
క్షణ కాలం అంతా నిశ్శబ్దం. అద్భుతమైన వెన్నెలతో మధుర సంగీతం అందరి మనస్సు లనూ యేవో అందని స్వప్న లోకాలకు తీసుకొని పోయింది.
ఆ నిశ్శబ్దాన్ని భంగ పరుస్తూ రాజగోపాల్-- "సూపర్బ్! మర్వేలస్! ఇంత చక్కని పాటనూ, ఇంత మధుర స్వరాన్నీ నేను వినలేదు. మాటల కందని అనుభూతి కలుగుతున్నది!' అన్నాడు కళ్ళు మూసుకొని.
శేఖర్ ముఖంలో గర్వంతో కూడిన వాత్సల్యం మిలమిల లాడింది.
పద్మ గబగబా లోపలికి పోయి, స్వర్ణ టేబుల్ మీద నుండి తెల్ల కాగితాన్ని , పెన్నునూ తెచ్చుకొని స్వర్ణ ను పాట వ్రాసి పెట్టమని కోరింది.
మరకతం నవ్వుతూ, "జాగ్రత్త , పద్దాలు! ఆ పాట అమెరికా లో పాడావంటే తెలుగు వాడేవాడేనా నిన్ను టక్కున ఎగరేసుకు పోవచ్చు!" అని హెచ్చరించింది.
"నీ కెప్పుడూ పెండ్లి గొడవే! స్వర్ణా! ఆకలి వేస్తున్నది. టైము కూడా అట్టే లేదు. త్వరగా రానీయ్ పెట్టేదేదో!' అన్నది ఇందిర.
"ఏం పెడుతుందట? చీవాట్లు పెడుతుంది. తింటావా?' అని అడిగింది మరకతం.
"మై డియర్ , మర్కటం! అవి నీ కోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డాయిగా! మా కోసం వేరే టిఫిన్ ఉందిలే!" అన్నది నిర్మల.
"అయితే, పండ్ల భద్రీ! త్వరగా లోపలికి పోయి ఆకులూ ఎక్స్ ట్రా తీసుకొని రాకూడదు?' అని పురమాయించింది మరకతం.
"నువ్వూ రా. నువ్వు కూర్చోవడం మేం? నేను పని చేయ్యడమేం?' అంది నిర్మల.
"నేను ఆస్థాన విదూషకురాలీని. నేను ఇక్కడి నుండి కదిలితే, సభ చిన్న పోదూ!" అన్నది మరకతం.
"సింగి నాదం గాదూ! లే! లే!" అని మరకతం చెయ్యి పట్టుకుని లేవనెత్తింది నిర్మల.
ఇద్దరూ నవ్వుతూ లోపలికి పోయారు. వారి వెంట చిరునవ్వుతో స్వర్ణ కూడా పోయింది.
మరి కొంతసేపటికి అందరి ముందు విస్తళ్ళూ , వాటిల్లో బిసిబెడల హుళి, చక్కర పొంగలి, ప్రత్యక్ష మయ్యాయి.
"తెలుగు పులిహోర మాని, కన్నడ బిసిబెడల హుళి కి పోయారెందుకబ్బా?' అన్నది ఇందిర.
"భాషా బేధాలతో టే బుర్ర బద్దలు కొంటూ ఉంటె, ఇక నువ్వు తిండికి కూడా తెలుగు, కన్నడం అని పేర్లు పెట్టడం మొదలు పెట్టు. ఆహార శాఖామంత్రివి కావాలని ఏమన్నా ఆశగా ఉందా?' అడిగింది మరకతం.
అందరితో పాటు శేఖర్, రాజగోపాల్ కూడా నవ్వారు. శేఖర్ కు పొర బోయింది.
"రాజన్నా! శేఖర్ నెత్తిన కాసిన నీళ్ళు చల్లు. మా వదిన గారు పాపం తెగ తలుచుకొంటున్నట్లున్నారు!" అన్నది మరకతం.
నవ్వుల మధ్య పార్టీ ముగిసింది.
ఎవరి గూటికి వారు పోయే ముందు, అంతా తాము తెచ్చిన బహుమతులను పద్మకు అందిచ్చారు. స్వర్ణ ముద్దులు మూటగట్టే రాదా కృష్ణుల విగ్రహాన్ని నిర్మల అజంతా శిల్పాన్ని, ఇందిర ఫ్లవర్ వాజ్ ను బహూకరించారు.
రాజ గోపాల్ చక్కని గంధపు ఫోటో ఫ్రేమ్ ను, శేఖర్ చక్కని చిత్రాన్నీ ఇచ్చారు.
శేఖర్ చిత్రం లో ఒమర్ ఖాయం , చేతిలో సాన పాత్ర, పాత్రలోని మధువులో నవ్వుల పువ్వులు రువ్వుతూ అతని ప్రియురాలు. అద్భుతంగా ఉంది చిత్రం.
తన్మయత్వం తో దాని వైపు చూసి, "ఎంత బాగా ఉన్నది , అన్నా!" అన్నది పద్మ.
మరకతం పెదవి విరుస్తూ , "మీరిచ్చే బహుమతులు మామూలివి. నేనివ్వబోయే బహుమతి అపూర్వమైనది" అన్నది ఊరిస్తున్నట్లు.
"పొద్దు పోతున్నది. తొందరగా నీ అక్షయ పాత్ర లోంచి తీసి ఇవ్వారాదూ!" అన్నది ఇందిర.
మరకతం అక్షయ పాత్ర లాంటి పర్సు తెరిచి , అందులో నుండి ఒక శిల్పాన్ని పైకి తీసింది.
పెద్ద ప్రత్యేకమైన శిల్పమేమీ కాదు. మూడు కోతులు -- 'చెడు వినకు, కనకు, మాట్లాడకు' అనే నీటిని బోధించేవి.
"మహా దీనికేనా బ్రహ్మాండమైన బహుమతి అని డబ్బా కొట్టావు!" అంది నిర్మల.
"పండ్ల భద్రీ! నీకు తొందర ఎక్కువ. ఇందులో ఉన్న పరమార్ధ మేమిటో నీకేం తెలుస్తుంది? ఒక మర్కటాన్ని విడిచి అమెరికా వెడుతుంది గదా మన పద్దాలు . నా గుర్తుగా ఒకటి కాదు , మూడు మర్కటాలిచ్చాను! ఇక మరిచి పోవాలన్నా మరిచి పోలేదు. అసలింతకు నేనిస్తానన్న అపూర్వ బహుమతి ఇది కాదు ఇదిగో!" అంటూ పర్సు లో నుండి ఒక ఫోటో తీసి పద్మ కిచ్చింది.
స్నేహితురాళ్ళంతా దగ్గరగా చేరారు, ఫోటో చూడటానికి.
ఒక మంచం, మంచం మీద ఒక సుర సుందరి నిద్రిస్తున్నది. జుట్టు విరబోసుకుని ఉంది. గాలికి ముంగురులు అతి రమ్యంగా చెదిరి ఉన్నాయి. పొడుగాటి కనురెప్పల నీడ ఎంతో మనోహరంగా ఉంది. చదువుతూ నిద్ర పోయినట్లుగా చేతిలో పుస్తకముంది. ఎడమ పక్కగా తిరిగి పడుకోన్నందు వలన, పొడుగాటి జుట్టు కొద్దిగా కుడి భుజం మీది నుండి నేలను తాకుతున్నది. ఆడవాళ్ళను కూడా మోహింపజేస్తున్నది ఆ సౌందర్యం!
"అహో! ఎవరీ సుందరి?' ఇందిర కుతూహలంగా చూస్తూ ప్రశ్నించింది.
పద్మ ఫోటోను ఒక్క క్షణం చూసి, ఫోటో ను ముద్దు పెట్టుకుంటూ , "థాంక్స్ మర్కటం! నిజం గానే ఇది అపురూప బహుమతి!" అన్నది.
"ఏదీ! నేనూ చూస్తాను!" అన్నాడు రాజగోపాల్ కుతూహలంగా.
పద్మ ఫోటో రాజగోపాల్ కి అందించింది.
ఫోటో ను రెండు నిమిషాలు చూసి, రాజగోపాల్ అప్రయత్నంగా ఫోటో ను ముద్దు పెట్టుకొన్నాడు. మరుక్షణాన ఒళ్ళు తెలిసింది. ముఖం సిగ్గుతో ఎర్రగా కందిపోయింది. "సారీ!" అంటూ పద్మ చేతికి ఫోటో ఇచ్చాడు.
స్నేహితురాళ్ళ కు కుతూహలం హెచ్చింది.
"ఇంతకీ ఎవరి ఫోటో అది?" మళ్ళీ అడిగింది ఇందిర.
"కళ్ళుంటే చూసి గుర్తు పట్టు!" అన్నది మరకతం.
స్వర్ణ కూడా కుతూహలంగా ఫోటో వైపు చూసింది. మరుక్షణ మే ముఖం ఎర్రగా అయింది. అప్రయత్నంగా కళ్ళెత్తి రాజగోపాల్ వైపు చూసి, కళ్ళు వాల్చుకుంది.
ఇది గమనించిన శేఖర్ కళ్ళలో బాధ కనిపించింది.
ఈ అంతర్నాటకాన్ని ఎవరూ గమనించ లేదు.
ఫోటో ను చక్కగా చూసిన ఇందిర సంతోషాన్ని ఆపుకోలేక చప్పట్లు కొట్టింది.
"ప్రతివారికి విడివిడిగా చెప్పలేను. అంతా వినండి. ఇది స్వర్ణ ఫోటో. ఒక ఆదివారం నేను వచ్చేటప్పటికి ఈ ఫోజులో నిద్రిస్తున్నది. మన పండభద్రి తన కెమెరా లో ఫిల్మ్ వేయించి తీసుకొని రమ్మంటే ఆ వేళే తెచ్చాను. దానితో మన నిద్రా సుందరిని ఒక స్నాప్ కొట్టాను. ఇది ఎవ్వరికీ తెలియదు. ఆ రీల్ నేను తీసుకొని, ఇంకో ఫిల్స్ రీల్ కొని పండ్ల భద్రి కిచ్చాను. ఈ ఫోటో వెనక ఉన్న గాధ ఇది!" అన్నది మరకతం ఉపన్యాస మిస్తున్న ఫోజులో.
ఫోటో స్వర్ణదని తెలియగానే అంతా కుతూహలంగా రాజ గోపాల్ వైపు చూశారు. అయితే, అతడు నిర్వికారంగా శేఖర్ తో ఏదో మాట్లాడుతూ కూర్చున్నాడు.
"మరకతం గారూ! మా పాప ఫోటో నాకు కావాలి. నెగటివ్ తెచ్చి ఇవ్వగలరా?' అని అడిగాడు శేఖర్.
"మరే! పాపం! నన్ను "మరకతం గారూ' అని పిలిచే అన్నలను నేను పలకను. ఎంచక్కాగా 'చెల్లాయీ ' అనో, లేక ఇంకా ముద్దుగా "మర్కటం' అని పిలిస్తే , మీకు ఏ పని కావాలన్నా చేసి పెడతాను. అంతే!" అంది మరకతం.
"నాకు చెల్లాయిలంటే ఎంతో ఇష్టమమ్మా! నీ లాంటి చలాకి అమ్మాయి చెల్లెలుగా చిక్కాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. మా పాప సీరియస్ టైప్. దాని నెమ్మది స్వభావానికి, నీ చురుకుతనానికి మంచి కాంబినేషన్! నెమ్మదిగా, నిండుగా ప్రవహించే నదిలోకి, పాడుకొంటూ , గంతులు వేసుకొంటూ కొండవాగు దూకినట్లుంటుంది! నేనూ, స్వర్ణా కూడా ఎంతో అదృష్ట వంతులం" అన్నాడు మనస్పూర్తి గా.
"నేను మీ ఇంటికి స్వర్ణ తో కూడా రావాలనుకొన్నా. మీకూ, వదిన గారికి ఏమీ అభ్యంతరం ఉండదుగా?" అన్నది మరకతం.
"తప్పకుండా ఉంటుంది. వదిన గారూ అని పెద్దగా మన్నిస్తే అభ్యంతరం ఉండదూ మరి! హాయిగా అన్నా, వదిన అంటే నిరభ్యంతరంగా రావచ్చు!" అన్నాడు శేఖర్.
"మారు మాట్లాడకుండా ఒప్పుకుంటున్నాము ఈ షరతుకి" అన్నది మరకతం.
పొంగి వచ్చే కన్నీటిని అపుకొంటూ పద్మ అందరి దగ్గరా సెలవు తీసుకొని వెళ్ళింది.
ఇందిర తప్ప మిగతా అంతా పద్మతో వెళ్ళారు. అంతా పద్మతో వెడితే , హాస్టల్ లో ఎవరూ ఉండరని ఇందిర ఉండిపోయింది.
"అట్టే ఆలస్యం చెయ్యకు. హాస్టల్ కు తొందరగా పోయి బిడ్డలకు ఏం కావాలో చూచుకో, అమ్మా! అని సలహా ఇచ్చింది మరకతం. సుదేష్ట కారెక్కుతూ.
"అట్లాగే . అందరికీ హర్లిక్సూ, గ్లోకోజ్ ఇస్తానులే. నువ్వు కూడా రా. పాపం, కాస్త తాగి వేడుదువు !" అన్నది ఇందిర.
