పద్మచరణ్ మాట జారితే వదిలే రకం కాదు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే ముందుకు జరిగి కుతూహలంగా అడిగాడు:
"ఏం? ఏం జరిగిందేమిటి? చెప్పు, చెప్పు. నాకు చెప్పడానికి మొహమాట మేమిటోయ్? అంత విషమ పరిస్థితి వస్తే సహాయపడతాను కూడా."
పద్మచారణ్ గమ్మత్తు మనిషి. ఏదైనా అడగాలని ఉంటె ఖచ్చితంగా అడుగుతాడు. అలాగే తన విషయాలు కూడా సిగ్గు పడకుండా , దాచకుండా ఉన్నది ఉన్నట్లు చెబుతాడు. బి.ఎస్ పి, చదువు తున్న పద్మ చరణ్ ఒకానొక సమయంలో రాజును పరిచయం చేసుకున్నాడు. అప్పటి నుంచి రాజు ప్రత్యేక అభిమాన మేమీ ప్రకటించక పోయినా పద్మచరణ్ , అతనెక్కడ కనిపిస్తే అక్కడ కలగా జేసుకుని మాట్లాడతాడు. రానురాను అతని ధోరణి రాజుకు అలవాటే అయిపొయింది. అతను మాట్లాడుతుంటే సన్నిహితుల దగ్గర కూర్చున్నట్లు అనిపిస్తుంది. పద్మ చరణ్ అసాధ్యుడు. పెద్ద లందరూ కూడి చిన్నతనం లో తనకు పెళ్లి చేసిన పల్లె టూరి పిల్లను వదిలేశాడు , తండ్రినే ఎదిరించి.
ఇప్పుడు పద్మ చరణ్ తరిచి తరిచి తన విషయం అడుగుతుంటే , కొంతసేపటి వరకు రాజు మాట్లాడలేదు.
జీవితాలతో అడుకునేవాళ్ళు కొందరు. జీవితాల్లోకి తొంగి చూసేవారు కొందరు. ఇతరుల జీవితాలలో జోక్యం కలగజేసుకుని చీవాట్లు తినిపోయేవారు కొందరు. ఇంతాచేసి ఇతరుల పట్ల సానుభూతి చూపించే వారు; గొప్ప కోసం కాకుండా , శరీరం తోనే కాక ఆత్మతో కూడా ఇతరులకు సహాయపడే వారు ఏ కొద్ది మందో ఉంటారు. ముఖ్యంగా ఇటువంటి రకరకాల జీవితాలతో జోక్యం కలగజేసుకుని విజయం పొందేది భగవంతుడన బడేవాడే నెమో!'
ఆ భావనకు మనసులోనే నవ్వుకున్నాడు రాజు. ఒకవైపు పద్మ చరణ్ ఊపిరి సలపనివ్వ కుండా ఉన్నాడు.
"ఏముందోయ్ , పద్మా? ఆ పిల్లంటే నాకు ఇష్టం లేదు" అన్నాడు.
"ఏ పిల్ల?" అవలించినంత పని చేశాడు పద్మ చరణ్.
"మా మరదలు."
"నీకిచ్చి పెళ్లి చేస్తా మంటున్నారేమిటి?"
"అదే వచ్చింది గొడవ!"
"పోనీ, ఏదో తెగేసి చెప్పెయ్య లేక పోయావా నాలాగ?"
"చెప్పడమూ అయింది ; ఒప్పుకోక పోవడమూ అయింది."
"మరీ అంత పిరికి వాడి వేమిటోయ్ , చెక్కా ముక్కా చేసుకోకుండా!"
"నా పరిస్థితుల్లో నువ్వుంటే తెలిసేది!" అన్నాడు రాజు లోపల పొంగే అస్పష్టమైన బాధతో.
"నేనుంటేనా? సరే! నేనొక మాట అడుగుతాను కోపం తెచ్చు కుంటావా , రాజూ భాయ్?"
"కోపం తెచ్చుకోవలసిందయితే కోపం తెచ్చుకోవడమే కాదు, లెంపకాయలు రుచి చూపిస్తాను."
"నీ కోపానికి నేను జడిసే దేమిటి గానీ, నీకా అమ్మాయి ఇష్టం లేదంటే మరొక అమ్మాయి నీకిష్టమై ఉండాలి!"
"ఘటికుడివి మొత్తానికి!" రాజు నవ్వాడు.
మహా సత్యాన్ని కనిపెట్టిన వాడిలా ఫోజు ఇచ్చి కూర్చున్నాడు పద్మ చరణ్ -- "ఇక కధ చెప్పు" అంటూ.
ఆ సమయంలో తన మనోగత సమస్యను పైకి స్పష్ట పరచాలని పించింది రాజుకు. స్నేహితులకు ఏమైనా చెప్పుకోవడం లో తప్పేముంది? ఆ మాట కొస్తే దాచడంలో గొప్పే లేదు. మిత్రుల సలహలకు ఒక విలువ ఉంది సంఘం లో . అమోఘమైన సలహాలు ఇచ్చి , ఉపాయాలు చెప్పి మిత్రుల మాన మర్యాదలను కాపాడిన స్నేహితులెందరో ఉన్నారు. పద్మ చరణ్ ఎటువంటి విషయమయినా పంతం పట్టి తెలుసుకునే వాడే గానీ , పని లేకుండా చాటే స్వభావం కాదతనికి. ఇన్నాళ్ళ సాహచర్యం లో తను తెలుసుకున్నది అదొకటి.
మెల్లగా మనసు విప్పి అంతా చెప్పాడు రాజు. వ్యక్తిగత సమస్యలు, తప్పించు కోలేని పరిస్థితులు తనకెంత పటిష్టంగా ఉన్నాయో వివరంగా చెప్పాడు. చెప్పనటువంటి సంగతులు సహితం సంకోచంతో చెప్పవలసి వచ్చింది. పద్మచరణ్ ఒక్క మాట అయినా పొల్లు పోనిచ్చే మనిషి కాడు.
హృదయం లో బాధను, చిరాకు ను; మెదడు లో సమస్యలను, చిక్కులను బయటికి చెప్పి, ఇక చెప్పవలసిన బాధ్యత అవతలి వ్యక్తీ దన్నట్లు ఊరుకోగానే ఎంతో హాయి అనిపించింది మానసుకు. వీస్తున్న చల్లగాలి కన్నతల్లిలా ఓదార్చింది. పద్మ చరణ్ ఏమి చెయ్య మంటాడో విందామని ఆశ మొలకెత్తింది రాజులో.
"పార్వతి సంగతి వదిలేద్దాము. ముఖ్యంగా సరోజ కు నువ్వంటే ఇష్టమేనా? అదీ ఆ పిల్లకు నువ్వంటే అపరిమితమైన ఇష్టం ఉండాలి. లేకపోతె, ఆడపిల్లలు ఉన్నారే, వాళ్ళు వేగంగా లొంగరు. ముఖ్యంగా తెగించలేరు." పద్మ చరణ్ ఏదో ముఖ భంగిమ పెట్టి అర్ధ యుక్తంగా అన్నాడు.
"ఏమిటో నువ్వు చెప్పేది? ఇష్టానికేం? ఉంది. కాని నిశ్చితంగా తెలుసుకోవడానికి నాకు అవకాశం ఎక్కడ కలిగింది? ఆధారమేమీ దొరక లేదు. మరో మహా సమస్యను నెత్తి మీద పెట్టుకోవడానికి భయపడి ఆమెతో నా సంగతి చెప్పలేక పోయాను " అన్నాడు రాజు.
'అయితే ఒక పని చెయ్యి."
"ఏమిటి?' రాజు చెవులే తనయ్యాడు.
"తిన్నగా పరీక్షలై పోగానే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపో. అప్పటికి ఎమ్.ఎ. పూర్తయి పొంతుదిగా? ఎక్కడో తాత్కాలికంగా ఓకే చెత్త ఉద్యోగం దొరకక పోదు. అందుచేత ధైర్యంగా నీ మనసులో మాట ఆ అమ్మాయితో చెప్పు. ఆవిడ ఇష్టపడిందో -- ఇక సమస్యే లేదు. కధ సుఖాంతపు దారి తొక్కుతున్నదన్న మాట."
"అయితే ......." నసిగాడు రాజు.
"మీకింకా అర్ధం కాలేదా , మహారాజా? అల్లదిగో . పడమటి దిక్కు చూడండి. పక్షులు ఎగరడం లేదు , జతలు జతలుగా? ఇదిగో , కార్లు పరుగెత్తడం లేడూ, జోరుగా? అలాగే మీరూను."
రాజు అర్ధం చేసుకున్నాడు. సరోజను అలా ఊహించడం కష్టమయింది. కొంతసేపు ఆగిపోయాడు.
"నేను ఊహించలేక పోతున్నాను పద్మా! ఆ అమ్మాయి అలా చెయ్యలేదు. సాహసం తక్కువ కాకపోయినా, ఇష్టపడదని నమ్మకంగా తెలుస్తుంది నాకు."
పద్మచరణ్ బాగా శబ్దం వినిపించేటట్లు నిట్టూర్చి, "నువ్వు ప్రతి విషయాన్నీ ముళ్ళ బాటలో పెట్టి ఆలోచిస్తే నాతరం కాదింక. అది నీ ఖర్మ. చెయ్య గలిగితే, నువ్వు సరోజను ఒప్పించడం లోనే ఉంది కార్యం ఫలోన్ముఖం కావడమైనా, కాకపోవడ మైనా " అంటూ లేచి నిలబడ్డాడు.
రాజు కూడా లేచి నడుస్తూ "సరేనోయ్! ప్రయత్నించి చూస్తాను" అన్నాడు పాంట్ జేబుల్లోకి చేతులు పోనిచ్చి.
"ఆ అట్లా దారికి రా, అబ్బాయ్! దేనికైనా మగవాడివి కాబట్టి నీవు సాహసించాలి. "పద్మ చరణ్ రాజు భుజం మీద చెయ్యి వేసి మెచ్చుకున్నాడు.
కొంతవరకు నడిచిన తర్వాత అడిగాడు పద్మ చరణ్: "మీ మరదలు నీకెందుకు ఇష్టం లేదు? అందంగా ఉండదా?"
"ఆమె అందమూ, గుణాలు నాకు నచ్చవు." చాలా తేలికగా అనేశాడు రాజు, మరో ప్రశ్నకు తావివ్వకుండా.
11
కాలేజీ పరీక్షలు అయినాయి. పార్వతికి తండ్రినీ , అక్కనూ చూడాలని ఉన్నా పల్లెటూరి వాతావరణం తలుచుకుని భయపడి ఉండిపోయింది. అయినప్పటికీ స్పుమ్యమూర్తి అయిన అక్క రమ్మంటూ వ్రాసిన ఉత్తరాలు మనసులో మెదులుతున్నాయి. ఒంటరిగా అక్క ఆ పల్లెటూళ్ళో ఎలా ఉండగలుగుతుందో , ఎంత బాధ పడుతున్నదో ? అని ఒక చింత మాత్రం పార్వతి నెప్పుడూ పీడిస్తుంది. 'తనే తండ్రి అయి ఉంటె ఇప్పుడైనా చక్కగా చదివించి ఉద్యోగం చేయించి ఉండును. తండ్రితో ఆమాత్రం చెప్పే చనువు తనకు లేకపోలేదు. కానీ, ఆ విషయం మీద వాదోపవాదాలు , తర్క వితర్కాలు జరగక తప్పవు. అట్లాంటి వంటనే తనకు చిరాకు. ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చేసింది. ఏమిటో, దాని జీవితం అలా అయింది! చూసి చూసి, అది చివరికి ఒకనాడు.......'
ఇక ఆలోచించలేక పోయేది పార్వతి. పార్వతి కి ఆలోచనలు ఎక్కువ. వాటిని ఒక రూపంలో పరిష్కరించు కోలేక తప్పించు కుంటుంది.
ఎండవేళ ఆలోచనల వేడికి తట్టుకోలేక సరోజ దగ్గరికి బయలుదేరింది పార్వతి. ఆకాశపు అంచుల్లో మేఘ మాలికలు బారులు తీర్చి ఉన్నాయి. మధ్యకాశం అంతా సూర్యుని తేజస్సు లో లీనమయింది. సరోజ వాళ్ళ కాలనీలో ఇళ్ళన్నీ అందంగా ఉంటాయి. చల్లదనాన్ని స్పురింప జేసే చలవరాతి తో నేల అందంగా తయారు చేసి ఉంటుంది. నాకూకు నేర్చిన పనితనం లో సౌఖ్యాన్ని కూడా ఆ ఇళ్ళల్లో అమర్చారని పిస్తుంది.
పార్వతి వీధి వాకిలి లోకి వెళ్ళగానే దక్షిణపు గాలి విసురుగా నచ్చి నడిచిన శ్రమ నంతటి ని పోగొట్టింది. చప్పుడు కాకుండా అడుగులో అడుగు వేస్తూ కిటికీ లో నుంచి తొంగి చూచింది. సరోజ కిటికీ దగ్గరగా ఉన్న మంచం మీద వెల్లకిలా పడుకొని నిద్రతోనూ , పట్టుకున్న పుస్తకంతో నూ కుస్తీ పడుతున్నది.
కిటికీ లో నుంచే "ష్" అంది పార్వతి. సరోజ ఉలిక్కిపడింది. అరమూత లవుతున్న కళ్ళు విప్పారి నిండుగా చూశాయి.
"నువ్వా? లోపలికి రా. ఏమీ తోచక చస్తున్నా" అంది.
"ఏమీ తోచకేం? ఏదో చదువుతున్నట్లున్నావుగా? పైగా నిద్రాదేవితో నేస్తం కడుతున్నావు!" నాలుగు వైపులూ పరికిస్తూ వచ్చి, స్నేహితురాలి దగ్గర కూర్చుంది పార్వతి.
"ఏమిటి చదువుతున్నావు?"
"ఏం లేదు. డిసేక్షన్ గురించి అలోచిస్తున్నాను . నీకేం? ఈ ఏటితో బెడద తీరిపోయినట్లే కాబట్టి , ఎంత కులాసాగా నైనా కబుర్లు చెబుతావు. "సరోజ తన కష్టమంతా ముందే ఉందనే బాధ మిళితమైన భంగిమ లో అన్నది.
"అయినా మేము పేదవాళ్ళం -- మీలాగా డాక్టర్లు, ప్లీడర్లు కాగలమా? ఏదో డిగ్రీ కోసం!" నిట్టూర్చింది పార్వతి.
"పాపం! తరగని ఆస్తులున్న గారాబాల అమ్మాయిలే ఇలా మాట్లాడతారు."
"ఏమైనా అను. ఇంకొక రెండు మూడేళ్ళు పరుగెత్తే సరికి డాక్టర్ సరోజాదేవి వయిపోతావా, లేదా? అది చెప్పు."
"అప్పటికి నువ్వేం అవుతావో చెప్పనా?"
"వద్దు. చెప్పక్కర్లేదు ." పార్వతి అంది.
"ఏం?"
"నాకే అయోమయం . అటువంటిది నువ్వు చెప్పినా అబద్దం అయిపోతుంది."
"చెప్పి తీరతాను. మిసెస్ రాజువు కావటమే కాక యువ రాజులను కంటావు కూడా అప్పటికి ." పెంకిగా అన్నది సరోజ, పార్వతిని నవ్వించాలని.
పార్వతి నవ్వలేదు. "నాకు నమ్మకం లేదోయ్! మా పెళ్లి జరగదనే అనుకుంటున్నాను."
సరోజ ముఖ కవళికలు మారాయి. "ఎందుకలా అనుకోవడం?" అంది కనుబొమలు చిట్లిస్తూ.
"నీకు తెలియనట్లే అడుగుతున్నావు!" అంది పార్వతి నవ్వుతూ.
"రాజు ఇంకా రాలేదు. పరీక్షలు ఈ పాటికి అయిపోవలసిందే! ఉత్తరాలు వస్తున్నాయా, అతని దగ్గర నుంచి?' సరోజ సంభాషణ ను అతని వైపు మళ్ళించింది.
"ఒకసారి పరీక్షలు కాలేదని వ్రాశాడు. మరొక సారి ఫస్టు క్లాసేలాగూ వస్తుంది కాబట్టి మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా నంటూ వ్రాశాడు. దీనికి అంతటికీ అసలు కారణం ఏమిటో తెలుసా?"
"ఏమిటి?' సరోజ చూపులో ఆత్రుత కనిపించింది.
"ఇంటికి వస్తే ఎక్కడ కూర్చో బెట్టి వెంటనే పెళ్లి చేసేస్తారో -- అని."
"ఏం? అంత భయమా?"
"పెళ్ళంటే కాదు, నేనంటే."
"నీకేం లోటు? వన్నె తరగని బంగారం లా........"
"సరి . అపు అపు . నువ్వు నన్ను వర్ణించనిదెప్పుడు ? బహుశా నువ్వు రాజువై ఉంటె నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఉందువు" అంది పార్వతి కోపం నటించి .
