7
మంచం మీద పడుకుని ఓ పది నిముషాల పాటు వెక్కి వెక్కి ఏడ్చింది లలిత ఎందుకిలా జరిగింది? అని బాధపడింది. బలరాం కూడా తనని ఇలాగే అపార్ధం చేసుకుంటే ; అన్న తలపే లలితని మరి బాధ పెట్టింది.
ఏడ్చి ఏడ్చి ముఖం ఉబ్బిపోయింది. కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లాగా తయారయ్యాయి. అద్దంలో చూసుకుంటే తనకే భయంకరంగా తోచింది లలితకి. రత్తివస్తే ఆకల్లేదని చెప్పి పంపేసింది. అతనలా మౌనంగా ఊరుకోకుండా తీక్షణంగా చూస్తూ ఊరుకోవడమే మరీ కలత పెట్టింది లలితని. అతని దృష్టి లోంచి దిగజారి పోవడం భరింపరానిదిగా తోచసాగింది . అతనికి తనపై మంచి ఉద్దేశ్యం ఉండాలి. అది మారిపోకూడదన్న బెంగపట్టి పీడించసాగింది.
అద్దంలో తన ముఖం చూసుకుంటే తనకి ఆశ్చర్యం వేసింది లలితకి. బలరాం పట్ల తన కెలాంటి ఆరాధన ఏర్పడిందో గ్రహించే సరికి చటుక్కున ముఖం తిప్పుకుంది -- ఎవరేనా ...చూస్తారేమో నన్నట్టు చేయకూడనిదేదైనా చేస్తుంటే పట్టుబడి పోతానన్నంత భయం కల్గింది -- ఎప్పుడూ తనేవరినీ ఆరాధించలేదు. తనపై ఆ వ్యక్తికీ సడుద్దేశ్యమే పెరగాలని, ఆదరణ అభిమానాలే ఉండాలని ఇంతగా తపన పడలేదు.... తనిక్కడికి వచ్చినప్పుడు -- ఏవ్యక్తి అయితే తనకి స్వేచ్చ లేకుండా చేస్తాడు అని భావించిందో , అతన్నేలా ఎదురు తిరిగి స్వేచ్చ ప్రకరించాలని తలపోసిందో , అంచనాలన్నీ తప్పేసరికి -- తను ఎదురు చుసిన వ్యక్తికీ-- ఈ వ్యక్తికీ పోలిక లేకపోయేసరికి ఉక్కిరిబిక్కిరయిపోయింది లలిత. ఇంత ఆప్యాయంగా బంధవుగా స్నేహితుని కంటే ఎక్కువగా తనని ఆకర్చించిన ఈ వ్యక్తికీ తన తప్పటడుగులు తెలిస్తే అసహ్యించుకుంటాడన్న భయం కలగలేదు లలితకి. కాని తనపై తనకే అల్పభావం ఏర్పడింది. అందుకే బలరాం తననీ అందరి లాగా చూస్తూ ఊరుకునేసరికి ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తెలియలేదు. ఎవరీ వ్యక్తీ? కట్టడి చేయిక కట్టి వేసే ఇంతన్నెందుకు తను నమ్మించాలని తాపత్రయ పడాలి? అన్న మొండితనం తలెత్తింది. అందుకే అలా మొండిగా ప్రశ్నిస్తూ పైకి చక్కా వచ్చింది. కాని తిరిగి కిందికి వెళ్ళి అతన్ని ఎదుర్కొనే ధైర్యం లేకపోయింది. ఆరంభం లో అనుమానాలతో ఆలస్యం చేస్తే వచ్చే పరిణామాలు ఇప్పుడిప్పుడే గ్రహింపుకు వస్తున్నాయి లలితకి. వీటి పర్యవసానం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది. కాని ఈ చిక్కులు విప్పడానికి కొస దొరకడం లేదు. అది దొరికేలోగా ఇంకెంత చిక్కు వేసి పెడుతుందో నా జీవితాన్ని-- యీ సరళ అనుకుని...బెంగగా అలాగే పడుకుని ఆలోచిస్తుంది లలిత....' ఇక జన్మలో మళ్లీ కారు తోలను.... అనుకుంది.
బలరాం పుస్తకాలు తిరగేస్తూ కూర్చున్నాడన్న మాటేకాని అతని మనస్సు పరిపరి విధాల ఆలోచిస్తుంది. తను విన్న విషయాలు నమ్మాలని పించడం లేదు. 'అబద్దం ఇదంతా' అని సరళ తో గట్టిగా వాదించి నోరు మూయిస్తే ఏంతో తృప్తి గల్గెది అతనికి. కాని లలిత అదేం చేయలేదు-- సరికదా నీకు ఎండుకన్నట్టు ప్రవర్తించేసరికి .....అతని మనస్సులో వద్దను కుంటున్నా శంక బయలుదేరింది... లలిత కి మోహన్ పూర్వం తెలుస్తే అ సంగతంత రహస్యంగా దాచడం దేనికి? ఓ పట్టాన అంతు చిక్కలేదు బలరాం కి. చేతి కందిన పుస్తకం తెరిచి చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాడు... లలిత పట్ల అతని హృదయం అతనికే అర్ధం కావడం లేదు. లలితని తలచుకుంటే గుండెల్లో వెచ్చగా ఉంటుంది. లలిత ఊహ లతన్ని చిత్రహింసలు పెడుతున్నాయి...మనసుకి తెలియకుండానే మనసు ఊహల గారడీలు చేయిస్తుంది.... కనపడని ఈ మంటలు ప్రేమ కాదు గదా? అనుకుంటూ ఓ పద్య కావ్యం తీశాడు-
మరునాటి సాయింత్రం దాకా బలరాం లలిత కళ్ళ పడలేదు. ఆ సాయింత్రమేనా లలిత అతని రోజా చెట్ల మధ్య తిరుగుతూ దొరికిపోయింది. ఆ అంతరంగం లో జరుగుతున్న ఘర్షణ చిహ్నాలామే ముఖంలో ప్రస్పుటంగానే కనబడుతున్నాయి. అలసిన కన్నులు బరువుగా వాలి చెంపల మీద నీడల్లాగా నల్లగా ఉన్నాయి. ఉబ్బిన రెప్పల అంచులు ఎర్రబడ్డాయి. ముక్కు కొస నిగనిగ మెరుస్తుంది. మామూలు చీర కట్టుకొని చేతిలో పుస్తకం పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ వస్తూ వస్తూన్న మొగ్గలని విచ్చీ విచ్చని పూవులనీ తిలకిస్తూ మనస్సులోనే తన అనేక నిర్ణయాలని మన్నించుకుంటూ తిరుగుతోంది......
వరందాలోంచే ఈ దృశ్యం చూసి అలాగే నిలబడి పోయాడు బలరాం. నిస్సహాయంగా 'రేపు అప్పగించకపోతే నించోపెడతాను' అని టీచరు హెచ్చరించితే కంఠతా పట్టడానికి అవస్థ పడే స్కూలు పిల్లలాగా కన్పించింది లలిత-- అతని కళ్ళకి. మూడడుగుల్లో వెళ్ళి ఆమె పక్కన నిలబడ్డాడు.' ఏమిటి లలితా చదువుతున్నావు?' అంటూ ఎప్పటి లాగా మాట్లాడుతూన్న బలరాం ని చూడగానే దుఃఖం పొంగుకు వచ్చింది లలితకి. బదులుగా కళ్ళెత్తి అతని వైపొక సారి చూసి కళ్ళు వాల్చేసుకుంది. లలిత చేతిలో పుస్తకం అందుకుని పేజీలు తిరగేశాడు బలరాం.
'నువ్వు కవిత్వం చదువుతావా?....ఇవన్నీ రాసి పెట్టుకున్నా వెందుకు?'
'నాకు నచ్చిన పద్యాలివి. కావాలన్నప్పుడల్లా చదువుకుందుకు వీలుగా రాశాను' అంది-- సిగ్గుపడుతూ--
కుతూహలంగా ఒక్కొక్కటే చూస్తూ పేజీలు తిప్పుతున్నాడు. అతని కళ్ళ ముందు కమనీయ దృశ్యాలు దాటిపోతున్నాయి . ఒకోక్కపెజీ తిప్పి లలిత చూపిస్తున్నట్టు అనిపిస్తుంది.....
'కనపడని జ్వాల ' అన్న ఓ పద్యం చుట్టూ రకరకాల ముగ్గులు, ముత్యాలు, పశ్నర్దకాలు ...ఎన్నో పరిచి ఉన్నాయి.
'అది నాకెక్కువ ఇష్టమైనది-- ఎన్నోసార్లు చదివిన దానికి చిహ్నాలు!' అంటూ నవ్వేసింది. నవ్వుతున్నా ఆమె కళ్ళ వెంట నీరుకారడం చూసి.
'ఏం లలితా ఒంట్లో బాగులేదా?' ఆత్రుతగా అడిగాడు.
'బాగానే ఉంది బలరాం....బాగానే ఉన్నానే' అంది- కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ.
'నాతొ చెప్పడానికి నీకు కష్టమైనవైతే ఎవరితో నైనా చెప్పవచ్చు కదా? మనస్సులో బాధపడితే ఎలా తెలుస్తుంది?' పుస్తకం మూసేసి అందిస్తూ అన్నాడు.
ఎవరితో చెప్పుకోను? నాకేవరున్నారని? గట్టిగా అరవాలనిపించింది లలితకి. కాని మౌనంగా తల వంచేసింది.
'నీ మనస్సుకి కష్టం కల్గించేలా ఎవరేనా ప్రవర్తించారా! ఏమైనా అన్నారా?'అనునయంగా అడిగాడు.
'లేదు బలరాం. నాకు వెళ్ళిపోవాలని ఉంది-- నన్నీ ప్రశాంత వాతావరణం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది....ఒంటరితనం పీడిస్తుంది-- మనస్సు విప్పి చెప్పుకొనే అత్మీయత కోసం నా గుండె తపించి పోతోంది. ప్లీజ్ బలరాం, నన్ను పంపించేస్తావా?' కళ్ళనీరు ధారాపాతంగా వర్తిస్తుంది. దాచుకుంటూ వస్తున్న దుఃఖ భారంతో గుండె లెగసి పడుతున్నాయి.
కళ్ళ అంచుల కెగసి ముత్యాలుగా రాలుతున్న కన్నీరు తుడవాలని పించింది బలరాం కి. నేను నీకు అత్మీయుడ్ని కానా? అని చేతుల్లోకి తీసికోవాలని పించింది. కాని నిస్సహాయంగా ఉండిపోయాడు.
'ప్లీజ్ రేపే నన్ను పంపించు నాకక్కడ మనుషులూ వాతావరణం నచ్చింది. నేనిక్కడ యిమిడి పోలేను....' అంది చేతుల్లో ముఖం దాచుకుంటూ.
'నీకదే ఇష్టమైతే తప్పకుండా వెళ్లి పోదు గాని. లలితా , అమ్మమ్మ గారింట్లో విందు కాగానే వెళ్లిపోదుగాని, రేపు విందనగా నువ్వెళ్ళి పోయావని తెలిస్తే ఆవిడ బాధపడతారు.
