15
రాజశేఖర మూర్తి వివాహానికయిన ఖర్చు సుబ్బారావు గారు అప్పు పెట్టారు. లాంఛనంగా అత్తవారిచ్చిన పట్టు బట్టలు, వెండి చెంబు , పళ్ళెము తప్ప ఒక్క దమ్మిడీ కట్నం పుచ్చుకోలేదు రాజశేఖర మూర్తి . వారు మనః పూర్వకంగా ఇవ్వదలుచుకున్నదేదో వధువుకు నగలుగా పెట్టుకోవచ్చు నన్నాడు. ఇందుమతి కి రెండు జతల బంగారు గాజులు, రెండు పేటల బంగారు గొలుసు పెట్టారు అనంత కృష్ణ శర్మ గారు. మంగళసూత్రం తప్ప వేరే ఏమీ పెట్టలేదు మగ పెళ్లి వారు. ఇతర ఖర్చులు, వధువుకు చీరలు, చూడ వచ్చిన చుట్ట పక్కాలకు బట్టలు, ప్రయాణపు ఖర్చులు, భోజనపు ఖర్చులు ఎంత నిరాడంబరంగా జరిపినా ఏడెనిమిది వందలయ్యాయి. ఈ అప్పు చలపతి , మాణిక్యమ్మ గార్ల భూములపై వచ్చే ఆదాయంతో తీరాలి.
రాజశేఖర మూర్తి గుంటూరు క్రైస్తవ కళాశాల లో బి.ఎ. లో చేరాడు. అతని ముఖ్య పాఠ్య విషయం గణిత శాస్త్రము. రవి ఇంజనీరింగ్ కు మద్రాసుకు వెళ్ళాడు. రాజశేఖర మూర్తి తన ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా మద్రాసులో ఇంజనీరింగు కాదు సరికదా, వాల్తేరు లో ఆనర్సు కూడా తలపెట్టలేక పోయాడు. క్రైస్తవ కళాశాల వారు క్రైస్తవ విద్యార్ధులకు చాలా మందికి స్కాలరు షిప్పులు ఇస్తూనే ఉంటారు. హిందువుల కూ మాత్రం తక్కువ. ఎలాగైతేనేం , రాజశేఖర మూర్తి కి లేదనకుండా సగం జీతపు స్కాలరు షిప్పు ఇచ్చారు. ఇంగ్లీషు, సంస్కృత పుస్తకాలు తప్ప గణిత శాస్త్ర పుస్తకాలు కొనవలసిన అవసరం లేకపోయింది. వెంతరత్నం గారు చదువుకున్న నాటి పాత పుస్తకాలు ఉంటె అవే వాడుకుంటూ వచ్చాడు రాజశేఖర మూర్తి. అయన దగ్గర లేనివి లైబ్రరీ నించి తెచ్చి చదువు కునేవాడు.
పెళ్లి సమయంలో తాను కుట్టించు కున్నవి, అత్తవారిచ్చినవి కొత్త బట్టలెన్నో ఉన్నాయి. మరి రెండు సంవత్సరాల వరకు బట్టల సమస్య లేదు. బి.ఎ. లో చేరింది మొదలు పాంటులు విడిచి, దోవతులు కట్టడం ప్రారంభించాడు. ధోవతీ కట్టి, లాల్చీ వేసుకుంటే ఒక కళాకారుడి లా ఉండేవాడు రాజశేఖర మూర్తి.
ఇందుమతి ని దివాకరరావు గారు మళ్ళీ ఏలూరు తీసుకుపోయి ఐదో ఫారం లో చేర్చాలను కున్నారు. ఇందుమతి కి ఇష్టం లేదు. పెళ్లి అయిన పిల్ల స్కూలుకు వెళ్లితే సహాధ్యాయు లూ, సహధ్యాయినులు కూడా యెగతాళి చేస్తారని ఆమె భయం. అనంత కృష్ణ శర్మ గారికి కూడా అది ఇష్టం లేదు. నలుగురూ ఏమైనా అనుకుంటారని అయన సంశయం. పైగా ఆమె ఆరోగ్యం కూడా సున్నితమైనది. ఈ రెండు సంవత్సరాలూ చదువు మానిపించి ఇంటి దగ్గరే ఉంచుకుంటే కొంచెం బలం చిక్కి ఆరోగ్యం చేకూరుతుందని అయన ఉద్దేశం. అదే నిశ్చయించారు.
దసరా పండుగలకు వెంకటా చలపతి గారు అనంత రవం వెళ్లి ఇందుమతి నీ, రేవతిని గుంటూరు తీసుకు వచ్చారు. ఇందుమతి పెళ్లి నాటి కంటే ఇప్పుడు బాగున్నది. ఆమె ఇప్పుడు చీరలు కడుతున్నది. వక్షః స్థలం నిండింది. చేతులు నునుపు దేరాయి. అధరం ఎర్రబడ్డది. ముఖంలో కొత్త కాంతి చేరింది.
దుర్గా ప్రసాద రావు గారు చనిపోయిన పిదవ కూడా మాణిక్యమ్మ గారు నవరాత్రోత్సవాలు మానలేదు. పురోహితుణ్ణి పిలిపించి, ఆమె స్వయంగా పూజకు కూర్చుని తొమ్మిది రోజులూ దేవీ పూజా జరిపించే వారు. రాజశేఖర మూర్తి కి సెలవులు కనక ఎక్కువ కాలం ఇంటి దగ్గరే ఉండేవాడు. ఇల్లు చిన్నది. ఇందుమతి కి భర్తను తప్పించుకు తిరగటానికే ఆస్కారం లేదు. భర్త తరిచి తరిచి తనతో మాట్లాడ ప్రయత్నిస్తే తనకు ఎవరైనా చూస్తారేమోనన్నభయం . అతడు లెక్క చెయ్యడు. ఒకనాడు మాణిక్యమ్మ గారు పూజ చేసుకుంటున్నది. సీతమ్మ గారు వంట చేస్తున్నది. రేవతి స్నానం చేస్తున్నది. వెంకటా చలపతి గారు ఇంట్లో లేరు. రాజశేఖర మూర్తి ఇందుమతి దగ్గిర చేరి, "ఇందూ, నా దగ్గిరికి రా" అని చెయ్యి చాపాడు. అతని చేతిలో ఒక మందార పుష్పం ఉన్నది. అది ఆమె వేణీ భారం లో స్వయంగా ఉంచాలని అతని కోరిక.
"మీరింకా నన్ను ముట్టుకో కూడదు" అని ఆమె దూరంగా జరిగింది.
"ఎందుచేత నట? నా భార్యను నేను తాకతమే పాపమా?"
"పాపం కాదు కాని, భావ్యం కాదు."
"పెళ్ళినాడు నిన్ను తాకలేదు? నీ మెడలో మంగళ సూత్రం కట్టలేదా? నిన్ను చేతబట్టుకొని అగ్ని చుట్టూ ప్రదక్షిణం చెయ్యలేదా? కలశం లో చిక్కిన నీ చేతికి నలిపి వెయ్యలేదా? ఇప్పుడేమిటి కొత్త?"
"అది వేరు. నలుగురి ఎదట పెద్దల ఆనతి ప్రకారం చేశారు."
"ఓహో! ఇక మీదట నిన్ను నలుగురి ఎదటనే తాకాలి కాబోలు."
"అది కాదు నేనన్నది. పెద్దల ఆనతి అయ్యేవరకూ మీరు నన్ను తాకరాదు."
"అదిగో, చూడు, మా అమ్మ ఆనతి అయింది. "తండ్రీ , కోడలి నింకా అక్కున చేర్చుకోవేమిరా?' అంటున్నది." అని తన తల్లి చాయచిత్రం చూపించాడు రాజశేఖర మూర్తి. ఆ తల్లి మందస్మితం అలాగే ఉన్నది.
'అదేం కాదు. 'బాబూ, కోడలి నప్పుడే ముట్టుకో కూడదు సుమా!' అంటున్నారావిడ" అని పరిహాస మధురంగా నవ్వింది ఇందుమతి.
ఆ నవ్వు రాజశేఖర మూర్తి హృదయంలో గిలిగింతలు పెట్టింది. తియ్యని ఆ పెదవుల నడుమ తెల్లని ఆ పలువరుస మన్మధ కుమారుడు ఇక్షు చాపం లో సంధించిన నవ మల్లికల పంక్తి లాగ తోచింది. ఇక తాళలేక పోయాడు రాజశేఖర మూర్తి.
"ఇందూ, నన్నేడిపించకు " అని తమకంతో ఆమెను దగ్గిరికి లాక్కుని, జడలో మందారం తురిమి , 'పెదవులతో ఆమె అధరం చుంబించపోయాడు. ఇంతలో రేవతి స్నానం చేసి వచ్చింది. తటాలున ఇందుమతిని విడిచి పెదవులు తడుచు కున్నాడు రాజశేఖర మూర్తి. ఇందుమతి సిగ్గుతో కుంచించుకు పోయింది. రేవతికి అర్ధం కాలేదు.
"బావా, అక్కంటే నీకు చాలా ఇష్టం కదూ?" అన్నది రేవతి.
"నువ్వంటే అంతకన్నా ఇష్టం" అని రేవతిని ఎత్తుకుని రెండు బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు రాజశేఖర మూర్తి. ఆ బాలిక తెల్లని బుగ్గలు ఎర్రబడ్డాయి. ఇందుమతి చిరుకోపంతో ఓరగా భర్తను చూసింది. ఆ చూపులు నేరుగా అతని హృదయాన్ని తాకాయి.
"పదును చూపుల నేల చూచెదు కురంగ
లోచనా! కారణము నే నేరుంగజాల,
భ్రూకుటీ వక్రధనువున రోష నిశిత
శరములన్ దాల్ప నేటికే చాలదపొంగ!"
అని హృదయంతరంలో గానం చేసుకున్నాడు రాజశేఖర మూర్తి.
16
దసరా పండుగ అయిన వెంటనే అనంత కృష్ణ శర్మ గారి దగ్గిర నుంచి ఉత్తరం వచ్చింది, అనుమతిస్తే నారాయణరావు గారు గుంటూరు వచ్చి ఇందుమతి ని తీసుకు వెళతారని. రాజశేఖర మూర్తి కి ఇందుమతి ని వదిలి ఉండ బుద్ది కాలేదు. పది రోజులు ఆమెతో సరస సల్లాపాలలో గడిపాడు. ఆమెకూ తన వద్ద చనువు కుదిరింది. ఆమె తనతో ఇప్పుడు మనసిచ్చి మాటాడుతుంది. ఆమెకు చదువుకోను "వేయి పడగలు" తెచ్చి ఇచ్చాడు. అది ఆమె ఇంకా పూర్టి చెయ్యలేదు. తను చదవ నిస్తే కదా? వీలైనప్పుడల్లా ఆమెతో కబుర్లాడుతూ కూర్చుంటాడు. మనుమడూ, మనవరాలూ ఆ విధంగా చిలకా గోరింకల లాగ ఉండటం చూసి సీతమ్మ గారు తన జన్మ సర్ధకమయిన దనుకున్నది. మధ్య మధ్య ణ ఆమె కూడా వచ్చి సరసోక్తులు పలికి పోతుంది. మాణిక్యమ్మ గారికి మాత్రం మనుమడు ఏ సమయంలో హద్దులు మీరుతాడో అన్న భయం.

అనంత కృష్ణ శర్మ గారి ఉత్తరాన్ని గూర్చి రాజశేఖర మూర్తి ఇందుమతి తో సంప్రదించాడు.
"నేనిక్కడ ఉంటె మీరు చదువుకోరు. ఈ పది రోజులూ మీరు పుస్తకం పట్టుకోలేదు" అన్నది.
"నీకటువంటి భయమేమీ అక్కర్లేదు" సరస్వతీ దేవి ప్రస్తుతం నా ఆరాధ్య దేవత. నువ్వు ప్రియురాలివి మాత్రమే" అన్నాడు.
అతడనుకున్నట్టు ఆమెలో ఈర్ష్య కలగలేదు. ఆమె సంతోషించి, "అయితే మీ ఇష్టం." అన్నది.
"రేవతి దిగులు పెట్టుకోదు కదా? ఏమే, రేవతీ ?"
"నీ దగ్గిర ఉంటె నా కెందుకు , బావా, దిగులు? కాని, నాకూ సెలవులు అయిపోయాయి గా? నేను మాత్రం స్కూలు కి వెళ్ళద్దూ?"
"ఓస్! నీకు పాఠాలు నేను చెబుతాను లే."
"నీ దగ్గిర నేను చదువుకోను బాబూ. పాఠం చెప్పడం మానేసి నా బుగ్గలు కోరికేస్తే?"
"చూశారా , రేపు వెళ్లి మా నాన్నతో కూడా చెబుతుందదీ" అన్నది ఇందుమతి నవ్వుతూ.
"చెప్పు కొనియ్ . నాకేం భయమా? నా హక్కుది. పోనీలేవే , మీ అక్కే చెబుతుంది లే" అన్నాడు రాజశేఖర మూర్తి రేవతి బుగ్గ మీద చిటికే వేస్తూ.
కుమారుడి సలహా మీద ఇందుమతి ని దీపావళి వరకు ఉంచుకుని పంపుతామని వెంకటా చలపతి గారు వియ్యంకుడి కి జవాబు వ్రాశారు.
కాలేజీలు తెరిచినా నాటి నుండి రాజశేఖర మూర్తి ఇందుమతి తో మునపటి లాగ అనవరత సల్లాపాలు మానాడు. అతని చదువేమో, అతడేమో. ఇందుమతి కి ఆశ్చర్యం అయింది. అంత దీక్ష, కనకనే అతనికి అలాగ చదువు అబ్బుతున్న దనకున్నది. తన అన్న మాధవరావు అంత దీక్షగా చదవటం తానెప్పుడూ చూడలేదు. రాజశేఖర మూర్తి ఇంట్లో అందరితో లాగే ఇందుమతి తో కూడా అప్పుడప్పుడు కొంచెం మాట్లాడతాడు. కాని, ఆ రెండు మాటలు ప్రేమ పూరితాలు.
రాజశేఖర మూర్తి భార్య ఇక్కడనే ఉన్నదని అతని స్నేహితులకు తెలిసింది. పెళ్ళికి ఎలాగూ పిలవలేదు. మా అందరికీ పార్టీ ఇచ్చి తీరాలని బలవంతం చేశారు. రాజశేఖర మూర్తి ఒక ఆదివారం నాడు తన ముఖ్య స్నేహితులు పది మందిని తన ఇంటికి ఆహ్వానించాడు. వారిలో దసరా సెలవులకు ఇంటికి వచ్చి సెలవలు పూర్తీ కాక ఇంకా గుంటూరు లోనే ఉన్న రవి ఉన్నాడు. చిన్ననాటి నించీ తనతో చదివి స్కూలు ఫైనల్ తో చదువు ఆపి తాలుకా ఫీసు గుమస్తా గా చేరిన హనుమంతరావు ఉన్నాడు. మూడు సంవత్సరాలు స్కూలు ఫైనల్ తప్పి ప్రస్తుతం కాశీ విశ్వవిద్యాలపు మెట్రిక్ పరీక్షకు తయారవుతున్న కలవారి బిడ్డ మనోహర రావు ఉన్నాడు. ఇంటర్ మీడియట్ లో తనతో చేరి, బి.ఎ లో కూడా తన సహాధ్యాయిని అయిన గణిత శాస్త్ర విద్యార్ధిని సరస్వతి ఉన్నది.
