11
ఆ రాత్రి ఏడుస్తూ పడుకుంది తులసి. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. ఏదో పీడకల వచ్చి నిద్రపోకుండా చేసింది. లేచి కూర్చుంది. మంచంమీద సీతాపతి ముడుచుకుని పడుకున్నాడు. పక్కగదిలో పాప పడుకుంది. గోవిందరావు గదిలో లైటు వెలుగుతున్నది ఇంకా. టైం చూసింది. నాలుగుంబావయింది. చలి వేస్తున్నది. అప్పుడే రోడ్డుమీద వాహనాల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. మనసు బాగా అలసి ఉన్నది. వచ్చి మళ్ళీ పడుకున్నది. ఏం చెయ్యటం? తెల్లారితే ఏం చెయ్యాలి? జీవితం భారంగా తోచింది. తనింకా ఎవరికోసం బ్రతకాలి? అందరూ తనను మోసం చేశారు. గోవిందరావు గదిలో గ్లాసు చప్పుడైంది. ఈ సమయంలో అతను మెలకువగా ఉన్నాడు! అతడి సంసారంలో పెళ్ళైన సూచనలేమీ కనిపించటంలేదు తనకు. మంచంకూడా ఒక్కరు పడుకునేదే. ఓ చిన్న స్టౌ అతడు కాపురం పెట్టిన సంగతి కూడా అబద్ద మేననిపిస్తూంది. ఎవరు తనకు నిజం చెబుతారు? ఈ ఆపత్సమయంలో ఎవరు తన నాదుకుంటారు? తనే కొనితెచ్చుకున్న దీ కష్టాలన్నీ. ఇప్పుడేడుస్తున్నది. రాత్రంతా పడిన మనోవ్యథతో మెదడు పచ్చిపుండైనట్లుగా ఉంది. ఆలోచించాలంటేనే బాధగా ఉంది. పడుకుని ఉందిగాని, ఆ సమయంలో లేచి నిలబడితే తప్పకుండా పడిపోయేదే తాను,. మనసులో సమ్మెట దెబ్బలవలె పోట్లు వస్తున్నాయి. సొమ్మసిల్లి నట్టుగా ఉంది. గోడవారగా నడుస్తూ ఇవతలకు వచ్చింది. ఒంటినిండా కొంగు కప్పుకుంది. జ్వరం వస్తున్నట్టుంది. చలి భరించలేకపోతూంది. మళ్ళీ లోపలికి వెళ్ళింది. సీతాపతి పొర్లాడు. తలుపు తెరిచిన చప్పుడుకు అతడికి మెలకువ వచ్చి ఉంటుంది. రాత్రి తను అక్కడ పడుకోలేదన్న విషయం కూడా గమనించే ఉంటాడు. తులసి కన్నీళ్ళు పొంగేయి. వచ్చి పడుకుంది. గోవిందరావు దగ్గు వినబడింది.
పాలమనిషి కేకతో తులసికి మెలకువ వచ్చింది కాని లేవలేదు. తమాషా చూడాలనుకుంది. పాలమనిషి రెండు మూడు సార్లు పిలిచాడు. జవాబు లేకపోవటంతో తలుపు బాదేడు. సీతాపతి గొణుక్కుంటూ లేచాడు.
"వస్తున్నాను, ఆగు" అంటూ లోపలికి వెళ్ళి గిన్నె తెచ్చి పాలు పోయించుకున్నాడు. బ్లాంకెట్ ముసుగులోంచి తులసి అన్నీ గమనిస్తూ పడుకుంది. గిన్నె లోపల పెట్టేసి వచ్చి మంచంమీద కూర్చున్నాడు. పాప లేచింది. పాప లేవగానే లోపలికి వెళ్ళి "పాలు తీసుకున్నాను" అని వచ్చేశాడు. పాప తన పక్కగుడ్డలు తీసి మడతపెట్టేసి వచ్చి, "అక్కా, అక్కా!" అంటూ పిలిచింది. తను పలకలేదు. వెళ్ళి మొహం కడుక్కుని వచ్చింది. సీతాపతి మళ్ళీ "మీ అక్కను లేపు" అన్నాడు. పాప మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళింది. సీతాపతి స్నానం చేసివచ్చి, గుడ్డలు వేసుకుని ఎటో వెళ్ళిపోయాడు. ఇంకా ఏడైనా కాలేదు. అంత పెందరాళే ఎక్కడికి వెళ్ళి ఉంటాడో అర్ధం కాలేదు.
పాప రేడియో పెట్టింది. పనిమనిషి వచ్చింది. పాపే అంట్లు వేసింది. తనింకా లేవకపోవటం పాపకు గట్టి అనుమానమే కలిగించినట్టుంది. ఈసారి తన దగ్గరకు వచ్చి, వంగి నిలుచుని, "అక్కా!" అంది. తను "ఊఁ!" అంది.
"ఒంట్లో బాగాలేదా, అక్కా?" అంది.
తను ఏమీ జవాబివ్వక ముసుగు తొలగించిలేచి కూర్చుంది.
పక్కనే కూర్చుంటూ "అక్కా!" అంది పాప మళ్ళీ.
"ఏమిటే ఊరికే. నాకేమీ కాలేదు. బాగానే ఉంది" అంది తులసి చెల్లెలి చెయ్యి విదిలించుకుని.
పాప స్టౌ వెలిగించి పాలు కాచింది.
అది గమనించనట్టుగానే, ఇంత పండ్లపొడి వేసుకుని వెళ్ళి మొహం కడుక్కుని వచ్చింది. పాప కాఫీ వడపోస్తూంది. తులసి అద్దం ముందు నిలుచుని తీరికగా మొహం తుడుచుకుంది కొంగుతో. కళ్ళు బాగా ఉబ్బివున్నాయి. బొట్టు పెట్టుకుంది. స్నానానికి చీర తీసుకుంటుంటే, "కాఫీ తాగి వెళ్ళక్కా" అంది పాప.
"నా కొద్దు. నువ్వు తాగెయ్" అంది తులసి గది లోంచి వచ్చేస్తూ.
"అదేమిటి, ఎందుకొద్దు?" అంది పాప ఆశ్చర్యంగా. తులసి స్నానం చేసి వచ్చింది.
రాగానే కప్పులో కాఫీ పోసి తీసుకొచ్చింది పాప. "వద్దన్నానుగా. వద్దు. తీసుకెళ్ళు" అంది తులసి అటువైపు చూడకుండానే.
"ఎందుకొద్ధక్కా, రాత్రికూడా అన్నం తినలేదు నువ్వు. ఈ కాఫీ తీసుకో" అంది పాప బ్రతిమాలుతున్నట్టుగా.
తులసి మాట్లాడలేదు. రెండు నిమిషాలాగి, "వద్దన్నానుగా, నా ముద్దుల చెల్లాయ్. తీసుకెళ్ళు నువ్వేమీ నన్ను బ్రతిమాలక్కర్లేదు" అంది వెటకారంగా.
పాపకు షాక్ తగిలింది. తనపట్ల అంత జుగుప్స తులసిలో ఎన్నడూ చూడలేదు. దుఃఖమూ, కోపమూ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
"ఐతే, నాకూ వద్దు" అంది గిరుక్కున తిరిగి.
ఆ మాట కోసమే నిరీక్షిస్తున్నదానిలా, "మరెందుకు చేశావు కాఫీ? ఏం, పాలూ, చక్కెరా, కాఫీ ఎక్కువున్నా యనుకున్నావా? నిన్నెవరు చెయ్యమన్నారసలు? ఈ సంసారం నువ్వే తీసుకో. ఆయనక్కూడా అదే బాగుండేటట్టుంది" అంది తులసి.
ఇన్ని విషబాణాలు వరసగా తగులుతాయని పాప ఎప్పుడూ ఊహించలేదేమో, నివ్వెరపోయింది.
పాప మౌనం తులసి కోపాన్ని మరింత తీవ్రం చేసింది.
గొంతు తగ్గించి, "నువ్వు తాగెయ్, పాపా. నాతో నీకేం నువ్వు తాగెయ్" అంది.
పాప కాఫీకప్పు కింద పెట్టేసి, గబగబా చివరి గదిలోకి పరిగెత్తి, నరాల పట్టు తప్పినట్టుగా నేలమీద దభాలున కూలబడి, చేతులు మొహం మీద కప్పుకుని ఏడ్చింది.
తులసికి చెల్లెల్ని ఓదార్చాలనిపించలేదు. ఓదార్చాలని పించలేదు కనకనే తనలోని కోపం మరింత పెరిగింది. అలా ఏడవటం సహించలేకపోయింది. పాప గదిలోకి వచ్చి, "ఏమమ్మా, అలా ఓ వారంపూట, నట్టింట్లో కూర్చుని ఏడుస్తున్నావు. ఇంకా ఎవరికేం కావాలని?" అంది.
పాప తలఎత్తలేదు. కాసేపటికి ఏడుపు మానింది. కళ్ళు తుడుచుకుంది.
తులసికి ఏం చెయ్యాలో తోచలేదు. ఎవరిమీదో కోపంగా ఉంది. పగగా ఉంది. ఇంకా తిట్టాలి. కొట్టాలి. హింసించాలి. రక్కి, గిచ్చి, నెత్తురు కారేలా చెయ్యాలి. అప్పుడుకాని తన మనసుకు కొంచెం సాంత్వన కలగదు. లేకపోతే అంత బాధా తనే అనుభవించాలి. పాప బాత్ రూంలో ఇంత సేపేం చేస్తున్నది. ఇవతలికి వస్తే బావుండును. మరోసారి తిట్టాలి. మరో 'డోస్' ఇవ్వాలి. మరికాస్త ఏడిపించాలి; గాయపరచాలి. తనమీది కోపంతో, తనంటే భయంతో పాప ఈ క్షణం ఇంటికి వెళ్ళిపోతే బావుండును. ఇలాంటి ఆడదాన్ని తనెలా ఇంట్లో ఉంచుకునేది? మొదటి సారి గనక తనింతమాత్రం గొడవ చెయ్యగలిగింది. ఇదే మరోసారి జరిగితే తనేం చెయ్యగలదు? చేసినా అది నవ్వులాటగా మారుతుందేమో!
అప్పుడే పది దాటింది. వంట చెయ్యకూడదనుకుంది. కాని తను వీళ్ళందరికీ ఎందుకు భయపడాలి? వీళ్ళమీది కోపంతో తనెందుకు ఆకలితో మాడాలి? వెళ్ళి వంటచేసి తను తినేసింది. చెల్లెలు పడుకున్న గది గుమ్మంలో నిలబడి, "ఆకలైతే అన్నం పెట్టుకు తినెయ్" అని వచ్చేసింది.
* * *

పాప అన్నం తినలేదు. సీతాపతి ఇంకా రాలేదు. అలాగే ఆఫీసుకి వెళ్ళిపొయ్యాడేమో. ఇక్కడ తాము ఇలా కొట్టుకుంటున్నారు. పాపం, ఆసుపత్రిలో ముసలాయన కెలా ఉందో. కాసేపు పడుకుని లేచింది. గాఢంగా నిద్రపోయింది. ఎంతోసేపు పడుకున్నా ననుకుంది. కాని చూస్తే ఇంకా రెండు కాలేదు. పాప అప్పుడే తల దువ్వుకుంది. చీర మార్చుకుని, తన పర్సు చేతపట్టుకుని బయల్దేరింది.
"ఎక్కడికి?" అని అడగాలనుకుంది. మనసులోని లక్ష అనుమానాలు, భయాలు పైకి వచ్చాయి. అన్నింటినీ అణగతొక్కి, అయిష్టంగానే తను అడగవద్దనుకున్న ప్రశ్న అడిగేసింది.
పాప మాట్లాడకుండానే మెట్లు దిగి వెళ్ళిపోయింది.
మత్తులోంచి తేరుకున్నదానిలా ఒక్కసారిగా భయంతో వణికిపోయింది తులసి.
ఈ సమయంలో పాప ఎక్కడికి వెళ్ళగలదు? తన స్నేహితురాళ్ళ వద్ద దబ్బు తెచ్చుకోవటానికా? లేక భర్త దగ్గరకా? అసలత డెక్కడికెళ్ళాడు? ఆఫీసుకా? ఆసుపత్రికా? రాత్రంతా గోవిందరావు ఏం చేశాడు?
ఏం చెయ్యాలి? తనెక్కడికి వెళ్ళగలదు? ఎందుకు తనకీ నరకం?
* * *
సాయంత్రం....సీతాపతి వచ్చాడు. తులసి చీకట్లో పడుకుని ఉంది. సీతాపతే స్విచ్ వేశాడు. తులసి లేచి వంటింట్లోకి వెళ్ళింది. క్షణంసేపు "పాప వచ్చిందా?" అని అడగాలనుకుంది. సీతాపతి గుడ్డలు మార్చుకున్నాడు. తులసి కాఫీనీళ్ళు పెట్టి, బియ్యం కడుగుతూ కూర్చుంది.
కనీసం "పాప ఏది?" అనైనా అడగడేం. కాఫీ తీసుకెళ్ళి భర్త ముందర పెట్టింది. సీతాపతి మౌనం గానే కాఫీ ముగించేడు. తన బాధ ఎవరూ పంచుకోరా? అందరికీ తనమీద అసహ్యమా? తను మోసగింపబడుతున్నా, నోరు మూసుకుని, దుఃఖం మింగుకుని ఊరుకుంటే మంచిదౌతుందా? భర్తకూడా ఇలాగైతే తను ఎలా బ్రతకగలదు! ఆ క్షణం తులసికి తనూ, భర్తా మాత్రమే శాశ్వతమనిపించింది. వెంటనే ఆయనతో మాట్లాడాలి. తమలో తమకు హెచ్చుతగ్గులేమిటి. తనక్కావలసిన విధంగా భర్తను మార్చుకోవాలి. ఇలా ఒకత్తే ఏడుస్తూ తనలో తను మథనపడితే ఏం లాభం? కాని ఎలా ప్రారంభించటం? మధ్యాహ్నమనగా వెళ్ళిన పాప ఇంకా రాలేదు. కొంపదీసి ఏదైనా అఘాయిత్యం....అమ్మో, ఇంకేమైనా ఉందా? ఆ ఊహే తను భరించలేదు. పాప రాగానే దాన్ని కౌగిలించుకుని, బుజ్జగించి, దుఃఖమారా ఏడ్చి ఈనాటితో ఈ నరకం ముగించాలి. పాప రావాలి త్వరగా.
కప్పు ఇంట్లోకి తెచ్చి, "నాన్నను ఎల్లుండి డిశ్చార్జి చేస్తున్నారట. నీ యిష్టమైతే ఇక్కడకు తీసుకొస్తాను. లేదా మళ్ళీ అన్నయ్య వద్దకు పొమ్మంటాను" అన్నాడు సీతాపతి.
