వాల్తేరు పోవడంలో గల ఉత్సాహం కేవలం చదువుమీదనేనా? అన్న అనుమానం ఆమెకు కలగకనూ పోలేదు. పద్మావతి పరధ్యానానికి ఆమె అర్ధాలు ఆరాలూ, తీసింది. పద్మావతి ప్రవర్తన నామె పసిగట్టేసింది.
    కూతురి వ్యక్తిగత విషయాలలో తాను ఒక్క దూకున ప్రవేశించడం ఆవిడకీ మనస్కరించలేదు. ఐతే ఇప్పటికే తనకు శిష్ఠసమాజంలో పలుకుబడి.....సరియైన స్థానములేదు......ఇకముందు కూతురి భవిష్యత్తులో దాని ప్రభావం ఉంటుందేమో నన్న భయం ఆమెలో దిన దినం ఎక్కువ కాజొచ్చింది. తనవారికి తన దేశానికి దూరమై బ్రతుకు వెళ్ళబుచ్చుతున్న జయమ్మకు మనోవ్యధ ఇటీవల మరీ ఎక్కువయింది.
    ఐనవాళ్ళందరూ "జయమ్మ లేచిపోయిందనే అంటారు తప్ప-" అయ్యో ఆ అబల సాహసం చేసింది..... తనకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొని ఏటి కెదురీది ఒడ్డున పడిందీ" అనరు.
    నిజానికి జయమ్మకి శాస్త్రబద్ధమైన వివాహమయ్యింది. అది ఆమె నమ్మకం మొదటి వివాహం పీటలమీదనే తప్పిపోయింది కూడాను. ఈ రెండు విషయాలు మహాపట్నం..... తనదిగాని వూరూ, అయిన గుంటూరులో ఎవరికీ అక్కర్లేక పోయింది గాని తిరిగి తాను పాతికేళ్ళ తర్వాతనైనా, తన బిడ్డకు ఐన సమ్మంధం వెతకబోతే తిరుగ తోడుతారు. తనవాళ్ళు.
    "అమ్మా ఎందుకమ్మా! అసలే నీ ఆరోగ్యం బాగుండటం లేదుకదా! ..... మరీ దిగులు పడుతున్నావు?....ఏమిటమ్మా ....? ఈ చదువు మానేద్ధునా?" -తల్లి అప్రసన్నతను గుర్తించిన పద్మావతి అడిగింది.
    "ఎవరు చెప్పారే నీకు నేను దిగులుపడుతున్నానని.....మీ అన్నదమ్ములు ఎవరూ యిటుకేసి చూడకపోయారు కదమ్మా!" కూతురి తల నిమిరింది జయమ్మ.
    "ఎవరి పనులు వాళ్ళ కుంటాయి...... పోనీ చూడనంత మాత్రాన మనకేం పోయింది." పద్మావతి తల్లి మొహంలోకి చూడకుండానే అన్నది.
    జయమ్మ చాలా మాటలు అనాలనుకుంది. కాని వొకటీ నోరు విడి రాలేదు. పద్మావతి లేచి "నీకు బార్లీ కలుపుకుని వస్తాన"ని వెళ్ళింది.
    పద్మావతికి ఎంత కాదనుకున్నా తనకి అన్నదమ్ము లుండిన్నీ తన తల్లి కడుపున పుట్టని వాళ్ళవడం ఏమో చిన్నతనంగా అనిపిస్తుంది. తన తల్లికి తానొక్కర్తినే అయివుండి ఉన్నా యింత బాధ ఉండదు; అనుకొనేది. పసితనంలో ఆపిల్ల కనేక విషయాలు వూహ కందకపోయినా యిటీవల అన్నీ తెలుస్తున్ననేను.
    జయమ్మ కూతురి బాధ నర్దం చేసుకొనే ప్రయత్నంలో, గత అనేక సంఘటనల పీడను తప్పించుకోలేక పోయింది.
    తా నొకనాడు సాహసం చేయకపోతే ఈరోజు పద్మావతికి ఈ సంకటం లేకపోను గద? 'అసలు పద్మావతి ఎక్కడ ఉంటుంది?' నిర్లిప్తంగా నవ్వుకుందామె.
    'కాని......కాని' .... అలా జరగలేదు.

                                    *    *    *

    జయమ్మకి దేవుడు చెంపకి చారెడేసి కన్నులిచ్చేడు. చక్కని అవయవ సౌష్టవం అమరిందామెకు.
    పద్మావతి కంటే నాలుగేళ్ళు చిన్నదిగా ఉన్నప్పుడే జయమ్మకి ప్రపంచం తెలిసిపోయింది. బ్రతుకు అందులోను ఆడదాని బ్రతుకు దాని లోని సాధక బాధకాలు పూర్తిగా అవగతమై పోయాయి.
    సంగీతం నేర్పించలేదు తల్లీ, తండ్రీ ఆ పిల్లకు. చదువులు సరేసరి. బానిస దేశంలో ఆడ పిల్లల చదువులు- వెనకపడ్డ జాతుల అభివృద్దీ ..... ముందుబడ్డ జాతుల నిరోధన యిత్యాది సమస్యలు సమస్యలు కానేకావు. అలాంటివి లేనే లేవు.
    జయమ్మ చదువుకి ఎలిమెంటరీ బళ్లోనే స్వస్తి వాచకం ఐపోయింది. ఆపిల్ల చాలా చురుకైనది అని మాత్రం అందరూ అనేవారు. బళ్ళో ఎవరు సూదిలో దారం ముందు వేస్తారన్న పందెంలో ఆ పిల్లది ఫస్టు. పరుగెత్తడంలో జయమ్మకి అది గజాల వెనకనే ఎవరు ఉరకాలన్నా.....ఐతే అది బాల్యం. ఆనక ఆడపల్ల చురుకు తనంకన్నా ఆకర్షించగలిగేది యవ్వనం. అదే ఆ పిల్ల పరువైన తండ్రి గుండెల కుంపటి. అసలు పరువు మర్యాదలు తప్ప అప్పులేగాని ఆస్తిపాస్తులు లేవనే కుటుంబాన జన్మించినట్లయితే ఆ యవ్వనమే అతగాడి మనోవ్యాధి. ఒక అయ్యచేతను - వాడెంత పనికిమాలినవాడైనా కళ్ళు కడిగి పెడితేనేగాని నిద్రపోలేరు తల్లీ తండ్రీ.
    జయమ్మ తల్లీ దండ్రీ చురుకైన జయమ్మని యింట బుసలు కొడుతూ తిరిగే నాగు బాములాగే చూసేవారు. ఎప్పుడే కొంప ముంచుతుందోనని దేవుడి దగ్గర మెల్లిగా చెప్పుకొనేదాపిల్ల తల్లి. రెక్కాడితేగాని డొక్కాడని సంసారంలో ఆడపిల్లల్ని ఎందుకురా? భగవంతుడా! సృష్టించావని వాపోతున్న రోజులవి.
    అయితే అప్పటికే రామమోహనరాయలు పేరు జనం మరచిపోయారు. దాని అవసరం తీరి పోయింది. వీరేశలింగం పంతులుగారి మీద కత్తులు నూరడం పోయింది. ఎదిగిన ఆడపిల్లలుంటే ఆ కుటుంబాలకు వెలి అన్నది నానుడి మాత్రంగానే ఉంది. విధవా వివాహాల వినికిడి మాత్రం లేదు కనకనా?
    కాని జయమ్మను అందాల కన్నెగా చేస్తూ వచ్చిన పదహారేళ్ళూ చేసిన ఉపకారమేమీ లేదు పైగా యవ్వనం ఆ పిల్ల జఘనోపరి భాగంలోనూ, ముతుక జాకెట్టు లోపలా, తన ప్రతాపం చూపించసాగింది.
    అందమైన ఆడపిల్లని తన్నుకుని ఎగిరిపోదామనే ఉధార పురుషులే గాని తట్టుకుని భరించుదామూ అనే ఆశయం (?) గలవాళ్ళెవరూ లేక పోయారు. ఈ సమస్య పద్మావతి నాటికీ ఉన్నదే గద? కాని అది జయమ్మ కథను మరోరకంగా త్రిప్పింది.
    జయమ్మ తల్లి పోరు పడలేక తండ్రి సమ్మంధాలు వెతగ్గా వెతగ్గా అచ్చం కథలో లాంటి సమ్మంధం ఒకటి కుదిరింది.
    ఆ వరుడికీ ముగ్గురి పిల్లల తల్లి ఐతేనేం ఇంటికి దీపం లాంటి యిల్లాలు గతించి నాలుగు సంవత్సరాలు అయ్యింది. అది కూడా ముఖ్యమైన వివాహానికి కావాల్సిన అర్హతలలో నిదే కదామరి ......
    వయస్సు ఏభైకి పైమాట అబద్ధం చెప్పకూడదూ అనుకుంటేగాని "వైవాహికంబు" లందు అసత్యం శ్రేష్ఠమైనదీ, శుభప్రదమైనదీను గనక నలభయ్యో వడిలో "రాజు" లా ఉంటాడన్నారు నలుగురూ.
    జయమ్మ చురుకైనది, బలమైనది గనక ఒప్పుకొన్నాడే గాని....."ఇంతకంటే రంభలు అరడజను మంది యింటి చుట్టూ తిరిగితే 'పొమ్మన్నా' డని వరుడివంక వాళ్ళు చెప్పుకున్నారు.
    జయమ్మ యిద్దరు మగాళ్ళు కలిసి సాయంపడతారూ అనిపించే బిందెను అవలీలగా చంకనెత్తుకుని ఒకనా డింటికి వచ్చేసరికి తనకి పెళ్ళి అన్న ఆ శుభవార్త కాస్తా స్థిరపడిపోయింది.
    "అమ్మా! వాడికి దృష్టి ఆనదే నువ్వొ నేనో కూడా పెళ్ళికూతురు ..... ఎవరనీ తెలియదే" అన్నది జయమ్మ. ఆ పిల్లకి కాబోయే భర్త పాదాలను మాత్రమే తల్చుకోవాలని తెలియదు.
    "ఓసినీ! ఎంతమాటన్నావే" నని వాళ్ళ అమ్మ మాత్రం తక్షణం లెంపలు వేసుకుంది. అంతలో కూతుర్ని గుండెల కదుముకుని కన్నీరు పెట్టుకుంది.
    "తల్లీ! తల్లిని అని కాదు గాని సాటి ఆడదాన్నిగా చెబుతున్నా .....ఆడజన్మ అంటేనే అడకత్తెరలో పక్క అనుకో ..... ఏ జన్మనో నోచుకున్న ఫలమో ఐతే తప్ప మనకి తగినవేమీ దొరకవు. దుఃఖం కంటే సాయం, ధైర్యం కంటే మిత్రం మన స్త్రీ జాతికి లేవనుకో ..... నామాట విని ఈ సమ్మంధానికి వొప్పుకో ..... ఆ మూడు ముళ్ళూ పడకపోయాయా?..... మీ నాన్నగారు జంధ్యాలు తెంపుకు పోతారన్న"ది-ఆవిడ చెప్పినదాంట్లో నిజా నిజాలకన్నా జయమ్మకి తనకు పెళ్ళి తప్పదన్న సత్యమే అర్ధం అయింది.
    ఆపిల్ల గుండెల్లో రాయి పడింది.
    కట్టలు తెంచుకువచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ, గదిలోకి పారిపోతూ సాంబమూర్తి కళ్ళల్లో పడ్డది.
    సామర్లకోట వస్తే, వీళ్ళ యింటికి వచ్చి "ఏం అక్కమ్మా" అని జయమ్మ తల్లినీ "ఏం బావ గారూ" అని జయమ్మ తండ్రినీ పలకరించకుండా వెళ్ళడు సాంబమూర్తి.

                             
    సాంబమూర్తిదీ, జయమ్మ తండ్రి పాపయ్యదీ ఒకే వూరు. సాంబమూర్తిదీ, జయమ్మ తండ్రి పాపయ్యదీ ఒకే వూరు. సాంబమూర్తి వయస్సులో బాగా చిన్నవాడు. అటు తర్వాత పాపయ్య సామర్లకోట రాక మునుపే  సాంబమూర్తి కుటుంబం గుంటూరు తరలిపోయింది-ఐనా ఆ ఇద్దరికీ స్నేహం ఉన్నది.
    సాంబమూర్తి, పాపయ్యను చాలా గౌరవంగా చూస్తూ ఉండేవాడు. ఒకసారి సాంబమూర్తిని వాళ్ళ వూర్లో ముని మాపు వేళ కట్లపాము కాటేసింది. అదే వేళకి అటు వస్తూ ఉన్న పాపయ్య అమాంతం ఆ కుర్రాణ్ణి భుజాన వేసుకుని అక్కడికిరెండు కోసుల దూరంలో ఉన్న తన మేనమామ గారింటికి పరుగు పరుగున తీసికెళ్ళాడు. తన మేనమామ చేత మంత్రం వేయించాడు.
    ఆనాడు తన ప్రాణ దానం చేసిన పాపయ్య మేనమామ కూతురే పాపమ్మ. ఆ పిల్లే అటుతర్వాత పాపయ్య అర్ధాంగీ, జయమ్మ తల్లీను.
    అందుకనే పాపమ్మ అంటే సాంబమూర్తికి అంతవిశ్వాసం.
    జయమ్మ పెద్దమనిషైన తర్వాత కాస్త దూరంగా మెసలుతున్నదే గాని, అధివరకూ మామయ్యా అంటూ చెవులు పట్టుకుని ఆడించేది. ఆ పిలల్లమీద సాంబమూర్తికి విపరీతమైన వాత్సల్యం.
    ఆ పిల్ల ఎందుకు ఏడుస్తున్నదో-కనుక్కోవాలని "ఏవమ్మాయ్! ఏడుస్తున్నానం"టూ సాంబమూర్తి ఆమెతో గదిలోకి వెళ్ళేడు.
    "ఇంకేముంది! పెళ్ళి చేసుకొనే అంటే ఆపిల్ల అలా మంకుతనం వోడుతున్నది. నీవైనా చెప్పు నాయనా" అన్నది జయమ్మ తల్లి వంట యింటినించే.
    సాంబమూర్తి కుక్కి మంచంలో కూలబడి ఏడుస్తున్న జయమ్మ తల నిమిరేడు. కళ్ళు తుడిచేడు.
    "ఛా! చంటి పిల్ల లాగ ఏడుస్తారా? నీ కష్టం తీర్చిందికి నేను లేనూ .... లే! నీ బాధ ఏమిటో నాకు చెప్పు"-
    జయమ్మకు సాంబమూర్తి వోదార్పుతో మరింత దుఃఖం పొంగివచ్చింది.
    "ఇలాగ ఏడుస్తూ ఉంటే ..... నేను చేయగల గేది ఏమీ ఉండదమ్మాయ్! అవతల మళ్ళీ అదుగో మీ నాన్న వచ్చేస్తాడు....." ఈ మాటలు సాంబమూర్తి రహస్యంగా అన్నాడు. "ఈలోగా చెప్పు. నేను నీకు సాయం చేస్తా" నన్నాడు.
    "నిజంగానా మామయ్యా"-ఆపిల్ల గుండెల్లో కొంచెం ఆశ ఉదయించింది.
    "నిజం..... లే.....ఏడుపు మాని .....అసలు సంగతి చెప్పు ..... "-అప్పటికి సాంబమూర్తి ఉదేశంలో జయమ్మ ఎవరినేనా ప్రేమించి ఉంటుందానే అనుమానం ఉన్నది.
    "ఒట్టు?" అన్నది జయమ్మ గుక్కిళ్ళు దిగమింగుకుని.
    ఆపిల్ల కళ్ళల్లోకి, వాటి వెనుక లోతుల్లో దాగిన నైర్మల్యానికి కరిగిపోయిన సాంబమూర్తి "ఒట్టూ.....! అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS