Previous Page Next Page 
ఇందుమతి పేజి 13

 

                                 14
    ఇందుమతీ రాజశేఖరుల పెళ్లి సమయంలో పచ్చని పట్టు పరికిణీ మీద ఆకుపచ్చని సిల్కు వోణీ ధరించి, కాళ్ళకు వెండి పట్టాలు, చేతులకు బంగారపు గాజులు, నడుము పై వడ్డాణము , మెడలో పట్టెడ, తలపై నాగరము, జడ చివర కుప్పెలతో లక్ష్మీ దేవి ముద్దు బిడ్డలా పెళ్లి పందిరి అంతా తానుగా చెంగు చెంగున తిరుగుతున్న శారదను చూశాడు మాధవరావు. ఆ పల్లెటూరి పిల్లను చూస్తుంటే ఎందుకో ముచ్చటయింది. బస్తీలో ఇంటర్ మీడియట్ చదువుతున్నా తన హృదయంతరాళం లో అతడు రైతు బిడ్డ. మూడో ఫారం వరకూ స్వగ్రామమైన అనంతవరం లోనే చదివాడు. ఆ తరవాత పై చదువుల కోసం బస్తీకి వెళ్ళినా అతని హృదయం అనంత వరం ;లోనే ఉండి పోయింది. ప్రతి సెలవలకూ తప్పకుండా స్వగ్రామం వెళ్లి వస్తూండేవాడు. అక్కడ ఉన్నన్నాళ్ళూ తోటి రైతు బిడ్డలతో స్నేహంగా పొలాల వెంట తిరుగుతూ , ఆవులనూ, గేదెల నూ కాస్తూ కాలం గడిపేవాడు. చదువుకున్న ఇతర యువకుల లాగ ఖస్తీ ఉద్యోగాలకు ఎగబడ కుండా స్వగ్రామానికి తిరిగి వచ్చి ఆధునిక పద్దతులలో వ్యవసాయం చెయ్యాలని అతని ఆకాంక్ష. అందుకనే ఇంటర్ మీడియట్ అయిన తరవాత కోయంబత్తూరు వెళ్లి వ్యవసాయ శాస్త్రం చదవాలని అతని కోరిక.
    వీరన్న పేటలో ఉన్న మూడు రోజులూ అతని మనస్సు పూర్తిగా శారదా మయమై పోయింది. అతని చూపులు శారదా మూర్తి నే అన్వేషించ సాగాయి. అతని శ్రవణీంద్రియాలు శారదా చెలంచలాల గుసగుసల కోసం అర్రులు చాచాయి. అతని ఘ్రానేంద్రియం శారదా వేణీభరాన్ని అనవరతము అంటి పెట్టుకుని ఉండే మొగలి పువ్వుల మత్తు వాసనల కోసం తహతహ తాడింది. ఆమెను పలకరించాలని ఉన్నది కాని అదను దొరకలేదు. వీరన్న పేట ఆమె కట్టుకొన్న ఇనప కోట. అక్కడ ఆమెను చేరడమే దుర్లభము.
    మూడు నిద్రలు అయిన తరవాత పెళ్ళివారు మళ్ళీ అనంతవరం వెళ్ళే రోజు ఆసన్నమైంది. ఇంక శారద కనిపించదేమో అని భయపడ్డాడు మాధవరావు. శారదను కూడా అనంతవరం తీసుకుని రమ్మని మెల్లిగా రాజశేఖర మూర్తి చెవిలో ఉదాడు. అతని మనస్సు అర్ధమైంది రాజశేఖర మూర్తికి. ఇందులో రాజశేఖరమూర్తి చేయ్యవలసిందేమి ఉన్నది? శారద ఎలాగూ రాకుండా ఉండదు. ఒంటి ఆడబిడ్డ కదా? ఆమె అన్నగారికి తోడుగా ఉండవలసిందే. ఎవరైనా తప్పవచ్చును కాని ఆమె తప్పదు.
    పెల్లివాళ్ళు అటు మూడు నిద్రలకు అనంతవరం బయలుదేరారు. రాజశేఖర మూర్తి తో బాటు జానకీ దేవి, శారద ప్రయాణ మయ్యారు. బస్సులో జానకీ, భానుమతి, ఇందుమతి , శారద ఒక సీటులో కూర్చున్నారు. వారికి ఎదురు సీటులో రాజశేఖర మూర్తి ,రేవతి, మాధవరావు కూర్చున్నారు. జానకి, భానుమతి ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. రాజశేఖర మూర్తి మధ్య మధ్య చిరునవ్వుతో ఇందుమతి వైపు చూస్తూ రేవతి తో కబుర్లు చెపుతున్నాడు. ఇందుమతి మౌనంగా ఉన్నది. మాధవరావేమో శారదనే చూస్తున్నాడు. శారద కు ఆశ్చర్యమయింది. ఎందుకాయన తనను అలా చూస్తాడు? వెర్రి బాగుంది1 ఇన్నాళ్ళూ అతడు తననే అనవరతము వెదుకుతున్నాడనీ , కనిపించినవుడల్లా కళ్ళారా తననే అవలోకిస్తున్నాడనీ ఆమెకు తెలియదు. ముఖం పక్కకు తిప్పుకుని ఇందుమతిని పలకరించ బోయింది. ఇందుమతి తన హృదయేశ్వరుడితో లోలోపల ఏదో మాట్లాడు కుంటున్నది కాబోలు, పలకలేదు శారద మళ్ళీ మాధవరావు వంక చూసింది. అతడు చిరునవ్వు నవ్వాడు. శారద గుండె ఝల్లు మన్నది. ఇక ఆ వైపు చూడలేదు.
    అనంతవరం చేరేసరికి రాత్రి ఏడున్నర అయింది. రాజశేఖర మూర్తి ని స్నానానికి లేమ్మన్నారు. అతడు పెట్టె తీసి ధోవతి తీసుకోవలసి ఉన్నది. శారదను పిలిచి తెప్పించు కుందామని "శారదా" అని పిలిచాడు. శారద ఎక్కడో లోపల ఉన్నది. వెంటనే మాధవరావు లోపలికి పోయి, "శారదా, మీ అన్నయ్య పిలుస్తున్నా"రన్నాడు. శారద విస్తుపోయింది. మరుక్షణం లో బయటికి వచ్చి అన్నకు ధోవతి ఇచ్చి లోపలికి పోయింది. మరునాడు ఉదయం మళ్ళీ స్నానం చేసేటప్పుడు బట్టలు కావలసి వాచ్చాయి. రాజశేఖర మూర్తి , "శారదా" అని పిలవటమే ఆలస్యంగా మాధవరావు లోపలికి పోయి శారదను పిలుచుకు వచ్చాడు. మధ్నాహ్నం భోజనాల సమయంలో మాధవరావు వడ్డనకు బయలుదేరాడు. శారద కూర్చున్న చోటికి వచ్చేసరికి అతని ఉత్సాహం కట్టలు తెగి ప్రవహించింది. క్షీరాన్నము, బొబ్బట్లు, నెయ్యి వద్దన్న కొద్ది ఆమెకు వడ్డించి పోయాడు. వాక్చాతురి లో పేరు పొందిన శారద మాధవరావు తనపై చూపుతున్న శ్రద్ధ గ్రహించి నప్పటి నుండి సిగ్గుల రాణి అయిపొయింది.  మాధవరావు ఏదో ఒక అదును కల్పించుకుని ఆమెను పలకరించాడు. ఆమె మాట్లాడలేదు. మాధవరావు ఆడవాళ్ళు కూర్చున్న చోటికి పోయి, "ఏమే, ఇందూ . మీ ఆడబిడ్డకు మాటలు రావా?" అన్నాడు.
    "ఏమమ్మా, ఏమిటో అడుగుతున్నాడు మా అన్నయ్య" అన్నది ఇందుమతి శారద వైపు తిరిగి.
    "మాటలు రానిది నీకు. నాలుగు రోజులుగా మా చిన్నన్నయ్య నిన్ను పలకరిస్తుంటే ఒక్క మాట పలికావా, జాణా?' అన్నది శారద.
    "అమ్మ బాబోయ్, మీ ఆడబిడ్డ గడుసుదేనెవ్" అన్నాడు చిలిపిగా మాధవరావు.
    "అయినా ఆడంగుల పెద్ద బావగారి లాగా, మీ అన్నయ్య కిక్కడెం పనిటా?' అన్నది శారద ఇందుమతితో.
    "ఏమో బాబూ నీకు తెలుసు, వాడికి తెలుసు" అన్నది ఇందుమతి.
    "కోపం తెచ్చుకోకండి ఆడబిడ్డ గారూ " అని వెళ్ళిపోయాడు మాధవరావు.
    మూడో నాడు వార్తా పత్రికలో ఇంటర్ మీడియెట్ పరీక్షా ఫలితాలు తెలిశాయి. అనుకున్నట్టుగానే రాజశేఖర మూర్తి మొదటి తరగతి లో పాసయ్యాడు . పాపం మాధవరావు పరీక్ష మాత్రం పోయింది. అతడు ఖిన్నుడైనాడు. రాజశేఖర మూర్తికి తాను పాసై నాడన్న సంతృప్తి మిగలలేదు. ఈ ఫలితాలు మరో రెండు రోజులు ఆలస్యంగా వచ్చినా బాగుండే దనుకున్నాడు.
    "ఎవరి ఖర్మ వారిది. ఎవరిని ఎవరుద్దరించగలరు, నాయనా! అంతా ఆ సర్వేశ్వరుడి కృప" అన్నారు అనంతకృష్ణ శర్మ గారు.
    మాధవరావు నిర్మించుకున్న గాలిమేడలు మొదలంటా కూలిపోయాయి. ఇంక శారదకు తన ముఖం చూపించ బుద్ది కాలేదు . ఆమెకు మాత్రం మాధవరావు పై సానుభూతి కలిగి, "పాపం, నిన్న ఆయన్ను అనవసరంగా కసిరాను. పాపిష్టి డాన్ని' అనుకుంది.
    మధ్యాహ్నం భోజనాలైన తరవాత పెళ్లి వారు ప్రయాణమైనారు. అల్లుడికి, అతనితో వచ్చిన శారద కు, జానకీ దేవికి బట్టలు పెట్టారు అనంత కృష్ణ శర్మ గారు. బయలుదేరే ముందు చొరవ చేసుకుని ఇందుమతి వద్దకు వెళ్ళాడు రాజశేఖర మూర్తి. చుట్టూ పరివేష్టించి ఉన్న ఆడవాళ్ళంతా అక్కడి నించి వెళ్ళిపోయారు.
    "ఇందూ, మళ్ళీ ఎప్పుడు మన కలయిక?"
    "మీ ఇష్టం. ఇక మీదాన్నే కదా?"
    "దసరా పండుగలకు గుంటూరు వస్తావా?"
    "అలాగే, నాన్నగారితో చెప్పండి."
    "దివాకర రావు గారు నిన్ను ఏలూరు లోనే ఉంచి పైకి చదివించనున్నారు. చదువు కుంటావా?"
    "ఏమో బాబూ, సిగ్గేస్తుంది."
    "నువ్వు చదువు కుంటా నంటే నా కిష్టమే. ఆలోచించుకో."
    "......."
    "నీ ఆరోగ్యం కూడా సరిగా చూసుకోవాలి. దివాకర రావు గారు మరీ మరీ చెప్పారు" అని ఆమె కుడిచేతిని తన చేతి తో తీసుకుని పెదవులతో మెత్తగా స్పృశించాడు. ఆమెకు నర నరాలలోనూ ఒక విచిత్రానుభూతి కలిగింది.
    "వస్తా" అని వెళ్ళిపోయాడు రాజశేఖర మూర్తి.
    బయలుదేరేటప్పుడు మాధవరావు కోసం చూసింది కూడా అతనిని ఒక ప్రశ్న అడగాలనిపించింది.
    "మాధవరావేక్కడ?" అని అడిగాడు.
    "మాధవా!" అని కేకవేశారు అనంత కృష్ణ శర్మ గారు. దొడ్లో అవులకు మేత వేస్తున్న మాధవరావు అలాగే పరుగెత్తుకు వచ్చాడు. రాజశేఖర మూర్తి మధవరావు ను పక్కకు తీసుకు పోయి, "శారదను వివాహం చేసుకోవటం మీ కిష్టమేనా?' అని అడిగాడు.
    "ఈ పరిస్థితుల్లో అటువంటి వేమీ తల పెట్టకండి, బావగారూ . శారద మణి పూస. ఆమెకు మంచి సంబంధం చూసి చెయ్యండి" అన్నాడు మాధవరావు.
    "మీకు తక్కువేమీటండీ! ఇప్పుడీ పరీక్ష పోయిందని ఎల్లకాలం ఇలాగే ఉంటుందా? సెప్టెంబరు లో మళ్ళీ పరీక్షకు వెళతారు, పాసవుతారు."
    "పాసయినా , ఒక మాటు తప్పిన వాడికి కోయంబత్తూరు సీటు ఎవరిస్తారు, బావగారూ?"
    "కోయంబత్తూరు కాకపొతే మరో ఊరు. వ్యవసాయం కాకపోతే మరో శాస్త్రం. చదవలేక పోతారా, బాగుపడలేక పోతారా?"
    "అయినా నా భవిష్యత్తు ఒక దారిన పడితే గాని, వివాహం మాట తలపెట్ట లేను బావగారూ" అన్నాడు శారద వైపు చూస్తూ మాధవరావు . ఆమె తన వైపే చూస్తున్నది.
    "ఏమిటీ మార్పు?' అనుకున్నాడు మాధవరావు.
    ఇంతలో బస్సు వచ్చింది.
    "ఆలోచించు కొండి. మీకు ఇష్టమైతే మా పెద్ద నాన్న గారితో చెబుతాను" అని బస్సు ఎక్కాడు రాజశేఖర మూర్తి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS